– యాదవరావ్ కందకుర్తి

ఆ ‌కుగ్రామానికి వెళ్లిన కొందరు స్వయం సేవకులు అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌కేశవ్‌రావ్‌ ‌బలీరామ్‌ ‌హెడ్గేవార్‌ ‌పూర్వీకులు నడిచిన నేల అదే.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో, ఇందూరు (నిజామాబాద్‌) ‌జిల్లాలో మారుమూల, పవిత్ర గోదావరీ తీరంలో కనిపిస్తుందా అందాల పల్లె. పేరు కందకుర్తి. పల్లెకు ఆ చివర కందకుర్తి-నాందేడ్‌ ‌వంతెన (1992లో కట్టారు) మీద నిలబడి, ఎడం పక్కకి చూస్తే కనిపిస్తుంది రమణీయ దృశ్యం. కొంచెం దూరంలో చిన్న కొండ. దాని మీద సంగమేశ్వ రాలయం. ఆ కొండను ఒరుసుకుంటూ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి మందగమనంతో ప్రవేశిస్తున్న గోదావరి దర్శనమిస్తుంది. నిజానికి  గోదావరి తెలుగు నేలను తాకే ప్రదేశం ఇదే. కొండకు ఈవలి పక్కనుంచి మంజీర (అసలు పేరు వంజర. ఇది సంస్కృతం. మంజీర ముస్లింలు పెట్టిన పేరనీ, కన్నడ పేరనీ అంటారు. ఇది గోదావరికి ఉపనది) వచ్చి గోదావరితో అక్కడే సంగమిస్తున్న దృశ్యం తరువాత కనిపిస్తుంది. కందకుర్తిని ఒరుసుకుంటూ ప్రవహిస్తూ, చిన్న వంపుతో ఆ రెండు నదులు సంగమాన్ని చేరుకుంటూ ఉంటుంది హరిద్ర నది. అదే పసుపు వాగు. మంజీర, హరిద్రలను వేరు చేస్తూ ద్వీపంలా కనిపిస్తూ ఉంటుంది పొడవాటి పచ్చని భూఖండం.

ఈ మూడు స్రవంతులూ కలసే చోటే ఉంది రాణీ అహల్యాబాయి హోల్కార్‌ (ఇం‌దోర్‌) ‌కట్టించిన శివాలయం. ఇది కూడా సంగమేశ్వరుని ఆలయమే. నీటి అడుగున కొంతకాలం, ప్రవాహం సన్నబడితే ఇసుక తిన్నెల మీద కొద్దికాలం కనిపిస్తూ ఉంటుంది.

దాదాపు ఫర్లాంగు దూరం ఉండే వంతెనకు ఆ కొసన ఉన్నదే మహారాష్ట్ర భూభాగం, తొలి పల్లె బెల్లూర్‌. ‌తరువాత కుడివైపు చూస్తే ఆ మూడు స్రవంతుల విశాల జలవేదిక కంటికి నిండుగా దర్శన మిస్తుంది. దిగువన పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న బాసర (అసలు పేరు వాసర) పుణ్యక్షేత్రానికి సాగిపోతూ ఉంటుంది.

సీతారామలక్ష్మణులు వనవాసానికి దండ కారణ్యం వచ్చినప్పుడు ఇక్కడి గోదావరి తీరానికి వచ్చారని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఇక అహల్యా బాయి కట్టించిన శివాలయం లేదా అహల్యాదేవీ మందిర్‌ ‌మొదలు, గ్రామంలో కనిపించే స్కంధ మందిరం, ఈ ఆలయానికి సమాంతరంగా కొన్ని గజాల దూరంలోనే కనిపించే రామాలయం, ఊరికి ఇటు చివర ఉన్న విశేషమైన ముస్లిం శ్మశానవాటిక దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలు.

ఆ రామాలయానికి విశిష్టమైన స్థల పురాణం, చరిత్ర ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహరాజ్‌, ఆయన ఆధ్యాత్మిక గురువు సమర్ధ రామదాసు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. పీష్వా పారసనీస్‌ ‌దండయాత్ర చేస్తూ 1785లో ఇక్కడికి వచ్చాడు. అహల్యాబాయి సైన్యం కూడా ఇక్కడ రెండు నెలలు విడిది చేసింది. అప్పుడే సైనికుల కోరిక మేరకు ఆమె సంగమేశ్వరాలయం కట్టించారు. మొగల్‌ ‌పాదుషా ఔరంగజేబ్‌ ‌దక్కన్‌కు వచ్చినప్పుడు బోధన్‌ (‌బహు ధాన్యపురం అన్న చక్కని పేరుతో పాటు ఏకచక్రపురం అన్న మరొక నామం కూడా ఈ పట్టణానికి ఉంది)లో బసచేయగా, అతడి సేనలో కొంత భాగం కంద కుర్తిలో విడిది చేసింది. ఇక్కడే మరాఠా సైన్యానికీ, మొగల్‌ ‌సైన్యానికీ యుద్ధం జరిగింది. అప్పుడు మరణించిన మొగలాయి సైనికుల కోసమే ఆ చిన్న గ్రామంలో అంత శ్మశానవాటికను విస్తరించవలసి వచ్చింది. గ్రామం మధ్యలో ఒక గుట్ట కనిపిస్తుంది. దీని చుట్టూ గ్రామం పెరిగింది. ఇందులో ఒక వైపు అంతా ముస్లిం శ్మశానవాటికే.

 కందకుర్తి దగ్గర ప్రవహించే మూడు నదుల సంగమం వలెనే, ఇక్కడ భాషాసాంస్కృతిక సముచ్ఛయం కనిపిస్తుంది. ఈ ఊరు ఏడువందల ఏళ్ల క్రితం అవతరించిందని చెబుతారు. మొదట కందకుర్తిలో జనావాసాలు లేవు. ఇక్కడకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే నీల అనే గ్రామం కేంద్రంగా ఉండేది. కానీ నదుల సంగమ స్థలి కాబట్టి జనం వచ్చి వెళుతూ ఉండేవారు. ఆదిలో ఇదొక జాలర్ల గ్రామం. అంతా అటవీ ప్రాంతం కాబట్టి డప్పులతో జనం వచ్చి వెళ్లేవారు. క్రూర జంతువుల నుంచి రక్షణకు అదొక మార్గం. ఆ విధంగా మాదిగలకు స్థానం వచ్చింది. ఆ కాలంలో వంజర సంగమం అనే దీనికి పేరు. ఆపై స్కంద కూడతి అన్న పేరు వచ్చింది. స్కంధుడు అంటే కుమారస్వామి. స్కంద కూడతి అంటే కుమారస్వామి నివాసం. కూడతి అంటే అర్థం నివాసం. తరువాత స్కంద కూడలి అన్న పేరుతో పిలిచారు. అక్కడ ఉన్నది స్కంద మందిరమే.

ఇంతకీ ఇది మరాఠా పదం కాదు. కన్నడ జనితం. ఇక్కడ స్థలాలకి చాలావరకు కన్నడ భాషా నామాలు ఉంటాయి.  నిజామాబాద్‌ ‌జిల్లాలో దొరికిన 60 శాసనాలు ఈ భాషలోనే ఉన్నాయి. తూర్పు చాళుక్యులు పాలనకు చిహ్నమిది. కానీ ఎక్కువమంది హిందువులు ఇక్కడ మాట్లాడేది మరాఠీ. భౌగోళికంగా దీని స్థానం తెలుగు ప్రాంతంలో. కాబట్టి వినిపించేవి కన్నడ పదాలు. ప్రజలు మాట్లాడేది మరాఠీ. చిరునామా తెలుగునాడు.అవతల నాందేడ్‌కు చెందినవాడు భవభూతి. ఆయన ఉదుంబర నామ్నా (తన స్వస్థలం) అని చెప్పుకున్నాడు. దీనిని ఇప్పుడు ఉమ్రి అంటున్నారు. పంప కవి కూడా ఈ పరిసరా లకు చెందినవారే. ఇందులో వంజీర, స్కందమూర్తి మందిరం, హిందూ వ్యతిరేక ముస్లిం పాలన ఒక చారిత్రక నేపథ్యానికి సంబంధించినవే.

 ఔరంగజేబ్‌ ‌సైన్యం రెండువందల మంది ఈ గ్రామంలోనే ఉండేవారు. తరువాత నిజాంలు కూడా ఇదే కొనసాగిస్తూ, తమ సేనల శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. తరువాత ఈ సైనికులను శాశ్వత ప్రాతిపదికన ఉంచేందుకు కందకుర్తి, ఆ చుట్టు పక్క ఈనాములు ఇచ్చారు. దీని ఫలితమే కందకుర్తితో పాటు సమీప గ్రామాలు హంగర్గా, కొప్పర్గాలలో నేటికీ ముస్లిం జనాభా 70 శాతం వరకు కనిపిస్తుంది. రైలు మార్గం నిర్మించే వరకు ఔరంగా బాద్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌వెళ్లాలంటే కందకుర్తి మీదుగానే వెళ్లాల్సి వచ్చేది.

About Author

By ganesh

Twitter
YOUTUBE