జాగృతి – సంపాదకీయం
శాలివాహన 1941 – శ్రీ శార్వరి జ్యేష్ఠ శుద్ధ దశమి – 1 జూన్ 2020, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
———————————————————————————————————————————-
దేశ పటాలలో రేఖలను మార్చినంత వేగంగా చరిత్రను ఏమార్చడం సాధ్యం కాదు. కొత్త సిద్ధాంతాలతో, కొత్త పార్టీలు అధికారంలోకి వచ్చినంత మాత్రాన దేశపటాలు, అంటే మ్యాప్‌లలో సరిహద్దు రేఖలు స్థానభ్రంశం కావడం సులభం కాదు. పొరుగు దేశాల ప్రలోభాలు రేఖలనీ, వాస్తవాలనీ అసలే ప్రభావితం చేయలేవు. అసలు ఇరుగు పొరుగు దేశాల విదేశాంగ విధానం ఆయా దేశాల గతం పునాదిగా అవతరిస్తుందని గుర్తించాలి. భారత భూభాగంలోని కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాల వివాదంలో నేపాల్ ఈ అంశాలను విస్మరించడంవల్లనే గందరగోళానికి గురైనట్టు కనిపిస్తుంది. ఇంత గందరగోళంలోకి ఆ చిన్న దేశాన్ని నెట్టేసిన ఘనత చైనాదే.
పైన చెప్పుకున్న ఆ మూడు ప్రాంతాలు నేపాల్ వేనని ఆ దేశ ప్రధాని ఖడ్గప్రసాద్ ఓలీ శర్మ వారం క్రితమే వివాదం రాజేశారు. 2019 అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నేపాల్‌లో పర్యటించిన తరువాతే ఈ వివాదానికి ప్రాణ ప్రతిష్ట జరిగిందని చెబుతున్నారు. ఇందుకు పరిస్థితులూ సహకరించాయి. నేపాల్ ప్రధాని ఓలీ శర్మ నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తానులో ముక్క. ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని, భారత్ పొడ గిట్టని ‘ప్రచండ’ అంతేవాసులలో ఓలీ ఒకరు. ప్రచండ ప్రధాని అయినప్పుడే చైనాకు ఎర్రతివాచీ పరిచే పని మొదలయింది. కానీ, చైనా తెర వెనుక ఉండి నడిపించిన ఈ మూడు ముక్కల ఆట నేపాలీలకు రుచించడం లేదనే అనుకోవాలి. నేపాల్, భారత్‌ల బంధం మరువరానిదన్న స్పృహ వారిలో వ్యక్తమవుతున్నది.
ఆ మూడు ప్రాంతాలు నేపాల్‌కు చెందినవని చెబుతూ కొత్తగా అవతరించిన మ్యాప్‌కు మే 27న పార్లమెంట్‌లో శరాఘాతం వంటి ప్రతికూలత ఎదురయింది. కొత్త రేఖల ఆ మ్యాప్ పుట్టి అప్పటికి వారమే. దీనిని ఆమోదించవలసిందేనంటూ ప్రధాని ఓలీ చేసిన విన్నపానికి పార్లమెంట్ తలొగ్గలేదు. కొత్త మ్యాప్ ఆమోదానికి దిగువ సభలో రాజ్యాంగ సవరణ బిల్లు రావాలి. కానీ చివరి క్షణంలో చర్చనీయాంశాల జాబితా నుంచి అది మాయమైంది. దీని వెనుక మతలబేమిటో బయటకు రావలసి ఉన్నప్పటికీ, కొత్త మ్యాప్ గురించి నేపాల్ రాజకీయ పక్షాలలో ఏకాభిప్రాయం లేదని తేలిపోయింది. మే 20న మంత్రి మండలి ఆమోదించిన కొత్త మ్యాప్‌కు వారంలోనే అంతర్జాతీయ ఆమోదం సాధించాలనీ, భారత్‌ను ఆ విధంగా లొంగదీయాలనీ అనుకోవడం నేపాల్ ప్రధాని అత్యాశే. అంటే చైనా అత్యాశ.
ఈ క్రమంలో గుర్తించవలసిన మరొక అంశం – ఈ మూడు భాగాలు తమవేనంటూ నేపాల్ వాదన మొదలుపెట్టిన తరువాత భారత సైనిక దళాల అధిపతి జనరల్ నరవాణే కీలెరిగి వాతపెట్టిన రీతిలో ప్రకటన ఇచ్చారు. నేపాల్ చేత ఇలా మాట్లాడిస్తున్నదెవరో తెలియనిదా అంటూ నరవాణె పరోక్షంగా చైనాను ఎత్తి పొడిచారు. నేపాల్ సైనికాధిపతి పూర్ణచంద్ర థాపా ద్వారానే ఈ ప్రకటనకు ఖండన ఇప్పించాలని నేపాల్ ప్రధాని ప్రయత్నించారనీ, ఇందుకు థాపా నిర్ద్వంద్వంగా తిరస్కరించారని వార్త. ఇది రాజకీయాంశమని థాపా చెప్పినట్టు తెలుస్తున్నది. నరవాణే ప్రకటనకు అడ్డురాని రాజకీయం థాపాకూ రాకూడదు. అంటే ప్రధాని వైఖరిని సమర్ధించడానికి నేపాల్ సైన్యం సిద్ధంగా లేదు. ఇదంతా జరుగుతూ ఉండగానే భారత్ సరిహద్దులలో ఇటీవలి ఘర్షణల గురించి చైనా కాస్త శ్రుతి మార్చింది. ఇలాంటి చిన్న చిన్న విభేదాలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేయకూడదని భారత్ లో ఆ దేశ రాయబారి సన్ విడాంగ్ మే 27వ తేదీనే ‘ఆశాభావం’ వ్యక్తం చేశారు. కొవిడ్ 19 కట్టడికి మోదీ కృషి అద్భుతమంటూ కితాబు కూడా ఇచ్చేశారు. కానీ అదే సమయంలో నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావాలి కాలాపానీ నుంచి భారత్ దళాలు వైదొలగాలని పాత పాటే వినిపించారు. నిజానికి ఆ ప్రాంతాలు నేపాల్ పరిధిలో ఉన్నవంటే అంగీకరించడానికి పార్లమెంటే సిద్ధంగా లేనప్పుడు ఇక విదేశాంగ మంత్రి మాటకు విలువేమిటి? కానీ సమస్యను సజీవంగా ఉంచే ఒక దురాలోచనకు ఇదో నిదర్శనం. కరోనా పాపమంతా చైనాదేనంటూ ప్రపంచం హోరెత్తిస్తున్న వేళ, దృష్టి మళ్లించడానికి జిన్ పింగ్ పడరాని పాట్లు పడుతున్నారు. ఊహాన్ పాత్ర మీద దర్యాప్తు జరపాల్సిందేనని 123 దేశాలు కోరాయి. ఈ చిక్కుల మధ్య చైనాకు విన్యాసాలు తప్పడం లేదు.
కానీ నేపాల్ ప్రధాని చైనా అధ్యక్షుడిని మక్కికి మక్కి అనుసరించడమే వింత. నేపాల్ లో కరోనాను నిరోధించడంలో ఆయన వైఫల్యం మీద ఆరోపణలు వచ్చాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి భారత్ నుంచే కరోనా వచ్చిందని ఆరోపిస్తున్నారాయన. పైగా అది చైనా కరోనా కంటే ఘోరమట! ఎంత దిగజారుడు?
ఇరుగు పొరుగు దేశాలలో ఒక్కటి కూడా భారత్ కు అనుకూలంగా లేదు. కానీ నేపాల్ సంగతి వేరు. హిందూ ఆధిక్యం ఉన్న ఒకే ఒక్క దేశం. అది చైనా గుప్పిట్లోకి పోవడమే పెద్ద వైచిత్రి. భారత్‌కు వ్యతిరేకంగా చైనా పన్నిన ఉచ్చులో తామూ ఉన్నామన్న వాస్తవం ఆ హిందూ దేశం గుర్తించాలి. కానీ, పాలకులు చైనాకు అనుకూలురైనా, ప్రజానీకం వ్యతిరేకంగానే ఉన్నదని తాజా పరిణామం రుజువు చేస్తున్నది. ఇంతటి సంకటంలోను అది సంతోషించదగినదే.