religion concept. finger touching the magic sky

చెడును పట్టుకోవడం సులభం. వదలడం కష్టం. మంచితనంతో చిరకాలం ఉండడం కష్టం. వదలడం సులువు. అందుకే ఎవరైనా, దేనిని పట్టుకోవాలి.. దేనిని వదలాలి అనే విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. సంసారం, కుటుంబం వంటివి తమను బంధిస్తున్నాయని ఆ బాదరబందీ వల్లనే భక్తి మార్గం పట్టలేకున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది నిజం కాదు. అవి మనల్ని పట్టుకోవడం కాదు. మనమే సంసారాన్ని, కుటుంబాన్ని, లోకాన్ని, సకల ప్రాపంచిక విషయాలనూ గట్టిగా పట్టుకొని కూర్చుంటున్నాం.
కోతులను పట్టుకునేవాళ్లు ఇరుకు మెడ ఉండే బరువైన కూజాలో వేరుశనగ పప్పులను వేసి చెట్టుకింద పెడతారు. అటువైపు వచ్చిన కోతి ఆ కూజాలోకి చేతిని పోనిచ్చి గుప్పెట నిండా గింజలను పట్టుకొని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది. మూతి ఇరుగ్గా ఉండడంతో.. పిడికిలి బయటకు రాదు. చేతిలో ఉన్న వేరుశనగ పప్పులను వదిలేస్తే చెయ్యి సులభంగానే బయటకొచ్చేస్తుంది. కానీ, ఆశ.. ఆ గింజలను వదలనీయదు. కూజాతో సహా అక్కడి నుంచి పారిపోదామా అంటే.. అది బరువుగా ఉంటుంది. దీంతో, కోతి అక్కడే ఉంటుంది. కోతులు పట్టేవారు అక్కడికి వచ్చి దాన్ని బంధిస్తారు. పట్టు విడవడం తెలియక కోతి బందీ అయినట్లుగా.. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గించుకుని క్రమేణా విడిచిపెట్టడం తెలియక ఆధ్యాత్మిక చింతనాసక్తులు దారితప్పుతుంటారు. పట్టుకోకూడనిదాన్ని తెలివితక్కువగా పట్టుకోవడం.. తీరా పట్టుకున్నాక దానివల్ల కలిగే ముప్పు గురించి తెలిసినా, దాన్ని విడిచే ఆలోచన చేయకపోవడం.. ఫలితంగా కడగండ్లకు గురికావడం.. ఇదీ జరుగుతున్నది.
తనది కాని స్త్రీని పొందాలనుకొని పట్టుపట్టిన రావణాసురుడు.. ఆమెను విడిచిపెట్టాలంటూ తన శ్రేయోభిలాషులు చెప్పిన మాటలను విని ఉంటే కొడుకులను, సోదరులను, బంధువులను, పరివారాన్ని, రాజ్యాన్ని, చివరకు ప్రాణాల్ని పోగొట్టుకుని ఉండేవాడు కాదు. అలాగే భారతంలో పాండవులకు ‘సూదిమొన మోపినంత భూమి కూడా యివ్వన’ంటూ పట్టిన పట్టు విడువక అహంకరించిన దుర్యోధనుడికి చివరికి ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందే. బాహ్య విషయాలపై పట్టు గురించి ఆలోచిస్తామేగానీ.. అంతర్గత, ఆధ్యాత్మిక విషయాల పట్ల ‘పట్టు’ సాధించటానికి ప్రయత్నించం. మనసు, జిహ్వ, ఇంద్రియాల పైన పట్టులేకపోవటం చేతనే భగవంతుడు మెచ్చే కార్యాలు చేయలేకున్నాం. ఆయన అనుగ్రహానికి పాత్రులం కాలేకపోతున్నాం.
మనం ‘పట్టు’ వదల వలసింది.. లౌకిక విషయాల్లో! పట్టు బిగించవలసింది. ఆధ్యాత్మిక సాధనాంశాల్లో!!
అప్పుడే మనం భగవంతునితో అనుబం ధాన్ని పెంచుకోగలం.

About Author

By editor

Twitter
YOUTUBE