వనవాసీ కల్యాణ్ ఆశ్రమం – ఆంధప్రదేశ్
విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రభుత్వ గ్రామ వాలంటీర్లకు, వార్డు వాలంటీర్లకు ఆంధ్ర వనవాసీ కల్యాణ్ ఆశ్రమం సభ్యులే మొదటిగా మాస్కులు అందచేయడం విశేషం. గ్రామ సచివాలయం సిబ్బంది ఇందుకు ఎంతో ఆనందించింది. కృతజ్ఞతలు తెలియచేసింది. లాక్‌డౌన్ కాలంలో పాడేరు జిల్లా (సంస్థ విభజన ప్రకారం)లో నాలుగు మండలాలు ఉన్నాయి. మొత్తం 38 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు 805 మాస్కులు ఆశ్రమం కార్యకర్తలు పంచారు. గంగవరం మండలం పోతన్నవారి పాలెం, శరభవరం, కరకపాడు గ్రామాలలో నాలుగు వందల కిలోల ఏడురకాల కూరగాయలు పంచిపెట్టారు. ప్రాంత అధికారి విద్యాధరి మహంత, కాటంరెడ్డి వెంకటకృష్ణ, పోరాగం, విశ్వనాథ్, సుమన్ (ఏబీవీపీ), కార్తీక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరకు, పాడేరు, అడ్డతీగలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. కల్యాణ ఆశ్రమ సభ్యులకు కొత్త అనుభవాలు ఎదరయ్యాయి. మైదాన ప్రాంతాల ప్రజలలో లేని క్రమశిక్షణ మన్యంవాసులలో కనిపించింది. సామాజిక దూరం పట్ల శ్రద్ధ ఉంది. ఒక విపత్తు వేళ మనుషులు పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో వారి నుంచే మైదాన ప్రాంతాల వారు ఎంతో నేర్చుకోవాలి.