– డా।। రామహరిత
చైనా కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా యుద్ధం వంటి సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయుధరహిత యుద్ధంగా విశ్లేషకులు చెప్తున్న ఈ మహమ్మారి పంపిణీ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. ఎంతో మానవ, ఆర్థిక నష్టాన్ని తెచ్చింది. ఈ ప్రమాదకర వైరస్‌ను అదుపుచేయడంలో పూర్తిగా విఫలమైన చైనా అధికారిక సమాచార ఏజెన్సీల ద్వారా తన తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంతోపాటు దౌత్య మార్గంలో ప్రపంచ శక్తిగా మరోసారి గుర్తింపు సాధించాలనుకుంది.
చైనా తెచ్చిన ఈ ఆయుధరహిత యుద్ధం ఆ దేశపు విస్తరణవాద విధానం వంటిదే. గుట్టుచప్పుడు కాకుండా భూభాగాలను ఆక్రమించడం, ఆర్థిక వ్యవస్థలను చేజిక్కించుకోవడం వంటి విధానాన్ని చైనా ఎప్పుడు అనుసరిస్తూనే ఉంది. ప్రపంచం దృష్టి తన చర్యలపై పడకుండా ఉండటానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవడం కూడా చైనాకు వెన్నతోపెట్టిన విద్య. తమ పౌరులకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేయడం కోసం ప్రత్యేక సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్‌లు రూపొందించుకోవడం, ప్రత్యేక సెర్చ్ ఇంజన్లు వాడుకలోకి తేవడం చైనాకు అలవాటు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ‘చైనా అనుకూల వాతావరణం’ రూపొందించడం కోసం వివిధ దేశాల్లో తమ రాయబార కార్యాలయాల ద్వారాట్విట్టర్ ఉద్యమం నడుపుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం చైనా చేస్తున్న ఈ గారడీలను తెలుసుకుంటోంది. అయినా చైనా తన ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. చైనా తమ అనుకూల మేధావి వర్గాన్ని ఎలా తయారుచేసుకుంటోంది, వారి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ అనుకూల ప్రచారం ఎలా చేసుకుంటోందన్నది విశ్లేషకులకు ఆసక్తికరమైన అధ్యయన విషయం అయింది.
ప్రపంచమంతా చైనా కరోనా వైరస్‌తో సతమతమవుతుంటే చైనా నిరంకుశ ప్రభుత్వం తాము వైరస్‌పై ఎలా విజయం సాధించినదీ, ఎలా ప్రజలపై ఆంక్షలు ఎత్తివేసినది పత్రికల ద్వారా ప్రచారం ప్రారంభించింది. తమ దౌత్య వేత్తల ద్వారా వైద్య సహాయం అందించడానికి సిద్ధమంటూ చెప్పించడం ద్వారా ప్రపంచ నాయకత్వం వహించడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రపంచానికి చూపించడానికి ప్రభుత్వం విపరీతమైన ప్రచారం మొదలుపెట్టింది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ తెరిచామని ప్రకటిస్తోంది. కానీ కొత్తగా కేసులు బయటపడటంతో స్థానిక ప్రభుత్వాలు థియేటర్లు, మాల్స్‌ను మూసివేస్తున్నాయి. రెస్టారెంట్‌లు, హోటళ్లను కూడా తెరవడం లేదు. చైనా ఇప్పటివరకు చెపుతున్న మృతుల సంఖ్య కూడా నమ్మదగినది కాదంటూ కొన్ని రిపోర్ట్‌లు వస్తున్నాయి.
గబ్బిలాల నుంచి 200పైగా వైరస్‌లు తయారు చేశామని గొప్పగా చెప్పుకునే వూహాన్‌లోని సూక్ష్మక్రిముల ప్రయోగశాలలు, జంతుమాంసపు మార్కెట్‌లకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో పాటు అనేక వైరస్‌లు ఈ మాంసపు మార్కెట్ ద్వారా వ్యాపిస్తున్నా ప్రభుత్వం ఈ మార్కెట్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న తమ ప్రచారానికి తగినట్లుగా ఈ మాంసపు మార్కెట్‌లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది కూడా. అక్కడ తేళ్ల దగ్గర నుంచి గబ్బిలాల వరకు అన్నీ జంతువుల అమ్మకాలూ జరుగుతున్నాయి. కానీ మరోపక్క మానవతా దృక్పధానికి మరోపేరుగా గుర్తింపు పొందాలనే తాపత్రయంలో చైనా అవసరమైన వైద్య సహకారం అందించడానికి సిద్ధమంటూ ప్రపంచ దేశాలకు సందేశాలు పంపుతోంది. వైరస్ నిర్ధారణ కిట్‌లు, మాస్క్‌ల నాణ్యత ఏమాత్రం సరిగా లేదని నిర్ధారణ అవుతున్నా ప్రపంచ దేశాలు అతిపెద్ద ఉత్పత్తిదారు అయిన చైనానే ఆశ్రయిస్తున్నాయి.
తైవాన్‌పై ధాష్టీకం
ప్రపంచ దేశాలను ఆదుకుంటున్నామన్న ‘ముసుగు దౌత్యం’ (మాస్క్ డిప్లమసి)తోపాటు మరోపక్క చైనా తనకు బాగా తెలిసిన విస్తరణవాద విధానాన్ని కూడా అమలు చేస్తోంది. ప్రపంచమంతా చైనా వైరస్‌తో సతమతమవు తుంటే చైనా మాత్రం తన ప్రాబల్యం, సామ్రాజ్యం పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉంది. తైవాన్‌లో ప్రజాస్వామ్య అనుకూల త్సై ఇన్ వెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి కొత్త ప్రభుత్వంపై చైనా కత్తికట్టింది. ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాలు, బెదిరింపులకు పాల్పడుతోంది. ఉద్రిక్తతలు పెంచుతోంది. ఫిబ్రవరి 10 చైనాకు చెందిన హెచ్ 6 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలో ప్రవేశించాయి. దానితో తైవాన్ ఎఫ్ 16 విమానాలను రంగంలోకి దింపింది. ఆ మర్నాడే అమెరికా అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన బి 52 యుద్ధవి మానాలను తైవాన్‌కు తరలించింది.
ఆ తరువాతి వారమే చైనా సైనిక విన్యాసాలను నిర్వహించి ఇక్కడ తమ సైన్యాన్ని సర్వసన్నద్ధం చేసింది. చైనా నిర్వహించిన విన్యాసాల్లో హెచ్ 6, జె 11 యుద్ధ విమానాలతోపాటు దాడులను ముందస్తుగా గుర్తించి హెచ్చరించే కేజే 500 విమానాలు కూడా ఉన్నాయని తైవాన్ ప్రకటించింది. ఈ విమానాలు తైవాన్ చుట్టూ తిరగడమే కాక జపాన్‌కు చెందిన సెంకాకు దీవులపైన కూడా ఎగిరాయి. తూర్పు చైనా సముద్రంలోని ఈ దీవులు తమవని చైనా చాలాకాలంగా చెపుతోంది. కోవిడ్ మహమ్మారి ఇబ్బంది పెడుతున్న చైనా మాత్రం తైవాన్ వంటి పొరుగు దేశాలను బెదిరించడం మానుకోలేదు.
‘బృహత్ చైనా’ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్న చైనా ప్రపంచ ఆరోగ్య సమావేశాలకు పరిశీలక హోదాలో హాజరు కావాలని తైవాన్‌కు ఆహ్వానం పంపడానికి వీలులేదని ప్రపంచ ఆరోగ్య సంస్థను అడ్డుకో గలిగింది. అలాగే తైవాన్‌తో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోరాదని చిన్న దేశాలను బెదిరిస్తోంది కూడా. ఈ బెదిరింపుల మూలంగా 2016 నుంచి ఇప్పటి వరకు ఎల్ సాల్విడార్, సావొ టోమ్, ప్రిన్సిపె, పనామా, డొమినికన్ రిపబ్లిక్, బర్కీనా ఫాసో, సాలమాన్ దీవులు, కిరిబాటి మొదలైన దేశాలు తైవాన్‌తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి.
తైవాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటం, అది హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రభావితం చేయడం సహించలేకపోయిన చైనా ఆ దేశంపై ఒత్తిడి తెస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించగలిగితే ప్రజాస్వామ్య దేశాలు దిక్కుతోచక చతికిలబడుతున్నా యని ఆ దేశాలకు వ్యతిరేకంగా చైనా ప్రచారం ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఎలాంటి సమాచారం అందకపోయినా తైవాన్ ఈ చైనా కరోనా వైరస్‌ను సమర్థంగా అడ్డుకొని స్వేచ్ఛాయుత దేశాలకు ఆదర్శంగా నిలచింది. ఇలా తైవాన్‌కు ప్రపంచంలో పరపతి పెరగడం చైనాకు ఏమాత్రం గిట్టలేదు. దానితో తైవాన్‌ని ‘దిగ్బంధనం’ చేసే విన్యాసాలు ప్రారంభించింది. మార్చి నెలలో కూడా చైనా దురాక్రమణను నివారించేందుకు తైవాన్ తన యుద్ధ విమానా లను రంగంలోకి దింపవలసివచ్చింది.
చైనాకు హెచ్చరికగా అమెరికా విమాన వాహక నౌక థియోడోర్ రూజ్ వెల్ట్ కూడా ఈ సముద్రజలాల గుండా గువామ్‌కు వెళ్లింది. తైవాన్ అనుకూల ధోరణికి మరింత బలం చేకూర్చే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 28న ‘(Taiwan allies International Protection and Enhancement Initiative Act) అనే ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసి తైవాన్ అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంచారు. వివిధ అంతర్జాతీయ వేదికలపై తైవాన్‌ను పరిశీలక దేశంగా గుర్తించడంతోపాటు తైవాన్ ప్రయోజనాలను దెబ్బతీసే దేశాలతో ఆర్థిక, సామాజిక, దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకునేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. చైనా కరోనా మహమ్మారిని నియంత్రించడంలో చెప్పుకోదగిన విజయం సాధించిన తైవాన్‌కు ఈ చట్టం మరింత బలాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఒక పక్క నాసిరకమైన వైద్య పరికరాలను ఇస్తోందని చైనా ప్రపంచ వ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చుకుంటే, అమెరికా, యూరోప్ దేశాలకు కోటికిపైగా మాస్క్‌లు సరఫరా చేసి తైవాన్ మంచిపేరు సంపాదించింది. ప్రపంచ దేశాల ప్రశంసలను కూడా పొందు తోంది. మహమ్మారి కుదిపేస్తున్న సమయంలో తైవాన్ పట్ల చైనా అనుసరిస్తున్న బెదిరింపు ధోరణిని అన్నీ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.
పసిఫిక్ సముద్రంలో పట్టు సంపాదించడానికి అమెరికాకు తైవాన్‌తో సత్సంబంధాలు చాలా అవసరం. అందుకనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజునుంచి డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంతో సంబంధాలను మరింత బలపరచు కునేందుకే ప్రయత్నిస్తున్నారు. అయితే తైపే చట్టం మూలంగా ఇప్పటికే ఆర్థిక, వాణిజ్య యుద్ధంలో మునిగిన చైనా, అమెరికాల మధ్య మరింత దూరం పెరిగింది.
దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
మార్చి నెలలో తమ నౌకదళ సిబ్బందికి కూడా చైనా కరోనా వైరస్ వ్యాపించడంతో అమెరికా కంగుతింది. పసిఫిక్‌లోనూ, ఇతర స్థావరాలలోను ఉన్న విమానవాహక నౌకల (యూ ఎస్ ఎస్ థియోడోర్ రూజ్ వెల్ట్, యు ఎస్ ఎస్ రోనాల్డ్ రీగన్) సిబ్బంది కూడా వైరస్ బారిన పడటంతో వివిధ స్థావరాల మధ్య సిబ్బంది రాకపోకలతోపాటు కొత్తగా నియమించిన సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని కూడా పెంటగాన్ రద్దు చేసింది. అమెరికాకు చెందిన 11 విమానవాహకలకు, అందులో అణు సామర్ధ్యం కలిగిన నౌక కూడా ఉంది. నిరంతరం సర్వీసింగ్ అవసరమవుతుంది. ప్రస్తుత ఐదు నౌకలు మాత్రమే వాడకానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కూడా రెండు పర్షియా గల్ఫ్‌లో ఉన్నాయి. మరో రెండింటి సిబ్బంది కరోనా వైరస్ మూలంగా బాధపడుతున్నారు. మిగిలిన ఒకటి అమెరికా తూర్పు తీరంలో ఉంది.
అమెరికా నౌకాదళపు బలహీన స్థితిని ఆసరాగా చేసుకుని, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో 90శాతం తమదేననే చైనా, ఇటీవల పెరకెల్ దీవుల (వీటిని చైనా గ్జిషా దీవులు అంటుంది) దగ్గర వియత్నాం చేపల పడవను ముంచేసింది. చైనా కోస్ట్ గార్డ్ నౌక నేరుగా వియత్నాం పడవపై దాడి చేసి ముంచేసింది. ఇటీవల కాలంలో అమెరికాకు దగ్గరవుతున్న వియత్నాంకు హెచ్చరికగా చైనా ఈ పని చేసి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో నిర్మించిన వివాదాస్పద సైనిక స్థావరాలలో కొత్తగా పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చైనా ప్రకటించింది కూడా.
గత జనవరి మాసంలో సైనిక రక్షణతో ఒక చైనా నౌక నతునా జలాల్లో ప్రవేశించడానికి ప్రయత్నించింది. అనేకసార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చైనా పడవలు ఇండోనేషియా జలాల్లో తిరుగుతూనే ఉన్నాయి. చైనా ధోరణితో విసిగిన ఇండోనేషియా ఎఫ్ 16 యుద్ధవిమానంతోపాటు ఒక యుద్ధ నౌకను మోహరించవలసి వచ్చింది.
హిందూ మహా సముద్ర జలాల్లో డ్రోన్‌లు
హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రాబల్యం పెంచుకోవాలన్నది చైనా చిరకాల కోరిక. ఈ ప్రాంతంలో తన నౌకదళ ప్రభావాన్ని పెంచుకునేందుకు అరేబియా సముద్రంలోని ఆడేన్ గల్ఫ్ హిందూ మహా సముద్రంలోని సోమాలియా తీరంలో పైరసీ వ్యతిరేక ఆపరేషన్‌లలో చైనా కూడా చేరింది. అంతేకాదు అధునాతన సబ్ మెరైన్‌లు, గైడెడ్ మిస్సిల్స్‌ను ధ్వంసం చేసే నౌకలు, తీరంలో ఉన్న నౌకలు, సబ్ మెరిన్‌లను ధ్వంసం చేసే యుద్ధ నౌకలను హిందూ మహా సముద్రంలో మోహారించింది. ఇలా పైరసీ నియంత్రణ ఆపరేషన్‌ల పేరు చెప్పి అధునాతన యుద్ధ నౌకలు, సబ్ మెరిన్‌లను మోహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొలంబో నౌకకేంద్రం దగ్గర సబ్ మెరిన్‌ను ఉంచడం, హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా తరుచూ చొరబాట్లకు పాల్పడటం వంటివి భారత్‌కు ఆందోళన కలిగించే విషయాలు.
జనవరిలో చైనా, పాకిస్తాన్‌లు అరేబియా సముద్రంలో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఈ విన్యాసాల్లో చైనా గగన రక్షణ వ్యవస్థను ఛేదించగలిగే తన సామర్ధ్యాన్ని, వివిధ యుద్ధ నౌకలను ప్రదర్శించింది. ఇటీవల కాండ్లా నౌకకేంద్రం మీదుగా పాకిస్తాన్‌లోని ఖాసిం నౌకకేంద్రానికి వెళుతున్న చైనా నౌక డై కుయి యూన్‌ను భారతీయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సుదూర లక్ష్యం ఛేదించే బాలిస్టిక్ మిస్సైల్‌లు, ఇతర జనహనన ఆయుధాల తయారీకి ఉపయోగించే పరికరాలు కనిపించాయి. దీనిని బట్టి పాకిస్తాన్, చైనాల మధ్య అణు సహకారం కొనసాగు తోందని మరోసారి స్పష్టమవుతోంది. అయితే ఈ మారణాయుధాల ముడిసరుకుల వివరాలు చెప్పని చైనా అవి పారిశ్రామిక పరికరాలంటూ బుకాయించాలని చూసింది.
భారత భద్రతకు ముప్పు కలిగించే విధంగా తాజాగా చైనా హిందూ మహా సముద్ర జలాల్లో 12 డ్రోన్‌లను మోహరించింది. సముద్రగని సమాచారాన్ని సేకరించేందుకేనని చెపుతోంది. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలు సాగించడానికి అన్నీ దేశాలకు అవకాశం ఉన్నా ప్రతి దేశం తమ జలాలను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటుంది. తమ జలాలలోకి ఇతర దేశాలకు చెందిన నౌకలు, డ్రోన్‌లు అనుమతి లేకుండా ప్రవేశిస్తే వాటిని నాశనం చేసే అధికారం కూడా ప్రతి దేశానికి ఉంటుంది. 2016లో దక్షిణ చైనా సముద్రంలో ఒక అమెరికా డ్రోన్‌ను ఇలాగే చైనా ధ్వంసం చేసింది. అయితే ఇప్పుడు హిందూ మహా సముద్రంలో చైనా చొరబాట్లు నిత్యకృత్యమయ్యాయి. డిసెంబర్ నెలలో ఈ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన చైనా యుద్ధ నౌకాలను భారత నావికా దళం తరిమివేసింది. చైనా కరోనా వైరస్‌తో భారత్ పోరాటం చేస్తున్న తరుణంలో భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించడమే కాక చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 21ఏళ్ల భారతీయ యువకుడిని అపహరించుకు పోయింది. ఈ సంఘటన చైనా దురాక్రమణ వ్యూహాన్ని మరోసారి బయటపెట్టింది.
భద్రతామండలిలో కరోనా మహమ్మారిపై చర్చలను అడ్డుకున్న చైనా
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అధ్యక్ష స్థానంలో ఉన్న చైనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న చైనా కరోనా వైరస్‌పై చర్చను అడ్డుకుంది. 2014లో ఎబోల వ్యాధి వ్యాపించి నప్పుడు భద్రతామండలిలో చర్చించినట్లు ఇప్పుడు కూడా చర్చించాలన్న ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. ఈ అంశం ‘భద్రతామండలి పరిధి, ఎజెండాకు మించినది’ అంటూ కుంటిసాకులు చెప్పింది. అంతేకాదు పాకిస్తాన్ కోరిక మేరకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి కశ్మీర్ విషయాన్ని మాత్రం ప్రస్తావించారు. కానీ మరోవైపు చైనా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో ప్రపంచ మంతటా కాల్పుల విరమణ పాటించాలన్న ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ పిలుపును తుంగలో తొక్కిన పాకిస్తాన్‌ను మందలించ కుండా చైనా జాగ్రత్తగా వ్యవహరించింది.
భద్రతామండలిలోని 10 తాత్కాలిక సభ్య దేశాల్లో 9 దేశాలు కోరడంతో తప్పనిసరి పరిస్థితిలో మండలి అధ్యక్షుడు కరోనా మహమ్మారిపై చర్చకు అనుమతించారు. ఆ సమావేశంలో మాట్లాడినా అమెరికా ప్రతినిది కెల్లీ క్రాఫ్ట్ ‘ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అందరికీ అందాలి. అందుకు అన్నీ దేశాలు సానుకూలంగా ప్రతిస్పందించాలి’ అంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వీటిని తిప్పికొడుతూ మహమ్మారి ‘ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య. దీనికి పరస్పర సహకారం, సహాయం అవసరం. అంతేగాని ఒక దేశాన్ని ఈ సమస్యకు బాధ్యురాలిని చేయకూడదు’ అంటూ బీజింగ్ ప్రతిస్పందించింది. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం రష్యా కూడా చైనానే సమర్ధించడంతో మహమ్మారి విషయంలో చైనా అనుసరించిన బాధ్యతారహితమైన వైఖరిని ఎండగట్టకుండానే ఆ సమావేశం చప్పగా ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా చైనా అనుసరిస్తున్న దౌత్యపరమైన బెదిరింపు వైఖరికి మరోసారి అన్నీ దేశాలు మౌనంగా తలవంచ వలసి వచ్చింది.