కొవిడ్ 19 మానవాళినే కాదు, ప్రపంచ వ్యాపార రంగాన్ని కూడా పునాదులతో సహా కదిలిస్తున్నది. ఇది భారత్‌కు కూడా వర్తిస్తుంది. ప్రాణాల కంటే వ్యాపార వాణిజ్యాలు ఎక్కువ కాదన్న దృష్టితో దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి కూడా తెలిసిందే. ఇదే దేశంలోని 70 శాతం వరకు వ్యాపారాల మీద తన ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం హెచ్చు స్థాయి నుంచి తీవ్ర హెచ్చు స్థాయికే ఉంటుందని కూడా భావిస్తున్నారు. అంటే ఈ ప్రభావం నుంచి తక్కువ నష్టంతో బయటపడే అవకాశమే లేదు. ఫిక్కి నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవం వెలుగు చూసింది. భారత పరిశ్రమల సమాఖ్య చేసిన మరొక సర్వే కూడా కొన్ని కీలకాంశాలను వెల్లడించింది. కేవలం 25 రోజులలో దేశంలో నిరుద్యోగం కొన్ని దశాబ్దాల వెనక్కి తీసుకుపోయింది. అయినప్పటికీ ప్రధాని, ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ కొనసాగింపు వైపు మొగ్గడం వారి వాస్తవిక దృష్టినే బహిర్గతం చేస్తున్నది. అలాగే ఒక మహా ఉత్పాతాన్ని పరిష్కరించే క్రమంలో మానవీయ కోణం లోపిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి. అందుకే పాక్షిక ఆంక్షల ఎత్తివేతను భారత ప్రభుత్వం, చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు స్వాగతిస్తున్నాయి.
లాక్‌డౌన్ ఫలితంగా కొన్ని సంస్థలలో 84 శాతం రాబడి తగ్గిపోయింది. ఇది చాలు మన ఆర్థిక గమనం ఎంత కుంటుపడిందో చెప్పడానికి. వచ్చే తొమ్మిది మాసాలకు గాని ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశం లేదు కాబట్టి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని 70 శాతం సంస్థలు చెప్పాయి. సర్వేలో పాల్గొన్న సంస్థలలో సగం వరకు ఉద్యోగుల, కార్మికుల వేతనాలలో కోత విధించక తప్పదని అభిప్రాయపడ్డాయి. ప్రతి నాలుగు సంస్థలలో మూడు ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి ఎదురవుతుందనే చెప్పాయి. ఇది వచ్చే కొన్ని మాసాలలోనే రూపు దాల్చే అవకాశమే ఎక్కువ. గడచిన కొన్ని వారాల నుంచి దేశంలో పడిపోయిన వ్యాపార లావాదేవీలు కనీవినీ ఎరుగనివని ఫిక్కి సర్వేలో కొన్ని సంస్థలు చెప్పాయి. ఇదే చాలా వాణిజ్య వ్యాపార సంస్థల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టింది. ధ్రువ ఎడ్వయిజర్స్ అనే సంస్థ ద్వారా ఫిక్కి ఈ సర్వేను నిర్వహించింది.
దేశ వ్యాప్తంగా ఉన్న 380 వ్యాపారాలపై ఆ సర్వే జరిగింది. అయితే ఈ విపత్తును ఎదుర్కొనడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు చాలవని 70 సంస్థలు అభిప్రాయపడ్డాయి. అయితే ఏడు శాతం సంస్థలు మాత్రం ఆ ప్యాకేజీలు సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పాయి. ఈ స్థితిలో మీరు ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారని ప్రశ్నించినప్పుడు పన్ను మినహాయింపు, ప్రోత్సాహకాలే ప్రస్తుత అవసరమని 44 శాతం వ్యాపార సంస్థలు సూచించాయి. రుణాల చెల్లింపు మీద మారటోరియం విధించాలని దాదాపు 30 శాతం వ్యాపార సంస్థలు కోరాయి.
లాక్‌డౌన్‌తో దేశం ఎదుర్కొంటున్న మరొక ప్రమాదకర సమస్య నిరుద్యోగం. ఇదొక పిడుగుపాటు వంటి పరిణామమే. నిరుద్యోగ సమస్య దేశానికి కొత్త కాకపోవచ్చు. కానీ ఇంతకాలం ఎన్నో ఒడిదుడుకుల మధ్య కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్న ఈ సమస్య లాక్‌డౌన్‌తో మళ్లీ కొన్నేళ్ల వెనక్కు దేశాన్ని తీసుకుపోయింది. ఇప్పుడు అసంఘటిత రంగమే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. లాక్‌డౌన్ సరిగ్గా ఈ రంగం మీద తన ప్రభావం తీవ్రాతి తీవ్రంగా చూపుతోంది. మార్చి 22 నుంచి లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం వెను వెంటనే వ్యవస్థల మీద కనిపించలేదు. ఏప్రిల్ ఆరంభం నుంచి తన ప్రతాపం ప్రదర్శించింది. దీనికి తోడు కొవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే కొద్దీ, దేశంలోని అన్ని రాష్ట్రాలలోను లాక్‌డౌన్ అమలు కఠినతరం కాసాగింది. ఫలితం నిరుద్యోగం మరింత వేగంగా పెరిగిపోయింది. కరోనా వైరస్ జాడలు ఆరంభమైన మార్చి మాసాన్ని తీసుకుంటే, ఆ నెల ఒకటో తేదీకి దేశంలో ఉన్న నిరుద్యోగం 7.91 శాతమని అంచనా. కానీ లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత ఏప్రిల్ 25 నాటికి, అంటే దాదాపు నెల రోజులకి అది 23.56 శాతానికి వెళ్లింది. ఇదే ఏప్రిల్ నెలాఖరుకు 26 శాతానికి ఎగబాకవచ్చునని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి సంస్థ అంచనా వేసింది. మార్కెట్ విలువలు పతనం కావడంతో నిరుద్యోగ సమస్య తీవ్రత ఎంత పెరిగిందో కూడా చూడాలి. ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 9 శాతంగా ఉన్న నిరుద్యోగం ఈ 25 రోజులలోనే 14 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాలలోను, పల్లె ప్రాంతాలలోను కూడా ఒకే రీతిలో నిరుద్యోగం శాతం పెరిగిపోవడం ఇంకా ఆందోళన కలిగిస్తున్నది. మార్చి ఒకటో తేదీ నాటికి పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం 8.63 శాతంగా ఉన్నది. 25 రోజులలో 25.46 శాతానికి పెరిగింది. పల్లె ప్రాంతాలలో అదే సమయంలో 7.58 శాతం ఉండగా మార్చి 25వ తేదీకి 22.71 శాతానికి చేరుకుంది. సేవారంగం, ఐటీ, రియల్ ఎస్టేట్, హౌస్‌హోల్డ్ సేవలు, భవన నిర్మాణం పనులు అన్నీ నిలిచిపోయాయి. వ్యవసాయం పనులకు కొంత వెసులుబాటు కల్పించినా అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం చతికిలపడిన రవాణా వ్యవస్థ. దీనికి తోడు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా రైతుల పరిస్థితిని మార్చేశాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రైతును ఆదుకొనడానికి, పంటను కొనుగోలు చేయడానికి పథకాలు చేపట్టామనీ, ప్యాకేజీలు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ఫలించడం లేదు. దీనితో చేతికి వచ్చిన పంటను కూడా అందుకోలేని దయనీయ పరిస్థితిలో రైతాంగం పడిపోయింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి ముఖ్యమంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ జరిపినప్పుడే దేశ పరిస్థితి గొప్ప ఇరకాటంలో ఉన్న మాట నిజం. రోజురోజుకూ పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు ఒకవైపు. లాక్‌డౌన్ కారణంగా రోజురోజుకూ కునారిల్లిపోతున్న ఆర్థిక వ్యవస్థ మరొకవైపు. అప్పటికే వలస కార్మికుల కదలికలు ఎక్కువయినాయి. ఇదే సాకుగా తీసుకుని కొన్ని విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని తమవంతు కృషి ఆరంభించాయి. కానీ ఎక్కువ మంది ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. ప్రధాని మీదే ఆర్థిక వ్యవస్థను కుదేలు కాకుండా చూసుకోవడమనే కీలక బాధ్యత ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాల రక్షణకే ఆయన మొగ్గుచూపారు. ఈ రెండు ఆశయాలను సమన్వయం చేయడానికి ఉపయోగపడే విధంగా ఆ సమావేశంలోనే సడలింపుల యోచన వచ్చింది. ఆ విధంగా కొన్ని పరిశ్రమలలో పని పునఃప్రారంభానికి అనుమతులు వచ్చాయి. కానీ పనివారి హాజరు పెద్ద సమస్యగా మారిందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) చేసిన సర్వే పేర్కొంటున్నది. ఈ సర్వేలో 180 కంపెనీలు పాల్గొన్నాయి. ఏప్రిల్ 23, 24 తేదీలలో సర్వే జరిగింది. అంటే ఆంక్షలు సడలించిన కొద్ది రోజులకు జరిగిన సర్వేగా చెప్పవచ్చు. ఉత్పత్తులకు ముడిపదార్థాలు సేకరించడం, సిద్ధమైన ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడం – రెండూ సమస్యగానే ఉన్నదని 60 శాతం పరిశ్రమలు చెబుతున్నాయి. కంటైన్మెంట్ అమలులో లేని ప్రాంతాలలో వాణిజ్యానికి అనుమతులు ఇవ్వాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. ఇందుకు అనుమతుల బాదరబందీ కూడా కఠినంగా ఉండరాదని భావిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే పాస్‌ల కోసం చూడకుండా, సంస్థలు ఇచ్చే అనుమతి పత్రాలతోనే పనివారు కర్మాగారాలకు, కార్యాలయాలకు వచ్చే ఏర్పాటు ఉండాలని కూడా కోరుతున్నాయి.
నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ దశల వారీగా ఆంక్షలను ఎత్తి వేస్తున్నది. మొదటిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న అత్యవసర ఉత్పత్తులు చేసే సంస్థల మీద ఆంక్షలు తొలగించారు. అలాగే భవన నిర్మాణం, ఐటీ పరిశ్రమ, హార్డ్‌వేర్ రంగాలలో కూడా పనుల పునరుద్ధరణకు అనుమతులు వచ్చాయి. అయితే, ఆంక్షలు తొలగించిన పరిశ్రమల జాబితాలోని 19 శాతం సంస్థలకు అనుమతులు రాలేదు. అనుమతులు లభించినా, అందులో జాప్యం జరిగిందని 27 శాతం సంస్థలు చెప్పడం విశేషం. కాగా, ఉత్పత్తయిన వస్తువుల రవాణా ఇంకా పెద్ద సమస్య. పనివారు, ముడిసరుకు సేకరణ, రవాణా క్లిష్టంగా తయారయింది. పనివారు తమ తమ సంస్థల వరకు వెళ్లడానికి ఉన్న ఇబ్బందులే పరిశ్రమల పునః ప్రారంభానికి, నిర్వహణకి పెద్ద సమస్యగా మారింది. అందుకే యాజమాన్యం తమ సొంత వాహనాలను నడపడానికీ, ప్రభుత్వం ఇచ్చే పాస్‌లతో ప్రమేయం లేకుండా, యాజమాన్యాలు ఇచ్చిన అనుమతి పత్రాలతోనే పనివారి రాకపోకలకు అవకాశం కల్పించాలని సిఐఐ సిఫారసు చేసింది. ఉత్పత్తులను సజావుగానే నిర్దేశిత ప్రాంతాలకు చేర్చగలిగామని కేవలం 15 శాతం సంస్థలే చెప్పగలిగాయి. ఉత్పత్తులను సిద్ధం చేసినప్పటికీ, పంపిణీలో జాప్యం తప్పడం లేదని 40 శాతం సంస్థలు తెలియచేశాయి. ఈ మాత్రం అవకాశం కూడా తమకు దక్కలేదని 30 శాతం సంస్థలు వెల్లడించాయి.
నిజానికి ఆంక్షల పాక్షిక తొలగింపుతో పునఃప్రారంభమైన సంస్థలలో కూడా పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు. పది శాతం సంస్థలు తమ సామర్థ్యంలో 50 శాతం కూడా పూర్తిగా వినియోగించు కోలేకపోతున్నాయి. తొమ్మిది శాతం కంపెనీలలో సగానికంటే ఎక్కువ మంది సిబ్బంది హాజరవుతున్నారు. ఆర్థిక వ్యవస్థను బతికించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవడం అధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశంలో సాధ్యం కాదు. కర్మాగారాలను, మార్కెట్లను స్వేచ్ఛగా వదిలిపెడితే వేలాది ప్రాణాలు గాలిలో కలసిపోతాయి. ప్రజల రాకపోకలకు వీలు కల్పించకపోతే ఆర్థిక వ్యవస్థ ఘనీభవించిపోతుంది. కానీ ఆర్థిక వ్యవస్థలో మందగమనం రాకుండా చూడడమే కీలకంగా భావించిన దేశం అమెరికా. అక్కడ లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ప్రవేశపెట్టకపోవడం వెనుక ఉన్నది ఆర్థిక వ్యవస్థకు పెద్ద పీట వేసిన ఫలితమే. కానీ అందుకు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఏప్రిల్ 27 నాటికి అక్కడ దాదాపు 55,000 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. కానీ భారత ప్రధాని మోదీ ఇందుకు భిన్నమైన వైఖరిని అవలంబించారు. ఆర్థిక వ్యవస్థ కొద్దికాలం తరువాత అయినా పుంజుకుంటుంది. కానీ కరోనా కట్టుతప్పడం, ఫలితంగా జరిగే అపార ప్రాణ నష్టం ఈ దేశంలో చాలా దారుణ పరిస్థితులను సృష్టిస్తుంది. అందుకే లాక్‌డౌన్ వైపే ప్రధాని, అధికశాతం ముఖ్యమంత్రులు మొగ్గు చూపారు. అందుకు తగినట్టే తక్కువ ప్రాణహాని జరిగింది. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని గుర్తిస్తూనే ఈ సమస్య పరిష్కారంలో మానవీయ కోణం కూడా అత్యవసరమని గుర్తించాలి.