కొవిడ్‌ 19‌ని కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌. ‌దీనిని అన్ని ప్రపంచ దేశాలు అంగీకరించాయి. ఆచరిస్తున్నాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. మత విశ్వాసాల కంటే ఇప్పుడు మానవాళి ఆరోగ్యం గురించి అంతా ఆలోచిస్తున్నారు. మక్కా మసీదుకే ఎవరూ రావద్దని సౌదీ అరేబియా ఆదేశించింది. అలాగే చాలా ప్రసిద్ధ మసీదులు మూతపడ్డాయి. చర్చిలు ప్రార్థనలు ఆపేశాయి. వాటికన్‌ ‌సిటీ నిర్మానుష్యమైంది. భారత్‌లో అనేక హిందూ దేవాలయాలు దర్శనాలను నిలిపివేశాయి. కారణం- సామాజిక దూరం పాటించాలి..
కానీ ఊరంతా ఒక దారి ఉలిపిరి కట్టెది ఒక దారి అన్నట్టుంది పాకిస్తాన్‌లో ఇమామ్‌ల ధోరణి. ఇమామ్‌లు అంటే మత గురువులు. లాక్‌డౌన్‌ ఆదేశాలను ఎవరూ పాటించవలసిన అవసరం లేదు. రంజాన్‌కి మసీదులలోనే ప్రార్థనలు చేయాలి అంటూ పాకిస్తాన్‌ ఇమామ్‌లు ఆదేశాలు ఇచ్చారు. పాకిస్తాన్‌ ‌ప్రభుత్వ ఆదేశాలనే కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను కూడా లెక్క చేయనక్కరలేదని చెప్పారు. కానీ, దేశం పెను సంక్షోభంలో ఉన్నప్పుడు నిర్ణయాలు చేయవలసినది ఎవరు? ప్రభుత్వాలా? మసీదులా? అని అక్కడి మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో లాక్‌డౌన్‌ ‌నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంత సంక్షోభం ఎదుర్కొనవలసి వస్తుందో ఆలోచించాలని వారు గట్టిగా చెబుతున్నారు. ఇది పాకిస్తాన్‌కు పెను సవాలు. అక్కడ కూడా కొవిడ్‌ 19 ‌విస్తరణ తక్కువేమీ కాదు. ప్రపంచానికి కూడా ఇదొక సవాలే. ఎందుకంటే ఇలాంటి వైరస్‌ ‌మీద ప్రపంచమంతా ఏకతాటి మీదకు వచ్చి పోరాడితే ఫలితం ఉంటుంది. చివరిగా- భారత్‌కు ఇదొక ముప్పు. ఎందుకంటే పాకిస్తాన్‌కు పొరుగున ఉన్నది మన దేశమే.
ఈ సంవత్సరం రంజాన్‌ ‌మాసాన్ని ముస్లిం దేశాలన్ని లాక్‌డౌన్‌ ‌మధ్య జరుపుకుంటున్నాయి. మసీదులలో కాకుండా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కూడా ప్రభుత్వాలు, మత గురువులు కూడా సమష్టిగా అంగీకరిస్తున్నారు. అయితే పాకిస్తాన్‌లో కొందరు ప్రముఖ ఇమామ్‌లు దీనికి సుతారాము అంగీకరించడం లేదు. వైరస్‌కు వ్యతిరేకంగా ప్రపంచం తీసుకుంటున్న చర్యలను బేఖాతరు చేస్తూ మసీదులలోనే ప్రార్థనలు చేయాలని వారు అంటున్నారు. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంజాన్‌ ‌మాసం ముస్లింలకు చాలా పవిత్రం. రోజంతా ఉపవాసం ఉండి, మసీదులలో సమష్టిగా ప్రార్థనలు చేసి, బంధుమిత్రులతో కలసి విందులు తీసుకుంటారు. ఇదే కొవిడ్‌ 19 ‌వ్యాప్తికి దోహదం చేస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే చాలా ముస్లిం దేశాలలో ఈ రంజాన్‌ ‌ప్రార్థనలు ఇళ్ల వద్దనే చేసుకోవచ్చునని సూచించారు. కానీ ప్రపంచమంతా లాక్‌డౌన్‌ ‌పాటిస్తున్నా పాకిస్తాన్‌లో మాత్రం ప్రార్థనలు మసీదులలోనే జరగాలని కొందరు ఇమామ్‌లు కచ్ఛితంగా చెబుతున్నారు. అక్కడ కూడా మార్చిలోనే లాక్‌డౌన్‌ ఆరంభమైంది.
నిజానికి లాక్‌డౌన్‌ ‌ప్రకటించినప్పుడే పాకిస్తాన్‌లో పలువురు ఇమామ్‌లు వ్యతిరేకించారు. కొందరు శుక్రవారం ప్రార్థనలకు మసీదులకు పెద్ద సంఖ్యలో హాజరు కావలసిందేనని పిలుపునిచ్చారు. దీని ఫలితం కనిపించింది కూడా. మసీదులకు వెళుతున్న వారిని నిరోధించేందుకు యత్నించిన పోలీసుల మీద దాడులు జరిగాయి. రంజాన్‌ ఉపవాసాలు దగ్గర పడుతున్న కొద్ది కొందరు ఇమామ్‌లు తమ పాత వైఖరి చూపిస్తున్నారు. మొదట లాక్‌డౌన్‌కు ఆమోదం తెలిపినా ఇప్పుడు మసీదులకు మాత్రం ఆ నిషేధాన్ని వర్తింపచేయరాదని చెబుతున్నారు. మసీదులకు మినహాయింపు ఇవ్వకుంటే దేవుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని వారంతా నమ్ముతున్నారు. పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం కూడా లొంగిపోయింది. లాక్‌డౌన్‌ అమలుకు సంబంధించి ఇచ్చిన ఇరవై ఆదేశాలలో చాలా వరకు పాటిస్తే రంజాన్‌ ‌నెలంతా మసీదులను మినహాయించవచ్చున్న అభిప్రాయానికి వచ్చింది. నీటితో ప్రక్షాళన, ఎవరి చాపలు వారు తెచ్చుకోవడం, ఆరడుగులు దూరం పాటించడం వంటివి ఆ 20 సూత్రాలలో ఉన్నాయి. అయితే దీని మీద పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశాన్ని నడపవలసింది ప్రభుత్వమా, మసీదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇమామ్‌లకు పూర్తిగా లొంగిపోయిందని ఇస్లామాబాద్‌కు చెందిన ఆచార్య అన్సుల్‌ అమీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలకు ఏది మంచిదో దానిని అమలు చేయడం అసాధ్యమని, ప్రజా ప్రయోజనాల గురించి ఇమామ్‌ల అభిప్రాయాలకు అతీతంగా ఆలోచన ఉండపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రొఫెసర్‌ ఎవరో అమాయకుడిలా ఉన్నాడు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఏమిటి?


1980లో అఫ్గాస్తాన్‌ ‌మీద సోవియెట్‌ ‌రష్యా దండయాత్ర సాగించినప్పుడు పాకిస్తాన్‌లోని మసీదులు ఉగ్రవాదుల కేంద్రాలుగా మారాయి. అప్పుడే పాకిస్తాన్‌ ‌సైన్యం ఇమామ్‌లకు వాటి మీద పూర్తి ఆధిపత్యం కల్పించింది. ఉగ్రవాదులను ఎందుకు తయారు చేశారంటే, అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించిన సోవియెట్‌ ‌రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకే. సోవియెట్‌ ‌రష్యా వ్యతిరేక పోరాటం కాబట్టి ఉగ్రవాదుల శిక్షణకు అమెరికా మద్దతు ఇచ్చింది. అయితే అఫ్గాన్‌ ‌యుద్ధం తరువాత చాలా దేశాలలో ఇమామ్‌ల అధికారాన్ని తగ్గించారు. పాకిస్తాన్‌లో రాజకీయ, విదేశీ వ్యవహారాలలో ఇమామ్‌లను సైన్యం ఉపయోగించుకోవడం ఆరంభించింది. కానీ లాక్‌డౌన్‌ను వ్యతిరేకించాలంటూ ఇమామ్‌లు ఈ సమయంలో పిలుపునివ్వడం చూస్తుంటే వారి మీద సైన్యానికి ఉన్న పట్టు గురించి కూడా ప్రశ్నలు జనిస్తున్నాయి. పాకిస్తాన్‌ ‌సైన్యం లాక్‌డౌన్‌కు అనుకూలంగా ఉంది. ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌మొదట వెనుకాడినా సైన్యం పట్టుతో లాక్‌డౌన్‌ ‌ప్రకటించారు. కానీ మసీదులలో జనం పోగు పడకుండా చూడడానికి ప్రయత్నాలు మొదలయిన తరువాత ప్రభుత్వమే దాడిలో చిక్కుకున్న సంగతి అర్థమైంది. కరాచీలో ప్రార్థనలకు వెళుతున్న వారిని నిరోధించదలిచిన పోలీసుల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. పౌరులు రాళ్లు విసరడంతో కొందరు పోలీసులను ఆస్పత్రిలో చేర్చవలసి వచ్చింది. పాకిస్తాన్‌ ఒక భూతాన్ని తయారు చేసింది. దానిని అదుపు చేయడం ఇక సైన్యం తరం కూడా కాదు అని ఆచార్య అమీన్‌ ‌పేర్కొనడం విశేషం. అయినప్పటికీ ఆ భూతాన్ని సృష్టించి పెట్టినవారే దానిని అదుపు చేయవలసిన బాధ్యత కూడా తీసుకోవాలని ఆయన అన్నారు. ఇదే కాకుండా రంజాన్‌ ‌దగ్గరకొచ్చే కొద్దీ మసీదుల వద్ద కాపలాకు పోలీసులు కూడా భయపడుతున్నారు. కారాగారాలలో కూడా కరోనా వైరస్‌ ‌విస్తరిస్తుందన్న భయంతో భారత్‌ ‌కొందరు ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినప్పుడు, అది కశ్మీర్‌కు కూడా వర్తింపచేయాలని పాకిస్తాన్‌ ‌పల్లవి అందుకుంది. కానీ భారత్‌ అం‌దుకు అంగీకరించలేదు. దీంతో కశ్మీరీల పట్ల భారత ప్రభుత్వం పక్షపాత, విద్వేషపూరిత వైఖరులు అవలంబిస్తున్నదని పాకిస్తాన్‌ ‌ధ్వజమెత్తింది. కానీ పాక్‌ ‌ప్రభుత్వానికీ, సైన్యానికీ సొంత దేశంలో ఇమామ్‌లతో వ్యవహరించడం అంటే, భారత్‌ ‌మీద రాళ్లు విసిరినంత, విమర్శలు కురిపించినంత సులభం కాదు.
‘ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్‌ ‌మానవాళి అందరి ఆరోగ్యానికి సంబంధించినదని మాకు కూడా తెలుసు. అంతమాత్రాన మత విధులను విడిచిపెట్టడం సబబు కాదు కదా’ అంటున్నారు ఇమామ్‌లు. ఇదే కాదు, రంజాన్‌ ‌మాసంలో వచ్చే ఆదాయంతోనే ఎక్కువ మసీదులు సంవత్సరమంతా నడుస్తాయన్న సంగతి గుర్తించాలని ఇమామ్‌లు చెబుతున్నారు. ఈ రంజాన్‌ ‌మాసం ప్రత్యేక పరిస్థితులలో వచ్చింది. అలాగే ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ పండుగను జరుపుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి. వైరస్‌కు చురుకెక్కువ. ఇలా నిత్యం పాక్‌ ‌జాతీయులంతా మసీదులలో గుమిగూడితే జరిగే ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని లాభం లేదు. పోనీ సైన్యం ఇమామ్‌ల అభిప్రాయాన్ని కాదని ఒక అడుగు ముందుకు వేయగలుగుతుందా? అది కూడా అనుమానమే. సైన్యం మీద ఇమామ్‌ల పట్టు, ఇమామ్‌ల మీద సైన్యం పట్టు సమంగానే ఉంటాయి. ఇదంతా చూస్తుంటే ఇవాల్టి రంజాన్‌ ‌పండుగ సరే, పాకిస్తాన్‌లో ముందుంది ముసళ్ల పండుగ అనిపించడం లేదా!

About Author

By editor

Twitter
YOUTUBE