నీటి బొట్టు – ముందు తరాలకు మెట్టు

నీటి బొట్టు – ముందు తరాలకు మెట్టు

మార్చి 22 ప్రపంచ జలదినోత్సవ ప్రత్యేకం

జలం.. జీవం.. జగం..

జలం లేనిదే జీవం లేదు, జీవం లేనిదే జగమే లేదు..

అంటే ఈ జగంలో జీవం ఉండటానికి జలమే కారణం.

జీవులకు జలం ఎంత ప్రధానమైనదో ఈ వాక్యాలు చూస్తే తెలుస్తోంది.

ప్రకతిలో పంచభూతాలైన భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని మానవాళి మనుగడకు అత్యంత ముఖ్యమైనవి. ఇందులో జల ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిండి లేకుండా కొన్ని వారాలైనా మనిషి బ్రతకగలడు, కానీ నీరు లేకుండా ఉండలేడు. మనిషికే కాదు భూమిపై ఉన్న సకల జీవరాశికీ నీరే ఆధారం.

మొట్టమొదట జీవరాశి పుట్టింది నీటిలోనే. జీవరాశి మనుగడ సాగేది నీటి జాడలు ఉన్న ప్రదేశాల్లోనే. అప్పటి సింధు, హరప్పా మొహంజొ దారో వంటి అనేక పేరుపొందిన నాగరికతలతో పాటు ఇప్పటి అనేక అభివృద్ధి చెందిన నగరాలు, దేశాలన్నీ ఎక్కువశాతం నదీతీరాలు, సముద్ర తీరాలు వంటి నీటి వనరులున్న ప్రదేశాల్లోనే వెల్లి విరుస్తున్నాయి.

మన భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్పం. శుభ్రమైన నీరు అంటే తాగు, సాగు నీరు అని అర్థం. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు. ఈ 2.7 లోనూ 75.2 శాతం మంచురూపంలో ఉంటే, మరో 22.6 శాతం భూగర్భంలో ఉంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో ఉంటుంది. సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు ఉపయోగ పడగలిగిన నీరు చాలా కొద్ది పరిమాణమే.

ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే పరిశుభ్రమైన నీటిలో 1 శాతం కంటే కూడా తక్కువ పరిమాణంలో (భూమిపై లభించే మొత్తం నీటిలో దాదాపు 0.007 శాతం) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతున్నది. ప్రతిరోజూ ఒక మనిషికి కనీసం 30 నుండి 50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షిత మైన నీరు అవసరం. కానీ ఇప్పటికీ ప్రపంచంలోని 88.4 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

భూమి ఏర్పడినప్పుడు ఎంత సురక్షిత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరగడం కానీ తరగడం కానీ లేదు. కానీ ఆ నీటిని వాడుకునే జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం పాట్లుపడాల్సి వస్తోంది.

నీటికి ఒక రోజెందుకు?

మనం ప్రతీ సంవత్సరం పండుగలు, ఉత్సవాలు జరుపుకుంటాం. సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు, సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. ఏది చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే.

నీరు లేని భూమిని ఊహించుకుంటే ఎలా ఉంటుంది? జీవులు, పచ్చని చెట్లు, నదులు, సముద్రాలు ఏమీ ఉండవు. ఎర్రటి ఎడారిలా ఉంటుంది. ఆకాశం నుండి చూస్తే భూమి మండుతున్న మరో అగ్నిగోళంలా ఉంటుంది. ప్రస్తుతం భూమిపై కనిపిస్తున్న జీవరాశికి, పచ్చదనానికి, చల్లదనానికి, ఇక్కడి నివాసయోగ్యానికి నీరే కారణం. అంతటి అమూల్య మైన నీటి విలువను తెలుసుకోడానికి, దాని వృథా పట్ల అవగాహన కల్పించడానికి ఒక రోజును ఐక్యరాజ్యసమితి కేటాయించింది. నీరు విషయంలో రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మనిషి నీరు ప్రవహించే కాలువలు, నదులు, సముద్రాలలో చెత్త వేయడం, పరిశ్రమల నుండి విడుదలయ్యే ప్రమాదకర రసాయనాలు కలపడం వంటివాటి ద్వారా నీటిని కలుషితం చేస్తున్నాడు. నీటిని కలుషితం కాకుండా కాపాడటం, కలుషిత నీటిని రీసైక్లింగ్‌ చేసి శుభ్రంగా మార్చడం ద్వారా 2030 నాటికి నీటి నాణ్యత పెంచడం, ప్రస్తుతం నీటి కొరత ఎదుర్కొం టున్న ప్రాంతాల ప్రజలకు పరిశుభ్ర నీటిని అందించడం ఐక్యరాజ్యసమితి లక్ష్యం.

నీటి కష్టాలెందుకు ?

నీటి కొరత తలచుకుంటే వణుకు పుడుతుంది. నీటి కొరత కష్టాలు అది ఎదుర్కొంటున్నవారికే తెలుస్తాయి. నీరు లభించని ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వేసవిలో అది మరీ ఎక్కువ. గొంతు తడిపే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచి పోవాల్సిన దుస్థితి. ఎక్కడ చూసినా బిందెలతో బారులు తీరే జనం. తాగడానికి పరిశుభ్రమైన నీరు దొరక్క కుంటల్లో, గుంటల్లో లభిస్తున్న మురికి నీటిపైనే ఆధారపడుతున్న జనం ఎందరో. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారికన్నా, కలుషిత నీరు తాగి మరణించిన వారే ఎక్కువ.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా 1,500 ఘన కిలోమీటర్ల పరిమాణంలో వ్యర్థ నీరు వస్తుంటుంది. వ్యర్థమవుతున్న నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. ఈ ప్రక్రియ ఇజ్రాయెల్‌ వంటి నీటి కొరత అధికంగా ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో తప్ప అన్నిచోట్లా జరగడం లేదు. అభివద్ధి చెందుతున్న దేశాలలో తగిన నిబంధనలు, వనరులు లేని కారణంగా 80 శాతం వ్యర్థ నీటిని పునర్వినియోగ ప్రక్రియకు మళ్లించకుండానే వృథా చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతి మరింత నీటి కాలుష్యానికి, కొరతకు కారణమవుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలో 80 దేశాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2025 నాటికి మరో 48 దేశాలు నీటికొరత సమస్యలో చిక్కుకోవలసి వస్తుందని అధ్యనాలు హెచ్చరిస్తున్నాయి. 3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటి కాలుష్యానికి సంబంధించిన వ్యాధులతో మరణిస్తున్నారు. నీటి కాలుష్య సంబంధిత మరణాల్లో 43 శాతం అతిసారం ద్వారా సంభవించినవే. ఈ మరణాలలో 84 శాతం మంది 14 ఏళ్ల లోపు పిల్లలే. నీటి కాలుష్య సంబంధిత మరణాల్లో 98 శాతం అభివద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులలో సగం మంది నీటి కాలుష్య సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే. ప్రతి 15 సెకన్లకు ఒక చిన్నారి నీటి కాలుష్య సంబంధ వ్యాధితో చనిపోతోంది. మనదేశంలో లక్షలాది మంది మహిళలు, వృద్ధులు, పిల్లలు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాలనుంచి నీళ్లు తేవడం కోసమే వెచ్చిస్తున్నారు.

ఉన్న కొద్దిపాటి మంచినీటిని సమర్ధవంతంగా వాడుకోవడంలో ఎదురవుతున్న వైఫల్యాలు తీవ్ర నీటి కొరతకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం వ్యర్థ నీటిని శుద్ధి చేయకుండా వదిలి వేయడం వల్ల అవి ఇతర జలాల్లో కలిసిపోయి మొత్తం జల కాలుష్యానికి కారణమవుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఐదువేల మంచినీటి సరస్సులు, నదులు తీవ్ర విష రసాయనా లతో కలుషితమయ్యాయి. వీటితో పాటు పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు, వ్యవసాయంలో వాడే ఎరువులు, పురుగుమందుల అవశేషాల వల్ల మిగిలిన మంచినీరు కూడా కలుషితం అవుతోంది. ఒక లీటర్‌ కలుషిత నీరు మరో 5 లీటర్ల మంచి నీటిని కలుషితం చేస్తుంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 108 కోట్ల మంది కలుషితమైన నీటినే తాగుతున్నారు. ఇది డయేరియా, టైఫాయిడ్‌, డిసిన్ట్రి, అమీబియస్‌, కలరా వంటి నీటి కాలుష్య సంబంధ వ్యాధులకు కారణమవుతున్నది. దీనివల్ల ఏడాదికి 40 లక్షల మంది మరణిస్తున్నారు. పెరుగుతున్న నీటి కాలుష్యం వల్ల ఇటు వర్తమానం లోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి, పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచి ఉంది. అందువల్లే మానవాళికి పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది.

మన బాధ్యత ఏమిటి ?

పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్న నేటి రోజుల్లో నీటి పునర్వినియోగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలి. మరోపక్క ఇప్పటికే లభిస్తున్న సురక్షిత నీటిని సంరక్షించుకోవాలి. అందుకోసం నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. భూగర్భ నీటిని అతిగా తోడకుండా ప్రభుత్వాలు గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయ దారులకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయాలి. నీటి మీటర్లను ఏర్పాటు చేసి రుసుము విధించడం ద్వారా భూగర్భ జలాల వృథాను తగ్గించవచ్చు.

ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని గృహాలు, కార్యాలయాలలో వినియోగిస్తున్న నీటిని మురికి కాలువకు కాక నేరుగా నీటి శుద్ధి కర్మాగారాలకు (రీసైక్లింగ్‌ ప్లాంట్‌) పంపేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. అంటే గృహాలకు నీటిశుద్ధి కర్మాగారాలకు మధ్య వ్యర్థనీటి పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలి. నీటిశుద్ధి కర్మాగారాల ద్వారా శుద్ధి అయిన నీటిని తిరిగి గృహాలు, పరిశ్రమలకు కేటా యించొచ్చు. లేదా పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో పెరిగే పూలమొక్కలు, పచ్చదనం పెరుగుదలకు ఉపయోగించవచ్చు. దీనివల్ల నీరు తిరిగి భూమిలోకి ఇంకి భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. లేదా దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలకు అందించవచ్చు. గృహాలు, కార్యాలయాల ఆవరణల్లో ఇంకుడు గుంతలు నిర్మించడం, మొక్కలు చెట్లు పెంచడం ద్వారా వేడిమి తగ్గి, భూగర్భ జలాల నిల్వ పెరుగు తుంది.

వ్యవసాయంలో నీటి వాడకం..

గహావసరాలకంటే వ్యవసాయానికి నీరు అధికంగా అవసరం. 1960 తర్వాత హరిత విప్లవం కారణంగా సేద్యపు నీటి వినియోగమూ పెరిగింది. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాలు లేనప్పుడల్లా నీటి సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఉపరితల జలాన్ని సేద్యానికి మళ్లించినా అదీ చాలడం లేదు.

వ్యవసాయంలో నీటి ఎద్దడిని తట్టుకోవాలంటే ప్రతి రైతూ ఆధునిక పద్ధతులు ఉపయోగించాలి. ముఖ్యంగా వరి సాగుకు నీరు ఎక్కువ అవసరమ వుతుంది. శ్రీ పద్ధతి వరి సాగులో నీటి వినియోగం తక్కువ అని ప్రయోగాత్మకంగా ఋజువైంది. వివిధ రకాల పళ్ళ, పూల మొక్కల పెంపకంలో కాలువలు, మడుల ద్వారా నీటిని పంపించే బదులు, బిందు సేద్యం వంటి అధునాతన పద్ధతులు ఉపయోగించాలి. దీనివల్ల నీటి వృథా తగ్గుతుంది. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వినియోగిస్తే నేల కాలుష్యంతో పాటు నీటి కాలుష్యమూ తగ్గుతుంది.

రైతులు తమ పొలాల్లోనే ఒక మూల నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. పొలంలో పడిన వాన నీరు ఆ కుంటలోకి వెళ్లేలా వాలు సరిచేయాలి. అలా వాన నీటిని నిల్వ చేయాలి. ఈ చిన్న పని వలన ఆ వ్యవసాయ క్షేత్రం, ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి. వ్యవసాయానికి సరిపడ నీరు అందుతుంది. విద్యుత్తు ఖర్చు తగ్గడంతో పాటు పొలానికి సంవత్సరం అంతా నీరు అంది మూడు నాలుగు పంటలు పండే స్థితి వస్తుంది. దీనివల్ల రైతు ఆదాయమూ, జాతీయ ఆదాయమూ పెరుగుతుంది. ఇటువంటి అవగాహనను ప్రతి రైతులోనూ కలిగించే పనిని ప్రభుత్వమూ, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేపట్టాలి. కుంట తవ్వకానికి, పొలం వాలుకు కావలసిన నిధులను ప్రభుత్వం సబ్సిడీపై అందించాలి. దీనివల్ల రైతు ఆదాయం నిజంగానే రెండింతలయ్యే అవకాశం ఉంది.

కొరతకు వ్యాపారమూ కారణమే

ఒకపక్క త్రాగు, సాగు నీటి కొరత ఇంత భారీ ఎత్తున ఉంటే మరోపక్క నీటి వ్యాపారం కూడా భారీగానే జరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మంచినీటి వ్యాపారం విలువ 400 బిలియన్‌ డాలర్లు. దానిలో తాగునీటి సీసాల వ్యాపారం విలువే 100 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2004 నాటికి ప్రతి సంవత్సరం 150 బిలియన్‌ లీటర్ల నీటి సీసాల (బాటిల్స్‌) మార్కెటింగ్‌ జరుగగా, అది 2010 నాటికి 265 బిలియన్‌ లీటర్లకు పెరిగింది. కొన్ని రకాల మినరల్స్‌ కలపడమే తప్ప కుళాయినీటి కంటే అదనంగా ఆరోగ్యాన్ని పెంచే అంశాలేవీ నీటి సీసాలలో లేవని పరిశోధకులు వాదిస్తున్నారు. ఈ వ్యాపారంలో 40శాతం ఫుడ్‌, బేవరేజెస్‌ కంపెనీలదే కావడం విశేషం. వీటికి కూల్‌డ్రింకుల వ్యాపారం అదనం. నీటి వ్యాపారంతో భూగర్భ జలాలు వేగంగా అడుగుంటుతున్నాయని ఎన్నో పరిశోధనలు చెప్పాయి. ఇంతటి భారీ నీటి కొరతకు కారణమవుతున్న నీటి వ్యాపారాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. అందుకు ప్రజా ఉద్యమాలు అవసరం.

ఐక్యరాజ్యసమితి మిలీనియం అభివృద్ధి లక్ష్యం ప్రకారం అందరికీ మంచినీరు అందుబాటులోకి తేవడానికి సంవత్సరానికి 30 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. వ్యర్థనీటిని శుద్ధి చేయడం, పునర్వినియోగానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, సమర్థ నీటి నిర్వాహణ విధానం వైపుగా దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.

మన భవిష్యత్‌ తరాలకు మనం ఇవ్వవలసిన ఆస్తి నీరే అని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగా నీటి వృథాను అరికడుతూ, నీటి బొట్టును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న కనీస స్పృహతో ప్రతి పౌరుడు జల సంరక్షణకు సారథి కావాలి. అలా చేయని పక్షంలో నీటికోసం యుద్ధాలు, హత్యలు, ఆత్మ హత్యలు నిజమయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం వాస్తవరూపంలోకి రాకముందే మేలుకుందాం.

నీటి పొదుపూ అవసరం

వ్యక్తిగతంగా కూడా ప్రతి మనిషి నీటి పొదుపు పట్ల శ్రద్ధ వహిస్తే రోజుకు ఎన్నో లీటర్ల నీటి వృథాను అరికట్టవచ్చు. కొళాయిల్లో నుండి నీరు బొట్లు రూపంలో కారకుండా, కొళాయిల్లో లీకేజి లేకుండా చూడాలి. పళ్లు తోమడం, గడ్డం గీయడం, వంట పాత్రలు శుభ్రం చేయడం, స్నానం చేయడం, బట్టలు ఉతకడం వంటి సందర్భాల్లో కొళాయి విప్పటం ద్వారా కాకుండా బకెట్‌లోని నీటిని చిన్న డబ్బాల ద్వారా వాడటం చేయాలి. ఇటువంటి చిన్న పనుల వల్ల నెలలో 300 గ్యాలన్ల సురక్షిత నీరు ఆదా అవుతుంది.

ముఖ్యంగా కొళాయి లీకేజిని అరికట్టాలి. ఒక్క కొళాయి నుంచి కారే ఒక్కో నీటిబొట్టు రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. దీనిని ఒక సంవత్సరంతోను, ఆ చుట్టుపక్కల ఇళ్లలోని ఎన్నో కొళాయిలతో లెక్కిస్తే ఎన్నో లీటర్ల శుభ్రమైన నీరు ఊరికే వృథా అవుతుందన్న విషయం మనలను దిగ్భ్రాంతులను చేయక మానదు. అందువల్ల కొళాయిలను కట్టేయడం ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలి. పిల్లలకూ ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. ఆధునికతలో ఇదీ ఒక భాగం. మన బాధ్యతల్లో ముఖ్యమైనది. నీటి విషయంలో నేడు మనం చూపే శ్రద్ధ రేపు మన పిల్లలకు నీటి కష్టాలు లేకుండా చేయగలదు. డబ్బు లేకున్నా బ్రతకగలం. నీరు లేకుండా బ్రతకలేం. ఇది వాస్తవం. అందుకే నీటి పొదుపు మన కర్తవం.

– ముత్యాల ప్రణీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *