వనవాసీ కల్యాణ్ ఆశ్రమం-తెలంగాణ
కరోనా వైరస్ విజృంభణ నగరాల్లోనే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం మారుమూల గ్రామాల పైన కూడా పడింది. కరోనా లాక్‌డౌన్‌లో గిరిజన ప్రాంతాల్లోని ప్రజల కష్టాలైతే చెప్పనే అక్కర్లేదు. ఎంతోమంది గిరిజనులు నిత్యావసరాలు సైతం సమకూర్చుకో లేని పరిస్థితిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది గిరిజనులుంటే, అందులో 9 కోట్ల మంది నగరాలకు దూరంగా మారుమూల గ్రామాల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇలా పట్టణాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక సంస్థ- అఖిల భారత వనవాసీ కల్యాణ్ ఆశ్రమం (పరిషత్). ఈ సంస్థకు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలున్నాయి.
కొవిడ్ 19 లాక్‌డౌన్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల కోసం వనవాసీ కల్యాణ్ ఆశ్రమం (తెంగాణ) పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసరాల పంపిణీ వంటివి దాతల సహకారంతో అందిస్తున్నది.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని 10 గ్రామాల్లో 10 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసరాలు ఉచితంగా అందజేసింది. వరంగల్‌లోని పలువురు దాతలు ఈ సామాగ్రికి ఆర్థిక సహకారం అందించారు. కన్నాయిగూడెం మండలంలోని చిట్యాలలో-20, మల్కపల్లి-26, పాలాయి గూడెం-21, కొయ్యూరులో-40 దినసరి కూలీల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గొత్తికోయ గూడేలలో దేవునిగుట్ట, అంకంపల్లి, బంజర ఎల్లాపూర్‌లలో 139 కుటుంబాలకు 5 కిలోల బియ్యం, 5 రకాల కూరగాయలు చొప్పున కిట్లను అందించింది. తాడ్వాయి, ముసలమ్మ పెంట, గుర్రాలబావి, బంగారుపల్లి, ములకల పల్లి, గంగారం, అన్నారం, భూపతిపూర్, ఇప్పటగడ్డ, శ్రీరాంనగర్, చింతలమోరి, గొండపర్తి, మండల్తోగు గ్రామాలలో 496 గిరిజన కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు అందించింది. 18 మంది ఏకోపాధ్యాయ పాఠశాలల కార్యకర్తలకు రూ. 500 చొప్పున కరువు భత్యం చెల్లించింది.
శ్రీశైలం, నాగర్‌కర్నూల్‌లో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో, శ్రీశైలం పరిసరాల్లోని నల్లమల అడవుల్లో నివసించే చెంచుల జీవితం లాక్‌డౌన్ సందర్భంగా దుర్భరంగా మారింది. వనవాసీ కల్యాణ్ ఆశ్రమం తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులు కాట్రాజు వెంకటయ్య, శ్రద్ధా జాగరణ ప్రముఖ్ ఉడతనూరి లింగయ్య, మాజీ సర్పంచ్ నిమ్మల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గట్టు అశోక్ రెడ్డి, అచ్చంపేటలోని మల్లికార్జున విద్యార్థి నిలయం కార్యదర్శి గుంత బాలకృష్ణ ఏప్రిల్ 15న ఆయా పరిసరాల్లో సందర్శించి 12 గ్రామాల్లోని 150 కుటుంబాలకు 13 రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు.
వనవాసీ కల్యాణ ఆశ్రమం ద్వారా నల్లమల చెంచుగూడేలలో రెండో విడత నిత్యావసరాల పంపిణీ జరిగింది. ఈ విడత మొత్తం 350 కుటుంబాలకు సహాయం అందించారు. దీనికి వందేమాతరం ఫౌండేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ – 1994 బ్యాచ్ విద్యార్థులు, చిరాగ్ ఫౌండేషన్, దప్పిలి శేఖర్‌రెడ్డి (సామగ్రిని తరలించడానికి వాహనం ఏర్పాటు చేసినవారు) సహకరించారు.
– ఏప్రిల్ 25న నల్గొండ జిల్లాలోని దేవరకొండ వద్ద కంబాలపల్లిలో 4 చెంచు గూడేలకు నిత్యావసరాలను అందించింది.
– మే 1న నల్లమల అడవులలోని మల్లెలతీర్థం, సార్లపల్లి, మాచారం, వెంక టేశ్వరబావి, చౌటగూడెంలోని 240 చెంచు కుటుంబాలకు ఆశ్రమం కార్యకర్తలు నిత్యావసరాలను అందించారు.
– ఏప్రిల్ 12న వనపర్తి జిల్లాలోని భౌరాపూర్‌లో చెంచులకు ఉచితంగా నిత్యావసరాలను అందించారు.
– భాగ్యనగర్‌లోని విద్యానగర్‌లో సిరిసంపద రెసిడెన్సీ, వనవాసీ కల్యాణ్ పరిషత్ కార్యకర్తలు కలిసి అడిక్‌మెట్ బ్రిడ్జి కింద నివసిస్తున్న వలస కార్మికులు 80 మందికి నిత్యం రెండు పూటలు భోజనం పెడుతున్నారు.
– ఖమ్మం జిల్లాలోని చర్లలో వనవాసీ కల్యాణ పరిషత్ ద్వారా కొమురంభీం విద్యార్థి నిలయం సమితి కార్యకర్తలు కోరం సూర్యనారాయణ నేతృత్వంలో గొత్తికోయల గ్రామాల కుటుంబాలకు నిత్యావసరాల కిట్స్ అందజేశారు. ఎర్రపాడులో- 56, చెన్నపురం-74, చెలిమల-22, బురుగుపాడు-56, వీరాపురంలో-44.. మొత్తం 252 కుటుంబా లకు నిత్యావసరాలను అందించారు.
– ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం, బొచ్చగూడ గ్రామంలో 30 కుటుంబాలకు ఆశ్రమం కార్యకర్తలు నిత్యావసర సామగ్రిని అందించారు. ఉట్నూరు మండలం లోని కుమ్మరికుంట గ్రామంలో 60 గిరిజన కుటుంబాలకు నిత్యావసరాలు, కూరగాయలు అందించారు.