ప్రపంచాన్ని ఇంకా మభ్యపెట్టడమేనా ?

ప్రపంచాన్ని ఇంకా మభ్యపెట్టడమేనా ?

‘మందుకోసం వెళ్లినవాడు మాసికం నాటికి వచ్చాడ’ని తెలుగు సామెత. పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ నోటి నుంచి మార్చి 6వ తేదీన వెలువడిన ‘ఒప్పుకోలు’ వింటే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. జైష్‌ ఏ మహమ్మద్‌ ముమ్మాటికీ ఉగ్రవాద సంస్థ అని ఆయన ఇప్పుడు తీరికగా చెబుతున్నారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే ‘హమ్‌ న్యూస్‌’ సంస్థ పత్రికా రచయిత నదీమ్‌ మాలిక్‌కు ఫోన్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషార్రఫ్‌ చాలా విషయాలు అంగీకరించారు. ఐఎస్‌ఐ అనే పాకిస్తాన్‌ నిఘా వ్యవస్థ పాతకాల గురించి చెప్పారు. ఇండియా మీద జైష్‌ ఏ మమహ్మద్‌ చేత దాడులు చేయించింది ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌) అని కూడా అంగీకరించారాయన.

2003, డిసెంబర్‌ మాసంలో తన మీద జరిగిన హత్యాయత్నం జైష్‌ ఏ మమహ్మద్‌ పనేనని కూడా ముషార్రఫ్‌ వెల్లడించారు. సరే, మీరు అధికారంలో ఉండగా ఆ ఉగ్రవాద సంస్థను అదుపు చేసే యత్నం ఎందుకు చేయలేదని జర్నలిస్ట్‌ అడిగితే అందుకు ముషార్రఫ్‌, ‘అప్పటి పరిస్థితులు వేరు’ అని జవాబు దాటవేశారు. ముషార్రఫ్‌ 1999-2008 సంవత్సరాల మధ్య పాకిస్తాన్‌ అధ్యక్షునిగా అధికారం చెలాయించారు. ఇంతవరకు వెలువడిన పలు అధ్యయనాలను బట్టి 2008 సంవత్సరానికి, అంటే ముషార్రఫ్‌ పదవి నుంచి వైదొలిగే నాటికి, ఆ దేశానికి ఉగ్రవాదుల స్వర్గధామం అన్న పేరు ప్రపంచ వ్యాప్తంగా ఖరారైపోయింది. ఇందుకు ఎవరిని తప్పు పట్టాలి? ఎవరు బాధ్యులవుతారు?

చాలాకాలంగా, నిజానికి 2008 ప్రాంతం నుంచి భారత్‌తో పాటు ఇరాన్‌, ఆఫ్గన్‌, అమెరికా, బ్రిటన్‌ దేశాలు పాకిస్తాన్‌ మీద ఒకే విధమైన ఆరోపణ చేస్తున్నాయి. ఆ దేశం ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందన్నదే ఆ దేశాల ఆరోపణ. పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దు లోయలలోని గిరిజన ఆవాసా లన్నీ ఉగ్రవాదులకు స్వర్గధామాలుగా అలరారు తున్నాయని పాశ్చాత్య మీడియా, అమెరికా రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. సాబాన్‌ సెంటర్‌ ఫర్‌ మిడిల్‌ ఈస్ట్‌ పాలసీ, బ్రూక్‌లింగ్స్‌ కూడా 2008 నాటికి పాకిస్తాన్‌కూ, ఉగ్రవాదులకూ మధ్య ఉన్న అనుబంధం ఏ స్థాయికి చేరుకుందో చెప్పింది. ప్రపంచం మొత్తం మీద ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న దేశం ఏదీ అని ఎవరైనా అడిగితే అది పాకిస్తాన్‌ అని చెప్పవచ్చునని ఆ సంస్థ నిర్ద్వంద్వంగా పేర్కొన్నది. ఇదే విషయాన్ని ఎందరో మేధావులు, జర్నలిస్టులు రాశారు కూడా. ప్రముఖ పాకిస్తాన్‌ పత్రికా రచయిత అహమ్మద్‌ రషీద్‌ కూడా సరిగ్గా అలాంటి వ్యాఖ్య చేయడం గమనార్హం. ‘టెడ్‌ గాలెన్‌ కార్పెంటర్‌’ అన్న తన పుస్తకంలో ఆయన ‘తాలిబన్‌లకు, కశ్మీర్‌ తిరుగుబాటుదారులకు ఐఎస్‌ఐ మద్దతు కొనసాగి స్తున్నది’ అని రాశారు. అల్‌ కాయిదా, లష్కర్‌ ఏ ఒమర్‌, లష్కర్‌ ఏ తాయిబా, జైష్‌ ఏ మహమ్మద్‌, సిపహ్‌ ఏ సాహబా, జైష్‌ ఉల్‌ అద్‌ వంటి ఉగ్రవాద సంస్థల చిరునామా పాకిస్తాన్‌ అని అందరికీ తెలిసి పోయింది.

ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణి మీద జైష్‌ ఏ మహమ్మద్‌ దాడి చేసి ఘోర తప్పిదానికి పాల్పడింది. ఈ సంస్థను పెంచి పోషిస్తున్నది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్‌ అందుకు ఫలితం అనుభవిస్తున్నది. మీ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల పట్ల అర్థవంతమైన చర్యలు తీసుకోవలసిందని, అవి స్థిరంగా కూడా ఉండాలని అమెరికా ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పింది. పుల్వామా దాడి తదనంతర పరిణామాలు పాక్‌ కొనితెచ్చుకున్న కష్టాలు. భారత్‌కు నలభయ్‌ దేశాలు మద్దతు పలికాయి. ఈ క్లిష్టదశలో పాకిస్తాన్‌ తన దేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద తప్పనిసరి పరిస్థితులలోనే దాడులు ఆరంభించింది. అంతర్జా తీయ సమాజం ఒత్తిడితోనే ఈ కొన్ని చర్యలనైనా ఆరంభించింది. జైష్‌ ఏ మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ సోదరుడు ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ను అరెస్టు చేశారు. ఇతడేమీ అమాయకుడు కాదు. రవూఫ్‌ కూడా ఉగ్రవాదే. అన్నగారి అడుగు జాడలలో నడుస్తున్నవాడే. అనుమానిత ఉగ్రవాద సంస్థల సభ్యులని చెబుతూ మొదటి దశలో అరెస్టు చేసిన 44 మందిలో అతడు కూడా ఉన్నాడు. ఇటీవల భారత్‌ పంపించిన ఉగ్రవాదుల జాబితాలో ఇతడి పేరు కూడా ఉంది. అరెస్టయిన వారిలో మసూద్‌ కుమారుడు హమ్మద్‌ కూడా ఉన్నాడని పాకిస్తాన్‌ మంత్రి చెప్పారు. అయితే ఈ అరెస్టులు చట్టబద్ధంగా జరగలేదనీ, ఇప్పటికీ పాక్‌ అంతర్జాతీయ సమాజాన్ని మభ్య పెడుతోందనీ భారత్‌ ఆరోపిస్తున్నది.

పుల్వామా దాడి తరువాత ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల మీద చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. మీ దేశంలో తిష్ట వేసి ఉన్న ఉగ్రవాదుల నిర్మూలనకు శాశ్వత చర్యలు, పటిష్టమైన చర్యలు తీసుకోక తప్పదని యూరోపియన్‌ యూనియన్‌ కూడా పాకిస్తాన్‌ను తీవ్ర పదజాలంతో హెచ్చరించింది.

నిషేధిత సంస్థలకు చెందిన సభ్యులని చెబుతున్న 121 మందిని అరెస్టు చేశామని పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. 180 మత విద్యా సంస్థలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఆ దేశం ప్రకటించింది. వందమందికి పైగా వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.

పాక్‌లో తిష్టవేసి ఉన్న ఉగ్రవాదుల నిర్బంధం గురించి, ఉగ్రవాద సంస్థలపై చర్యల గురించి అమెరికా పుల్వామా దాడి తరువాత రోజు నుంచి పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూనే ఉంది. కానీ పాకిస్తాన్‌లో ఎటువంటి వ్యవస్థీకృత ఉగ్రవాద సంస్థ పనిచేయడం లేదని అమెరికాలో పాకిస్తాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌ అడ్డంగా బొంకడం ఒక విచిత్ర పరిణామం. అలాగే జైష్‌ ఏ మహమ్మద్‌ సంస్థ తమ దేశంలో లేనేలేదని పాకిస్తాన్‌ సైన్యం కూడా అదే రోజు (మార్చి 5)న ప్రకటించడం ఇంకొక విచిత్రం. ఆ సంస్థను తమ దేశమే కాకుండా, ఐక్యరాజ్య సమితి కూడా నిషేధించిందని సైన్యం అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. కానీ ఆ సంస్థ అధిపతి మసూద్‌ పాకిస్తాన్‌లోనే ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మహమూద్‌ ఖురేషీ చెప్పడం విశేషం కదా! పాకిస్తాన్‌ ఇప్పటికీ ఉగ్రవాదుల పట్ల మొక్కుబడి చర్యలు మాత్రమే తీసుకుంటున్నదని చాలా దేశాలు, ముఖ్యంగా భారత్‌ అనుమానిస్తున్నాయి. ఈ అనుమా నాలకు ఆధారం లేదని మాత్రం పాక్‌ చెప్పలేదు.

ఇలా ఉండగా ఐక్య రాజ్యసమితి రూపొందించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించవలసిందిగా జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీస్‌ సయీద్‌ పెట్టు కున్న విన్నపాన్ని ఐక్య రాజ్య సమితి భద్రతామండలి మార్చి ఏడున తోసి పుచ్చింది. ఈ విన్నపం పట్ల భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కూడా నిరాకరించాయి. కానీ ఈ విన్నపాన్ని పాకిస్తాన్‌ నిరాకరించలేదు. ఈ ధోరణి వెనుక ఏం ఉందో ఊహించడం కష్టం కాదు. సైన్యం గీసిన గీతను పాకిస్తాన్‌ ప్రభుత్వం దాట లేదు. లాహోర్‌లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని, దానికి అనుబంధంగా పనిచేసే పాలాహ్‌ ఇ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌ను పాకిస్తాన్‌ ప్రభుత్వం మూసి వేసింది. హఫీజ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించడానికి ఫ్రాన్స్‌ కూడా వ్యతిరేకమే. హఫీజ్‌ 23 దేశాలలో విధ్వంసం సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2008 నాటి 26/11 బొంబాయి దాడుల సూత్రధారి కూడా ఇతడే. ఆ దాడులలో 166 మంది చనిపోయారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తన 1267 తీర్మానంలో ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంది. ఆ జాబితా నుంచి తన పేరును తొలగించవలసిందని హఫీజ్‌ 2017లో విన్నవించాడు. తన పేరును ఆ జాబితా నుంచి ఎందుకు తొలగించాలో అతడు రెండు కారణాలు చూపించాడు. మొదటిది – అతడికి లష్కర్‌ ఏ తాయిబాతో ఎలాంటి సంబంధం లేదు.అది అతడి స్వీయ ప్రకటన. దీనిని ఐరాస నమ్మాలి. రెండు- అతడు నిర్దోషి అని పాక్‌ కోర్టులు ముక్తకంఠంతో పలికాయి. ఈ ఆధారాలను ప్రపంచం నమ్మాలని హఫీజ్‌ కోరిక.

పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్‌ మీద ఒత్తిడి తెస్తున్న దేశాలలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. తరువాత ఇరాన్‌ కూడా తీవ్ర స్థాయిలోనే ఆ దేశం మీద చర్యలకు పట్టుపడుతోంది. ఉగ్రవాదం అణచివేతలో పరస్పరం సహకరించుకోవాలని ఈమధ్యనే భారత్‌, ఇరాన్‌ ఒక అంగీకారానికి కూడా వచ్చాయి. ఆఫ్గన్‌ కూడా పాక్‌ బాధిత దేశమే. ఇటీవలనే ఆ దేశ నిఘా విభాగం మాజీ అధిపతి రహంతుల్లా రబిల్‌ ఐఎస్‌ఐ మీద తీవ్ర ఆరోపణ చేశారు. పాకిస్తాన్‌కు ఇరుగు పొరుగున ఉన్న దేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే 45 నుంచి 48 సంస్థల వరకు ఐఎస్‌ఐ ఆశ్రయం కల్పిస్తున్నదని రబిల్‌ చెప్పారు. బాలాకోట్‌ దాడిని భారత్‌ ఇంతకు చాలా ముందే చేసి ఉండవలసిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. జైష్‌ అల్‌ అది అనే ఉగ్రవాద సంస్థ ఇరాన్‌కు పెద్ద బెడదగా మారింది. ఈ సంస్థకు మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్‌ భవిష్యత్తులో గట్టి మూల్యమే చెల్లించుకోక తప్పదని ఆ దేశ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాదుల ఆచూకీ పాకిస్తాన్‌కు తెలియదంటే నమ్మడం సాధ్యం కాదని కూడా వారు అంటున్నారు. అసలు పాక్‌తో తమ సరిహద్దు వెంబడి గోడ నిర్మించాలని భావిస్తున్నట్టు ఆ దేశ విదేశ వ్యవహారాల శాఖ తెలియచేసింది. పాక్‌ పట్ల ఇరాన్‌ అంత మంటతో ఉంది. సరిహద్దు లలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ నివారించలేకపోతే, తామే పాకిస్తాన్‌లో ప్రవేశించి ఆ పని చేస్తామని కూడా ఆ దేశం హెచ్చరిస్తున్నది. అణ్వాయుధాలు కలిగిన దేశంగా చెప్పుకునే ఆ కొన్ని వందల మంది ఉగ్రవాదులను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నదని కూడా ఇరాన్‌ ప్రశ్న.

కశ్మీర్‌ లేని పాకిస్తాన్‌ను ఊహించలేమని మసూద్‌ వంటి ఉగ్రవాదులు ప్రజలను రెచ్చగొట్టే పని చేయడంలో ఆశ్చర్యం ఉండదు. కానీ ప్రజా ప్రభుత్వాలు కూడా ఉగ్రవాదులకు వంత పాడడం విషాదం. కశ్మీర్‌ అంశంతోనే పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడం ఒక సంప్ర దాయంగా మారిపోయింది. కానీ కశ్మీర్‌ను వదులు కోవడానికి భారత్‌ సిద్ధంగా లేదు. అయినా పోరాటం సాగుతుందంటూ ఉగ్రవాదులను ప్రేరేపిస్తే ప్రపంచ దేశాలు ఎక్కువ కాలం మౌనంగా ఉండిపోవు. పైగా కశ్మీర్‌ కోసం పోరాటం ఒక లౌకిక ఆశయంతో చేస్తున్నది కాదు. అక్కడ ముస్లింలు ఎక్కువ కాబట్టి అది పాకిస్తాన్‌కు చెందాలని వాదించడం అర్థరహితం. మతం ఆధారంగా విధ్వంసాన్ని, రక్తపాతాన్ని సృష్టించడం అనాగరికం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ నియంత హిట్లర్‌ సరిగ్గా ఇలాంటి వాదనే లేవదీశాడు. పోలెండ్‌ కారిడార్‌లోని జర్మన్లకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఆ దేశం మీద యుద్ధానికి దిగుతానని వచ్చాడు. అది ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. అప్పటికే ఉన్న ఉద్రిక్తతలు అందుకు దోహదం చేశాయి. చైనాలో కొన్ని ప్రాంతాలలో ముస్లింలు అధికంగా ఉన్నారు. అంత మాత్రం చేత ఆ ప్రాంతాలు కూడా మావేనని పాకిస్తాన్‌ అంటే ఆ దేశం ఊరుకుంటుందా? పైగా చైనాలో కంటే భారత్‌లో ముస్లింల పరిస్థితి మెరుగ్గానే ఉంది. పాక్‌ వంటి వ్యాధి గ్రస్థ దేశం ప్రేరేపించ కుండా ఉంటే ఇక్కడి ముస్లింలు మరింత మెరుగ్గా దేశంలో అంతర్భాగమవుతారు.

ఈ అంశం మొత్తం పరిశీలిస్తే ఒక అంశం అర్థమవుతుంది. ముషార్రఫ్‌ ప్రకటనతో ఈ కోణమే ప్రపంచం దృష్టికి తప్పక రావాలి. పాకిస్తాన్‌ సైన్యం మీద ఎవరికీ అదుపు లేదు. అంటే ప్రజాప్రభుత్వానికి అక్కడ విలువ లేదు. అలాగే ఐఎస్‌ఐ. దీనిని ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నదా? ప్రభుత్వాన్ని ఇది శాసిస్తున్నదా? ఆఖరికి ఉగ్రవాదుల మీదనైనా పాకిస్తాన్‌ ప్రభుత్వానికి అదుపు ఉన్నదా? చివరి ప్రశ్న కీలకమే. కానీ సైన్యం మద్దతు ఉన్నప్పుడు ప్రభుత్వం మద్దతు పెద్దగా లెక్కలోకి రాదు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న పరిస్థితి ఇదే. ఈ విషయం ముషార్రఫ్‌ కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *