ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో చాప కింద నీరులా క్రైస్తవ మత ప్రచార కార్యకలాపాలు జోరందుకున్నాయి. మరోవంక రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం పెరిగిపోయింది. అలాగని, గత ప్రభుత్వాలు ఇంతకంటే గొప్పగా హిందువుల మనోభావాలను గౌరవించాయని కాదు. ఓటుబ్యాంకు రాజకీయాల్లో మునిగి తేలుతున్న పార్టీలు హిందువుల మనోభావలకు ఏనాడూ విలువ ఇవ్వలేదు. అదే బాటలో నడుస్తున్న వైసీపీ ప్రభుత్వ పాలనలో గత సంవత్సర కాలంలో ఇందుకు సంబంధించి అనేక ఉదంతాలు వెలుకులోకి వచ్చాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పుడు అదే క్రమంలో వెంకన్న దేవుని ‘నిరర్ధక’ ఆస్తుల విక్రయం వ్యవహారం వెలుగులోకి వచ్చించి. రాజకీయ వివాదంగానూ మారింది. బీజేపీ, జనసేన, టీడీపీ తదితర రాజకీయ పార్టీలు, హిందూ ధార్మిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఇలా ఒక వివాదం తెరపైకి వచ్చినప్పుడు కొద్ది రోజులపాటు సందడి చేసి, ఆ తర్వాత మరో వివాదం వెలుగుచూసే వరకు మౌనంగా ఉండిపోవడం వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి హిందూ దేవాలయాలు, హిందూ ధర్మం నిలబడాలంటే దేవాలయాల వ్యవహారాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యాన్ని సమూలంగా తుడిచి వేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిన బాధ్యత హిందూ సమాజంపై ఉంది. ఇందుకు హిందూ సమాజాన్ని ముందుండి నడిపించవలసిన బాధ్యత సాధుసంతులు, హిందూధర్మ సంస్థలు తీసుకోవలసిన అవసరమూ ఉంది.

అసలు దేవుని ఆస్తులు అమ్ముకోవాలని అనుకోవడం, పైగా భక్తులు భక్తి ప్రపత్తులతో భగవంతునికి సమర్పించిన ఆస్తులను నిరర్ధక ఆస్తులని ముద్ర వేయడం మహా దౌర్భాగ్యం, దుర్మార్గం. అయితే, అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మాత్రం ఇదేమీ పెద్ద విషయంగా అనిపించడం లేదు. హిందువుల మనోభావాల గురించి ముఖ్య మంత్రి పట్టించుకోరు. ఒక్కమాటలో చెప్పాలంటే, హిందువుల మనోభావాలతో ఆడుకోవడం ఆయనకు, ఆయన ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. మతమంటే క్రైస్తవం. కాదంటే ఇస్లాం. హిందూ మతం మతమే కాదు. హిందూ ధర్మం ధర్మం కాదనేది ప్రభుత్వం నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇందుకు ఉదాహరణ – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ ప్రసాద్‌ ఆకస్మిక బదిలీ. తిరుమల సహా అనేక హిందూ దేవాలయాలలో పనిచేస్తున్న అన్యమతస్థులను తొలిగించి ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు ప్రయత్నంచిన అప్పటి సీఎస్‌ ఎల్వీని రాత్రికి రాత్రి బదిలీ చేయడం ద్వారా జగన్మోహన్‌రెడ్డి తానేమిటో, తన అభి‘మతం’ ఏమిటో చెప్పకనే చెప్పారు. ఎల్వీ బదిలీని క్రైస్తవ సంఘాలు తమ విజయంగా సంబరాలు చేసుకోవడంలోనే, రాష్ట్రంలో ‘ఏసు’ రాజ్య పాలనకు బీజం పడిందనే సత్యం స్పష్టమైంది. ఇక ఆ తర్వాత క్రైస్తవ ఫాస్టర్లకు, ఇస్లాం మత ప్రచారకులు మౌల్వీలకు నెలకు ఐదు వేల రూపాయల వంతున ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం చెల్లించాలనే నిర్ణయం సహా అనేక హిందూ వ్యతిరేక నిర్ణయాల ద్వారా ప్రభుత్వం హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని పలచన చేసే సంకల్పాన్ని స్పష్టం చేస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో తమిళనాడులోని 23 చోట్ల ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తులను విక్రయించాలని టీటీడీ ధర్మకర్తల మండలి పేరున జగన్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గమనిస్తే, క్రైస్తవీకరణ కుట్రలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం కష్టం కాదు. చిత్రం ఏమంటే, ‘నేనూ నిజమైన, నిండైన హిందువునే’ అని పదే పదే ప్రకటించుకునే టీటీడీ చైర్మన్‌ ఎస్వీ సుబ్బారెడ్డి ప్రభువుల పాపాలను మోసే శిలారూపం దాల్చారు. ప్రభువుల పాపాలను తమ భుజాలకు ఎత్తుకున్నారు. తాను నిజమైన హిందువును అని నిరూపించుకునేందుకు వచ్చిన చక్కని అవకాశాన్ని జార విడుచు కున్నారు. ఒకప్పుడు, ఇదే సుబ్బారెడ్డి, ఇవే భూముల విక్రయ వ్యవహరంలో చాలా చక్కగా ధర్మో రక్షిత రక్షితః సూక్తిని గుర్తు చేశారు. ‘నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. అధర్మంగా దేవుడి ఆస్తులు అమ్మితే, ఆ అధర్మమే నిన్ను మింగేస్తుంద’ని అప్పటి ముఖ్యమంత్రిని హెచ్చరించారు. ఇప్పుడు కూడా అదే సూక్తిని పాటించి, ఆస్తుల విక్రయాన్ని అడ్డుకుని ఉంటే, ఆయన మరోమారు ‘నేనూ హిందువునే’ అని చెప్పుకోవలసిన అవసరం వచ్చేది కాదు. కానీ, ఆయన ఆ అవకాశాన్ని వదులుకున్నారు. దైవభక్తి కంటే ప్రభుభక్తి ప్రధానమని భావించారో ఏమో గానీ, ప్రభు ఆజ్ఞను దైవాజ్ఞగా పాటించారు. అయితే, ఎవరు పట్టించుకున్నా లేకున్నా ధర్మం తప్పిన వారిని దైవం ఉపేక్షించలేదు. వెంకన్న ఆస్తులను విక్రయించాలనే అధర్మ ఆలోచన చేసిన అప్పటి ముఖ్యమంత్రికి శిక్ష తప్పలేదు. ఆయన అధికారాన్ని కోల్పోయారు.
దేవాలయాల ఆస్తులను విక్రయించే అధికారం ప్రభుత్వాలకు, రాజకీయ ప్రాపకంతో పనిచేసే టీటీడీ పాలక మండలికి ఉందా? అంటే, ఉంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి పాలక మండలి తీసుకున్న నిర్ణయం, చేసిన తీర్మానం ప్రకారం వెంకన్న ఆస్తులను విక్రయించే అధికారం పాలక మండలికి ఉంది. ఇప్పుడు ఆ సాకును చూపించే, టీటీడీ చైర్మన్‌ ‌సుబ్బారెడ్డి, అధికార పార్టీ నాయకులు, నేరం తమది కాదని, పాత పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్నే తాము అమలు చేస్తున్నామని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అమాయక త్వాన్ని నటిస్తున్నారు. నిజమే, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్న 2016-17 సంవత్సరాలలో స్వామివారి ఆస్తుల అమ్మకంపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చెప్పిన పని ఎంచక్కా పూర్తి చేసింది. టీటీడీ ఆస్తులను పాలక మండలి ఇష్టానుసారంగా అమ్ముకో వచ్చని నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను అప్పటి పాలక మండలి ఆమోదించింది.
అయితే, ఆ పక్రియ ముందుకు సాగలేదు. అందుకు కారణాలు ఏమిటన్న విషయాన్ని పక్కన పెడితే వైసీపీ అధికారంలోకి వచ్చి క్రైస్తవ బంధుత్వం బలంగా ఉన్న ఎస్వీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఆస్తుల అమ్మకం పక్రియ తిరిగి ప్రాణం పోసుకుంది. ప్రస్తుతానికి తమిళనాడులోని 23 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలనే నిర్ణయం, అందుకు అనుగుణంగా వేలం పక్రియ మొదలయ్యింది. దీనికి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ ‌చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. అన్నిటినీ మించి, ఇందుకు సంబంధించి ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం ఉత్తర్వులు జారీ అయినా ఇంతవరకు క్రతువంతా రహస్యంగా కానిచ్చారు. తమిళనాడులోని 23 చోట్ల ఉన్న ఆస్తుల వాస్తవ విలువ ఎంతో గాని, ఈ భూముల విక్రయం ద్వారా వచ్చేది కేవలం రూ.1.54 కోట్లేనట. అయితే బీజేపీ అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ అనుమానం వ్యక్తపరిచిన విధంగా ఇంతటితో దేవుడి భూముల అమ్మకం పక్రియ ముగియదు. మున్ముందు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశం మొత్తం మీద ఉన్న టీటీడీ ఆస్తులను విక్రయించేందుకు ఇటు ప్రభుత్వం, అటు టీటీడీ పాలక మండలి వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నాయి. నిజానికి, వేలానికి పెట్టిన తమిళనాడులోని 23 ఆస్తులతో గానీ, దానితో పాటుగా ఏపీలో గుర్తించిన మరో పాతికకు పైగా ఆస్తుల విక్రయంతో గానీ కథ ముగిసిపోదు. దేశం అంతటా ఉన్న వేల, లక్షల కోట్ల రూపాయల అస్తులను అప్పనంగా మిగేసేందుకు సిద్ధం చేసుకున్న బృహత్‌ ‌ప్రణాళికలో ఇది తొలి అడుగు మాత్రమే.
మరోవైపు హైకోర్టు అనుమతి లేకుండా దేవాలయాల భూములను విక్రయించరాదని, సుమారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను టీటీడీ పాలక మండలి సభ్యులు పెడచెవిన పెట్టారు. ఆ కేసులో టీటీడీ ప్రమేయం లేదని, దేవాదాయ శాఖకు మాత్రమే ఆ తీర్పు వర్తిస్తుందని కోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా పాలక మండలి వితండవాదన చేస్తోంది. చివరకు అధికార పార్టీకి వంతపాడే మేధావులు కూడా భక్తి ప్రపత్తులతో దాతలు విరాళంగా స్వామివారికి సమర్పించుకున్న ఆస్తులను నిరర్ధక ఆస్తులుగా ముద్ర వేసి హిందువుల మనోభావలాను దెబ్బతీసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. ఈ ఆస్తుల పర్యవేక్షణ భారంగా మారిందని, కాపాడడం కష్టమవుతోందని అందుకే అమ్మేస్తున్నామని అంటున్నారు. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సందర్భాలలో విక్రయించిన వాణిజ్య పరమైన ఆస్తులకు, భగవంతునికి భక్తులు భక్తిపూర్వకంగా సమర్పించుకున్న ఆస్తులకు మధ్య పోలిక తెస్తున్నారు.
మరోవైపు టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు జగన్‌ ‌ప్రభుత్వం ప్రయత్ని స్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తక్షణమే ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులు నిరర్ధకమని టీటీడీ అనడం దారుణమని విపక్షాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దేవాలయ భూములను విక్రయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రభుతాన్ని హెచ్చరించారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత మంగళవారం లాక్‌డౌన్‌ ‌నిబంధనలను పాటిస్తూ ఎక్కడి వారు అక్కడ నిరసన దీక్షలు నిర్వహించారు. భవిష్యత్‌లో టీటీడీ అస్తులతో పాటుగా వైసీపీ నేతల కన్నుపడిన సింహాచలం భూముల పరిరక్షణకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జనసేన, కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీలు కూడా ఆందోళన చేపట్టేందుకు సిద్దమవుతుతున్నాయి. అన్నిటినీ మించి వైసీపీ పాలనలో హిందూ దేవుళ్ల ఆస్తులకు మాత్రమే కాదు, హిందూ సమజానికీ ధర్మానికీ రక్షణ లేకుండా పోయిందన్న అభిప్రాయం అందరి నోటా వినిపిస్తోంది.
మే 25వ తేదీ రాత్రి టీవీ ఛానళ్లలో ప్రత్యక్షమైన టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు సుబ్బారెడ్డి కొత్త మాట వినిపించారు. అసలు భూముల అమ్మకం నిర్ణయమే జరగలేదని ఆయన చెప్పడం విశేషం. పాత ప్రభుత్వం నిర్ణయాన్ని సమీక్షించామని, అంతేతప్ప తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని చెప్పారు. అయితే ఆస్తుల వేలానికి సంబంధించిన ప్రకటన మాటేమిటి? వైసీపీ ఎంపి రఘురామకృష్ణ రాజు టీటీడీ నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, కొందరు పాలక మండలి సభ్యులు కూడా ఆస్తుల వేలానికి వ్యతిరేకంగా ఉండడం ఈ ఉదంతానికి కొసమెరుపు.
– రాజనాల బాలకృష్ణ, సీనీయర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE