ఈ దేశంలో హిందువులకు రక్షణ లేదు. ఈ మాట అంటే వెక్కిరించడానికి కనీసం లక్ష గొంతులు లేస్తాయి. టీవీ చానళ్లు, గోష్టులు, సభలు మండిపడిపోతాయి. మహారాష్ట్రలోని పాల్గర్‌ ‌జిల్లాలో ఇద్దరు సాధువులు, వారిని తీసుకువెళుతున్న కారు డ్రైవర్‌ ‌మీద జరిగిన ఘోరమైన దాడి ఇక్కడ హిందువుల ప్రాణాలకు విలువ లేదన్న వాస్తవాన్నే వెల్లడించింది. అది మరచిపోకముందే పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ ‌లో ఒక సాధువు మీద దాడి చేసి దారుణంగా గాయపరిచారు. వీటి గురించి ఒకటి రెండు చానళ్లు తప్ప మిగిలినవన్నీ ఐచ్ఛిక మౌనాన్ని ఆశ్రయించాయి. మైనారిటీల మీద దాడులు, వారి మూకహత్యలు జరిగినప్పుడే ఆ నోళ్లు పెగులుతాయి. కాషాయం కట్టినవారి మూకహత్య జరిగితే అది చర్చనీయాంశం కాదనే అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్నం ఇప్పటిది కాదు. ఈ ధోరణికి కొన్ని ప్రముఖ రాజకీయ పక్షాలు, మేధావులు, వామపక్షాలు నిస్సిగ్గుగా వంత పాడుతున్నాయి.
క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు జరిగితే గంగవెర్రులెత్తే కాంగ్రెస్‌ ‌పార్టీనీ, మేధావులనీ, హిందూ వ్యతిరేకులనీ, హక్కుల కార్యకర్తలనీ ప్రశ్నించిందనందుకు రిపబ్లిక్‌ ‌టీవీ చానల్‌ ‌ప్రధాన సంపాదకుడు అర్ణబ్‌ ‌గోస్వామి మీద దాడి యత్నం జరిగింది. పాల్గర్‌ ‌జిల్లాలో డెబ్బయ్‌ ఏళ్ల వృద్ధ సాధువును స్వయంగా కిరాతకులకు అప్పగించిన ఆ రాష్ట్ర పోలీసులే, అర్ణబ్‌ ‌మీద దాడికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో దానిని నేరపూరిత దాడిగా పేర్కొనడానికి నిరాకరించారు. ఒడిశాలో పదిహేనేళ్ల క్రితం గ్రాహమ్‌ ‌స్టెయిన్స్ అనే క్రైస్తవ మిషనరీని సజీవ దహనం చేసినప్పుడు కాంగ్రెస్‌ ‌నాయకురాలు సోనియా గాంధీ వెక్కి వెక్కి ఏడ్చారట. అది ఆమె మానవత్వానికి నిదర్శనమట. కానీ కాషాయధారులైన ఇద్దరు సాధువులను మూక హత్య చేస్తే, అలా వెక్కి వెక్కి ఏడ్వక పోయినా కనీసంగా ఎందుకు నోరు మెదపడం లేదు అని అర్ణబ్‌ ‌ప్రశ్నించడమే కాంగ్రెస్‌ ‌పార్టీ ఆగ్రహానికి కారణమైంది.
రాత్రి వేళ… డెబ్బయ్‌ ఏళ్ల ఆ వృద్ధుడు పోలీసు చేయి పట్టుకుని ఏదో భవంతి నుంచి బయటకు వచ్చాడు. మొదట ఒక వ్యక్తి వెనుక నుంచి తన్నాడు. కొన్ని అడుగుల తరువాత కర్రలతో దాడి మొదలయింది. ఆయన తలమీద అయిన గాయం నుంచి రక్తం కారడం మొదలయింది. తనకు ప్రాణభిక్ష పెట్టమని దయనీయంగా కోరుతూ, దెబ్బలకు తాళలేక ఆ పోలీసును పట్టుకోబోతే, అతడు తప్పించుకుని, మూకకు ప్రాణం తీసే అవకాశం ఇచ్చాడు. వెనుక నుంచి కర్రలతో చావబాదుతున్నారు. అరుస్తున్నారు. పోలీసు పక్కకు తప్పుకున్నాడు. కింద పడేసి గొడ్డళ్లతో, కర్రలతో చావగొట్టారు. ఇది వీడియోలోని దృశ్యం.
ఏప్రిల్‌ 16‌న మహారాష్ట్రలోని పాల్గర్‌ ‌జిల్లాలో, గిరిజన ప్రాంతంలోని ఒక గ్రామంలో ఇద్దరు సాధువులపై జరిగిన హత్యాకాండ దృశ్యమిది. ఎవరో వీడియో తీసి పెట్టారు. వీరిద్దరు కండీవాలీ ఆశ్రమం లేదా జునా అఖాడాకు చెందిన వారు. ఒకరి పేరు షిక్నే మహరాజా కల్పవృక్షగిరి. మరొకరు సుశీల్‌గిరి మహరాజ్‌. ‌వీరితో పాటు కారు డ్రైవర్‌ ‌నీలేశ్‌ ‌తెల్గాడేను కూడా ఆ మూక చంపేసింది. ఘటనాస్థలం కాసా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోనిది. వీరిలో కల్పవృక్షగిరి వయసు డెబ్బయ్‌ ఏళ్లు, సుశీల్‌గిరి వయసు ముప్పయ్‌ ఐదేళ్లు. డ్రైవర్‌ ‌కూడా మూడు పదుల వయసులో వారే. ఆ ఇద్దరు సాధువులు ముంబై నుంచి నీలేశ్‌ అద్దె కారు మీద సూరత్‌ ‌బయలుదేరారు. వారి గురువు మహంత్‌ ‌రామగిరి అంత్యక్రియల కోసం వెళుతూ ఉండగా ఈ దారుణం జరిగింది. ముంబై-గుజరాత్‌ ‌జాతీయ రహదారి మీదుగా వెళితే చిక్కులు ఎదురవుతాయన్న భావనతోనే ఈ దారి వెంట వచ్చారు. గడ్చంచేలె అనే ఊరు (దాహను తాలూకా) మీదుగా వెళుతుండగా వీరిని ఆపేసి, రాత్రి తొమ్మిది, పది గంటల మధ్య ఆ మూక అతి దారుణంగా హత్య చేసింది. ఇది ముంబైకి 140 కిలోమీటర్లు. లాక్‌డౌన్‌ ‌కాబట్టి వారి కారును ఒక తనిఖీ కేంద్రం దగ్గర అటవీ శాఖ సెంట్రీ ఆపి వివరాలు అడుగుతుండగానే ఆ మూక అక్కడికి చేరింది. వీడియో బయటకు రాకముందు అతి నీచమైన రీతిలో ఒక వర్గం మీడియా ఈ ఉదంతం గురించి నమోదు చేసింది. వారిద్దరు సంచార జీవులని ఒక వెబ్‌సైట్‌ ‌పేర్కొన్నది. సంచార జీవుల ప్రాణాలైనా అంత విలువలేనివా? సాధువులిద్దరు పిల్లలను ఎత్తుకుపోయే దొంగలు అనుకుని దాడి చేశారట. ఇది సాక్షాత్తు ఘనత వహించిన మహారాష్ట్ర సర్కారు ఇచ్చిన మొదటి నివేదిక. అలాగే అక్కడ వీధి దీపాలు లేకపోవడం వల్ల జరిగిందని ఇంకొక కథనం. నిజానికి అంతకు మూడు నాలుగు రోజుల ముందు కూడా లాక్‌డౌన్‌ ‌సమయంలో గిరిజనులకు ఇవ్వవలసిన వస్తువులు అందించడానికి వెళ్లిన బృందం మీద కూడా స్థానిక ఉద్యమ కార్యకర్త విశ్వా వాల్వి నాయకత్వంలో కొందరు దాడికి దిగారు. అయితే పోలీసులు వచ్చి కాపాడారు. కేసు నమోదయింది.
సాధువుల మీద జరిగిన హత్యాకాండకు సంబంధించిన వీడియో 19వ తేదీన వైరల్‌ ‌కావడంతో దేశం నిర్ఘాంతపోయే దృశ్యాలు కనిపించాయి. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒక పోలీసు కల్పవృక్షగిరిని ఒక భవంతి నుంచి బయటకు తీసుకురావడం, ఆ మూక కర్రలతో, గొడ్డళ్లతో దాడి చేయడం, వెనుక తన్నడం స్పష్టంగా కనిపించింది. కొందరు అటవీశాఖ రక్షకభటులు, పోలీసుల సమక్షంలోనే ఈ హత్యలు జరిగిన మాట నిజం. ఈ ఉదంతంలోని అమానుషత్వాన్ని, రాక్షసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి అవమానకరమైన రీతిలో ప్రయత్నం జరిగింది. ఇందుకోసం జర్నలిస్టులు చాలామంది అన్ని విలువలను వదిలేశారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కూడా మానవత్వాన్ని మరచి మాట్లాడాయి. ఇదంతా హిందువులు కాబట్టే అంటే తొందరపాటు కాదు. కాషాయం ధరించిన వారి మీద దాడి జరిగితే అంత నిర్లక్ష్యంగా, అంత వక్రంగా వార్తను నమోదు చేయవలసిన అవసరం ఏమిటన్నదే ఇప్పుడు అంతా వేస్తున్న ప్రశ్న. పిల్లల దొంగలే అయితే పోలీసులు ఎదురుగా అంత ధైర్యంగా ఎందుకు దాడి జరిగింది? రెండు వందల నుంచి నాలుగు వందల మంది మీద పడి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ మూక ఆ ముగ్గురిని బయటకు లాగి సామూహిక హత్య చేసిందని పాల్గర్‌ ‌కలెక్టర్‌ ‌కైలాస్‌ ‌షిండే తరువాత ప్రకటించారు. సాధువుల మీద దాడి సమయంలో 400 నుంచి 500 మంది ఉన్నారని, కానీ పోలీసులు చాలా తక్కువమంది ఉన్నారని ఎఫ్‌ఐఆర్‌ ‌తయారు చేసిన అసిస్టెంట్‌ ‌పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆనందరావ్‌ ‌కాలే నమోదు చేశారు. జయ్‌రామ్‌ ‌భావర్‌, ‌మహేశ్‌ ‌సీతారాం రా, గణేశ్‌దేవ్‌ ‌జీరావ్‌, ‌రాందాస్‌రూజ్‌ అసేర్‌, ‌సునీల్‌ ‌సోమ్‌జీ రాటే అనే ఐదుగురు పేర్లను ఏఎస్‌ఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఏఎస్‌ఐ ఆనందరావ్‌ ‌కాలే, ఎస్‌ఐ ‌సుధీర్‌ ‌కాటేర్‌లను విధి నిర్వహణలో అలక్ష్యం వహించినందుకు పాల్గర్‌ ‌జిల్లా ఎస్‌పి గౌరవ్‌సింగ్‌ ‌సస్పెండ్‌ ‌చేశారు. ఈ ఇద్దరు కాసా స్టేషన్‌లో పని చేసినవారే.
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆ ఐదుగురు సీపీఎం కార్యకర్తలేనని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పత్రిక ఆర్గనైజర్‌ ‌వెల్లడించింది. సీపీఎం ఎమ్మెల్యే వినోద్‌ ‌నికోలే కనుసన్నలలోనే ఈ హత్యలు జరిగాయని ఆ పత్రిక ఆరోపించింది. కాబట్టి సాధువుల దారుణహత్యలో సీపీఎం పాత్ర సుస్పష్టమని కూడా పేర్కొన్నది. జరిగిన తీరును బట్టి సీపీఎం కుట్ర పన్ని ఈ హత్యలు చేసిందని స్పష్టమవుతున్నదని ఆ పత్రిక చెబుతున్నది. దాడి జరిగిన ప్రాంతమంతా క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలతోనే ఉంటుందని కూడా తేల్చింది. అరెస్టయిన 101 మంది కూడా సీపీఎం కార్యకర్తలేనని, పారిపోయిన వారిలో కూడా సీపీఎం కార్యకర్తలతో పాటు కష్టకారి సంఘటన్‌కు చెందిన వారు కూడా ఉన్నారని ఆర్గనైజర్‌ (‌వెబ్‌) ‌తెలియచేసింది. ఇంతకీ కష్టకారి సంఘటన్‌ ‌కూడా పేరు మోసిన సంస్థే. దీనిది కూడా ఘన చరిత్రే. క్రైస్తవ మిషనరీలతో దీనికి చాలా అనుబంధం ఉంది. ఆ 101 మందికి బెయిల్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చిన సంస్థ కూడా కష్టకారి సంఘటన్‌ ‌కావడం విశేషం. ఈ సంస్థ ప్రధాన నిర్వాహకుడు షిరాజ్‌ ‌బాల్సారా. ఇదొక ఎన్జీవో. ఈ దుర్ఘటనలో సీపీఎం పాత్ర, మిషనరీల పాత్ర గురించి కూడా దర్యాప్తు జరిపించాలని విశ్వహిందూ పరిషత్‌ ‌కూడా కోరింది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ‌నాయకత్వంలో బీజేపీ బృందం గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేసింది. ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌ఫోన్‌ ‌చేసి నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఉదంతానికి సంబంధించి ఇంతవరకు అరెస్టు చేసినవారిలో తొమ్మిది మంది మైనర్లు ఉన్నారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వెల్లడించారు. అలాగే అక్కడ చోద్యం చూసిన పోలీసులలో ఇద్దరిని సస్పెండ్‌ ‌చేసినట్టు కూడా చెప్పారు. దాడికి దిగిన ముష్కరులంతా స్థానిక ‘గిరిజనులు’ అని, విక్రమ్‌ఘడ్‌ ‌తాలూకా, గడ్చంచేలె గ్రామాలకు చెందిన వారని అధికారులు చెబుతున్నారు.
అన్ని విధాలా అసమర్థుడని నిరూపించుకున్న ఏ రాష్ట్రాధినేత అయినా ఏమంటాడు? పదవి కోసం తండ్రి ఆశయాలనీ, పార్టీ ఆత్మనీ నిలువెత్తు లోతున పాతరేసిన పదవీలాలసుడు ఏమంటాడు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌ఠాక్రే సరిగ్గా అదే అన్నాడు. ‘పాల్గర్‌ ఉదంతంలో మత కోణం చూడరాదు’ అని. ఈ అంశం మీద కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షాకు ఆయన చెప్పిన సమాధానం ఇదే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కూడా ఉచిత హామీ ఒకటి పడేశారు. ఇంకా, తన ఉదారతను చాటుకుంటూ, ఇలాంటివి జరగడం అత్యంత విషాదమని వాక్రుచ్చారు. మేమేమీ చేతులు ముడుచుకుని కూర్చున్నామా ఏమిటి? ఆ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. దాడికి సంబంధించి వందమంది వరకు అరెస్టు కూడా చేయించాం. ఎవరినీ వదలం. సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోంది అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారాయన. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ ‌పాము విరక్కుండా, కర్ర విరక్కుండా అన్న రీతిలో ఒక హాస్యాస్పదమైన వివరణ ఇచ్చారు. నిజానికి అదొక హెచ్చరిక. సామాజిక మాధ్యమాలలో ఇది హిందువుల మీద దాడి అంటూ చెలరేగిన దుమారానికి ఆయన హెచ్చరిక అన్నమాట. ఇక్కడ దాడి చేసిన వారు, బాధితులు ఇద్దరూ ఒకే మతం వారు. కాబట్టి దీనికి మతం రంగు పులమడం సరికాదు అంటారాయన. గిరిజనులు సహజంగా అమాయకులే. కానీ ఇతర మతాలు, ఇతర సిద్ధాంతాల ప్రభావాలకు లోనైనవారు మాత్రం అమాయకులు కారు. అది చాలాసార్లు రుజువైంది. ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ ప్రాంతం కలసి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం నెగ్గింది. అలాగే ఇటీవల క్రైస్తవంలోకి మతాంతరీకరణలు జరిగాయి. ఇది సాక్షాత్తు మహారాష్ట్ర మాజీ పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌జైన్‌ ఒక టీవీ చర్చలో వెల్లడించిన మాట. అక్కడ గిరిజనులు 90 శాతం ఉన్న మాట నిజమే అయినా, వారిలో ఎక్కువ మంది క్రైస్తవులు, ముస్లింలుగా మారారని సాధు సమాజం చెబుతోంది. వీరికి భయపడే పోలీసులు కావాలని ఆ ఇద్దరు సాధువులను ఆ మూకకు అప్పగించారని కూడా సాధు సమాజం తీవ్ర ఆరోపణ.


ఇక్కడ కారు డ్రైవర్‌ ‌నీలేశ్‌ ‌గురించి రెండు విషయాలు. ఆయన కూడా రామ్‌గిరి మహారాజ్‌ ‌భక్తుడు. అందుకే లాక్‌డౌన్‌ ‌సమయంలోను ఆ సాధువులు ఇద్దరిని అక్కడికి తీసుకువెళ్లడానికి సిద్ధపడ్డాడు. తాను ఆరాధించే సాధువు అంత్యక్రియలకు హాజరు కావడం మరొక ఉద్దేశమని నీలేశ్‌ ‌భార్య పూజ తెలియచేసింది. ‘నా భర్త ముఖం కూడా నేను చివరిసారిగా చూసుకోలేకపోయాను. అంత పాశవికంగా ఆయనను, ఆ ఇద్దరు సాధువులను ఆ మూక కొట్టి చంపేసింది. వారందరిని ఉరితీయాలి’ అని ఇండియా టుడే టీవీతో అన్నారామె. నీలేశ్‌, ‌పూజలకు ఇద్దరు పిల్లలు. ఇక నీలేశ్‌ ‌తల్లి బాధ చెప్పలేనిది. ఆ కుటుంబానికి ఆయన ఒక్కడే ఆధారం. ఆ కుటుంబం భవిష్యత్తు అగమ్యగోచరమే. ఈ పాపం మిషనరీలది. సీపీఎంది. పదవీవ్యామోహంలో హిందూ ఆత్మగౌరవ నినాదం సంగతి సౌకర్యంగా మరిచిపోయన శివసేనది. ఎన్సీపీ, కాంగ్రెస్‌కి కూడా ఈ పాపంలో సమ వాటాయే ఉంది.
అరెస్టుల తరువాత వారి కుటుంబీకులు, సంబంధీకులు గడ్చంచేలె సర్పంచ్‌ ‌చిత్రా చౌదరిని బెదిరించడం మొదలుపెట్టారు. నిజానికి ఈ ఉదంతం గురించి లోకానికి తెలియడానికి ఆమె తోడ్పాటు ఉందని చెబుతారు. ఆమె బీజేపీ కార్యకర్త. పోలీసులతో కుమ్మక్కయినందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని ఆమెను బెదిరిస్తున్నారు. ఆమెను చంపుతామని కూడా కొందరు హెచ్చరించినట్టు లోకమత్‌ అనే పత్రిక వెల్లడించింది. తమకు దాసోహమనని వ్యక్తుల మీద, రాజకీయ కార్యకర్తల మీద వామపక్ష మూకలు వేసే ముద్ర సరిగ్గా ఎక్కడైనా ఇదే కదా! హిందు అన్న పేరు వింటేనే కంట్లో నిప్పులు పోసుకునే కాంగ్రెస్‌ అనే దగుల్బాజీ రాజకీయ వేదిక ఆరోపణ మరీ వికృతం. బీజేపీయే ఈ దాడి వెనుక ఉన్నదట. నాలుగైదు జిల్లాలలో కూడా ప్రభ వెలగని శరద్‌ ‌పవార్‌ అనే జాతీయ నాయకుడి పార్టీ ఎన్సీపీ కూడా ఈ విషయంలో విధ్వంసక వైఖరినే ప్రదర్శించింది. ఇక మీడియా… కొన్ని చానళ్లు, పత్రికలు తప్ప ఎక్కువ భాగం ఈ వార్త మీద వాస్తవాలు ఇవ్వలేకపోయాయి. మూకహత్యల గురించి సంచలనాత్మకంగా చెప్పవలసి వస్తే మైనారిటీల విషయంలోనే జరుగుతుందని సుస్పష్టంగా తేల్చి చెప్పాయి. కానీ సోనియాజీ కళ్లు తెరవండని హెచ్చరించినందుకు రిపబ్లిక్‌ ‌టీవీ చానల్‌ ‌ప్రధాన సంపాదకుడి మీద దాడి యత్నం జరిగింది. నిజానికి ఇది పాల్గర్‌ ‌సంఘటనకు కొనసాగింపు.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE