– క్రాంతిదేవ్ మిత్ర
కరోనా మహమ్మారి ఎవరి సృష్టో ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కొవిడ్ 19 వైరస్ బారినపడి విలవిల్లాడుతూ వారి ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతుంటే చైనా మాత్రం చిద్విలాసంతో చాపకింద నీరులా తన ప్రణాళికను అమలు చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ మందే లేని ప్రాణాంతక వైరస్ ధాటికి అన్ని దేశాల్లోనూ వైరస్ కేసులు, మరణాలు పెరిగిపోతుంటే అది పుట్టిన చైనా మాత్రం ఇంత త్వరగా కోలుకోవడం వెనుక మతలబు ఏమిటో అగ్రదేశాలు వెంటనే గ్రహించాయి. అన్ని దేశాలూ ఆర్థికంగా చితికిపోతుంటే చైనా మాత్రం తన పెట్టుబడులను ఆయా దేశాల్లోకి పంపిణీ చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని తెలిసిపోయింది. దీంతో ఆయా దేశాలు చైనా కుట్రలకు విరుగుడు చర్యలకు ఉపక్రమించాయి. భారత్ కూడా వెంటనే వ్యూహాన్ని మార్చేసి చైనాకు చెక్ పెట్టేసింది.
ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత కఠినం!
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో కీలక మార్పులు చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే దిశగా ఈ చర్యలను చేపట్టింది. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని పొరుగు దేశాలు భారత కంపెనీల్లో వాటాలు చేజిక్కించుకునే అవకాశం ఇవ్వకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. ముఖ్యంగా రక్షణ, టెలికాం, ఫార్మా సహా 17 రంగాల కంపెనీల్లో నిర్దేశిత శాతాన్ని మించి విదేశీ పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలంటే ఆ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు తీసుకురావాలి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నిబంధనలు చైనాను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది.. ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం. రెండోది.. ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టడం.. ఇప్పటి వరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండో విభాగంలో ఉండేవి. ప్రస్తుత నిబంధనలతో చైనాను రెండో విభాగంలో చేర్చారు. వాస్తవానికి ఒక్క చైనాకే కాదు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, భూటాన్‌లకూ ఈ సవరణ వర్తిస్తుంది
చైనా కుట్రలను అడ్డుకునేందుకే..
చైనాలో పుట్టిన కరోనా వైరస్ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. పలు దేశాల్లో లక్షలాదిగా వైరస్ బాధితులు పెరిగిపోయి, పెద్ద సంఖ్యలో రోగులు మరణిస్తున్నారు. అన్ని దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలు చేపట్టడంతో ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విచిత్రంగా చైనా త్వరగా కోలుకొని ఆయా దేశాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం పలు అనుమానాలను తావిస్తోంది. కరోనా అనేది ప్రపంచంపై చైనా పన్నిన కుట్ర అని ఇప్పటికే అన్ని దేశాలకూ తెలిసిపోయింది. ఇటీవల మన దేశానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 1.01 శాతం వాటా కొనుగోలు చేసింది.
భారత్‌లోని 18 అగశ్రేణి అంకుర సంస్థల్లో ఇప్పటికే చైనాకు రూ.30వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నట్లు అంచనా. బ్రూకింగ్స్ ఇండియా నివేదిక ప్రకారం భారత్‌లో మొబైల్ తయారీ పరిశ్రమలు, నిర్మాణ పరికరాలు మొదలు స్థిరాస్తి, ఆటొమొబైల్ వరకు ఎన్నో రంగాల్లో పలు చైనా సంస్థలు పెట్టుబడులు గుమ్మరిస్తున్నాయి. ఆ సంస్థల సంఖ్య ఎనిమిది వందలకు పైబడిందంటే, చైనా ఆధిపత్య వ్యూహం చాపకింద నీరులా ఎలా విస్తరిస్తున్నదో అర్థమైపోతుంది. అంతే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీల్లోనూ చైనా వాటాల రూపంలో పెట్టుబడులు పెడుతోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన భారత ప్రభుత్వం వెంటనే కీలక నిర్ణయానికి ఉపక్రమించిందని తెలుస్తోంది.
భారత ఆర్థిక రంగం చైనాకు అనుకూలంగా మారకూడదనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా కంపెనీలు ఇప్పటికే విధుంచుకున్న పెట్టుబడి లక్ష్యాలకు ఈ నిర్ణయం బ్రేకులు వేసింది. అయితే చైనా పారిశ్రామిక వర్గాల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న భారత్ తాజాగా కొంత పట్టు విడుపుల వైఖరిని ఎంచుకుంది. ముందే సిద్ధమైన కొన్ని ప్రాజెక్టులకు ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు చైనా కంపెనీ ప్రతిపాదనల పరీశీలనను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అప్రాధాన్య రంగాలకు సంబంధించి చైనా కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఉలిక్కిపడ్డ డ్రాగన్..
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి భారత్ ఇటీవల చేసిన ఈ కీలక విధాన సవరణపై చైనా ఉలిక్కి పడింది.. సరిహద్దు దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేయడాన్ని డబ్ల్యూటీఓ నిర్దేశించిన స్వేచ్ఛా వాణిజ్య స్ఫూర్తికి విఘాతకరమని సుద్దులు చెబుతోంది. భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తాను వ్యూహాత్మంగా వేసిన ఎత్తుగడను భారత్ చిత్తు చేసిందనే ఉక్రోషం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా కుట్రలను గమనించిన జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు స్పెయిన్, జర్మనీ తదితర దేశాలు కూడా ఇప్పటికే ఎఫ్‌డీఐలపై ఆంక్షలు విధించాయి. భారత్ కూడా ఈ చర్యలకు ఉపక్రమించేసరికి చైనా ఆందోళన పడుతోంది. భారత్‌తో పాటు, ఈ దేశాల తీరు ప్రపంచ వాణిజ్య సంస్థ మార్గదర్శకాలకే విరుద్ధం అని చైనా చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉంది. తన అవకాశవాద పెట్టుబడుల్ని అడ్డుకునే యత్నాలు చైనాకు కంటగింపవుతున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో సభ్యత్వం ఉన్న చైనా కాపీరైట్స్, ట్రేడ్ మార్కస్ తదితర మేధాసంపత్తి హక్కులను మొదటి నుంచీ బేఖాతరు చేస్తూనే ఉంది. చైనాలో తయారయ్యే వస్తువుల్లో 70 శాతానికి పైగా ఇతర దేశాల్లోని పాపులర్ బ్రాండ్స్‌కు నకలే అని అందరికీ తెలిసిన విషయమే. టపాకాయలు, ఆటబొమ్మలు మొదలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ వస్తువులెన్నింటినో చైనా కంపెనీలు కారుచౌకగా ఉత్పత్తి చేసి భారత్‌తో సహా ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అప్పుడు గుర్తుకు రాని డబ్ల్యూటీఓ నిబంధనలు భారత్ తలుపులు వేసేందుకు సిద్ధమయ్యేసరికి గుర్తుకురావడం విడ్డూరమే. ఎఫ్‌డీఐలకు చెందిన నిబంధన డబ్ల్యూటీఓ పరిధిలో లేదని, పెట్టుబడులకు సంబంధించి భారత్ విధాన నిర్ణయంలో ఎటువంటి తప్పిదం చోటుచేసుకోలేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. తమ దేశ అవసరాలను, ప్రాథమ్యాలను ఆయా ప్రభుత్వాలు, ప్రజానీకం నిర్ణయించుకోవాలే గాని ఇతర దేశం నిర్దేశించే వీల్లేదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
భారత్‌పై ప్రపంచ దేశాల దృష్టి
కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో ప్రపంచ ప్రఖ్యాత సంస్థల దృష్టి భారత్‌పై పడిందని అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) చెబుతోంది. సమీప భవిష్యత్తులో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఫేస్‌బుక్ సంస్థ మన దేశానికి చెందిన జియోలో 5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం ఇందుకు నిదర్శనం. ఈ పెట్టుబడితో భారత్‌పై విదేశీ కంపెనీలకు ఉన్న విశ్వాసం ప్రతిబింబిస్తోందని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ తెలిపింది.
‘కరోనా కారణంగా భారీగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు భారత్‌కు అవకాశాలు ఏర్పడ్డాయి. తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు ప్రత్యామ్నాయం అవ్వగలిగే శక్తికూడా భారత్‌కు ఉంది. ఈ పరిణామంతో ఉద్యోగాల సృష్టితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది’ అని అంటున్నారు యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ అధ్యక్షుడు ముకేశ్ అగి.
విదేశీ కంపెనీలను మరింతగా ఆకర్షించే దిశగా పారదర్శకత, స్థిరత్వంతో కూడిన విధానాల ద్వారా భారత్ విదేశీ కంపెనీల్లో విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందని అగి అంటున్నారు. భారత్ ఇప్పటికే కార్పొరేట్ సుంకాల సంస్కరణలు తీసుకువచ్చిందని.. అయితే కార్మిక చట్టాలు, భూ సంస్కరణలూ అవసరమని వివరించారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఏడాదికి కనీసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ అంచనా వేసింది.
మొత్తానికి చైనా తాను తీసిన గోతితో తానే పడుతోంది. డ్రాగన్ గుంట నక్క బుద్ధిని గ్రహించిన ప్రపంచ దేశాలు క్రమంగా ఆ దేశాన్ని బ్లాక్‌లిస్టులో పెడుతున్నాయి. చైనాతో ఆర్థిక బంధాలను తెంచుకుంటున్నాయి. చైనా తాను పన్నిన కుట్రలు బెడిసి కొట్టి ఒంటరిగా మారుతోంది. ఈ పరిణామాలన్నీ అంతిమంగా భారతదేశానికి మేలు చేయబోతున్నాయి.