జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి జ్యేష్ఠ శుద్ధ తదియ – 25 మే 2020, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌

————————————————————————————————————————————–

టర్కీ అనే దేశానికి ఐరోపా జబ్బు మనిషి అని బిరుదు. ఆసియా మానసిక రోగి అనీ, ఉన్మాది అనీ ఒక దేశానికి పేరు పెట్టవచ్చు. ఆ దేశమే పాకిస్తాన్‌. ఇలా పిలిస్తే అతిశయోక్తి కాదు. ఈ అవసరం ఎంతో కనిపిస్తున్నది కూడా.

భారతదేశంలో మైనారిటీల గురించీ, మరీ ముఖ్యంగా కశ్మీర్‌లో ముస్లింల గురించి క్షణం తీరిక లేకుండా వాపోయే పాకిస్తాన్‌ ఆ ‌దేశంలో మైనారిటీలను ఎలా చూస్తున్నది? అక్కడి మైనారిటీలు – హిందువులు, క్రైస్తవులు – అక్షరాలా నరకం చూస్తున్నారు. ఇందుకు మరొక తాజా ఉదాహరణను కూడా ప్రపంచం ఎదుటికి ఆ ఉన్మాద దేశం తెచ్చింది. ఈ ఉదాహరణను చూస్తే, తమ దేశంలో మైనారిటీలతో ఇలాగే వ్యవహరిస్తామన్న సంకేతమే కనిపిస్తున్నది కూడా. సాక్షాత్తు దేశ గృహ నిర్మాణశాఖ మంత్రి తారిక్‌ ‌బషీర్‌ ‌చిమా సమక్షంలోనే అక్కడి పంజాబ్‌ ‌ప్రాంతంలోని భావల్‌పూర్‌లో ఒక హిందూ బస్తీని బుల్‌డోజర్‌తో నేలమట్టం చేయించింది. దీనిని ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఆ అమాత్యుడు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌పార్టీ పాకిస్తాన్‌ ‌తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ ‌సభ్యుడే. మే 22వ తేదీన ఈ వార్త అన్ని జాతీయ ఆంగ్ల పత్రికలలోను కనపడింది.

ఇలాంటి దుశ్చర్యకు పాకిస్తాన్‌ ‌పాలకులు ఎంచుకున్న సమయం, వాళ్ల నేర మనస్తత్వాన్నీ, క్రౌర్యాన్నీ కూడా బహిర్గతం చేస్తున్నాయి. భుగభుగలాడే ఎండ. మరొక పక్క కొవిడ్‌ 19 ‌మహమ్మారి. ఈ సంకట స్థితిలో హిందువుల ఇళ్లన్నీ నేలమట్టం చేయించింది పాకిస్తాన్‌. ‌బుల్‌డోజర్‌ ‌కోరల నుంచి రాలిపడుతున్న ఇళ్ల శిథిలాల దగ్గర దీనంగా నిలబడి, కూల్చవద్దనీ, నీడ లేకుండా చేయవద్దని హిందువులు వేడుకుంటున్న దృశ్యాలు, వారి పిల్లలు, వృద్ధులు కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు హృదయాలను కలచివేసేటట్టు ఉన్నాయి. మైనారిటీల హక్కుల పట్ల ఎంత నిర్దయనైనా ప్రదర్శించగలమని చాటి చెప్పడమే పాక్‌ ఉద్దేశం. ఎలాగంటే, సాక్షాత్తు గృహ నిర్మాణ మంత్రి సమక్షంలో ఈ రాక్షస కాండ జరగడం ఒకటైతే, మైనారిటీల హక్కుల సంరక్షణలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ ఆ దేశ మానవ హక్కుల సంఘం పాలకుల తల వాచేటట్టు చీవాట్లు పెట్టిన కొద్దిరోజులకే ఈ వికృతం చోటు చేసుకోవడం మరొకటి.

పాకిస్తాన్‌లో అసలు మైనారిటీల జాడే లేకుండా చేయడమే పాలకుల ఉద్దేశమా? అన్న ప్రశ్నకు ఇక్కడ తావు లేకపోలేదు. హిందువుల మీద కక్ష కట్టడం అక్కడి రాజకీయ వ్యూహంలో భాగం. కానీ ఇటీవలే క్రైస్తవుల మీద కూడా ఇమ్రాన్‌ఖాన్‌ ‌పార్టీ సభ్యులు ఇదే తీరులో దాష్టీకానికి పాల్పడ్డారు. పంజాబ్‌ ‌ప్రాంతంలోనే ఖానెవాలా జిల్లాలో క్రైస్తవుల ఇళ్లు, శ్మశానవాటికను ధ్వంసం చేశారు.

ఈ రాక్షసత్వం భారత మానవహక్కుల కార్యకర్తలకీ, ఆమ్నెస్టీకీ, ఐక్యరాజ్య సమితికీ ఎందుకు కనపడదు? ఆ ఆక్రోశాలు ఎందుకు వినపడవు? పాక్‌ ‌ప్రభుత్వం మైనారిటీల మీద మతం ఆధారంగా, విశ్వాసాల ప్రాతిపదికగా జరపని అకృత్యం లేదు. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, అహ్మదీయులు, షియాల మీద ఇదే రకమైన హింసాకాండ, హత్యాకాండ జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి మంటపం నుంచి హిందూ కన్యలను తీసుకుపోయి మతం మార్చి, వాళ్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న నీతిమాలిన చర్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కరోనా సమయంలో మైనారిటీలకు నిత్యావసరాల సరఫరాలో వివక్ష చూపించారన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ భారతదేశంలో మైనారిటీలు అన్న మాటకే మైమరిచిపోయే మేధావులు, జర్నలిస్టులు ఈ వాస్తవాలను పట్టించుకోరు. పాకిస్తాన్‌కు చెందినవారే అయినా, ఆ మెజారిటీ ముస్లింలను ఒక్క మాట అన్నా సెక్యులరిజం వెన్ను విరిగిపోతుందని భయపడిపోతుంటారు. చచ్చినా నోరు విప్పరు. పైగా రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు. హక్కులు లేవనీ, ప్రపంచ ప్రజల ఇస్లామోఫోబియాతో భయకంపితులైపోతున్నారనీ ఎవరి కోసం ఈ మేధావులు గొంతు చించుకుంటున్నారో వారే, అంటే ముస్లిం ఉగ్రవాదులే, ఆ మేధావులని ఒట్టి వెర్రికుట్టెలుగా జమ కడుతున్నారు. ‘ఇలాంటి మారణహోమాలు మాకు నిత్యకృత్యం. అయినప్పటికీ మూర్ఖులైన అవిశ్వాసులు మాకు రుణాలూ, నిధులూ ఇస్తూ, వాళ్ల మూర్ఖపు సెక్యులర్‌ ‌దేశాలలో సమ హోదా ఇస్తూనే ఉంటారు’ అని ఒక సందర్భంలో ఒక ముస్లిం మతోన్మాది కుండబద్దలు కొట్టాడు. ముంజేతి కంకణం వంటి ఇలాంటి వ్యాఖ్యలు కూడా పట్టనంతటి అజ్ఞానంలో ఈ మేధావులు, జర్నలిస్టులు ఉన్నారు. అదే విషాదం. వీళ్లతో కలసి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా పెను నిద్ర చేస్తున్నాయి. ఇస్లామోఫోబియాని పెంచుతున్నారంటూ ప్రపంచ ప్రజానీకాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. పాకిస్తాన్‌లో (లేదా కొన్ని ఇతర దేశాలలో) ఈ విధంగా వివక్షకు గురై, సర్వం కోల్పోయిన వారికి భారత్‌లో ఆశ్రయం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే ఈ మేధావులే అడ్డుపడుతున్నారు. సీఏఏ వ్యతిరేక అల్లర్లన్నీ అవే. పాక్‌ ‌మైనారిటీలకు భారత్‌ ‌తప్ప ఎవరు ఇస్తారు ఆశ్రయం? ఇది మానవతా దృక్పథంతో ఆలోచించవద్దా! అందుకు ఇది సమయం కాదా?

About Author

By editor

Twitter
YOUTUBE