లాక్‌డౌన్‌ను విమర్శించలేం. లాక్‌డౌన్‌ను విమర్శించడం అంటే కొన్ని కోట్ల ప్రాణాలకు విలువ లేదని చెప్పడమే. ఆ కారణంగా తలెత్తుతున్న కొన్ని దుష్ఫలితాలను విస్మరించలేం కూడా. విస్మరిస్తే మానవత్వం అనిపించుకోదు. కానీ వలస కార్మికుల సమస్యను, అందులోని ఉద్వేగాన్ని అడ్డం పెట్టుకుని దేశ ప్రజానీకాన్ని ఒక మహా విపత్తుకు సమీపంగా తీసుకుపోదలచిన రాజకీయ వికృత విన్యాసాలను మాత్రం ఎండగట్టవలసిందే. నిజమే, ఇప్పుడు దేశం మొత్తాన్ని బాధ పెడుతున్న దుష్ఫలితాలలో కీలకమైనది – వలస కార్మికుల సమస్య. మే 8వ తేదీ వేకువన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కర్మాడ్ దగ్గర జరిగిన రైలు ప్రమాదం ఘటన వలస కార్మికుల సమస్యలోని ఒక బీభత్స కోణాన్ని దేశం ముందు ప్రదర్శించింది. ఆ దుర్ఘటన కేంద్రబిందువుగా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్ని ప్రశ్నలు, ఎన్ని విశ్లేషణలు, ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆ దుర్ఘటనలో పదహారు మంది కూలీలు చనిపోవడం విషాదమే. మహారాష్ట్రలోనే జాల్నా అనే చోట ఉన్న స్టీల్ కర్మాగారంలో వీరంతా పని చేసేవారు. ఈ ప్రమాదం పట్ల రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
వలస కార్మికుల సమస్య ఏప్రిల్ మధ్య నుంచే రూపుదిద్దుకుంటున్న జాడలు కనిపిస్తాయి. మొత్తానికి కేంద్రం, రాష్ట్రాలు ఈ విషయం మీద ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాత కొన్ని రైళ్లు, బస్సులు వలస కార్మికులతో వారి వారి స్వస్థలాలకు బయలుదేరాయి. ఈ క్రమంలో జరిగినదే కర్నాడ్ రైలు దుర్ఘటన. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన విశ్లేషణ ప్రకారం ఘటన జరగడానికి మూడు రోజుల ముందు శ్రామిక్ రైళ్లలో ప్రయాణం కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంగతి వీరితో ప్రయాణించినా ప్రమాదానికి గురి కాకుండా మిగిలినవారు కూడా చెప్పారు. అయితే అధికారుల నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని, అందుకే ఇరవై మంది కూడబలుక్కుని కాలినడకన బయలుదేరామని శివభాను సింగ్ అనే యువకుడు చెప్పాడు (కానీ ఈ కార్మికులు ఎవరూ కూడా ప్రయాణం కోసం దరఖాస్తు చేయడానికి రాలేదని అధికారులు చెబుతున్నారు). రైలు పట్టాల మీద ఎక్కువ మంది నిద్రించగా, ముగ్గురు వేరే చోట పడుకున్నారు. వీరే బతికి బట్టకట్టారు. వీరంతా మధ్యప్రదేశ్‌లోని ఉమారియా, షహదోల్ జిల్లాలకు చెందినవారు. మరొక వాస్తవం కూడా శివభాను వెల్లడించాడు. కర్మాగారం త్వరలోనే పునఃప్రారంభిస్తామనీ, ఉండిపొమ్మనీ వారి కాంట్రాక్టర్ చెప్పాడట. కానీ ఇంటికి వెళ్లిపోవాలన్న గట్టి ఉద్దేశంతో బయలుదేరామని చెప్పాడు. నలభయ్ కిలోమీటర్లు నడిచిన తరువాత అలసిపోయి రైలు పట్టాల మీదే నిద్రించారు. రైలు పట్టాలను ఎందుకు ఆశ్రయించవలసి వచ్చిందంటే, సరిహద్దులలో, అక్కడక్కడ పోలీసు తనిఖీల నుంచి తప్పించుకోవడానికే. లాక్‌డౌన్ కారణంగా రైళ్లు నిలిచిపోయాయి కాబట్టి ప్రమాదం లేదని భావించే వారు ఆ పట్టాల మీద నిద్రించారన్నది కూడా ఒక పత్రిక ఇచ్చిన కథనం. తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగిపోయింది. లాక్‌డౌన్ అమలులలో ఉన్నా గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి. ఇటీవలనే వలస కార్మికులతో శ్రామిక్ శకటాలు కూడా నడుస్తున్నాయి. ఇందులో మొదటి సంగతి వారికి తెలియదని చెబుతున్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన ఖాళీ డీజిల్ పెట్టెల గూడ్స్ తెలంగాణలోని చర్లపల్లి నుంచి మన్మాడ్ వెళుతోంది. చిత్రం ఏమిటంటే ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే భోపాల్ నుంచి 170 మంది వలస కార్మికు లతో బయలుదేరిన ఒక రైలు జాల్నా చేరుకుంది. ఏ విధంగా చూసినా ఆ పదహారు మందికి ఎదురైన మరణం ఘోరమైనది. అయినా వారంతా అంత అనాలోచితంగా పట్టాల మీద పడుకోకుండా, ఆ ముగ్గురు నలుగురు మాదిరిగానే సురక్షిత ప్రదేశంలో నిద్రించి ఉండవలసింది. అంతా అయిపోయినా ఈ మాట అనుకోకుండా ఉండలేం. ఇక మిగిలింది – మృతుల కుటుంబాలను ఆదుకోవడం ఒక్కటే.
నలభయ్ రోజుల లాక్‌డౌన్ తరువాత భారత్‌లో వలస కార్మికుల సమస్య తీవ్రరూపం దాల్చింది. ఏప్రిల్ రెండో వారంలో ఇందుకు సంబంధించిన జాడలు కనిపించాయి (దేశంలో మూడు దఫాలుగా లాక్‌డౌన్ విధించారు. మార్చి 25, 2020 – ఏప్రిల్ 14, 2020 వరకు ఒకటో దశ. ఏప్రిల్ 15, 2020 – మే 3, 2020 వరకు రెండో దశ. మే 4, 2020 – మే 17, 2020 వరకు మూడో దశ). ఆంధప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి వలస కార్మికులు పట్టుపట్టడం మొదలు పెట్టారు. ఈ పరిణామం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే కాదు, కేంద్రాన్ని కూడా దారుణమైన ఇరకాటంలోకి నెట్టేసింది. అయినా వలస కార్మికుల తరలింపు అనివార్య మైంది. అంతే. లాక్‌డౌన్ కొనసాగిస్తూనే, తరలింపు కూడా చేపట్టవలసి వచ్చింది. ఇందులో చాలా ప్రమాదం పొంచి ఉన్నా ఈ నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితులు కల్పించారు. మొదటిసారి లాక్‌డౌన్ ప్రకటించిన మార్చి 24 తరువాతి కాలానికీ, వలస కార్మికుల సమస్య పతాక స్థాయికి చేరుకున్న మే మొదటివారం నాటికీ కొవిడ్-19 ఉధృతిలో మార్పేమీ లేదు. అలా పైపైకి దూసుకుపోతూనే ఉన్నది బాధితుల సంఖ్య. కేరళ తప్ప దక్షిణాదిన కేసులు భయపెట్టే స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర అయితే (ఈ వ్యాసం రాసే నాటికి) దాదాపు 18,000 కేసులు నమోదు చేసుకుంది. ఏడు వందల మంది మరణించారు. గుజరాత్, ఢిల్లీ, బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎక్కడా కూడా పరిస్థితి సజావుగా లేదు. ఆంధప్రదేశ్‌లో భయం గొలిపే రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. దేశం మొత్తం మీద కేసులు 68,980. మృతులు 2,234 (మే 11 సాయత్రం నాటికి). ఇటు లాక్‌డౌన్. అటు వలస కార్మి కులు తరలింపు. ఈ నడుమ జరిగినదేమిటి? కేసుల సంఖ్య పెరగడమే. కాంగ్రెస్ వంటి బాధ్యతారాహిత్య నాయకుల వేదిక నుంచి ఒత్తిడి, అది ప్రదర్శించిన వాగాడంబరం, కొన్ని కొన్ని ప్రజా సంఘాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 1947 నాటి వలసలను మించి పోయి ఈనాటి వలసలు ఉన్నాయన్నట్టు చిత్రిస్తూ కొన్ని మీడియా సంస్థల హడావిడి.. మొత్తానికి వలస కార్మికుల తరలింపు గురించి అత్యవసరంగా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కల్పిం చాయి. ఇది కాకుండా వెళ్లిపోతామని వేడు కుంటున్న కార్మికులను నిలిపి ఉంచే ప్రయత్నం ఎంతమాత్రం మంచిది కాదంటూ స్వయం ప్రకటిత మేధావుల, ఆర్థికవేత్తల నుంచి ప్రకటనల హోరు. నలభయ్ రోజులుగా ఇతర రాష్ట్రాలలో ఉండిపోయిన వారు మరొక వారం ఉండడం కష్టమా? అన్న ప్రశ్న సహేతుకమే. పని చేయడానికి వచ్చిన రాష్ట్రాలలో మరొక వారం ఉండిపోతే వారు నిజంగానే నష్టపోతారా? అందుకే కాబోలు, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడుయూరప్ప వలస కార్మికులను ఉండపోవలసిందనీ, అన్ని ఏర్పాట్లు చేస్తామనీ మొదట చెప్పినా, ఒక్క రోజుకే నిర్ణయం మార్చి రైళ్లు ఏర్పాటు చేశారు. వలస కార్మికుల సమస్యను పట్టుకుని కాంగ్రెస్, కమ్యూ నిస్టులు, కొన్ని ప్రజాసంఘాలు కేంద్రంపై ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డా యంటే అతిశయోక్తి కాదు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడానికి కావలసిన సూత్రం ఎక్కడివారు అక్కడ ఉండడం అన్న విధానం పూర్తిగా భగ్నం చేయడానికి ఈ ఎమోష నల్ బ్లాక్‌మెయిలింగ్‌ను ఉపయోగించుకున్నారు.
నిజానికి మూడో దఫా లాక్‌డౌన్ ప్రకటన లోనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ఆలోచన కూడా కనిపిస్తుంది. దానిని సజావుగా సాగనివ్వ లేదు. ఆ మేరకు ఈ బ్లాక్ మెయిలింగ్ శక్తులు పైశాచికానందం పొందగలిగాయి. దేశం మాత్రం మూల్యం చెల్లించడానికి సిద్ధమవు తున్నది. జూన్ మాసంలో మళ్లీ కరోనా విజృంభిస్తే అందుకు ఇలాంటి ఒత్తిడులు దోహదపడ్డాయని భావించకుండా ఉండలేం. మే మొదటివారంలో హిందుస్తాన్ టైమ్స్ ప్రచురించిన ఇప్సోస్ సర్వే ప్రకారం చూసినా భారతదేశంలో చాలామంది ఎటూ తేల్చుకోలేని స్థితిలోనే ఉన్నారు. ఈ సర్వే ప్రకారం 51 శాతం మంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని అభిప్రాయపడినప్పటికీ, 78 శాతం మంది మాత్రం ఇల్లు వదిలి బయటకు రావడానికి సిద్ధంగా లేనట్టు చెప్పారు. ఈ రెండు అంశాలకు పొంతన కుదరదు. ఆన్‌లైన్ ద్వారా ప్రపంచంలోని 14 దేశాలకు చెందిన 28,000 మందిని ఇప్సోస్ పలకరించింది. ఇందులో ఎనిమిది దేశాల వారు కొవిడ్-19 పూర్తిగా తగ్గిపోయిన తరువాతే ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించడం మంచిదని చెప్పారు.
వలస కార్మికులకు సంబంధించి భారతదేశ పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. చాలా విస్తృతమై నది కూడా. 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో 45.36 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. అంటే జనాభాలో 37 శాతం. రాష్ట్రాలు దాటి వెళ్లేవారు కొందరు. సొంత రాష్ట్రంలోనే అటు ఇటు వెళ్లేవారు ఇంకొందరు. వలస కార్మికుల సంఖ్య 2016 నాటి యాభయ్ కోట్లు చేరి ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సమస్య ప్రధానంగా అంతర్రాష్ట్ర వలస కార్మికులది. వీరి సంఖ్య 2016 నాటి అంచనా ప్రకారం 10 కోట్లు. అయితే ప్రభుత్వ రికార్డులలోకి చేరిన వారు దాదాపు 6.5 కోట్లు ఉంటారు. కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు, రోజు కూలీలు వంటి వర్గాలను కలిపితే అది పదికోట్లకు చేరుతుంది. ఇందులో ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వారు 14 శాతం. తరువాత ఐదు, ఆరు శాతం వంతున మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఉన్నాయి. అంటే నలభయ్ లక్షల నుంచి అరవై లక్షల మంది ఉత్తరప్రదేశ్‌కు తిరిగి వెళ్లాని అనుకుంటున్నారు. పది లక్షల ఎనభయ్ వేల నుంచి ఇరవయ్ ఎనిమిది లక్షల మంది బిహార్‌కు చేరుకోవాలని అనుకుంటున్నారు. రాజస్తాన్‌కు వెళ్లాలని అనుకుంటున్నవారు ఏడు లక్షల నుంచి పది లక్షలు. మధ్యప్రదేశ్‌కు వెళ్లే వారు ఆరు నుంచి తొమ్మిది లక్షలు. 2017-2019 మధ్య నిర్వహించిన పాలిటిక్స్ అండ్ సొసైటీ బిట్వీన్ ఎలక్షన్స్ సర్వే ప్రకారం ఈ వలస కార్మిక కుటుంబాల రోజువారీ – వారాంత ఆదాయం రెండు వేల నుంచి ఐదు వేలు (22 శాతం మంది), 10,000 నుంచి 20,000 (ఎనిమిది శాతం మంది) వరకు ఉంది. లాక్‌డౌన్ వీరి సంపాదనకు గండి కొట్టింది. లాక్‌డౌన్ ద్వారా ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం, కుంగుబాటు ఎంతటిదో దాచవలసిన పనిలేదు. అదే సమయంలో లాక్‌డౌన్ ప్రాణభిక్ష పెట్టిన మాటను కూడా దాచవద్దు. భారత ప్రభుత్వం 22.6 బిలియన్ డాలర్ల విలువైన ప్రోత్సాహ కాలను ప్రకటించినా వలస కార్మికులు మాత్రం వీధిన పడక తప్పలేదు.
కానీ భారతీయ సమాజానికి సహజంగా ఉన్న కొన్ని లక్షణాల కారణంగా కార్మికులు చాలావరకు లాక్‌డౌన్ కాలంలో వలస వెళ్లిన రాష్ట్రాలలో అంతో ఇంతో సౌకర్యంగానే బతికారంటే అతిశయోక్తి కాదు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, వ్యక్తిగత హోదాలో కొందరు లక్షల సంఖ్యలో కార్మికులకు భోజన వసతి సమకూర్చారు. నిత్యావసరాలు అందించారు. ఎన్నో చోట్ల రాష్ట్ర మంత్రులు, పోలీసులు కూడా వీరిని నిలిపివేశారు. వెళ్లవద్దని సౌమ్యంగా అర్ధించారు. ఇందుకు ప్రధాన కారణం వారు స్వస్థలాకు వెళ్లలేరు. ఏ రాష్ట్రం పొరుగు రాష్ట్రం వారిని అనుమతించడం లేదు. అయినా వలసకార్మికులు తిరుగు ప్రయాణానికి తెగించారు. ప్రాణాలకు తెగించారన్నా అనవచ్చు. కాలినడకన, సైకిళ్ల మీద, రిక్షాల మీద, నడచి వృద్ధులు, పిల్లలతో ఈ వేసవిని కూడా లెక్క చేయకుండా బయలుదేరారు. ఇదంతా చూస్తే ఈ వలస తిరుగుబాటు కేవలం ఆర్థికం కాదు. మానసికం కూడా అనిపించక మానదు. మరొకసారి లాక్‌డౌన్ పొడిగింపు ఉండదని వారికి ఎవరూ గట్టిగా చెప్పలేక పోతున్నారు. అలా చెప్పడం సాధ్యం కాదు కూడా. మరొకసారి లాక్‌డౌన్ ప్రకటిస్తే భవిష్యత్తుకు భరోసా లేదనే ఎక్కువమంది నమ్ముతున్నారని అనిపిస్తుంది. కానీ ఇందుకు పరిష్కారం వందల సంఖ్యలో గుంపులుగా వెళ్లిపోవడం కాదు.
కొందరు యజమానులు, రాష్ట్రాల పాలకులు ఆయా రాష్ట్రాలలో ఉండిపోవల సిందని, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని చెబుతున్నారు. ఆ ఒక్క హామీయే వలస కార్మికులను నిలబెట్టలేకపోతున్నది. మహారాష్ట్ర (ముంబై), తెలంగాణ, ఆంధప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి బిహార్, జార్ఘండ్ రాష్ట్రాలకు వెళ్లగోరిన ఆయా రాష్ట్రాల వలస కార్మికులకు ఇక్కడి కంటే అక్కడ దొరికే అదనపు ఉపాధి ఏమిటో చెప్పడం కష్టం. అలాగే సూరత్ నుంచి బయటకు వెళ్లాలనుకునే వారి విషయంలో కూడా ఇదే ప్రశ్న వస్తుంది. వారు పేద రాష్ట్రాల నుంచి వచ్చినదే ఉపాధి లేక అన్నది వాస్తవం. లాక్‌డౌన్ వంటి కఠిన నిబంధన నేపథ్యంలో వారికి సొంత రాష్ట్రాలలో కొత్తగా దొరికే ఉపాధి మాత్రం ఏమిటి? పైగా పై రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని అనుమతించడానికి దాదాపు ఏ రాష్ట్రం కూడా సిద్ధంగా లేదు. కేంద్రం నిబంధనల మేరకు ఇప్పుడు అనుమతి స్తున్నా, క్వారంటైన్ తరువాతనే అది జరుగు తున్నది. కాబట్టి ఒక ఉద్రేకంతో వలస కార్మికుడు రోడ్డెక్కడంలో కొందరు అనుమా నిస్తున్నట్టు కుట్ర కోణం ఉందనే అనుకోవాలి. మమతా బెనర్జీ వలస కార్మికుల రైళ్లను అనుమతించడం లేదని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
చరిత్రలోనే అతి పెద్దయిన, అనేకానేక చిక్కులు ఉన్న ఈ ఆర్థిక, సామాజిక సమస్యను ప్రస్తుతం ఉన్న వాతావరణంలో క్షణాలలో పరిష్కరించడం సులభం కాదు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సరిహద్దులను మూసివేసింది. కానీ, కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం వలస కార్మికులను అనుమతించాలని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. తమిళనాడులో అన్నాడిఎంకే ప్రభుత్వం ఉంది. ఆంధప్రదేశ్‌కూ, ఆ రాష్ట్రానికీ మధ్య ఏకంగా ఒకచోట గోడ కట్టి, మరొకచోట కందకం కూడా తవ్వించింది. అయినా ఇప్పుడు చిత్తూరులో కొవిడ్-19 బాధితుల పెరుగుదల భయానకంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులను రాజకీయం కోసం ఉపయోగించుకోవాలని కొన్ని పార్టీలు శతవిధాలా పరితపిస్తున్నాయి. ఇందులో అగ్రగణ్యమైనది కాంగ్రెస్. కొవిడ్-19 వ్యతిరేక పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసు యంత్రాంగం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం సాగించిన ప్రశంసనీయ మైన పోరాటాన్ని ఈ దేశం మరిచిపోయేటట్టు చేసే ప్రయత్నం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని విద్రోహ ప్రజా సంఘాలు చేస్తున్నాయి. ఇందుకు ఒక వర్గం మీడియా శక్తి వంచన లేకుండా చేయూతనిస్తున్నది. కశ్మీర్‌లోని హంద్వారా వద్ద ఐదుగురు భద్రతా సిబ్బంది ఉగ్రమూకల చేతిలో హతమైతే, అదేదో మామూలు చావు అన్నట్టు వెల్లడించిన మీడియా ఇది. బుర్హాన్‌వనీ వారసుడు, కశ్మీర్ ఉగ్రవాది నైకూ ఎన్‌కౌంటర్ అయితే వీరమరణం చెందాడని చెప్పిన చెత్త మీడియా సంస్థలు ఇవి. వలస కార్మికుల సమస్యను తాజా అవకాశంగా తీసుకుని, దానిని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్నీ పన్నుతున్నాయి. అవార్డు వాససీ, మైనారిటీలపై దాడులు, ఆర్టికల్ 370 రద్దు అనంతర అల్లర్లు, సీఏఏ వ్యతిరేక అల్లర్లు వంటి దేశ వ్యతిరేక చర్యలకు కొనసాగింపే వలస కార్మికుల సమస్యను అడ్డం పెట్టుకుని మోదీ మీద బురద చల్లడం. ఇది దేశ ప్రజలకు అర్థంకాని సంగతీ కాదు, కొత్తదీ కాదు. వలస కార్మికుల దగ్గర చార్జీలు వసూలు చేయడం దారుణం అంటారు సోనియాగాంధీ. కార్మికుల తరలింపునకు అవసరమయ్యే ఖర్చు వారి పార్టీ భరిస్తుందట. ఇంతవరకు ఆ పార్టీ, దాని కార్య కర్తలు వలస కార్మికులకు ఎలాంటి సాయం అందించారో, ఏ స్థాయిలో అందించారో, మిగిలిన స్వచ్ఛంద సంస్థల సేవతో పోలిస్తే అది ఏపాటిదో కూడా ఆమె చెబితే దేశం విని తరిస్తుంది. వలస కార్మికులను తరలించేందుకు అయ్యే వ్యయంలో పదిహేను శాతం రాష్ట్రం, మిగిలిన చార్జీ రైల్వే శాఖ భరిస్తున్నాయనీ, ఇందుకోసం వందలాది శ్రామిక్ రైళ్లు తిరుగుతున్నాయని ప్రభుత్వం చెప్పినా కాంగ్రెస్ నేతల తలకెక్కడం లేదు. ‘115 ప్రత్యేక రైళ్లతో వలస కార్మికులు స్వంత ఇళ్లకు వెళ్లడానికి ఉపయోగపడుతున్న ఈ విధానాన్ని చిల్లర రాజకీయాల కోసం భగ్నం చేయవద్ద’ని అతి పెద్ద రైల్వే కార్మిక సంఘం ఏఐఆర్‌ఎఫ్ కొద్దిరోజుల క్రితం సోనియా గాంధీకి లేఖ కూడా రాసింది. మే 1 నుంచి శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ పేరుతో నడుపుతున్నారు. ఏ ఒక్క స్టేషన్లోను టికెట్లు అమ్మడం లేదు. మరి చార్జీ తీసుకుంటు న్నారని సోనియా ఎలా ఆరోపిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి సంభిత్ పాత్రా ప్రశ్నించారు. ఇక రాహుల్ అయితే ముఖ్య మంత్రులతో కలసి పనిచేయమని ప్రధానికి సలహా ఇచ్చారు. ఇది అత్యంత జుగుప్సాకరమైన మాట. ఎందుకంటే రాహుల్‌కు సొంత పార్టీ నాయకులతోనే కలసి పని చేయడం చేతకాదు. ఇంకా, కొవిడ్ 19 నివారణ అనేది ప్రధాని కార్యాలయానికే పరిమితం కాదని మోదీ గుర్తించాలంటూ గొప్ప సత్యాన్ని దేశ ప్రజలకు చెప్పి అందరినీ తరింప చేశారాయన. కొవిడ్ 19 నివారణ, లాక్‌డౌన్ అమలు గురించి ప్రధాని మూడుసార్లు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ వంటివారితో కూడా చర్చించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విన్నపం మేరకు ప్రత్యేక సాయం కూడా అందించారు. ఈ సంగతి రాహుల్‌కు తెలియదని అనిపి స్తుంది. ప్రధాని ఇతరులతో కలసి పనిచేయా లంటూ రాహుల్ గాంధీ సలహా ఇవ్వడం ఇంతటి కొవిడ్-19 విషాదంలోను పెద్ద జోక్. ఆర్టికల్ 370 రద్దు తరువాత మన సైనిక వాహనం మీద ఒక మతోన్మాది దాడి చేస్తుండగా తీసిన ఫొటోకు పులిట్జర్ బహుమానం వస్తే, ఆ ఫొటో తీసిన వ్యక్తిని ఆకాశానికెత్తిన రాహుల్ గాంధీ చెప్పే సుద్దులను ఈ దేశం ఇంకా వినాలా? ఇక, ఆయన సహోదరి ప్రియాంక అయితే ఎలాంటి నిర్ధారణ లేకుండానే అహమ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ -19 బాధితులను వివక్షతో చూస్తున్నారని ట్వీట్ చేసేశారు. కోతకు వచ్చిన పంట చేతికి రావడం లేదని రైతులు విలవిల్లాడిపోతున్నా మాట్లాడని ఈ పార్టీ, ఒక్కసారిగా వలస కార్మికుల మీద తన ప్రేమను ఒలకబోయడమే పెద్ద రాజకీయం. వలస కార్మికులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. పోలీసుల మీద తిరగబడుతున్నారు. రాళ్లు విసురుతున్నారు. వీరి తరఫున మాట్లాడితే, అది కూడా రెచ్చగొట్టి నట్టు మాట్లాడితే అది కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపయోగపడుతుంది. కొవిడ్-19 విషయంలో మోదీ చేసిన కృషి ప్రశంసనీయమంటూ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కీర్తికి గండికొట్టవచ్చు.
ఈ దేశంలో కార్మిక రంగం ఉమ్మడి జాబితాలోని అంశమన్న సంగతే గుర్తు లేనట్టు కాంగ్రెస్ పార్టీ, కార్మికుల పాలిట స్వయం ప్రకటిత శ్రేయోభిలాషులు కమ్యూనిస్టులూ మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరికి సదా వత్తాసు పలికే చాలా ప్రజా సంఘాల ఎజెండా ఒక్కటే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అపకీర్తి పాల్జేయడానికి వలస కార్మికుల సమస్యను అవకాశంగా మలుచుకోవడం. వలస కార్మికుల కన్నీళ్లూ, కడగండ్లు వారికి అవసరం లేదు. వారికి పట్టవు కూడా. అంతర్రాష్ట్ర వలస పనివారి చట్టం 1979 ఏం చెబుతున్నది? ఇది దేశంలో బలంగా అమలవుతున్న చట్టం కూడా. వలస కార్మికుల తరలింపు, రక్షణ వంటి అంశాలు రాష్ట్రం చేతిలో ఉన్నాయని అంటున్నదీ చట్టం. అలాగే వీరి రక్షణ విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని కూడా సూచిస్తున్నది. ఇవే కాకుండా, వీరంతా విస్మరిస్తున్న ఒక వాస్తవం- వలస కార్మికులను ఏ రాష్ట్రం తరిమి కొట్టడం లేదు. సాయంలో వివక్ష చూపడం లేదు. వారు కొన్ని సామాజిక, మానసిక కారణాలతో స్వరాష్ట్రాలకు వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారు. ఆవేశపడు తున్నారు. అదే ఈ పార్టీలకు ఉపయోగపడు తున్నది. ప్రభుత్వాలు, వాటి బాధ్యత, చట్టాలు వాటి పరిధులు వీటిని అలా ఉంచితే, భారతీయ సమాజం లాక్‌డౌన్ కష్టకాలంలో వలస కార్మికుల పట్ల వహించిన శ్రద్ధను, చూపిన కరుణను నిర్లక్ష్యం చేసే హక్కు, చులకన చేసే హక్కు ఎవరికీ లేదు. ఇందుకు సంబంధించిన ఘట్టాలు కోకొల్లలు. మచ్చుకు కొన్ని- చత్తీస్‌గఢ్ లోని సరైపాలి అనే పంచాయతీలో విద్యుత్ టవర్ల నిర్మాణానికి ఒక కాంట్రాక్టర్ జార్ఖండ్ నుంచి 15 మంది కూలీలను తీసుకువచ్చాడు. హఠాత్తుగా లాక్‌డౌన్ విధించారు. కాంట్రాక్టర్ ఆ 15 మందిని గాలికి వదిలేసి పరారయ్యాడు. కానీ సరైపాలి గ్రామస్థులు ఆ 15 మంది ఆకలితో ఉండిపోరాదని నిర్ణయించుకుని ఆదుకున్నారు. అధికారుల సహకారంతో ఊరి పాఠశాలలోనే ఆశ్రయం కల్పించారు. రాజస్తాన్ లోని పల్సానా అనే గ్రామం కూడా 54 మందిని ఇలాగే ఆదుకుంది. ఏపిలోని పాయగరావు పేటలో ఎండలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు నెలకు మూడున్నర వేలు సంపాదించుకునే ఒక మహిళ రెండు పెద్ద పెద్ద శీతలపానీయాల సీసాలు కొని తెచ్చింది. అయితే పోలీసులు మర్యాదగా తిరస్కరించి, ఆమె పెద్ద మనసుకు పొంగిపోయారు. దీనిని రాష్ట్రం అంతా చూసింది.
లాక్‌డౌన్ వేళ ప్రజలు కూడా చాలాచోట్ల గొప్ప బాధ్యత కలిగిన పౌరులుగా వ్యవహ రించారు. పశ్చిమ బెంగాల్‌లోని బాంగిది అనే గిరిజన ప్రాంతానికి చెందిన ఏడుగురు చెన్నైలో పని చేసేవారు. లాక్‌డౌన్ ప్రకటించిన మార్చి చివరిలోనే వీరు స్వరాష్ట్రం బయలుదేరారు. మొత్తం 1700 కిలోమీటర్లు. మొత్తానికి స్వరాష్ట్రం, సొంతూరు దగ్గరకు వచ్చారు. కానీ వారు వెంటనే గ్రామంలోకి చొరబడిపోలేదు. ఊరి బయటే స్వచ్ఛందంగా క్వారంటైన్ అయ్యారు. అక్కడంతా ఏనుగుల భయం. ఒక మామిడితోటను చూసుకుని చెట్ల మీద మంచెలు కట్టుకుని, దోమతెరలు వేసుకుని ఆ కాలం గడిపారు. ఇది పురూలియాకు సమీపంలో ఉంది. లాక్‌డౌన్, కొవిడ్-19 వ్యతిరేక పోరులో భారతీయులు సమైక్యంగా చూపించిన స్పూర్తినీ, ఇలాంటి సంస్కారాన్నీ, దేశభక్తినీ కాంగ్రెస్ సహా చాలా పార్టీలు, ప్రజాసంఘాలు సహించలేకపోతున్నాయి. ప్రజలలో ఈ మార్పు వారి ఉద్దేశంలో అవాంఛనీయం. కొన్ని మైనారిటీ సంస్థలు, వాటి నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఐక్యత వారి ఎజెండాకు వ్యతిరేకం. సమాజ విచ్ఛిన్నమే వారి శాశ్వత ధ్యేయం. లాక్‌డౌన్, కొవిడ్-19 వ్యతిరేక పోరాటంలో ఈ దేశ మధ్య తరగతి గొప్ప త్యాగనిరతిని ప్రదర్శించింది. ఇది ఇలాగే కొనసాగాలంటే వలస కార్మికుల సమస్య నేపథ్యంలో కాంగ్రెస్ తదితర సంస్థలు చేస్తున్న వికృత క్రీడను అర్థం చేసుకోవాలి.