Ichilov Medical team at the coronavirus unit, in the Ichilov hospital, Tel Aviv, Israel, May 4, 2020. Photo by Yossi Aloni/Flash90

పత్రికల మొదటి పేజీలలో కొవిడ్‌ 19 ‌వార్తలు పలచబడుతున్నాయి. టీవీ చానళ్లలో కూడా అంతే. ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్యం అడుగులు వేయడం ఆరంభించాయి. అంటే, కొవిడ్‌ 19 ‌మహమ్మారి భూగోళం నుంచి రూపుమాసిపోయిందా? కనీసం అదుపులోకి వచ్చిందా? ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? ఏమీ లేదు. పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనితో పోటీ పడుతూ లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఒక్కొక్కటీ సడలిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే దేశంలో నడుస్తున్న నీచ రాజకీయం, మేధో దుండగీడుతనం కొవిడ్‌ 19 ‌కోరలకు పదును పెట్టేందుకే ఉపయోగపడ్డాయని అనిపిస్తుంది.

వలస కార్మికుల దీనస్థితిని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని తన కఠిన నిబంధనలను సడలించుకునేటట్టు చేయడంలో కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, ముస్లిం మేధావులు, సెక్యులర్‌ ‌మేధావులు, కొన్ని ప్రజా సంఘాలు ఒక మేరకు విజయం సాధించాయని అనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ మీద ఈ చిన్న విజయం సాధించిన మాట నిజమే కానీ, కొవిడ్‌ 19 ‌నివారణ చర్యల అమలులో ఇంతకాలం కేంద్రం ప్రాణాలకు ఇచ్చిన విలువ ఈ దుష్ట రాజకీయంతో లుప్తమైందన్న సత్యం ఎందరు గుర్తిస్తున్నారు? మొదట పౌరుల ప్రాణాలకే ప్రాధాన్యం అన్న నరేంద్ర మోదీ, రెండోదశ లాక్‌డౌన్‌ ‌చివరికి ప్రాణ రక్షణ, ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు అన్న విధానానికి రావడంలోని ఆంతర్యం ఇది కాదా?

వైద్యరంగంలో మౌలిక వ్యవస్థ గొప్పగా వ్యవస్థీకృతం కాని భారత్‌ ‌వంటి దేశంలో కొవిడ్‌ 19 ‌కేసులు విజృంభిస్తే ఇక మిగిలేది శూన్యం అన్నంతగా తొలిరోజులలో గట్టిగా సంకల్పం చెప్పుకున్నాం. కానీ ఆ విజృంభణ, లాక్‌డౌన్‌ ‌సడలింపులు ఒక్కసారే ఆరంభమైనాయి. దేశంలో కోవిడ్‌ 19 ‌తాజా పరిస్థితి ఎలా ఉందో చూస్తే, లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడం, అందుకు దారి తీయించిన పరిస్థితులలోని వాస్తవికత అర్థమవుతుంది. మే నెల 25 మధ్యాహ్నం ఈ వ్యాసం రాసే సమయానికి అందిన సమాచారం ప్రకారం దేశంలో కొవిడ్‌ 19 ‌కేసులు 1,38,845. ఇందులో యాక్టివ్‌ ‌కేసులు 77, 108. మృతులు 4021. వందల సంఖ్యలో పెరుగుతున్న కేసులను చూసే మనమంతా భీతిల్లాం. కానీ ఇప్పుడు అంకెలు కొద్దిరోజుల నుంచి ప్రజానీకాన్ని భయపెట్టడం మానేశాయి. గడచిన 24 గంటలలో కొవిడ్‌ 19 ‌లక్షణాలతో అస్పత్రులకు వచ్చిన వారి సంఖ్య 6977. మృతులు 154. ఈ అంకెలయినా నిజానికి భయపెట్టి ఉండాలి. కానీ ఎవరూ భయపడడం లేదనే అనిపిస్తుంది. మహారాష్ట్ర కేసుల సంఖ్య యాభయ్‌ ‌వేలు దాటి పోయింది. లాక్‌డౌన్‌ ఇప్పుడే ఎత్తివేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించడం వింతేమీ లేదు. అలాగే జూన్‌ ‌రెండు నుంచి మళ్లీ సరిహద్దులు మూసేస్తామని అస్సాం ముఖ్య మంత్రి కూడా చెప్పారు. ఢిల్లీలో కేసుల సంఖ్య 13,000 అధిగమించింది. మరణాలలో వేగం తక్కువే అయినా, కేసులు పెరుగుదల వేగం మాత్రం భీతిగొలిపే విధంగానే ఉంది. ప్రపంచంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య అరకోటిని ఎప్పుడో దాటిపోయింది. అమెరికా తరువాత ఇప్పుడు బ్రెజిల్‌ అతలాకుతలం అవుతున్నది.

లాక్‌డౌన్‌ ‌నిబంధనల విధింపులో ప్రభుత్వాల వైఖరీ, ప్రజల ధోరణీ పొంతన లేనివిగా ఉన్నాయి. విపక్షంలోని ద్వంద్వ వైఖరే ఇందుకు దారి తీసింది. పాజిటివ్‌ ‌కేసులను పెంచిన వలస కార్మికుల తిరుగు ప్రయాణం వెనుక ఉన్నది విపక్షాలే. ప్రస్తుతం రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించారు. పోలీసులు ఎదురుగా ఉంటే అవి అమలవు తున్నాయి. లేకపోతే గుంపులు గుంపులుగా జనం రైళ్లు ఎక్కుతున్నారు. ఇక మద్యం దుకాణాలను తెరుచుకోవచ్చు అని ప్రకటించ గానే ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ కూరగాయల మార్కెట్లలో ఏం జరుగుతున్నదో తెలియని వారు లేరు. పోలీసులు దాదాపు కాడి వదిలేశారు. కానీ విమాన ప్రయాణికుల కోసం, మరికొద్ది రోజులలో పట్టాలెక్కనున్న రైలు ప్రయాణికుల కోసం మాత్రం బోలెడన్ని సూత్రాలు తయారు చేస్తున్నారు. అంటురోగం విషయంలో ఈ వైఖరి హేతుబద్ధమైనదేనా? సాధారణ ప్రజల మధ్య వైరస్‌ ‌పెరగడానికి అనుకూలించే పరిస్థితిని, అనుమతిస్తూ, ఉన్నత వర్గాలకు మాత్రం కఠిన నిబంధనలు అమలు చేయడం ఏ మేరకు మంచిది? ఒకవైపు కఠినంగా, ఇంకొక వైపు కళ్లెం వదిలేసినట్టుగా ఉండడం ఏమిటి? అంటువ్యాధికి పేద, ధనిక భేదం లేనే లేదు. అదెప్పుడో రుజువైంది కూడా. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మే మాసాంతానికి చేరుతుందనుకున్న కేసుల సంఖ్య దాదాపు వారం ముందే చేరుకుంది. అదికూడా అనూహ్యంగా పెరిగాయి కేసులు. ఇది గమనించవద్దా? ముఖ్యంగా విపక్షాలు గుర్తించాలి. ఆయా పార్టీలు, టీవీ చానెళ్ల పుణ్యమా అని, అవి చేసిన ఊదర కారణంగానే వలస కార్మికులను తరలించే కార్యక్రమం మొదలయింది. తరువాత పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరిగిపోయిన మాట నిజం.

మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు, మేధావి వర్గాల నుంచి వస్తున్న విమర్శ- కొంత సమయం ఇచ్చి లాక్‌డౌన్‌ ‌ప్రకటించి ఉండాలని. నిజానికి వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడం దగ్గర కూడా ఆ అవసరం మరింతగా కనిపిస్తున్నది. అది గుర్తించడం దగ్గర విపక్షాలు దారుణంగా విఫలమైనాయి. ఈ విచ్ఛిన్నకర శక్తులు తక్షణమే వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపించాలన్న కోర్కెతో దేశంలో అలజడి ఆరంభించాయి. దీనికి తగిన ఏర్పాటు చేసే లోపుననే వలస కార్మికులు నడక బాట పట్టారు. నిజానికి వాళ్లని రెచ్చగొట్టి ఆ బాట పట్టించారు. ఈ క్రమంలో వారి కోసం కొన్ని ఏర్పాట్లు చేయడానికయినా కొంత సమయం అవసరం కాదని అనగలమా? ఒక ప్రాంతాన్ని కుదిపేసిన, ఒక జిల్లాను, లేదా ఒక రాష్ట్రాన్ని కుదిపేసిన తుపాను వంటిది కాదు ఈ విపత్తు. ఇది అపరిమితం. ఇందుకు తగ్గ వ్యూహం అనుసరించడానికి వ్యవధి లేకుండా చేసి విపక్షాలు వలస కార్మికులనే బలి పశువులను చేశాయి. కేసుల సంఖ్య పెరగడానికి ప్రత్యక్షంగా దోహదపడ్డాయి. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి ఏర్పాట్లు అంటే కేవలం భోజనం ప్యాకెట్లు, మంచినీళ్ల సీసాలు, జ్వరం టాబ్లెట్లు సిద్ధం చేయడం ఒక్కటే కాదని తరువాత తెలిసి వచ్చింది.
ప్రతి రాష్ట్రం సరిహద్దులను మూసేసింది. అంటే తమ రాష్ట్ర ప్రజలనే అవి లోపలికి అనుమతించలేదు. కొన్నిచోట్ల జిల్లాల సరిహద్దులు, గ్రామాల సరిహద్దులు కూడా మూతపడ్డాయి. బయలుదేరిన వారు నిజంగా రోడ్డున పడినది అప్పుడే. శ్రామిక రైళ్లను ఆరంభించిన తరువాత పశ్చిమబెంగాల్‌ ‌వంటి కొన్ని రాష్ట్రాలు లోపలికి అనుమతించలేదన్న వాస్తవం విస్మరించడం సరికాదు. అప్పుడు కూడా ఇబ్బందులు పడినవారు ఎవరు? ఇలాంటి అనుమతులకీ, ముందస్తు ఏర్పాట్లకీ సంసిద్ధం చేయడానికి కేంద్రానికి ఈ పార్టీలు, హక్కుల సంఘాలు సమయం ఇచ్చాయా? కానీ అప్పుడు అత్యంత జుగుప్పాకరంగా, బాధ్యతారహితంగా వీళ్లే మోదీ తొందరపడి లాక్‌డౌన్‌ ‌ప్రకటించారని విమర్శించారు. దేశం దీని గురించి ఆలోచించవలసి ఉంది. వలస కార్మికులు రైలు పట్టాల మీద పడుకుని ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. ఎవరి ప్రాణమైనా విలువైనదే. అయినా ఈ విషయంలో సుప్రీంకోర్టు సరైన విధంగానే స్పందించిందనే చెప్పాలి. రైలు పట్టాల మీద పడుకోవద్దని ఆ కార్మికులకు ఎవరు చెప్పాలి అని పిటిషన్‌ ‌దారులను అత్యున్నత న్యాయస్థానం సరిగానే ప్రశ్నించింది. స్వస్థలాలకు పోతున్నవారికి దారిలోనే అన్నపానాలు ఏర్పాటు చేయాలన్న వాదనను కూడా కోర్టు తోసిపుచ్చవలసి వచ్చింది. ఇది వలస కార్మికుల మీద దయ లేకపోవడంగా భాష్యం చెప్పడం సరి కాదు. పిటిషన్‌ ‌దారుల వాదనలోని అసంబద్ధతకు ఇదొక్కటే సమాధానం అవుతుంది. పట్టాల మీద పడుకుని ప్రాణాల కోల్పోయిన వారిపట్ల సానుభూతి లేకుండా నెటిజన్లు మాట్లాడుతున్నారంటూ ఓ కమ్యూనిస్టు వెబ్‌సైట్‌ ‌నిందించింది. వారు అలా పడుకొనే పరిస్థితులు కల్పించిన వారిని, అంటే ప్రభుత్వాన్ని, నిందించాలని ఆ వెబ్‌సైట్‌ ‌వితండవాదం. ఈ ధోరణి, ఈ వ్యాసం చాలు, ఈ దేశంలో పెద్దగా చదువుకోని కష్టజీవుల వెతలను మేధావులనుకునే వాళ్లు ఏ విధంగా మలుస్తున్నారో చెప్పడానికి.

మరొక ప్రశ్న. మండుటెండలో నడచి పోతున్న వలస కార్మికుల పట్ల, వారి చిన్నారుల పట్ల భారతీయ సమాజం అంత నిర్దయగా వ్యవహరించిందా? వారి ప్రాణాలను లెక్క చేయనే లేదా? ప్రేక్షక పాత్రకే పరిమితమైందా? కొందరు కార్మికులు పస్తులు ఉన్నారని చెప్పడం అసత్యం కాదు. కానీ నడచిపోతున్న వారిని చాలాచోట్ల సాధారణ ప్రజలు ఆదుకున్నారు. చిన్నా, పెద్ద సంస్థలు కలోగంజో పోశాయన్న మాట నిజం. ప్రభుత్వాలతో, పార్టీలతో సంబంధం లేని ఇలాంటి వాస్తవాలైనా అంగీక రించడం కనీస ధర్మం. కానీ, చాలామంది వీటిని కప్పిపుచ్చి ప్రజలలో మిగిలి ఉన్న ధార్మిక దృష్టిని కూడా అవమానిస్తున్నారు. ఇదంతా మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేస్తున్నదే గానీ, ఈ పార్టీలకీ, మేధావులకీ వలస కార్మికుల మీద ఎలాంటి సానుభూతీ లేదు. వలస కార్మికుల విషయంలోను, ఆ సమస్యను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న ఆరోపణలు ఎంత నీచమో చరిత్ర తేలుస్తుంది. డాక్టర్ల సేవలు, పోలీసులు ప్రదర్శించిన నిబద్ధత, పారిశుధ్య కార్మికులు చూపించిన నిజాయితీ విపక్షాల ఆరోపణల కారణంగా ఇప్పుడు గుర్తింపునకు రావడం లేదు.

అన్ని రకాల విలువలకు తిలోదకాలు ఇచ్చేసి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ క్లిష్ట పరిస్థితులలో వలస కార్మికులకు చేసిన మేలేమిటి? ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికుల తరలింపునకు సంబంధించి కాంగ్రెస్‌ ‌చేసిన మోసం దేశానికి ఇప్పటికే తెలిసింది. వలస కార్మికుల కోసం వేయి బస్సులు సమకూరు స్తున్నాం, అనుమతి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరడం, తరువాత బొక్కి బస్సులతో పాటు, అంబులెన్సులు, త్రీవీలర్లు కూడా చూపించి నాటకం ఆడాలనీ, ‘షో’ చేయాలనీ అనుకోవడం, చివరికి రసాభాస కావడం కాంగ్రెస్‌ ‌క్రూర పరిహాసం తప్ప మరొకటి కాదు. ఇదంతా ఆ పార్టీ రాజకీయ సంస్కృతినే చెబుతుంది. ఉత్తరప్రదేశ్‌ ‌వలస కార్మికుల మీదే మా నాయకులకు ప్రేమ ఎందుకో తెలియదు, మహారాష్ట్ర, రాజస్తాన్‌, ‌పంజాబ్‌ ‌వంటి రాష్ట్రాలలో కూడా ఇలా బస్సులు సమకూర్చే ఆలోచన ఎందుకు చేయలేదు అని ఆ పార్టీకే చెందిన ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్యే అధితి చాలా చక్కగా ప్రశ్నించారు.

కొవిడ్‌ 19 ‌మీద జరుగుతున్న యుద్ధంలో రాజకీయాలు ప్రవేశించకూడదు. అలా ఆ మహమ్మారి కోరలకు పదును పెంచే అవకాశం ఇచ్చి, దేశంలో ప్రాణహానిని పెంచరాదు. కానీ ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, స్వయం ప్రకటిత మేధావులు అక్షరాలా చేస్తున్నది ఇదే. భారతీయ జనతా పార్టీ మీద కోపం భారత్‌ ‌పరువును దిగజార్చడానికి శతథా యత్నించిన వారే ఇప్పుడు మోదీ మీద అక్కసుతో కొవిడ్‌ 19 ‌మీద పోరాటాన్ని కూడా నీరు కార్చే యత్నం చేస్తున్నారు. కొవిడ్‌ 19 ‌విషయంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు శల్య సారథ్యం చేస్తున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలను ఈ సమయంలోను మరచిపోవడం లేదు. కొవిడ్‌ 19 ‌మీద యుద్ధం ఎంత చరిత్రాత్మకమో, ఎంత నిర్ణయాత్మకమో మోదీ అర్థం చేసుకున్నంతగా కాకున్నా, మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు కనీస అవగాహనైనా ఏర్పరుచు కున్నారా? అన్నదే ఇప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్న. మోదీని రాజకీయంగా బలహీన పరచడానికి ఈ సమయాన్ని ఎంచుకోవడమే అనైతికం. ఎందుకంటే, ఈ చర్యలతో మోదీ బలహీన పడడం ఎలా ఉన్నా, ఆ ధోరణితో కొవిడ్‌ 19 ‌బలం పుంజు కుంటుంది. మోదీ చేతులో నుంచి పరిస్థితులను తప్పించడానికి ప్రయత్నం ఆరంభించడంతోనే కేసుల పెరుగుదల ప్రారంభమైంది. రెండోదశ కొవిడ్‌ 19 ‌సిద్ధమవుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయన్న వార్తలు ఇప్పుడే జోరందు కుంటున్నాయి. వ్యాక్సిన్‌ ‌వచ్చే వరకు కొవిడ్‌తో సహజీవనం చేయాలన్న మాటా వినిపిస్తున్నది. ఇకనైనా ప్రజల కోసం ఈ క్లిష్ట సమయంలో విపక్షాలు, దొంగ మేధావులు తమ వైఖరి మార్చుకోవడం అవసరం కాదా!
– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE