కొవిడ్‌ 19 ‌మహమ్మారితో యుద్ధానికి విరామం ఇవ్వలేం. ఆర్థిక వ్యవస్థ పునర్‌ ‌నిర్మాణ యజ్ఞం ప్రారంభించకుండా ఇక ఉండలేం. ఇలాంటి అత్యంత కీలక దశకు భారతదేశం చేరింది. ప్రపంచం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అమెరికా పోరాటం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. యాభయ్‌ అయిదు వేల మరణాలతో అమెరికా అతలాకుతలమవుతున్న మాట నిజం. అలాగే చాలా యూరప్‌ ‌దేశాలు. ఏప్రిల్‌ 27 ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఆరంభించే సమయానికి దేశంలో కొవిడ్‌ 19 ఏ ‌దశలో ఉంది? 1,396 కొత్త పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీనితో వైరస్‌ ‌లక్షణాలు కనిపించిన వారి సంఖ్య 27,885కు చేరుకుంది. అంతకు ముందురోజు కేసుల విషయంలో ఒక రికార్డ్ ‌నమోదయింది. అత్యధిక సంఖ్యలో 1,945 కేసులు నమోదైనాయి. భారత్‌లో ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇవి గమనంలోకి తీసుకోక తప్పని కఠోర వాస్తవాలే. కానీ 40 రోజుల లాక్‌డౌన్‌ ‌కారణంగా చిందరవందరైన ఆర్థిక వ్యవస్థను ఇంకా పట్టించుకోకుండా ఉండలేని పరిస్థితి మరొకవైపు. అందుకే ఈ అంశం మోదీ, ముఖ్యమంత్రుల సమావేశానికి చోదకశక్తి అయింది. నలభయ్‌ ‌రోజులు కావచ్చు. అయినా లాక్‌డౌన్‌ ఎత్తివేసే సాహసం చేయడానికి భారతదేశం సిద్ధంగా లేదన్న మాట వాస్తవం. మే 3 దాకా రెండో దశ లాక్‌డౌన్‌ ఉం‌టుంది. ఆ తరువాత? ఇదే ప్రశ్న ఇప్పుడు సాధారణ పౌరులతో పాటు అధికారంలో ఉన్నవారిని కూడా వేధిస్తున్నది. లాక్‌డౌన్‌ ‌మీద నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని ఇప్పుడు పార్టీలకు అతీతంగా అంతా అంగీకరిస్తున్నారు. రెండో దశ లాక్‌డౌన్‌ ‌మే 3 వరకు ఉంటుందని ప్రధాని నాడు ప్రకటిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి దానికి మరొక నాలుగు రోజులు చేర్చవలసి వచ్చింది. అలాగే చాలా రాష్ట్రాలు కూడా చేశాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతర పరిస్థితులను ఊహించడానికి కూడా భయపడుతున్న దశ ఇది.


ఇప్పుడు ఎవరి అంతరంగమైనా ఒకటే చెబుతోంది. లాక్‌డౌన్‌ ఒక్కసారే ఎత్తివేయడం సాధ్యం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి పాక్షికంగా సడలించక తప్పదు. అందుకే మే 3వ తేదీ తరువాత జరిగే యుద్ధం మరింత కష్టమైనది. కనిపించని కరోనా వైరస్‌ ‌శత్రువుతోను, కనిపిస్తున్న ఆర్థిక వ్యవస్థ కష్టాలతోను జమిలిగా యుద్ధం సాగవలసిందే. ఇందుకు దేశంలో మొదట రెడ్‌ ‌జోన్ల (కొవిడ్‌ 19 ఇన్‌ఫెక్షన్‌ ‌భీకరంగా ఉన్న జిల్లాలు)ను ఆరెంజ్‌ ‌జోన్లు (కొద్ది కేసులు మాత్రమే ఉన్న జిల్లాలు)గా మార్చగలగాలి. అలాగే ఆరెంజ్‌ ‌జోన్లను గ్రీన్‌ ‌జోన్లు (అసలు ఇన్‌ఫెక్షన్‌ ‌సోకని ప్రాంతాలు)గాను తయారు చేయాలి. రెడ్‌ ‌జోన్లలో లాక్‌డౌన్‌ ‌నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. ఇదే ప్రధాని ముఖ్యమంత్రులకు చెప్పారు. ముఖ్యమంత్రులు కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను బట్టి ఈ జోన్లను ప్రమాద స్థాయి నుంచి బయట పడేయడం ఎంత వరకు సాధ్యం? మేఘాలయ ముఖ్యమంత్రి మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించ వలసి ఉంటుందని భావించారు. ఆంక్షలు అనివార్యం, కానీ తుది నిర్ణయం కేంద్రానిదేనని గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. కాబట్టి లాక్‌డౌన్‌ ‌వల్ల సత్ఫలితాలు వచ్చాయన్న ప్రధాని అభిప్రాయంతో ఇప్పుడు ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు. గడచిన ఒకటిన్నర మాసంలో లాక్‌డౌన్‌ ‌కారణంగా వేలాది ప్రాణాలు దక్కాయి అని మోదీ భావిస్తున్నారు. అయినప్పటికి లాక్‌డౌన్‌ను యథాతథంగా కొనసాగించాలని కూడా ఎవరూ భావించలేరు. ఏమైనా ఈ కీలక అంశం మీద నిర్ణయం తీసుకోవడానికి ఆయన ఇంకొన్ని రోజుల సమయం తీసుకుంటున్నారు. మే 3 తరువాత వెలువడే నిర్ణయం కీలకమైనదే అవుతుంది.
లాక్‌డౌన్‌, ‌భుక్తి మార్గాల మధ్య సమన్వయం సాధించాలని మోదీ ఆశిస్తున్న సంగతి అర్థమవుతుంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి పోయింది. మిగిలిన రంగాలలో కూడా లక్షలాది ఉద్యోగాలు ఖాళీ అయిపోయాయి. మొత్తంగా చూస్తే కొన్ని లక్షల మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇలా ఉంటే, మరొక పక్క కొవిడ్‌ 19 ‌యోధులు పౌరుల ప్రాణాలు కాపాడేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రాణాల రక్షణకు ఒక వైపున పోరాటం చేస్తున్నా, ఆర్థికాంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుందని ప్రధాని ముఖ్యమంత్రులకు చెప్పారు. కాబట్టి దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు మళ్లీ ఆస్కారం కల్పించాలన్నదే ఆయన అభిమతం. నిజానికి రెండో దశ లాక్‌డౌన్‌ ‌సమయంలోనే ఏప్రిల్‌ 20 ‌నుంచి కొన్ని రంగాలలో పనుల పునరుద్ధరణకు అనుమతులు ఇచ్చి, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి నడిపించే పనికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఈ సడలింపుల వల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందేమో శ్రద్ధగా గమనించాలన్నది ప్రధాని అంతరంగం. ఎందుకంటే కొన్ని సడలింపుల వల్ల నలభయ్‌ ‌రోజుల లాక్‌డౌన్‌ ‌వ్రతం చెడిపోయే పరిస్థితి రాకూడదు. అంటే సడలింపులతో పాజిటివ్‌ ‌కేసులు పెరిగితే ఉభయ భ్రష్టత్వం తప్పదు. కొవిడ్‌ 19 ‌ద్వారా మనం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఇది కూడా ఒకటని ప్రధాని నిశ్చితాభిప్రాయం. ఇందులో ప్రజల బాధ్యతను కూడా ప్రధాని గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ‘దో గజ్‌ ‌దూరి’ (రెండు గజాల ఎడం) అనేది మనకి తారకమంత్రంలా ఉండాలన్నదే ఆయన ఆశయం. ఇంత ఘోర విపత్తు జరిగి, ఇంత నష్టం జరిగినా ఈ చిన్న సూత్రాన్ని పాటించి తీరాలన్న స్పృహ లేని పౌరులు ఇప్పటికి ఇతోధికంగానే కనిపిస్తున్నారు. చిన్న తప్పిదంతోనే పలు దేశాల ఆర్థిక, సామాజిక ముఖచిత్రాలను కొవిడ్‌ 19 ‌గుర్తు పట్టలేనంతగా మార్చేసిన అనుభవం ఎదురుగానే ఉన్నా నిబంధనలు పట్టనివారు చాలామందే కనిపిస్తున్నారు. ముఖానికి మాస్క్ ‌ధరించడం కూడా జీవితంలో భాగం కావాలని ప్రధాని సూచిస్తున్నారు. కొవిడ్‌ 19 ఏ ‌పౌరునికైనా శుభ్రత విషయంలో మిగిలిన జీవితం మొత్తం పాటించవలసిన పాఠాన్ని నేర్పిందని మోదీ పరోక్షంగా భావిస్తున్నారు. మనం ధైర్యంగా పోరాడాలి. సాధారణ పౌరునికి కూడా ఉపయోగపడే సంస్కరణలు తేవాలి అని కూడా మోదీ ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. ఇందులో విశ్వవిద్యాలయాల సేవలు కూడా తీసుకోవాలని సలహా ఇచ్చారు.
కరోనా వైరస్‌ ‌తగ్గుముఖం పట్టడంతోనే ఎవరి బాధ్యత తీరిపోవడం లేదన్నది వాస్తవం. జూన్‌ ‌మాసం ప్రవేశించే సరికి, ప్రతి సంవత్సరం వలెనే కొన్ని కొత్త వ్యాధులు విజృంభిస్తాయి. వాటిని ఎదుర్కొనడానికి కూడా పరిపాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉంచాలి. కొవిడ్‌ 19 ‌నేపథ్యంలో దేశంలో చాలామంది వైద్యులు తమ ఆస్పత్రులు మూసివేశారు. ఇప్పుడు వాటిని మళ్లీ తెరిపించాలి. కరోనా పరిస్థితి, తీవ్రత, ఇతర భయాలు ఎలా ఉన్నా అన్ని రకాల సేవలకు దీర్ఘకాలం విరామం ఇవ్వాలంటే సాధ్యం కాదు. దానితో కొత్త విపరిణామాలు తప్పవని మోదీ గుర్తు చేశారు. ఇంత విపత్తును ఎదుర్కొన్నా మన ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ స్థిరంగానే ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు. అయితే ఆర్థిక ప్యాకేజీ గురించి కొన్ని రాష్ట్రాలు చేసిన సూచనలకు ఇంకా సమాధానం ఇవ్వవలసి ఉంది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌కూడా పాల్గొన్నారు. ఇక ఆర్థికాంశాలే కీలకంగా ఉంటాయని ఈ విధంగా ప్రధాని సూచించారన్నమాట.
ఏప్రిల్‌ 27‌న ముఖ్యమంత్రుల సమావేశంలో మోదీ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు బీజం అంతకు ముందు జరిపిన రెండు సమావేశాలలో కనిపిస్తుంది. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా గ్రామాధికారులతో ప్రధాని ఏప్రిల్‌ 24‌న మాట్లాడారు. 26వ తేదీ నాటి మన్‌ ‌కీ బాత్‌ ‌మరొకటి.
కొవిడ్‌ 19 ‌మన దేశానికి గట్టి సందేశాన్ని ఇచ్చిందనీ, అదే ఈ దేశం స్వయం సమృద్ధిగా, స్వయం ఆధారిత వ్యవస్థగా ఉండాలని ఆ సందేశం చెబుతున్నదని ప్రధాని పంచాయతీ దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండు గజాల దూరం అంటూ మన గ్రామీణ ప్రజానీకం ప్రపంచానికి పెద్ద సందేశం పంపిందని అన్నారు. లక్షలాది గ్రామ అధికారులతో మోదీ ముచ్చటించారు. మనం స్వయం సమృద్ధం కాకుంటే ఇలాంటి విపత్తులను ఎదుర్కొనలేమని మోదీ చెప్పారు. ఇతరుల మీద అతిగా ఆధారపడరాదన్న మన పూర్వ సిద్ధాంతానికి ఇప్పుడు విలువ వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
మన్‌ ‌కీ బాత్‌లో మరొక కీలకమైన వ్యాఖ్య చేశారాయన. ప్రజల సారథ్యంలో సాగే యుద్ధంతోనే కొవిడ్‌ 19 ‌మహమ్మారిని అరికట్టడం సాధ్యమవుతుందని అన్నారు. నిజానికి ఈ యుద్ధానికి సారథులు కూడా ప్రజలేనని ప్రధాని అన్నారు. భవిష్యత్తులో కరోనా వైరస్‌ ‌మీద జరిగిన పోరు గురించి ప్రజలు మాట్లాడుకుంటారని, అప్పుడు ప్రజా పోరాటంతోనే ఇది సాధ్యమైందనే నిర్ణయానికి వారు వస్తారని ప్రధాని చెప్పడం ప్రశంసనీయం. కొవిడ్‌ 19 ‌మీద పోరాటంలో ముందున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసు యంత్రాంగాలకు ఆయన మరొకసారి ధన్యవాదాలు తెలియచేశారు. ఈ అభిప్రాయాలనే ప్రధాని ముఖ్యమంత్రుల సమావేశంలో వెల్లడించారు. కరోనా మీద పోరాటం కేవలం అధికార పీఠాలకే పరిమితం కాదనీ, ఇందులో ప్రజలదే ప్రధాన పాత్ర అని ఆయన గుర్తు చేసినట్టయింది. వచ్చే నెల మన్‌ ‌కీ బాత్‌ ‌సమయానికి కొవిడ్‌ 19 ‌యుద్ధం విషయమై శుభవార్త వినాలని కోరుకుందామని ప్రధాని చెప్పడం స్వాగతించవలసిందే.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE