ఆదివారం (మే 3) ఉదయం పది గంటల పదిహేను నిమిషాలు. అప్పటి నుంచి కొద్దిసేపటి వరకు దేశంలోని చాలా ఆస్పత్రుల మీద పూలు కురిశాయి. కశ్మీర్‌లోని దాల్‌ ‌సరస్సు మొదలుకొని, త్రివేండ్రం వరకు ఇదే విధంగా వైద్యాలయాల మీద పుష్పాభిషేకం జరిగింది. చేతక్‌ ‌హెలికాప్టర్‌ ‌హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మీద ఎగురుతూ పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించింది. చాలామంది డాక్టర్లు, అక్కడ ఉన్న వారు ఆనందోత్సాహాలతో కరతాళధ్వనులు చేశారు. ఇంకొందరు ఆ అందమైన దృశ్యాన్ని తమ తమ సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు. ఆ హెలికాప్టర్‌ అక్కడకు చేరుకునే సమయానికి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది ఆ ప్రాంగణంలో వచ్చి నిలిచారు. ఆ పూలవానలో మునిగితేలారు. వారి అంతరంగం ఆనందంతో తడిసి ముద్దయింది.

గడచిన 42 రోజులుగా కొవిడ్‌ 19 ‌వైరస్‌ను నిర్మూలించడానికి అహరహం శ్రమిస్తున్న వైద్యుల గౌరవార్ధం భారత వైమానిక దళం, సైనిక, నావికా దళాలు ఆదివారం గగనతలం నుంచి పూలవర్షం కురిపించి, దేశం తరఫున కృతజ్ఞతలు తెలియచేశాయి. అందులో భాగంగానే గాంధీ ఆస్పత్రి మీద కూడా పూలు పడినాయి. తెలంగాణ ప్రాంతంలో ఇదే ఆస్పత్రి నుంచి వందలాది మంది కొవిడ్‌ 19 ‌రోగులు బతికి బయటపడ్డారు. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక కట్టడం మీద పూలరేకులను కురిపించిన హెలికాప్టర్లు తరువాత దేశంలోని వివిధ ఆస్పత్రుల మీద కూడా పూరేకులు చల్లాయి. రక్షక భటుల గౌరవార్థం అక్కడ పూలు చల్లారు. శ్రీనగర్‌ ‌దాల్‌ ‌సరస్సు మీద ఉదయం హెలికాప్టర్లు ఎగిరాయి. అదే సమయంలో దేశంలో కొన్నిచోట్ల ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.15కి రాష్ట్రపతి రోడ్‌లో కూడా ఇలాంటి విన్యాసం జరిగింది. కొవిడ్‌ 19 ‌సమరంలో ముందున్న వైద్యులు, పోలీసులను సత్కరించుకోవడానికి భారత వైమానిక దళం ఈ కార్యక్రమం చేపట్టింది. సి-130జె సూపర్‌ ‌హెలికాప్టర్లు, ఎయు-30 ఎయిర్‌‌క్రాఫ్టు ఈ కార్యక్రమం కోసం వినియోగించారు.
మరొక హెలికాప్టర్‌ ‌పంచకుల (హరి యాణా) ప్రభుత్వ ఆస్పత్రి మీద పూలు చల్లింది. అదే సమయంలో ఆ ఆస్పత్రి బయట మిలటరీ బ్యాండ్‌ ‌మోగింది. పనాజీలోని గోవా మెడికల్‌ ‌కాలేజీ మీద కూడా ఇలాగే పూలు జల్లారు. వైద్యుల ఎడల తమ గౌరవాన్ని ప్రకటించుకోవ డానికి ముంబైలో మెరైన్‌ ‌డ్రైవ్‌ ‌కూడా నిర్వహిం చారు. ఇందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌త్రివిధ రక్షక దళాలకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఎయిమ్స్ ‌రెసిడెంట్స్ ‌డాక్టర్స్ ‌సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రాజ్‌కుమార్‌ ‌కూడా ఇందుకు ధన్యవాదాలు తెలియచేశారు. నౌకా, వైమానికి, సైనిక దళాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా వైరస్‌ను తరిమివేయడంలో ఎంతో శ్రమించిన వైద్యులందిరి కోసం ఈ ఫ్లైపాస్ట్ ‌నిర్వహిస్తున్నామని రక్షణ దళాల అధిపతి జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌శుక్రవారం వెల్లడించారు. శ్రీనగర్‌ ‌నుంచి త్రివేండ్రం వరకు, దిబ్రూగఢ్‌ ‌నుంచి కచ్‌ ‌వరకు ఈ విధంగానే ఆస్పత్రుల మీద పూలు చల్లుతామని ఆయన చెప్పారు. ఆ సమయంలో కొన్ని ఆస్పత్రుల వద్ద మిలటరీ బ్యాండ్‌ ‌కూడా మోగింది. నావికా దళంలోని యుద్ధ నౌకలు కూడా తమ హెలికాప్టర్లను ఇందుకు పంపుతున్నాయని రావత్‌ ‌చెప్పారు.
దాల్‌ ‌సరస్సు మీద విన్యాసాలు చేసిన తరువాత ఆ హెలికాప్టర్లు చండీఘడ్‌లోని సుఖానా సరస్సు మీద కూడా పూలు చల్లుతూ విన్యాసాలు చేశాయి. లక్నోలోని కింగ్‌ ‌జార్జ్ ‌వైద్య విశ్వవిద్యాలయం మీద, ఒడిశాలోని కళింగ మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ‌మీద (భువనే శ్వర్‌), ‌బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి మీద, చెన్నైలోని రాజీవ్‌ ‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి మీద, భోపాల్‌లోని చిరాయు వైద్య కళాశాల మీద, షిల్లాంగ్‌లోని సివిల్‌ ఆస్పత్రి మీద, రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ‌మీద, కేరళలోని త్రివేండ్రం వైద్యకళాశాల మీద, నలందా మెడికల్‌ ‌కాలేజీ మీద, లే లోను, అహమ్మదా బాద్‌ ‌సివిల్‌ ఆస్పత్రి మీద, గౌహతి మెడికల్‌ ‌కాలేజీ, మహేంద్ర మోహన్‌ ‌చౌదరి ఆస్పత్రి (అస్సాం) మీద, జైపూర్‌లోని సవాయ్‌ ‌మాన్‌సింగ్‌ ఆస్పత్రి మీద, ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్‌, ఎఎన్‌జెపి ఆస్పత్రుల మీద హెలికాప్టర్లు పూలు కురిపించాయి.
ఆదివారం సాయంత్రం ముంబై, పోర్‌ ‌బందర్‌, ‌కార్వార్‌, ‌విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పోర్ట్ ‌బ్లెయిర్‌లలో వైద్యులకు సంఘీభావంగా నౌకలలో దీపాలు వెలిగించారు. తీర గస్తీ నౌకా బృందానికి చెందిన నౌకలు 24 చోట్ల ఈ కార్య క్రమం కోసం వచ్చాయి. ఇందులో పోర్బందర్‌, ఒఖా, రత్నగిరి, ధాను, మురద్‌, ‌గోవా, న్యూ మంగళూరు, కవరాటి, కరైకాల్‌, ‌చెన్నై, కృష్ణ పట్నం, నిజాంపట్నం, పుదుచ్చేరి, కాకినాడ, పరదీప్‌, ‌గోపాల్‌పూర్‌ (‌పూరి), సాగర్‌ ఐలాండ్‌, ‌పోర్ట్ ‌బ్లెయిర్‌, ‌దిగ్లిపూర్‌, ‌మాయాబందర్‌, ‌హుట్‌ ‌బే, కాంప్‌ ‌బెల్‌ ‌బేలలో తీర గస్తీ నౌకలు తిరుగుతూ సంఘీభావం ప్రకటిస్తాయి.
కరోనా వైరస్‌ ‌పోరాట యోధులకు సంఘీభావం తెలియచేయడానికి ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించడం కూడా తప్పు పట్టిన చెత్త మేధావులు ఈ దేశంలో ఉన్నారు. బిపిన్‌ ‌రావత్‌ ‌ప్రకటన తరువాత ఒక మేధావి ఇంత ఖర్చు పెట్టి పూలు ఎందుకు చల్లాలి? ఆ ఖర్చు పేదలకు ఇవ్వవచ్చు కదా అంటాడా చెత్త మేధావి. నిజమే, తమ ప్రాణాలకు కూడా తెగించి వైద్యం అందిస్తున్న డాక్టర్ల మీద రక్షక దళాలు పూలు చల్లితే నచ్చలేదా? మైనారిటీలు ఉమ్మితే నచ్చింది కాబోలు. పోనీ మూత్రం నింపిన సీసాలు డాక్టర్ల మీదకు విసిరితే సత్కరించినట్టు అవుతుందా? ఎంతో సేవ చేసే నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సత్కరించడంతో సమానమని ఈ మూర్ఖుల భావమా? ఇలాంటి నీచ మనస్తత్వంతోనే మైనారిటీలను స్వయం ప్రకటిత మేధావులు, చాలామంది పత్రికా రచయితలు బుజ్జగిస్తూనే ఉన్నారు. నిజంగానే ఆదివారం నాటి ఈ పుష్పాభిషేకం కరోనా వైరస్‌ ‌మీద పోరుతున్న వైద్యులకు దక్కిన కొద్దిపాటి గౌరవం. చంద్రునికో నూలుపోగు.

About Author

By editor

Twitter
YOUTUBE