– ‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర

దశాబ్దాలుగా అక్రమంగా తిష్టవేసిన ఆ భూభాగంపై పాకిస్తాన్‌కు ఎలాంటి చట్టబద్దమైన అధికారాలు లేవు. ఆక్రమిత కశ్మీర్‌ ‌విషయంలో పెత్తనాన్ని చాటుకు నేందుకు తరచూ ఏదో ప్రయత్నం జరుగుతూనే ఉంది. పాక్‌ ‌పాలకులు అక్కడి వనరులను కొల్లగొడుతూ, ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం లేదు. పైగా కొంత భాగాన్ని చైనాకు ధారాదత్తం చేయడమే కాకుండా, వివాదాస్పద సీపీఈసీ కారిడార్‌కు అనుమతి ఇచ్చారు. పాక్‌ ‌పాలకులను ప్రశ్నించేవారిని చిత్ర హింసలకు గురి చేస్తూ, మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నా అంతర్జాతీయ సమాజం పట్టించుకోదు. తాజాగా గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌లో పాకిస్తాన్‌ ‌సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకొని స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పాక్‌ ‌దుందుడుకు చర్యలను తప్పు పట్టిన భారత్‌, ‌తనదైన రీతిలో షాక్‌ ఇచ్చింది.

ప్రపంచమంతా కరోనా వైరస్‌ ‌సృష్టించిన ఆరోగ్య సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో కూడా పాకిస్తాన్‌ ‌తన దుందుడుకు చర్యలను ఏమాత్రం తగ్గించుకోవడంలేదు. కరోనా సోకిన తీవ్రవాదులను జమ్ముకశ్మీర్‌ ‌రాష్ట్రంలోకి పంపించే కుట్రలు బయట పడినా బుద్ధి మారలేదు. పాక్‌ ‌సైన్యం సరిహద్దులో కవ్వింపు చర్యలతో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి తాను అక్రమంగా తిష్టవేసిన భూభాగంలో లేని పెత్తనాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది పాకిస్తాన్‌.

పాక్‌ ‌సుప్రీంకోర్టు దుందుడుకు చర్య

ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌లో వచ్చే సెప్టెంబరులో సాధారణ ఎన్నికలు నిర్వహించుకునేందుకు పాక్‌ ‌కోర్టు గతవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు 2018 నాటి ఆదేశాల్లో సవరణలకు మార్గం సుగమం చేసింది. అలాగే అక్కడ ప్రస్తుతానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ ప్రాంతంపై పాకిస్తాన్‌కు ఎలాంటి చట్టబద్దత కానీ హక్కులు కానీ లేవు. పాకిస్తాన్‌ ‌సుప్రీంకోర్టు తన పరిధిలో లేని అంశంపై తీర్పును ఇవ్వడంపై భారత్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమిత కశ్మీర్‌లో ఎలాంటి మార్పులను సహించబోదని పాకిస్తాన్‌కు భారత్‌ ‌తేల్చి చెప్పింది. జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌తో పాటు గిల్గిట్‌-‌బాల్టిస్తాన్‌ ‌ప్రాంతాలు చట్టబద్ధంగా పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని గుర్తుచేసింది. అంతే కాదు.. ఆక్రమించుకున్న భూభాగం నుంచి తక్షణమే వైదోలగాలని పాకిస్తాన్‌కు భారత విదేశాంగ శాఖ అల్టిమేటం జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో అంతర్భాగమైన ఆక్రమిత కశ్మీర్‌లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం పాకిస్తాన్‌ ‌ప్రభుత్వానికి గానీ, అక్కడి న్యాయవ్యవస్థకు గానీ లేవని భారత్‌ ‌తేల్చి చెప్పింది. ఈ ప్రాంతంలో భౌతిక మార్పులకు తరచూ యత్నిస్తున్న పాక్‌ ‌చర్యలను భారత్‌ ‌తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ప్రాంతంపై భారత ప్రభుత్వ వైఖరి 1994లో పార్లమెంటు చేసిన తీర్మానం ద్వారా తెలియజేశామని గుర్తుచేసింది. ఆక్రమిత కశ్మీర్‌ను అక్రమంగా ఆక్రమించుకున్న విషయాన్ని, అక్కడ జరుగుతున్న వనరుల దోపిడి మానవ హక్కుల ఉల్లంఘనను, ప్రజల స్వేచ్చను హరిస్తున్న విషయాల్ని పాక్‌ ‌ప్రభుత్వం తాజా చర్యలతో కప్పిపుచ్చలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ఆ దేశ రాయబారికి దౌత్యపరమైన లేఖ (డిమార్ష్)‌ను అందజేసింది.

వాతావరణ సూచనల నిర్ణయం

పాకిస్తాన్‌ ‌సుప్రీంకోర్టు తీర్పు విషయంలో నిరసనతో పాటు మరో షాక్‌ ‌కూడా భారత్‌ ఇచ్చింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇక మీదట పీవోకే ప్రాంతాల్లోనూ వాతావరణ సూచనలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పాక్‌ ఆధీనంలో ఉన్న గిల్గిట్‌-‌బాల్టిస్తాన్‌, ‌ముజఫరాబాద్‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేయనున్నట్లు ఐఎండీ డైరెక్టర్‌ ‌జనరల్‌ ఎమ్‌ ‌మహపాత్ర, ఆర్‌ఎం‌డీ హెడ్‌ ‌కుల్‌దీప్‌ శ్రీ‌వాత్సవ ఈ మేరకు ప్రకటించారు. ఇకపై ఆ ప్రాంతా లను జమ్ముకశ్మీర్‌ ‌సబ్‌ ‌డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఐఎండీ గతంలో ముజఫరాబాద్‌, ‌గిల్గిట్‌-‌బాల్టిస్తాన్‌ ‌ప్రాంతాల్లోనూ వాతావరణ సూచనలు చేసేది. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు నిలిపివేసింది. తాజాగా ఈ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు చేయాలని నిర్ణయించింది. పీవోకే భారత్‌లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం బలంగా సంకేతాలిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌మీద పట్టు సాధించే దిశగా భారత్‌ ‌తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదొకటని చెప్పవచ్చు.

మోదీ ప్రభుత్వ దూకుడుతో పాక్‌ ‌చిత్తు

కేంద్రంలో 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్‌ ‌దుర్నీతికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట పడటం మొదలైంది. భారత సైన్యం పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌పాక్‌ ‌భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద మూకల శిబిరాలపై నిర్వహించిన సర్జికల్‌ ‌స్ట్రెక్స్ ఆ ‌దేశంతో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఆ తర్వాత పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మరోసారి చేపట్టిన ఎయిర్‌ ‌స్ట్రెక్స్ ‌పాక్‌ ‌వెన్నులో వణుకు పుట్టేలా చేశాయి.

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌ ‌విషయంలో మరో రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. కశ్మీర్‌కు దశాబ్దాలుగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370‌ని రద్దు చేస్తూ భారత పార్లమెంట్‌ ‌చట్టం చేసింది. దీంతో పాటు జమ్ముకశ్మీర్‌ ‌రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది.

భారత్‌ ‌తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పాకిస్తాన్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. యుద్ధమే చేయాల్సి వస్తే ఎదుర్కో వడం కష్టమేనని ఆ దేశానికి అర్థమయ్యేలా చేశాయి. భారత్‌తో గిల్లిగజ్జాలు పెట్టుకుంటే ఆర్థికంగానూ తమకు తీవ్రంగా నష్టమేనని పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌కు ఇప్పటికే అర్థమైంది. అయినప్పటికీ కుక్క తోక వంక అన్న చందాన భారత్‌ ‌వ్యతిరేకతను మార్చుకోలేరు.

1947లో మొదలైన వివాదం

దేశ విభజనతో కూడిన భారత స్వాతంత్య్రంతో పాటు జమ్ముకశ్మీర్‌ ‌వివాదానికి కూడా పునాది పడింది. ఆంగ్లేయుల కుటిల నీతి, ప్రథమ ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ- షేక్‌ అబ్దుల్లా ముసుగులో గుద్దులాటతో మొదలైన సంక్షోభం ఇది. ఇతర సంస్థానాల మాదిరిగానే జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసే విషయంలో మహారాజా హరిసింగ్‌ ‌సకాలంలో నిర్ణయం తీసుకోలేదు. ఈ నేప థ్యంలో ఈ సంస్థానం మొత్తాన్ని కబలించేం దుకు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్‌ ‌కుట్ర పన్నింది. 1947 అక్టోబర్‌ 24‌న శ్రీనగర్‌లోని రాజప్రసాదంలో విజయదశమి వేడుకలు జరుగుతున్న వేళ కొండజాతుల ముసుగులో పాకిస్తాన్‌ ‌సైన్యం దురాక్రమణకు దిగింది. అప్రమత్తమైన మహారాజా హరిసింగ్‌ ‌జమ్ము కశ్మీర్‌ను భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేసేందుకు అంగీకరిస్తూ రక్షణ కోసం సైన్యాన్ని పంపాల్సిందిగా న్యూఢిల్లీకి సందేశం పంపించారు. ప్రధాని నెహ్రూ కాస్త తత్సారం చేసినా, కేంద్ర హోంమంత్రి సర్దార్‌ ‌పటేల్‌ ‌వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపారు. భారత సైన్యం పాకిస్తాన్‌ ‌మూకలను చావు దెబ్బ తీసింది.

అయితే పాక్‌ ‌సైన్యాన్ని పూర్తిగా తరిమికొట్టక ముందే ప్రధాని నెహ్రూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించారు. దీంతో కాల్పుల విరమణ, యధాతథ స్థితి అమలులోకి రావడంతో జమ్ము కశ్మీర్‌ ‌రాష్ట్రంలోని మూడోవంతు భూభాగం పాకిస్తాన్‌ ‌చెరలోనే ఉండిపోయింది. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అక్కడి ప్రజలు ఎక్కడ చేరుతారు అనే విషయాన్ని నిర్ణయిస్తా మని ఐరాస చేసిన ప్రకటన అలాగే ఉండి పోయింది. పాకిస్తాన్‌ ‌చెరలో ఉన్న భూభాగానే పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే) అంటారు. ఇందులో ముజాఫరాబాద్‌, ‌మీర్‌పూర్‌ ‌ప్రాంతాలకు ‘ఆజాద్‌ ‌కశ్మీర్‌’ అనే పేరు పెట్టింది పాకిస్తాన్‌. ఉత్తర ప్రాంతాన ఉన్న గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌లను నేరుగా తన పాలనలోకి తెచ్చుకుంది పాక్‌. ‌తాజా వివాదానికి మూలం ఈ ప్రాంతమే.
వాస్తవానికి జమ్ముకశ్మీర్‌ ‌సమగ్రంగా నాలుగు భాగాలుగా ఉంటుంది. ఇందులో జమ్మూ, కశ్మీర్‌, ‌లద్దాక్‌ ‌భాగాలు భారత వాస్తవాధీనంలో ఉన్నాయి. పాకిస్తాన్‌ ఆ‌క్రమణలో ముజాఫరాబాద్‌- ‌మీర్‌పూర్‌, ‌గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌ ఉన్నాయి. కాగా ఇందులో ఉత్తరాన ఉన్న ‘పోక్స్ ‌గామ్‌’ ‌ప్రాంతాన్ని చైనాకు పాకిస్తాన్‌ ‌ధారాదత్తం చేసింది. లద్దాక్‌లోని ఆక్సాయ్‌ ‌చిన్‌ ‌ప్రాంతాన్ని చైనా ఆక్రమించు కుంది.

ఆక్రమితంలో పేరుకే ఆజాద్‌

‌భారత వాస్తవాధీనంలోని జమ్ముకశ్మీర్‌లో ఎంత తీవ్రవాద కార్యకలాపాలు, సంక్షోభం ఉన్న అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగు తున్నాయి. ప్రజా ప్రతినిధులు ఎన్నికవు తున్నారు. భారత ప్రభుత్వం తాజాగా రెండు భాగాలుగా పునర్విభజన చేయక ముందు జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలో 111 స్థానాలు ఉన్నాయి. ఇందులో 46 సీట్లు కశ్మీర్‌ ‌లోయ, 37 సీట్లు జమ్ము, 4 సీట్లు లద్దాక్‌లో ఉన్నాయి. మిగతా 24 సీట్లను పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌కోసం ఖాళీగా ఉంచారు.

మరోవైపు పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌కు ఆ దేశం ‘ఆజాద్‌ ‌కశ్మీర్‌’ అని పేరు పెట్టుకుంది. కానీ అక్కడి ప్రజలకు మొదటి నుంచీ ఆజాదీ (స్వాతంత్య్రం) అనేదే లేదు. పాకిస్తాన్‌లో భారత దేశ పరిధిలోని కశ్మీర్‌ ‌ప్రజలు ఆజాదీ గురుంచి మాట్లాడుతుంది. పీవోకే ప్రజలను కనీసం పౌరులుగా కూడా గుర్తించదు. విస్తారమైన ఖనిజవనరులు, హిమాని నదీ జలాలు ఉన్న ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్‌ ‌గత ఏడు దశాబ్దాలుగా దోచుకుంటోంది. అక్కడ స్థానిక పాలన, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అనేవి భూతద్దం పెట్టినా కనిపించవు.

భారత దేశంలో జమ్ముకశ్మీర్‌ ‌విలీనానికి చట్ట బద్దత ఉంది. కానీ పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌కు ఎలాంటి చట్టబద్దత లేదు. ఈ కారణంగా పాకిస్తాన్‌ ‌మొదటి నుంచీ ఇక్కడ పరోక్ష పెత్తనమే చేస్తూ వస్తోంది. సోకాల్డ్ ఆజాదీ కశ్మీర్‌కు అధ్యక్షుడు, శాసనసభ్యులు ఉన్నా వారి పెత్తనం మాత్రం ఇస్లామాబాద్‌దే. ఎలాంటి స్వయం నిర్ణయాధికారం ఉండదు. ఇక ఇక్కడి అసెంబ్లీలో 48 సీట్లు ఉన్నా, వాస్తవానికి ఎన్నికయ్యేది 28 మందే. మిగతా 20 సీట్లు జమ్ముకశ్మీర్‌లోని శరణార్థుల పేరుతో రిజర్వు చేశారు.

పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ఉత్తర భాగంలో ఉండే గిల్గిత్‌-‌బాల్టిస్తాన్‌ ‌ప్రజలు రాజ్యాంగ పరంగా రాష్ట్ర హోదా కోరుతూ వచ్చారు. పాకిస్తాన్‌ 2009‌లో ఈ ప్రాంతానికి స్వయం పాలనకు అవకాశం కల్పిస్తే శాసనసభను ఏర్పాటు చేసినా రాజ్యాంగబద్ద స్వయం ప్రతిపత్తిని ఇవ్వలేదు. అయితే ఈ శాసనసభ గిల్గిట్‌-‌బాల్టిస్తాన్‌కు రాష్ట్ర హోదా కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం 2018లో స్థానిక కౌన్సిల్‌లను అడ్వయిజరీ బోర్డుగా మారుస్తూ 68 అంశాలపై శాసనాలు రూపొందించే అధికారాలను ప్రధానమంత్రికి కట్టబెట్టింది. ఈ అంశంపై కొందరు పాకిస్తాన్‌ ‌సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది.

ఆజాద్‌ ‌కశ్మీర్‌ (‌ముజాఫరాబాద్‌- ‌మీర్‌పూర్‌)‌తో పోలిస్తే గిల్గిట్‌-‌బాల్టిస్తాన్‌లో అణచివేత చాలా దారుణంగా ఉంది. ప్రతి నిత్యం పాకిస్తాన్‌ ‌సైన్యం అణచివేత, అత్యాచా రాలకు గురవుతున్న ఇక్కడి ప్రజలు తమకు నిజమైన స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడి తిరుబాటుదారులను, ఆందోళకారులను చాలా కఠినంగా అణచివేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు హత్యకు గురయ్యారు. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌తో పోలిస్తే భారత్‌ ‌పరిధిలోని జమ్ముకశ్మీర్‌ ‌ప్రజలకే స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అధికంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆదాయంతో సంబంధం లేకుండా జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తోంది. కానీ పాకిస్తాన్‌ ‌పాలకులు మాత్రం పీవోకేను దోచుకోవడం తప్ప అక్కడ అభివృద్ధి కోసం ఇస్తున్నది దాదాపు శూన్యం. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు భారత్‌ ‌వైపు ఆశగా చూస్తున్నారు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE