– ఆయుష్ నడింపల్లి
భారతదేశ చరిత్రలో 1910 -1947 మధ్య కాలం మహోజ్జ్వలమైంది. ఎందరో మహానుభావులు స్వాతంత్య్రోద్యమం, సాంఘిక సంస్కరణలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యానికి ఎనలేని కృషి చేసిన కాలమది. కానీ జాతీయత పునరుద్ధరణ కోసం తాను నిర్మించుకున్న బాటలో అందరినీ నడిపించడమే కాక, నాటి మహానాయకులతో కలసి సమన్వయంతో పనిచేయడం డా. హెడ్గేవార్ ప్రత్యేకత.
సంఘ్ తప్పక వృద్ధి చెందుతుంది : గాంధీజీ
1921 గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమంలో, 1930 అటవీ సత్యాగ్రహంలో పనిచేయడానికి ముందే డా. హెడ్గేవార్‌కి గాంధీజీతో పరిచయం ఉంది. ఆగస్ట్ 19,1921-జూలై 12 ,1922, మళ్లీ జూలై 21,1930-ఫిబ్రవరి14,1931 మధ్య కాలంలో డా.హెడ్గేవార్ జైలు శిక్ష అనుభవించారు. మార్చ్18,1922న గాంధీజీకి ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. అప్పటినుంచి ప్రతినెలా 18 తేదీ, ఆయన పేరున ‘గాంధీ• రోజు’గా జరుపుకునేవారు. గాంధీజీ జైల్లో ఉండగా, చాలామంది నాయకులు తమ స్వప్రయోజనాలకు మాత్రమే ఉద్యమంలో ఉండేవారు. 1922 అక్టోబర్ గాంధీ రోజున డా. హెడ్గేవార్ మాట్లాడుతూ, ఈ రోజు పవిత్రమైన రోజు, మహాత్ముని జీవతంలో ఆయన పెంపొందించుకున్న విలువలు గుర్తు చేసుకుంటూ, ఆయన అనుయాయులు అందరూ ఆ విలువలను లక్షణా లను అలవరచుకుని పాటించాలని పిలుపునిచ్చారు. గాంధీజీని పుణ్యాత్ముడని పేర్కొంటూ, తాను నమ్మిన ఆదర్శాలకోసం, అన్నిటినీ వదులుకోగల త్యాగశీలి అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించిన తరువాత కూడా డా.హెడ్గేవార్ 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లారు. రెండుసార్లు మొత్తం 19నెలలు జైలుశిక్ష అనుభవించారు.
గాంధీజీ వార్థాలో జమ్నాలాల్ బజాజ్ ఇంట్లో బసచేసిన రోజుల్లో, డిసెంబర్ 25,1934న, ఆయన దగ్గరలోని సంఘ్ శీతాకాల శిబిరం సందర్శించి, స్వయంసేవకులతో సాదరంగా సంభాషించారు. అక్కడ కులమతభేదాలు లేకుండా, షెడ్యుల్డ్ కులాల సభ్యులతో సహా అందరూ సోదరభావంతో ఉన్నారని తెలుసుకుని ఆనందించారు. మర్నాడు డిసెంబర్ 26,1934, డాక్టర్జీ గాంధీజీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కులవివక్షలేని సంఘ్ కార్యకలాపా లను ప్రశంసించారు. ఆర్ధిక అవసరాలను తీరుస్తూ సంఘ్‌లో పాటించే గురుదక్షిణను మెచ్చుకుంటూ, కాంగ్రెస్‌లో కూడా ఎందుకు ప్రారంభించకూడదని అన్నారు. దానికి డాక్టర్జీ, ‘కాంగ్రెస్‌లో కార్యకర్తలంటే కుర్చీలు, జంపఖానాలు పరిచేవారు మాత్రమే. కాని సంఘ్‌లో నాయకులు, అనుచరులు అని రెండు శ్రేణులు లేరు. స్వయంసేవకులందరూ సమానమే. స్వీయ ప్రేరణతో దేశసేవే పరమావధిగా ఉంటార’ని తెలిపారు. కులవివక్ష•లేని సంఘ్ నిర్మాణం ఎలా సాధ్యమైందని గాంధీజీ అడిగితే, హిందువుగా జీవించడమే స్వయంసేవకులందరి ఏకైక జాతీయ అస్తిత్వం అనే విధంగా సంఘ్ ఏర్పరిచామని జవాబిచ్చారు. గాంధీజీ సంఘ్‌కి తమ ఆశీస్సులు అందించారు. తరువాత మళ్ల్లీ 1947లో దేశవిభజన నాటి విపత్కర విషాద పరిస్థితుల్లో, ఢిల్లీలోని ‘భంగి కాలనీ’లోని సంఘ్ శాఖని సందర్శించి, స్వయంసేవకులతో ముచ్చటించారు. సెప్టెంబర్ 27,1947నాటి‘హరిజన్’ పత్రికలో గాంధీజీ ఈవిధంగా రాసారు. చాలాకాలంక్రితం డా.హెడ్గేవార్ జీవించి ఉన్నకాలంలో జమ్నాలాల్ బజాజ్ వెంటరాగా, వార్థా ఆర్‌ఎస్‌ఎస్ శిబిరానికి వెళ్లాను. వారి క్రమశిక్షణ, సరళత, ఏమాత్రం అస్పృశ్యత లేకపోవడం నన్నెంతో ఆకట్టుకున్నాయి. సేవా తత్పరత, త్యాగం అనే ఆదర్శాలతో నెలకొల్పిన సంస్థ తప్పకుండా వృద్ధి చెందుతుంది’. (‘కంప్లీట్ వర్కస్ అఫ్ గాంధీ’, అధ్యాయం89, పేజీ 193-194)
అస్పృశ్యత లేని చోటు: డా.అంబేడ్కర్
‘హిందువుగా పుట్టినా, హిందువుగా మరణిం చను’ అని 1935లో డా. అంబేడ్కర్ అన్నమాట అందరికీ తెలుసు. ఆయనను హిందూ వ్యతిరేకి అని, బ్రిటిష్ పాలకుల చేతిలో పావు, అని అనడం సులభమే కాని, డా.హెడ్గేవార్ మాత్రం అంబేడ్కర్ మాటల వెనక ఉన్న హృదయ వేదనను అర్ధం చేసుకున్నారు. ఏప్రిల్ 21,1939న జరిగిన శిబిరంలో ఒక రోజుపాటు అంబేడ్కర్ డాక్టర్జీతో ఉన్నారు. ఉదయం, సాయంత్రం జరిగే శారీరక కార్యక్రమాలను గమనించారు. మధ్యాహ్నం జరిగే బౌద్ధిక్ (ఉపన్యాసం)లో డాక్టర్జీ కోరిక మేరకు ‘దళితులు – దళితోద్ధరణ’ అనే అంశంపై ప్రసంగిం చారు. డాక్టర్జీతో డా.అంబేద్కర్, ‘ఈ శిబిరంలో షెడ్యుల్డ్ కులాల సభ్యులున్నారా’ అని అడిగారు. అందుకు సమాధానంగా డా.హెడ్గ్గేవార్, ‘ఇక్కడ హిందువులున్నారు తప్ప, స్ప ృశ్యులు -అస్పృశ్యులు అని వేరువేరుగా ఎవరూ లేరని’ అన్నారు. డా. అంబేద్కర్ సభ్యులను విచారించి, అక్కడ చాలామంది షెడ్యుల్డ్ కులాల వారుండడమే కాక, సభ్యులంతా కులం అనే భావన లేకుండా, అంతా సమానంగా ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అదే సంవత్సరం చివులూన్ నుండి సతారా వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో స్థానిక సంఘచాలక్ ఆహ్వానం మేరకు కరాత్ గ్రామంలోని సంఘశాఖకు వచ్చారు. శాఖలోని స్వయంసేవకులను ఉద్దేశించి ఉపన్యసించారు. తర్వాత సంఘం అస్పృశ్యతను ఎలా మరిపిస్తున్నదో తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు.
సంఘ్ పాత్ర అద్భుతం: నేతాజీ
భారతజాతి సమైక్యత, దేశ స్వాతంత్య్రం ఒకే నాణానికి రెండు పార్శ్వాలు అని డా.హెడ్గేవార్ భావించేవారు. దేశ ఐక్యత కోసం పని చేస్తున్నా, స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఏనాడూ వదిలిపెట్టలేదు. 1928 కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో డా.హెడ్గేవార్ -నేతాజీ సమావేశమై, సంఘ్ లక్ష్యం-భారతదేశ పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. 1979 అక్టోబర్ ‘ఇటస్ట్రేటెడ్ వీక్లీ’ పత్రికలో హుద్దార్ ‘డా.హెడ్గేవార్ స్థాపించిన సంఘ్ ‘విప్లవ బృందాన్ని’ తలపింప జేస్తోందని, ఏకకాలంలో పలు విదేశాలనుంచి ‘భారత స్వాతంత్రాన్ని’ ప్రకటించే పథకం ఉండేదని, అయితే డా. బిఎస్.మూంజే సలహాతో ఆ ఆలోచన విరమించారని రాశారు. కాంగ్రెస్ నాయకుడు శంకర్రావు దేవ్‌కి లేఖ రాస్తూ, యువతకి శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడంలో సంఘ్ పాత్ర ఎంతో అద్భుతమని నేతాజీ ప్రశంసించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తరువాత కూడా డా.హెడ్గేవార్‌తో నేతాజీ సంప్రదింపులు కొనసాగిం చారు. అంతకుముందు సంఘ్ సర్‌కార్యవాహగా ఉన్న హుద్దార్, నేతాజీ బోస్ తరపున 1939లో డాక్టర్జీని కలిసారు. 20 జూన్ 1940 తేదిన అవసానదశలో ఉన్న డాక్టర్జీని చివరిసారిగా నేతాజీ కలిసి దర్శించుకున్నారు.
సంఘ్ హిందూ ఆశాజ్యోతి: సావర్కర్
‘మహరాట్ట’ అనే కలంపేరుతో, వీర్ సావర్కర్ మహద్గ్రంధం ‘ఎస్సెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ’, అండమాన్ జైల్లో రచించారు. దేశంలో అన్ని ప్రాంతాలకు, నాగ్‌పూర్ సహా ఆ గ్రంథాన్ని రహస్యంగా చేరవేశారు. సావర్కర్ తోటి నేత, బంధువు, ఈ పుస్తక ప్రచురణకర్త విశ్వనాథ్ వినాయక్ కేల్కర్, డాక్టర్జీకి సన్నిహిత మిత్రుడు. ఆ విధంగా డాక్టర్జీ ఆ పుస్తకం చదివారు. నారాయణ పాల్కర్ మరాఠీ లో రచించిన ‘డా. హెడ్గేవార్ జీవిత చరిత్ర’లో ఇలా రాసారు. ‘డాక్టర్జీకి తన మనస్సులోని హిందూ జాతీయత’- సావర్కర్ తార్కికంగా వ్యాఖ్యానించి రచించిన ‘హిందుత్వ’లో ఎంతో భావసారూప్యత కనిపించింది. ఆయనకు ఆ గ్రంథం ఎంతో ప్రేరణ ఇచ్చింది’. (పాల్కర్, నారాయణ-డా.హెడ్గేవార్’, భారతీయ విచార్ సాధన, పూణే. పేజీ 121)
వీర్ సావర్కర్, డా.హెడ్గేవార్‌కి పరస్పర గౌరవ భావం ఉండేది. అండమాన్ జైలు నుంచి సావర్కర్‌ను విడుదల చేయాలని డాక్టర్జీ తీవ్ర పోరాటం చేసారు. అక్టోబర్ 14,1923 నాగపూర్ కాంగ్రెస్ ర్యాలీలో ఆయన తమ ప్రసంగంలో, ‘14 సంవత్సరాల తరువాత వీర్ సావర్కర్‌ని విడుదల చేసినా, బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహిరించినట్లు కాదు’ అని అన్నారు.1937లో సావర్కర్‌ని రత్నగిరిలో బేషరతుగా విడుదల చేశారు. డాక్టర్జీ ఎంతో ఆనందంతో తన స్నేహితునికి, మీరెంతో అదృష్ట వంతులు, సావర్కర్ వంటి అసమాన దేశభక్తి కలిగిన మహానుభావుడిని కలుసుకున్నారు అని లేఖ రాసారు.
1937లో వీర సావర్కర్ పర్యటనలో నాగ్‌పూర్, చందా, వార్ధా, భండారా, అకోలా, ఉమ్రేద్ ఇంకా ఇతర ప్రాంతాల్లో, డాక్టర్జీ ఆయనతో కలిసి పర్యటించారు. సావర్కర్ ఎన్నో శాఖలను చూసారు. డిసెంబర్12 తేదీన నాగ్‌పూర్ శాఖలో సావర్కర్‌ను సన్మానించారు.‘హిందూ సంఘటన’ ఉత్సాహం, ధైర్యం చూసి సావర్కర్ ఎంతో మెచ్చుకుని, తమ ఆశీస్సులు అందించారు. ఈ యాత్ర గురించి డాక్టర్జీ రాస్తూ ‘ఈ పర్యటన సముద్ర మథనం’ లాంటిది. జనంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది’ అన్నారు. ఈ పర్యటన ప్రత్యక్ష సాక్షి సంఘ జ్యేష్ట కార్యకర్త శంకరరావు సముద్ర ఇలా గుర్తు చేసుకున్నారు. ‘‘స్వాతంత్య్ర వీర సావర్కర్ అకోలా పర్యటన సందర్భంగా డాక్టర్జీ ఉదయమే రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. స్వయంగా పూలదండ తీసుకుని, కంపార్ట్మెంట్ తలుపు తీసి, సావర్కర్‌కి సాష్టాంగప్రణామం చేశారు. దండ వేసి, సాదరంగా ఆహ్వానించారు. సంఘ్ స్థాపన ఉద్దేశాలు వివరించారు. సంఘ్ నిర్మాణం గురించి విని సావర్కర్ ఎంతో సంతృప్తి చెందారు. అపుడు డాక్టర్జీ ఇలా అన్నారు ‘‘తాత్యారావు, మీరు దార్శనికులు, మీరు దేశమంతా పర్యటించి ప్రేరణ కలిగించండి. విదేశీ పాలనలో ఉన్న హిందూ సమాజానికి మీ బోధన అవసరం, వారిని తట్టి లేపండి, మీ జీవితమే ఉదాహరణగా హిందూ జాతి ప్రతిఫలిస్తుంది. మేము ప్రారంభించిన ఈ చిన్న సంస్థ, అంకితభావంతో శక్తిమంతంగా దేశవ్యాప్తంగా పనిచేసే స్వయంసేవకుల కృషి వల్ల, స్వాతంత్య్రా నంతర భవిష్యత్తులో, ప్రపంచంలోనే హిందూ దేశం ఒక గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తుంది’’ అని అన్నారు. ఏప్రిల్ 2, 1938న డాక్టర్జీ నాసిక్ నుంచి నాగ్‌పూర్ తిరిగి వచ్చారు. ‘హిందూ యువక పరిషద్’కి అధ్యక్షుడిగా డాక్టర్జీని ఎన్నుకున్నామని తెలియచేస్తూ, ‘ధర్మవీర్ ఎల్బి భోపట్కర్’ ఉత్తరం డాక్టర్జీకి చేరింది. వెనువెంటనే వీర సావర్కర్ నుంచి ‘అధ్యక్షతకు ఒప్పుకోండి’ అని టెలిగ్రామ్ అందింది. సావర్కర్ టెలిగ్రామ్, వందలాదిమంది యువకులను కలిసే అవకాశం లభిస్తుంది. కాబట్టి, డాక్టర్జీ ఒప్పుకున్నారు. మే1,1938, పూణేలోని ‘తిలక్ స్మారక మందిరం’లో హిందూ యువక పరిషద్’ భారీ సమావేశం జరిగింది. వేదిక మీద వీర్ సావర్కర్, ఆయన సోదరుడు బాబారావు, డా.హెడ్గేవార్ ఇతర విశిష్ట వ్యక్తులు ఉన్నారు. సావర్కర్ తన ప్రసంగంలో, ‘భవిష్యత్తులో- హిందూదేశ’ రూపకల్పనకి, భావితరాలను తీర్చి దిద్దగలిగే ఆశాదీపం సంఘ్’ అని అభినందించారు. (పాల్కర్, నారాయణ-డా. హెడ్గేవార్’, పేజీ 321)
మహారాష్ట్ర ప్రాంత సంఘ్ రెండు రోజుల సమావేశం పుణేలో మే 11,1940న జరిగింది. డాక్టర్జీ, అప్పటి సర్‌కార్యవాహ గురూజీ దీనికి హాజరయ్యారు. మధ్యాహ్నం హఠాత్తుగా సావర్కర్ అక్కడికి వచ్చారు. డాక్టర్జీ పట్టుబట్టగా, సావర్కర్ ప్రసంగిస్తూ, ‘‘నేడు హిందూజాతి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఈ పరిస్థితిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒకటే మన ఆశాకిరణం. మేం జీవితంలో ఎన్నో ఉద్యమాలు నిర్మించాం. కానీ ఏవీ సంపూర్ణ ఫలితాలని ఇవ్వలేదు. కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను, సంఘ్ మాత్రమే ‘హిందూజాతి’ని నిర్మిస్తోంది’’ అన్నారు. (పాల్కర్, నారాయణ-డా. హెడ్గేవార్’, పేజీ 383).
డాక్టర్జీకి అవసానకాలం సమీపించిందని సావర్కర్‌కి టెలిగ్రామ్ అందింది. నాగ్‌పూర్ ప్రయాణానికి సిద్ధమవుతుండగా, డాక్టర్జీ ఇకలేరని మరో టెలిగ్రామ్ అందింది. సావర్కర్ ఎంతో విచారించారు. ‘‘డా.హెడ్గేవార్ మరణించారు, అయన అమరులు. డా.హెడ్గేవార్ మరణించారు, సంఘ్ చిరంజీవి’’ అని టెలిగ్రామ్ పంపించారు. (పాల్కర్, నారాయణ-డా.హెడ్గేవార్’,పేజీ.400) సావర్కర్, డా.హెడ్గేవార్లను రెండు శరీరాలు, ఒకే ఆత్మ’ అని వర్ణించవచ్చు.
వ్యాసకర్త : ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్
సంప్రదించిన గ్రంథాలు :
– డా.హెడ్గేవార్ చరిత్ర’ – శ్రీ నారాయణ (నానా) పాల్కర్
– డా. కేశవ్ బలిరాం హెడ్గేవార్’ – డా. రాకేశ్ సిన్హా
– సావర్కర్ సమగ్ర రచనలు
– ఆర్‌ఎస్‌ఎస్ సంగ్రహాలయం/ఆర్కైవ్స్