‌భారత స్వాతంత్య్ర సమరానికి అనేక రూపాలూ, దశలూ ఉన్నాయి. చట్టబద్ధ  విధానాలతో ఉద్యమించిన సంస్థలూ, ఇంగ్లిష్‌ ‌రాజనీతి మీద విశ్వాసం లేక, బ్రిటిష్‌ ‌జాతి పాలనలోని దమననీతి మీద ఆగ్రహంతో హింసాయుత పంథాలో సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న సంస్థలు ఉన్నాయి. దేశం లోపల, విదేశాల కేంద్రంగా, ఇక్కడి కొండ కోనలలో గిరిజనులు, మైదానాలలో రైతులు కూడా బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్‌ ‌జరిపిన ఏకైక పోరాటంతోనే స్వాతంత్య్రం వచ్చిందన్న తీర్పు చారిత్రక దృక్పథంతో ఇచ్చినది కాలేదు.

దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ రాకకు ముందు కూడా ఇక్కడ స్వాతంత్య్రోద్యమం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్‌తో ప్రమేయం లేకుండా సాగిన సమరం ఉంది. తీవ్ర జాతీయత ఆధారంగా సాగిన ఉద్యమాలు కనిపిస్తాయి. పంజాబ్‌, ‌బెంగాల్‌, ‌మహారాష్ట్రతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలలో అలాంటి తీవ్ర జాతీయతను ప్రేమించినవారు కనిపిస్తారు. వారిలో ఒకరు డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలీరామ్‌ ‌హెడ్గేవార్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులుగా ఆయనకు ఉన్న ఖ్యాతి వెనుక భారత స్వాతంత్య్రోద్యమంలో  ఆయన నిర్వహించిన పాత్ర అజ్ఞాతంగా ఉండిపోయింది.

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర రచన అసంపూర్ణం. అలా అని ప్రజల హృదయాలలో చిరస్థానం అందుకుని, చరిత్ర పుటలకు మాత్రం చేరలేకపోయినవారు స్వాతంత్య్రం సమరానికి దూరంగా ఉన్నారని చెప్పడం ద్రోహం. ఎందరో త్యాగధనుల పేర్లు, గిరిజనోద్యమ నేతల పేర్లు, రైతాంగ ఉద్యమ నాయకుల పేర్లు చరిత్ర పుటలలో కనపించవు. ఇది చరిత్రరచనలో లోపం. స్వాతంత్య్రో ద్యమంలో డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌పాత్ర, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రమేయం విషయంలో ఇదే లోపం జరిగింది.

వైద్యవిద్య – అనుశీలన్‌ ‌సమితి

బెంగాల్‌ ‌విభజన జరిగిన నాటి నుంచే దాని ప్రకంపనలు దేశమంతటా వ్యాపించాయి. నాగ్‌ ‌పూర్‌లో అయితే కొందరు వంగదేశీయులు ఉండే వారు. అలాగే నాగ్‌పూర్‌కు చెందిన కొందరు జాతీయవాదులు బెంగాల్‌ ‌విప్లవకారులతో అప్పటికే సంబంధాలు కలిగి ఉండేవారు. చరిత్ర ప్రసిద్ధమైన అలీపూర్‌ ‌బాంబు కుట్ర కేసు నుంచి అనుశీలన్‌ ‌సమితి సభ్యులను రక్షించేందుకు నాగ్‌పూర్‌ ‌నుంచి నిధి పంపారు. భయ్యా సాహెబ్‌ అనే న్యాయవాది నూరు రూపాయలు ఇందుకోసం కేశవరావ్‌కు ఇచ్చినట్టు లిఖిత పూర్వక ఆధారాలు కూడా ఉన్నాయి.

 మెట్రిక్‌ ‌తరువాత వైద్య విద్య కోసం కలకత్తా వెళ్లారని సాధారణ సమాచారం ద్వారా తెలుస్తుంది. నిజానికి బెంగాల్‌ ‌వెళ్లి విప్లవకారులతో కలసి దేశ స్వాతంత్య్రం కోసం పని చేయాలని కేశవరావ్‌ ‌భావించారని చెప్పడం వాస్తవమనిపించు కుంటుంది. ఇందుకు నాగ్‌పూర్‌లో ఉన్న విప్లవకారుల బృందం కూడా ఆమోదించింది. నాగ్‌పూర్‌ ‌నుంచి కలకత్తా వెళ్లి అక్కడ అనుశీలన్‌ ‌సమితి నాయకుడు పులిన్‌ ‌బిహారీదాస్‌ను కలుసుకోవాలని కూడా నిర్ణయించారు. అదే సమయంలో మరొక ఉదంతం కూడా జరిగింది. రామ్‌లాల్‌ ‌వాజపేయి అమెరికా కేంద్రంగా భారత స్వాతంత్య్రోద్యమానికి విప్లవ పంథాలో సహకరించిన వ్యక్తి. ఆయన జీవిత చరిత్ర రాసుకున్నారు. ఈయన విదేశాలకు వెళ్లడానికి కొద్దిముందు నాగ్‌పూర్‌ ‌వచ్చి అజ్ఞాతంలో గడిపారు. ఆ ఏర్పాట్లు చేసిన వ్యక్తి కేశవరావ్‌. ఇక, కేశవరావ్‌ ‌కలకత్తా ఎలా వచ్చారో పులిన్‌ ‌తన జీవితకథలో రాశారు. దాదాజీ సాహెబ్‌ ‌బుటి అనే ఆయన చేసిన ఆర్థికసాయంతో కేశవరావ్‌ ‌కలకత్తా వచ్చి వైద్య కళాశాలలో చేరారని దాని సారాంశం. కలకత్తాకు బయలుదేరే ముందు కేశవరావ్‌ ‌డాక్టర్‌ ‌మూంజే ఇంటనే ఉండేవారు. కేశవరావ్‌ ‌కలకత్తా రాకలోని ప్రధాన ఉద్దేశం వైద్య విద్య కాదు. విప్లవ కార్య కలాపాలలో తర్ఫీదు పొందడానికే అని పులిన్‌ ‌కూడా రాశారు. 1910లో మూంజే ఇచ్చిన లేఖతోనే కేశవరావ్‌ ‌కలకత్తా వెళ్లారు. శాంతినికేతన్‌ ‌లాడ్జిలో ఉండేవారు. అప్పటికే విప్లవ కార్యకలాపాలతో ప్రసిద్ధులైన శ్యాంసుందర్‌ ‌చక్రవర్తి, మౌల్వీ లియాఖత్‌ ‌హుస్సేన్‌లతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఇందులో లియాఖత్‌ ‌హుస్సేన్‌ ‌తిలక్‌ ‌సిద్ధాంతాలను నమ్మిన ఉద్యమకారుడు.

నాగ్‌పూర్‌లోనే మొదలయిన నిఘా కలకత్తాలో కూడా కేశవరావ్‌ ‌మీద కొనసాగింది. గోపాల్‌ ‌వాసుదేవ్‌ ‌కేత్కర్‌ అనే నిఘా విభాగం ఉద్యోగి విద్యార్థి పేరుతో మొదట కేశవరావ్‌ ‌గదిలోనే ఉండేవారు. కేత్కర్‌ అసలు రూపం చిన్న ఉదంతంతో బయటపడి పోయింది. 1910 జూన్‌లో వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌సోదరుడు నారాయణరావ్‌ ‌సావర్కర్‌ ‌వైద్య విద్య కోసం కలకత్తా వచ్చారు. ఒకసారి దేనికోసమో వెతుకుతూ కేశవరావ్‌ ‌కేత్కర్‌ ‌సామాను కూడా వెతకవలసి వచ్చింది. అప్పుడే ఒక సందేశం ఉన్న కాగితం దొరికింది. ఎన్‌ఆర్‌ఎస్‌ (‌నారాయణరావ్‌ ‌సావర్కర్‌) ‌కలకత్తా వచ్చాడు. ఓ కన్నేసి ఉంచ వలసింది అన్నదే దాని సారాంశం. అప్పటికే అను శీలన్‌ ‌సమితి సాహిత్యం పంపిణీ చేసే పనిలో కేశవరావ్‌ ‌కీలకంగా ఉండేవారు. ఆయన రహస్య నామం ‘కొకెన్‌’. ఇదే సంస్థకు చెందిన త్రైలోక్యనాథ్‌ ‌చక్రవర్తి తదితరులు కలసి తీయుంచుకున్న ఒక ఫొటోలో కేశవరావ్‌ ‌కూడా ఉన్నారు.

1916లో వైద్యవిద్య పూర్తయింది. విశేషమైన శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు కేశవరావ్‌. ‌బ్యాంకాక్‌లో పని చేయడానికి ఆకర్షణీయమైన వేతనంతో అవకాశం కూడా వచ్చింది. కానీ వాటిన్నింటిని వదిలిపెట్టి నాగ్‌పూర్‌ ‌తిరిగి వచ్చేశారు. భావ్‌జీ కార్వే వంటి మిత్రులతో కలసి విప్లవ సంస్థను స్థాపించారు. దీని పేరే క్రాంతిదళ్‌. ‌క్రాంతిదళ్‌ ‌కూడా అనుశీలన్‌ ‌సమితి పంథాలోనే నడపాలని నిర్ణయించారు. అంటే ఆయుధాలు సేకరించి తెల్లజాతి ప్రభుత్వం మీద ఎక్కుపెట్టడమే. కార్వే, డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బెంగాల్‌ ‌తీవ్ర జాతీయవాదులతో పాటు పంజాబ్‌ ‌విప్లవ కారులతో కూడా సంబంధాలు పెట్టుకున్నారు. నాగ్‌పూర్‌, ‌వార్ధా జిల్లాల నుంచి 20 మందిని మధ్య భారత్‌లో విప్లవ కార్యకలాపాల నిర్వహణకు పంపించారు. గంగాప్రసాద్‌ ‌పాండే వీరి నాయకుడు.

దమననీతికి చిరునామాగా ఉండే ఇంగ్లండ్‌ ‌మీద మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918)తో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక అభిప్రాయం బలంగా ఉండేది. ఆ యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అయింది ఇంగ్లండ్‌. ‌గదర్‌వీరులు, చాలామంది ఇతర సంస్థల విప్లవకారులు ఆ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని దేశానికి స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని గట్టిగా ప్రయత్నిం చారు. డాక్టర్జీ కూడా ఇంగ్లండ్‌ ఆధిపత్యం మీద తిరుగుబాటుకు ఇది సరైన సమయమని భావించారు. మొదట ఈ అంశం గురించి తన పాత సహచరుడు డాక్టర్‌ ‌మూంజేతో చర్చించారు. కానీ ఆయన ఈ ఆలోచనను ఆమోదించలేదు. కానీ పూనాలో ఉన్న తిలక్‌తో కలసి చర్చించడానికి అవకాశం కల్పించా డాయన. ఈ ఇద్దరు వెళ్లి ఆయనతో చర్చించారు. తిలక్‌ ‌కూడా ఆ ప్రతిపాదన పట్ల సముఖత వ్యక్తం చేయలేదు. కొంత నిరాశపడిన మాట నిజమే అయినా, తిరిగి నాగ్‌పూర్‌ ‌చేరుకున్న డాక్టర్జీ శివాజీ పుట్టిన శివనేర్‌ ‌దుర్గాన్ని చూసి వచ్చారు. మళ్లీ ఆయనలో నూతన ఉత్సాహం వెల్లువెత్తింది. అంతేకాదు పంజాబ్‌, ‌రాజస్తాన్‌ ‌ప్రాంతాలలో పనిచేస్తున్న విప్లవకారులతో సంప్రదించి వారికి ఆయుధాలు సరఫరా చేసే పనిలో కొనసాగారు. సమన్వయం కోసం వారిని నాగ్‌పూర్‌ ‌రప్పించి బారాద్వారి, తులసీబాగ్‌, ‌సోనేగావ్‌ ‌మందిర్‌, ‌కల్నల్‌బాగ్‌, ఇం‌దోరామందిర్‌, ‌మొహితేవాడలలో రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. విప్లవ సాహిత్యం అందించే కార్యక్రమం ప్రధానంగా డాక్టర్జీ నిర్వహించేవారు. యవత్‌మల్‌కు చెందిన వామన్‌రావ్‌ ‌ధర్మాధికారి అనే ఒక విప్లవకారుడు నమోదు చేసిన ఒక అనుభవాన్ని ఇక్కడ ప్రస్తావించు కోవాలి. ధర్మాధికారి కూడా విదేశాల నుంచి భారత స్వాతంత్య్ర ఉద్యమానికి సహకరించారు. ‘1917-18 నాటికి సాయుధ విప్లవం ఆరంభించ డానికి సంసిద్ధులై ఉండాలని మమ్మల్ని డాక్టర్జీ కోరారు’ అని ఆయన రాసుకున్నారు. వామన్‌రావ్‌, ‌సతారాకు చెందిన మరొక కార్యకర్త గోవా, బొంబాయి తీరాలలో ఎనిమిది రోజులు ఆయుధాల నౌక రాక కోసం వేచి ఉన్నారు కూడా. వారి ఆశ నిరాశ అయింది. ఈ దశ తరువాత డాక్టర్జీ బహుముఖంగా ఆలోచించడం కనిపిస్తుంది.

హోంరూల్‌ ఉద్యమం

1916-1918 మధ్య హోంరూల్‌ ‌లీగ్‌ ఆశయంతో భారత జాతీయోద్యమం మలుపు తీసుకుంది. దీనికి అనీబిసెంట్‌, ‌బాలగంగాధర తిలక్‌ ‌నాయకులు. మోతీలాల్‌ ‌నెహ్రూ కూడా ఇందులో పనిచేశారు. బహుశా తిలక్‌ ‌మీద ఉన్న నమ్మకంతో డాక్టర్జీ కూడా హోంరూల్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. బేరార్‌లో తిలక్‌ ‌కోసం ఏర్పాటు చేసిన సభను ఆయన విజయవంతం చేశారు. ఈ ఉద్యమ సమయంలో డాక్టర్జీ వెంట ఉన్నవారు గంగాప్రసాద్‌ ‌పాండే, అప్పాజీ జోషి, బాబూరావ్‌ ‌హర్కారే, నానాజీ పౌరాణిక్‌. ‌జాతీయ కాంగ్రెస్‌లో ఆనాడు కూడా వర్గాలు ఉన్నాయి. అవి తిలక్‌, ‌గోఖలే కేంద్రబిందువు లుగా పని చేసేవి. ఇందులో తిలక్‌ ‌వర్గీయులు రాష్ట్రీయ మండల్‌ ‌పేరుతో సామాజిక, రాజకీయ చైతన్యం కోసం కార్యకలాపాలు నిర్వహించేవారు. నిజానికి హోంరూల్‌ ఉద్యమం ఆశయానికి ఇక్కడే గండి పడింది. బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంలో ఉంటూనే కెనడా, ఆస్ట్రేలియాల మాదిరిగా ప్రత్యేక ప్రతిపత్తిని కోరడం ఆ ఉద్యమం ఆశయం. కానీ తిలక్‌ ‌వర్గం మాత్రం తొందరలోనే సంపూర్ణ స్వాతంత్య్రం నినాదాన్ని తిరిగి అందుకుంది. హోంరూల్‌ ఉద్యమం చివరి అంచున గాంధీజీ యుగం ఆరంభ మైంది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారత్‌ ‌రాజకీయ వాతావరణం అనూహ్యంగా మారి పోయింది. 1919లో జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దురంతం అందుకు పరాకాష్ట. మహాయుద్ధంలో భారతీయుల సాయం పొందడానికి ఎన్నో హామీలు ఇచ్చిన ఆంగ్ల ప్రభుత్వం జలియన్‌వాలా బాగ్‌ ‌దురంతాన్ని కానుకగా ఇచ్చింది. ఆ సంవత్సరం డిసెంబర్‌లో జలియన్‌ ‌వాలాబాగ్‌ ఉన్న అమృత్‌సర్‌లోనే కాంగ్రెస్‌ ‌సభలు జరిగాయి. వాటికి డాక్టర్జీ హాజరయ్యారు. మరుసటి సంవత్సరం నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ ‌సభలను నిర్వహించాలని నిర్ణయించారు. వీటికి తిలక్‌ అధ్యక్షత వహించాలి.

కానీ, భారత స్వాతంత్రోద్యమంలో సిద్ధాంత పరమైన పెద్ద శూన్యానికి చోటు కల్పించి తిలక్‌ ‌జూలై 31, 1920న బొంబాయిలో కన్ను మూశారు. కాంగ్రెస్‌ ‌సభల నిర్వహణ సంఘంలో డాక్టర్జీ కీలకంగా ఉన్నారు. అందుకే డాక్టర్‌ ‌బాలకృష్ణ శివరాం మూంజే, డాక్టర్జీ కలసి పుదుచ్చేరి వెళ్లి అరవింద్‌ ‌ఘోష్‌ను కలుసు కున్నారు. తిలక్‌ ‌స్థానంలో ఘోష్‌ ‌నాగపూర్‌ ‌కాంగ్రెస్‌ ‌వార్షిక సభలకు అధ్యక్షత వహించాలని వారి ఆశయం. కానీ ఘోష్‌ ‌తిరిగి ప్రధాన స్రవంతి రాజకీయోద్యమంలోకి రావడానికి అంగీకరించలేదు. నిజానికి ఈ పరిణామం పైన చెప్పుకున్న సిద్ధాంత పరమైన లోటును మరింత పెంచింది. పదిహేను వందల మంది ప్రతినిధులు హాజరైన ఆ సభలలో డాక్టర్‌ ‌పరాంజపే, డాక్టర్జీ ఆహార, బస వ్యవస్థలను నిర్వహించారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆమోదం తెలిపిన సమావేశాలు ఇవే. నాగపూర్‌కు చెందిన కొందరు కార్యకర్తలతో కలసి డాక్టర్జీ సంపూర్ణ స్వరాజ్య కోసం తీర్మానం ప్రవేశపెట్టించవలసిందని గాంధీజీని కలసి కోరారు. కానీ సాధ్యం కాలేదు. ఇదే అంశం మీద మూడు మాసాల ముందు, సెప్టెంబర్‌లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక సమావేశా లలో చిత్తరంజన్‌దాస్‌ ‌సహాయ నిరాకరణను వ్యతిరేకించారు. మదన్‌మోహన్‌ ‌మాలవీయ, జిన్నా కూడా సందేహాలు వ్యక్తం చేశారు. కానీ నాగపూర్‌ ‌సదస్సులో గాంధీజీ సహాయ నిరాకరణతో సంవత్సరంలోనే స్వాతంత్య్రం సాధించవచ్చునని ఒక భ్రమాజనిత అంచనాను సభల ముందు ఉంచారు. దేశమంతా ఆయన వెంట కదిలింది. కానీ ఆయన ఖిలాఫత్‌ ‌పునరుద్ధరణను హిందూ ముస్లిం ఐక్యతకు సోపానంగా భావించారు. తన ఉద్యమంలో దీనిని కూడా భాగం చేశారు.

మారిన రాజకీయ వాతావరణం

అప్పటికి భారత జాతీయ కాంగ్రెస్‌ ‌మీద నిజానికి భారత జాతీయోద్యమం మీద గాంధీజీ ప్రభావం బాగా విస్తరించింది. అప్పటి దాకా విప్లవోద్యమాలలో పనిచేసిన వారు కొందరు గాంధీ పంథాలోకి వెళ్లారు కూడా. కొందరు గాంధీ పంథా మీద విరక్తితో ఇతర మార్గాలను అన్వేషించారు. ఇదీ వాస్తవమే. 1921లో (సహాయ నిరాకరణోద్యమం) డాక్టర్జీ మీద దేశద్రోహం కేసు నమోదైంది. కాబోల్‌, ‌భరత్వాడలలో ‘రెచ్చగొట్టే’ ప్రసంగాలు ఇచ్చినందుకు ఆ సంవత్సరం మేలో ఆయనను అరెస్టు చేశారు. జూన్‌ 14‌న విచారణ మొదలయింది. స్మెలే అనే న్యాయాధికారి ఎదుట తన కేసును తానే వాదించుకున్నారు. ఆగష్టు ఐదున తన ప్రకటన చదివి వినిపించారు.

నేను చేసిన ప్రసంగాలు దేశద్రోహానికి పురిగొల్పేవిగా ఉన్నాయని, ఈ చర్యకు సమాధానం చెప్పమని నన్ను అడుగుతున్నారు. ఈ విషయంలో ఒక విదేశీయుడు తీర్పు చెప్పడానికి కూర్చోవడం అంటేనే నా దేశ ఆత్మ గౌరవాన్ని బహిరంగంగా అవమానించడమేనని అనుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పడిందంటే, అలా అని ఎవరు చెప్పినా కూడా నేను తిరస్కరిస్తాను. ప్రస్తుత చట్టాలు, న్యాయస్థానాలు అలాంటి చట్ట వ్యతిరేక ప్రభుత్వ బానిసలు. భారతదేశం భారతీ యుల కోసం అన్న అభిప్రాయం నా దేశ ప్రజలలో పాదుకొల్పడానికి నేను ప్రయత్నించాను అని డాక్టర్జీ న్యాయస్థానంలో  చెప్పారు. భారతదేశం భారతీయు లది అందుకే మేం స్వాతంత్య్రం కోరుతున్నాం. నా ఉపన్యాసాల సారాంశం మొత్తం ఇదే. దేశానికి స్వాతంత్య్రం ఎలా సాధించాలో, వచ్చిన తరువాత దానిని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు చెప్పాలి. ఇలా చెప్పకపోతే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా మా ప్రజలు ఆంగ్లేయులను అనుకరిస్తారు. బ్రిటిష్‌ ‌జాతి చేస్తున్నదేమిటి? ఇతర దేశాలను అణచివేస్తారు. కానీ తన దేశ స్వాతంత్య్రం ప్రమాదంలో పడితే రక్తాన్ని చిందించేందుకు సిద్ధమవు తారు. ఒక దేశాన్ని పాలించే హక్కు మరొక దేశం వారికి సంక్రమింప చేసే చట్టం ఎక్కడైనా ఉందా? నేనొక ప్రశ్న అడుగుతాను. ఇలా చేయడం సహజ న్యాయమని అనిపించుకుంటుందా? మా దేశాన్ని తమ పాదాల కింద అణచివేసే అధికారం ఆంగ్లేయు లకు ఎవరు ఇచ్చారు? ఆంగ్లేయులు ఈ దేశం వారా? ఈ దేశం తమదని వాళ్లెలా చెప్పుకుంటారు? ఇది ధర్మం, నైతికత, న్యాయాలను పట్టపగలు హత్య చేయడం కాదా? అని న్యాయమూర్తిని నిలదీశారు డాక్టర్జీ.

ఈ దేశాన్ని ఆంగ్లేయులే పాలించాలని మేం కోరుకోలేం. బ్రిటన్‌ను బ్రిటిష్‌ ‌జాతి, జర్మనీని జర్మన్‌ ‌జాతి పాలించుకున్నట్టు భారతీయులు భారతదేశాన్ని పాలించుకోవాలి. ఇంకా బానిసత్వంలో, పరాయి పాలనలో మగ్గిపోవడానికి మా మనస్సాక్షి అంగీకరించడం లేదు… ఈ విధంగా సాగింది ఆయన వాదన. దేశద్రోహం కేసు కంటే దాని కోసం చేసిన వాదనే మరింత శిక్షార్హంగా ఉందని న్యాయ మూర్తి ఒక ఏడాది కఠిన కారాగారం విధించాడు. బెయిల్‌ ‌తీసుకోవడానికి డాక్టర్జీ నిరాకరించారు. ఏ చట్టం విదేశీయం అనుకున్నారో, అది మంజూరు చేసే బెయిల్‌ను స్వీకరించడం స్వవచన వ్యాఘాతమే అవుతుంది. ఆగస్ట్ 19, 1921‌న డాక్టర్జీని శిక్ష అమలు కోసం అజని కారాగారానికి తరలించారు. జూలై 22, 1922న ఆయన విడుదలయ్యారు. ఆ సాయంత్రమే ఆయనకు స్వాగతం పలుకుతూ బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేశారు. ఇందులో మోతీలాల్‌ ‌నెహ్రూ ప్రసంగించారు. ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ అతిథిగా ఉండడం తప్ప ఈ శిక్షతో తాను కొత్తగా సాధించింది ఏదీ లేదని డాక్టర్జీ సవినయంగా చెప్పడం విశేషం.

1930లో (అటవీ సత్యాగ్రహం) తొమ్మిది మాసాలు ఆయన కారాగారం అనుభవించారు. విదర్భ ప్రాంత సామాన్య ప్రజానీకం అడవుల మీద ఆధారపడి జీవనం చేసేది. కానీ ఆంగ్ల ప్రభుత్వం ఒక్కసారిగా అడవులలో ప్రవేశం మీద ఆంక్షలు విధించి, హింస ఆరంభించింది. దీనికి వ్యతిరేకంగా లోక్‌మాన్య బాపూజీ ఆణె అటవీ సత్యాగ్రహం ప్రారంభించారు. జూలై 10, 1930న ఈ ఉద్యమం ఆరంభమైంది. నిజానికి విదర్భ ప్రాంత జాతీయ కాంగ్రెస్‌ ‌నాయకులలో డాక్టర్జీ ఒకరు. 1930లో పూర్ణస్వరాజ్‌ ‌పిలుపు ఇచ్చినందుకు డాక్టర్జీ జాతీయ కాంగ్రెస్‌ ‌పట్ల గౌరవం పెంచుకున్నారు. సంపూర్ణ స్వరాజ్యమే తన అంతిమ ధ్యేయమని ఆ సంస్థ ప్రకటించి ఆనాడు దేశంలోని రాజకీయ కార్యకలా పాలను కాంగ్రెస్‌ ‌తన వైపు తిప్పుకోగలిగింది. ఆ సందర్భంలో ఐదేళ్లప్రాయం ఉన్న తన సంస్థ సభ్యులకు ఆయన ఒక లేఖ రాశారు. ‘స్వాతంత్య్రం తన లక్ష్యమని కాంగ్రెస్‌ ‌ప్రకటించింది. జనవరి 26, 1930న దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవలసిందని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ పిలుపునిచ్చింది. ఒక భారతీయ సంస్థ తన లక్ష్యానికి దగ్గరగా వస్తున్నందుకు మనమంతా సంతోషించడం సహజమే. ఇలాంటి ఆశయ సాధన కోసం పనిచేసే ఏ సంస్థకైనా సహకరించడం మన విధి. కాబట్టి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు అన్ని శాఖలలోను స్వయంసేవకులు మన గురువు, జాతీయ పతాకంగా మనం గౌరవించే కాషాయ పతాకానికి వందనం చేయాలి. స్వాతంత్య్రం అసలు అర్థం, దానిని కాపాడుకోవడం ఎలా అన్న అంశమే సారాంశంగా ఉపన్యాసాలు ఉండాలి. మనం కాంగ్రెస్‌ ‌నిర్దేశించు కున్న లక్ష్యాన్ని స్వాగతిస్తున్నాం కాబట్టి, ఆ సంస్థను అభినందించాలి. జరిగిన కార్యక్రమం గురించి నివేదిక పంపించవలసింది’ జనవరి 21, 1930న డాక్టర్జీ ఈ లేఖ రాశారు. అయితే కాషాయ ధ్వజానికి వందనం చేయవలసిందంటూ డాక్టర్జీ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్‌కు, కొన్ని సంస్థలకు రుచించలేదు.

స్వాతంత్య్రం సమరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పాత్రను అంచనా వేయడం అంత సులభం కాదు. భారత జాతీయ కాంగ్రెస్‌తో కలసి పనిచేయకపోతే స్వాతం త్య్రోద్యమంలో పాల్గొన్నట్ట్టు కాదన్న ఒక అభిప్రాయం అనాడు కనిపిస్తుంది. ఇదే చరిత్రకారులలో కొనసాగింది. సంస్థలే కాదు, వ్యక్తుల విషయంలో కూడా ఇలాంటి ఒక గట్టి అభిప్రాయాన్ని వెదజల్ల డంలో నాటి కాంగ్రెస్‌ ‌నాయకులు, తరువాత అదే పంథాలో చరిత్రకారులు తమ వంతు కృషి చేశారు.

చాలా సంస్థలతో పాటు స్వరాజ్య సమరంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ఆ ‌సంస్థ సర్‌సంఘ్‌ ‌చాలక్‌ ‌పాత్ర గురించి వాస్తవాలను కూడా పక్కన పెట్టినట్టు ఇప్పుడిప్పుడు రుజువవుతున్నది. నిజానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జాతీయ కాంగ్రెస్‌ ‌రాజకీయాలకు దూరంగా ఉండడమే కాదు, హిందూ మహాసభతో కూడా చిరకాలం కలసి పని చేయలేదన్న మాట వాస్తవం. మధ్య భారతంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో డాక్టర్జీ పాల్గొనడం ఉద్యమానికి ఊతమిచ్చిందని ఆ ప్రాంత హోం శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. మొదటి నుంచి డాక్టర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దిశ ఎట్లా ఉండాలో స్పష్టమైన అవగాహనతోనే ఉన్నారు. పూనా ఆందోళన సందర్భంగా (ఏప్రిల్‌ 8, 1940) ఆయన ఇచ్చిన ప్రకటన శిలాక్షరాలతో లిఖించదగినది. ‘(ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్ల) ద్వేషపూరిత ఆలోచన ఉన్నవారికి మొదట నేనొక విషయం స్పష్టం చేయదలి చాను. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల సైనిక పటాలం కాదు. హిందూ మహాసభ వారి సైనిక విభాగం కూడా కాదు. సంఘ్‌ ‌ప్రయత్న మంతా నిజమైన అర్ధంలో హిందువులను జాతీయ వాదులుగా రూపొందించడమే’ అని చెప్పారాయన. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఉద్యమిస్తున్న ఏ సంస్థకైనా విధానాన్ని బట్టి, సిద్ధాంతాన్ని బట్టి డాక్టర్జీ మద్దతు ఇవ్వడానికి వెనుకాడలేదు. అంటే కాంగ్రెస్‌ ఒక్కటే దేశం కోసం పోరాడుతున్నదన్న పాక్షిక దృష్టి ఆనాడే లేదన్నమాట. తమ విధానానికి, జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే ఆయా సంస్థలలో పని చేయడానికి సంస్థ కార్యకర్తలను ఆయన అనుమ తించారు. సత్యవ్రత్‌ ‌ఘోష్‌, ‌కాంచన్మయి మజుందార్‌ ‌నమోదు చేసిన ఒక అంశాన్ని ఇక్కడ పేర్కొనవచ్చు. త్రైలోక్యనాథ్‌ ‌చక్రవర్తి ఉదంతం ఆధారంగా ఈ ఇద్దరు రచయితలు ఈ అంశాన్ని ఉటంకించారు. ‘రాజకీయోద్యమాలలో ప్రత్యక్ష ప్రమేయాన్ని కఠినంగా నిరాకరించినప్పటికీ భారతదేశ సంక్షేమం వరకు ఆయా సంస్థలతో కలసి పని చేయడానికి తన కార్యకర్తలను  సంఘ్‌ అనుమతించింది. త్రైలోక్యనాథ్‌ ‌చక్రవర్తి (1889-1970) బెంగాలీ విప్లవకారుడు. స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ను కలుసుకున్నారు. ముందు ముందు చక్రవర్తి నిర్వహించబోయే విప్లవంలో పాల్గొనడానికి తమ కార్యకర్తలను అండగా పంపుతామని డాక్టర్జీ హామీ ఇచ్చారు’ (రిమెంబరింగ్‌ అవర్‌ ‌రివల్యూషనరీస్‌ – ‌మార్క్సిస్ట్ ‌స్టడీ ఫారమ్‌, 1994, ‌పే 57).

జాతీయ కాంగ్రెస్‌కు నాటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్ల ద్వేషభావమే ఉంది. తమ సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లో చేరబోరని 1934లో సంస్థ ఒక తీర్మానం చేసింది. అలా తీర్మానించిన నాలుగేళ్ల తరువాత, 1939లో బోస్‌ ‌తరచూ తన దూతలను డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌వద్దకు పంపేవారు. బహుశా సాయుధ తిరుగుబాటులో ఆయన సాయం కోసం అయి ఉండ వచ్చు అని మోడ్రన్‌ ‌రివ్యూ (మార్చి 1941)  పేర్కొన్నది. ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్‌ ‌కాంచన్మయి మజుందార్‌ ‌కూడా, ‘డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌తన 51వ ఏట నాగ్‌పూర్‌లో కన్ను మూశారు. ఆయనను చూడడానికి ఎస్‌ ‌సి బోస్‌ ‌నాగ్‌పూర్‌ ‌వెళ్లారు’ అని రాశారు. స్వాతంత్య్రోద్య మంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేరుగా పాల్గొనలేదు. కానీ కార్యకర్తలు ఉద్యమంలో వెనుకబడలేదు. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్‌ ‌నం. 2352-2158 ఇందుకు నిదర్శనం. ఇది డిసెంబర్‌ 12, 1932‌న జారీ అయింది. మధ్య భారత ప్రభుత్వం ఇలా నివేదించింది. ‘దేశంలో జరుగుతున్న రాజకీయో ద్యమం పట్ల ఇటీవల సంఘ్‌ ఆసక్తి చూపించడం ప్రారంభమయింది. ఈ మత సంస్థకు చెందిన కార్యక్రమంలో ప్రభుత్వోద్యోగులు పాల్గొనరాదు’ అన్నదే ఆ సర్క్యులర్‌ ‌సారాంశం. ఈ అంశం మీద డాక్టర్జీ పెద్ద అలజడే లేవదీశారు. చట్టసభ సభ్యులను కలసి ఒక సానుకూల అభిప్రాయాన్ని నెలకొల్పారు. చిత్రం ఏమిటంటే సంఘ్‌ ‌మత సంస్థ అంటూ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఈ ఆరోపణను నిరూపించుకోలేక పోయింది. సంఘ్‌, ‌దాని సిద్ధాంతం గురించి మార్చి 7, 8, 1934 సంవత్సరంలో సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌శాసనసభ చర్చించింది. ఏ ముస్లిం మత సంస్థ అయినా సంఘ్‌కు వ్యతిరేకమని తేలిందా? ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మత సంస్థ అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర రుజువు ఉందా? అంటూ ఎంఎస్‌ ‌రెహమాన్‌ అడిగిన ప్రశ్నకు సభా నాయకుడు రాఘవేంద్రరావు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారు. మార్చి 8, 1934న ప్రభుత్వం తన సర్క్యులర్‌ను ఉపసంహ  రించుకోవలసి వచ్చింది.

కీలక పరిణామాలు

 ముందు చెప్పినట్టు సంఘ్‌-‌స్వాతంత్య్రోద్యమం అన్న అంశాన్ని అంచనా వేయడం సులభం కాదు. ఇదొక ఉదాహరణ: జనవరి 31, 1934న పారిశ్రామికవేత్త జమ్నాలాల్‌ ‌బజాజ్‌ ‌నాగ్‌పూర్‌ ‌వచ్చి డాక్టర్జీని, డాక్టర్‌ ‌మూంజేని విడివిడిగా కలుసు కున్నారు. ఆ సమయంలో స్వాతంత్య్రోద్యమం గురించి డాక్టర్జీ ఇచ్చిన వివరణలో ఎంతో హేతు బద్ధత కనిపిస్తుంది. ‘సంఘ్‌ ‌రాజకీయాలకు దూరంగానే ఉంటుంది. ఇతర సంస్థల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి శత్రుభావం లేదు. అలాగే ఖాదీని కూడా సంఘ్‌ ‌వ్యతిరేకించదు. అంటరానిత నాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది’ అని చెప్పారాయన. ఇదొక వాస్తవిక ధోరణి. కాంగ్రెస్‌ ‌మాత్రమే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నదన్న అభిప్రాయం ఏనాడూ సరికాదు. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న 1934లోనే గాంధీజీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శిబిరానికి వచ్చారు. వార్థాలో గాంధీజీ సేవాగ్రామ్‌ ‌నివాసానికి సమీపంలోనే ఈ శిబిరం జరిగింది. అప్పాజీ జోషి వెళ్లి ఆహ్వానించారు. డిసెంబర్‌ 25, 1934‌న గాంధీజీ, ఆయన కార్యదర్శి మహదేవ దేశాయ్‌, ‌శిష్యురాలు మీరాబెన్‌ ‌కలసి ఆశ్రమానికి వచ్చారు. డాక్టర్జీ కలుసుకున్నారు. అంతా పరిశీలించారు. దాదాపు తన్మయుడయ్యారు.

 డాక్టర్జీ తరువాత గురూజీ సర్‌సంఘ్‌చాలక్‌ అయ్యారు. ఆయన కాలంలో కూడా స్వయంసేవక్‌లు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆగస్ట్ 16, 1942‌న చిమూర్‌ (‌మహారాష్ట్ర)లో జరిగిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో పలువురు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు పాల్గొన్నారు. దాదా నాయక్‌ అనే కార్యకర్తకు మరణశిక్ష పడింది. రామదాస్‌ ‌రాంపురే అనే కార్యకర్త పోలీసు కాల్పులలో మరణించాడు. అక్కడ క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి వ్యతిరేకంగా అల్లర్లు లేవదీసిన వారు తుకుడోజీ మహారాజ్‌ అని రాష్ట్ర పోలీసులు పంపిన నివేదికలో నమోదు చేశారు. డాక్టర్జీ మరణించిన రెండేళ్ల తరువాత హోం శాఖ పంపించిన ఒక నివేదికలోని అంశాలను గమనిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బ్రిటిష్‌ ‌వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. ‘కార్యకర్తలు (ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్య కర్తలు) సైన్యం, నావికాదళం, టెలిగ్రాఫ్‌, ‌రైల్వేలు, పరిపాలనా విభాగాలలోకి చొచ్చుకు పోయారు. సమయం అనుకూలించినప్పుడు పరిపాలనా విభాగాలను అదుపులోకి తీసుకోవడం వారికి పెద్ద కష్టం కాదు. ఈ సంస్థ తీవ్రమైన బ్రిటిష్‌ ‌వ్యతిరేకి. దాని అభిప్రాయాలలో రోజురోజుకీ తీవ్రవాదం పాలు పెరుగుతున్నది’ (అక్టోబర్‌ 13, 1943).

‌డాక్టర్జీ వంటి ఒక చైతన్యమూర్తి స్వాతంత్య్రోద్య మానికి దూరంగా ఉన్నారని ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రకటించడం తొందరపాటు. చరిత్ర రచనే సక్రమంగా లేని దేశంలో ఇలాంటి ప్రకటన పరమ దుర్మార్గం. స్వయం సేవకులు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పతాకం కింద ఉద్యమంలోకి రాలేదు. ఒకే లక్ష్యంతోనే అయినా రెండు మూడు పంథాలు ఉన్న ఉద్యమంలో ఒకే పంథాను సమర్థించడం సరైన నిర్ణయం కాదు. భగత్‌సింగ్‌ ‌మహోన్నత దేశభక్తులను ఉరి తీస్తుంటే తమ సంస్థకు సంబంధం లేనివాడన్నట్టు కాంగ్రెస్‌ ‌ప్రవర్తించడం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. చంద్రశేఖర్‌ ఆజాద్‌, అల్లూరి, బోస్‌ ‌వంటివారు ప్రాణత్యాగం చేస్తే అయ్యో అన్నవారు లేని కాలమది. అందరిదీ దేశభక్తే అని నిరూపించడం అనివార్యం. అందుకే నిజాయితీ కలిగిన అన్ని ఉద్యమ సంస్థల లోను ప్రవేశించడానికి డాక్టర్జీ అనుమతించారని భావించాలి.

సంప్రదించిన గ్రంథాలు, పత్రాలు:

1. ది సాఫ్రాన్‌ ‌సర్జ్: అన్‌టోల్డ్ ‌స్టోరీ ఆఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లీడర్‌షిప్‌

అరుణ్‌ ఆనంద్‌, ‌ప్రభాత్‌ ‌పేపర్‌ ‌బ్యాక్స్, 2019.

2.‌బిల్డర్స్ ‌మోడరన్‌ ఇం‌డియా, డాక్టర్‌ ‌రాకేశ్‌ ‌సిన్హా , పబ్లికేషన్‌ ‌డివిజన్‌, 2017.

3.‌డాక్టర్‌ ‌హెడ్గేవార్‌, ‌ది ఎపోక్‌ ‌మేకర్‌, ‌హెచ్‌.‌వి.శేషాద్రి, సాహిత్య సింధు, 1981.

4. యుగద్రష్ట డాక్టర్‌ ‌హెడ్గేవార్‌, ‌భండారు సదాశివరావు, 1989.

5.పెనుతుపానులో దీపస్తంభం, గోపాల్‌ ‌నీలకంఠ దాండేకర్‌,

6.‌వై ది ఆర్‌ఎస్‌ఎస్‌ అపోజెస్‌, అరుణ్‌ ఆనంద్‌, ‌ది సండే ఇండియన్‌, ‌మార్చి 12, 2020.

7. కేశవ బలీరామ్‌ ‌హెడ్గేవార్‌ అం‌డ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ ‌ది ఇండియన్‌ ‌ఫ్రీడం మూవ్‌మెంట్‌, అభిన వ్‌ ‌సింగ్‌, ‌జామియా మిలియా.  

ఫోటోలు:

1. హెడ్గేవార్‌ల స్వగృహం, నాగ్‌పూర్‌

‌2. డాక్టర్జీ చదువుకున్న ‘నేషనల్‌ ‌మెడికల్‌ ‌కాలేజి’

3. అన్న సీతారాంపంత్‌ ‌కుటుంబంతో డాక్టర్జీ (కుడిపక్క)

4. రఘూజీ భోంస్లే, లక్ష్మణ్‌రావ్‌ ‌భోంస్లే, డాక్టర్‌ ‌మూంజే

5. తొలినాటి స్వయంసేవకులతో డాక్టర్జీ, 1939

About Author

By ganesh

Twitter
YOUTUBE