శ్రీ వికారినామ సంవత్సర రాశిఫలాలు-2019

శ్రీ వికారినామ సంవత్సర రాశిఫలాలు-2019

గ్రహసంచారం: ఈ ఏడాది గురుడు ఏప్రిల్‌ 22 వరకు ధనుస్సులోనూ తదుపరి నవంబర్‌ 4 వరకు వృశ్చికరాశి, తదుపరి సంవత్సరాంతం వరకు ధనుస్సులోనూ సంచారం. శని వచ్చే జనవరి 24వరకు ధనుస్సు రాశిలోనూ, తదుపరి మకర రాశిలో సంచారం. ఇక రాహుకేతువులు సంవత్సరమంతా మిథునం, ధనుస్సు రాశుల్లో సంచరిస్తారు.

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

వీరికి కొంతవరకు గురుబలం, సంవత్సరాంతంలో శనిబలం ఉంటుంది. రాహుకేతువుల బలం లేదు. గత ఏడాదికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి. కోర్టు కేసులు పరిష్కారమయ్యే సూచనలు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. క్లిష్టమైన పనుల్ని సైతం ఓపిగ్గా పూర్తి చేస్తారు. వ్యాపారులకు అత్యంత లాభదాయకమైన కాలం. ఉద్యోగస్తులు గత ఏడాదికంటే మరింత గుర్తింపు పొందుతారు. ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కవచ్చు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఖాయం. నిరుద్యోగులకు అవకాశాలు. వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి. ఏప్రిల్‌-నవంబర్‌ మధ్యకాలంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు, విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. కళాకారులకు నూతన అవకాశాలు. రాజకీయనేతలకు ఊహించని పదవీయోగాలు. ఆదాయం-14 వ్యయం-14, రాజ్యపూజ్యం-3, అవమానం-7. వీరు గురుడు, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు, గౌరీదేవికి కుంకుమార్చనలు శుభప్రదం.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

వీరికి ఈ ఏడాది మధ్యకాలంలో కొంతవరకు అనుకూల వాతావరణం ఉంటుంది. అష్టమ శని, గురుని ప్రభావంతో ఈతి బాధలు ఎదుర్కొంటారు. తరచూ మానసిక ఆందోళన. ఆర్థికంగా కొంత నిలదొక్కుకునే సమయానికి ఏదో అవసరం వచ్చి మళ్లీ అప్పులు చేస్తారు. రుణదాతలు ఒత్తిడులు మరింత పెంచుతారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వద్దు. గృహం, ఆభరణాలు, భూములు కొనుగోలు చేసే యత్నాలు ద్వితీయార్ధంలో నెరవేరే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ద్వితీయార్ధంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది, అయితే ఏప్రిల్‌ నుంచి గురుబలం కారణంగా అనుకున్న విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు లాభాలు అందీఅందనట్లుగా కనిపిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. అయితే శ్రమ తప్పకపోవచ్చు. కళాకారులకు కొన్ని అవకాశాలు నిరాశ కలిగించినా క్రమేపీ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. వాహనాలు, ఆరోగ్యం విషయాల్లో మరింత అప్రమత్తత అవసరం. ఆదాయం-8, వ్యయం-8, రాజ్యపూజ్యం-6, అవమానం-6. వీరు గురు, శని గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. దుర్గామాతకు ప్రత్యేకంగా కుంకుమార్చనలు చేయించాలి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

వీరికి ప్రథమార్థంలో కొంత ఊరట కలిగించే విధంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత తీరతాయి. పొదుపు పాటిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. కొంత ఆందోళన కలిగించే సమాచారాలు అందుతాయి. బంధువర్గంతో తరచూ విరోధాలు, కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. ఆస్తుల వ్యవహారాలలో కోర్టులకు కూడా వెళ్లే అవకాశం. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారించినా కదలికలు ఉండవు. వ్యాపారాలలో మరింత శ్రమించాలి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు ప్రథమార్థంలో కోరుకున్న మార్పులు పొందుతారు. అయితే బాధ్యతలతో సతమతమవుతారు. కొత్త సంస్థలు, కంపెనీల ఏర్పాటులో కృషి ఫలిస్తుంది. రాజకీయవేత్తలకు ప్రథమార్థంలో పదవులు లభిస్తాయి. కళాకారులకు సామాన్య ఫలితాలు. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది. విదేశీ విద్యావకాశాల కోసం చేసే యత్నాలు సఫలీకృతమవుతాయి. ద్వితీయార్థంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించడం మంచిది. తరచూ ఆస్పత్రుల సందర్శనం. శత్రువులపై ఓ కన్నేసి ఉంచండి. ఆదాయం-11, వ్యయం -5, రాజపూజ్యం-2, అవమానం-2. వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయాలి. ఆంజనేయస్వామికి అర్చనలు చేయండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

వీరికి ద్వితీయార్థంలో గురుబలం అధికం. అలాగే, జనవరి వరకూ శని బలం ఉంటుంది. రాహుసంచారం వల్ల మానసిక ఆందోళన, తరచూ ఆరోగ్య సమస్యలు, శత్రుబాధలు వంటి ఫలితాలు ఉండవచ్చు. ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేసి మీ సత్తా నిరూపించుకుంటారు. ఆర్థికంగా చికాకులు ఎదురైనా తదుపరి పరిస్థితులు అనుకూలిస్తాయి. అయితే తరచూ వృథా ఖర్చులు పెరుగుతాయి. అనుకున్నది సాధించాలన్న తపన, పట్టుదలే మీ విజయాలకు బాటవేస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ఆధ్యాత్మిక భావాలు పెరిగి మఠాలు, పీఠాల దర్శనాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు లాభాల బాటపడతారు. కొత్త భాగస్వాముల సమీకరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు సమర్థతనను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు అనుకున్న ప్రగతిని సాధించి విశేష గుర్తింపు పొందుతారు. రాజకీయవేత్తలకు ప్రజాదరణ లభిస్తుంది. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. సాహిత్యకారులు, జర్నలిస్టులు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. వ్యవసాయదారులకు మొదటి పంట విశేషంగా లాభిస్తుంది. ఏడాది చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అందోళన, శారీరక రుగ్మతలు వంటి బాధలు తప్పకపోవచ్చు. ఆదాయం-5 వ్యయం-5, రాజపూజ్యం-5, అవమానం-2. వీరు గురు, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, దుర్గామాతకు అధికంగా కుంకుమార్చనలు చేయండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

వీరికి గురుబలం విశేషం. అలాగే, సంవత్సరాంతంలో శనిబలం అధికం. ఆర్థికంగా మరింత బలం చేకూరి రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసి విజయం వైపు సాగుతారు. బంధువర్గంతో విభేదాలు, మనస్పర్థలు తొలగుతాయి. మీపై వచ్చిన అపవాదులు, విమర్శలు తొలగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. నూతన గృహ, భూయోగాలు కలుగుతాయి. సంతానం, వివాహ, ఉద్యోగ యత్నాలు సఫలీకృతమై ఉత్సాహంతో సాగుతారు. ద్వితీయార్థంలో శారీరక రుగ్మతలతో బాధపడతారు. కుటుంబంలో ఒత్తిడులు ఎదురైనా చాకచక్యంగా అధిగమిస్తారు. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు అనూహ్యమైన విధంగా టెండర్లు దక్కుతాయి. వ్యాపారస్తులు సంస్థలను విస్తరిస్తారు. భాగస్వాముల అన్వేషణలో సఫలమవుతారు. ఉద్యోగాలలో మరిన్ని మార్పులకు అవకాశం. ఉన్నతవర్గాల చేయూత అందుతుంది. పారిశ్రామికవేత్తలు అనుకున్న ప్రగతితో ముందడుగు వేస్తారు. ప్రభుత్వంతో వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. రాజకీయవేత్తలను పదవులు వరిస్తాయి. విశేష ప్రజాదరణతో ముందుకు సాగుతారు. కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. క్రీడాకారులు ప్రతిభను చాటుకుంటారు. అవార్డులు సైతం దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. ఆదాయం-8, వ్యయం-14, రాజపూజ్యం-1, అవమానం -5. వీరు శివాభిషేకాలు జరిపిస్తే మంచిది.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. నవంబర్‌ నుంచి గురుబలం, జనవరి నుంచి శనిబలం చేకూరుతుంది. రాబడి ఉన్నా ఖర్చులు కూడా విశేషంగా పెరుగుతాయి. పనుల్లో ప్రతిబంధకాలు, జాప్యం తప్పకపోవచ్చు. తరచూ ప్రయాణాలు, తద్వారా శ్రమాధిక్యం. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆందోళన చెందుతారు. బంధువుల చేయూతతో కొన్ని కార్యక్రమాలు మ్యధ్యమధ్యలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన హామీలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు కొంత వరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులు కొంత అసహనంతో గడుపుతారు. అలాగే, విధులు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ద్వితీయార్థంలో కొంత అనుకూలత ఉండవచ్చు. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు, అవకాశాలు సంతృప్తి కలిగించవు. పరిశోధకులు, శాస్త్రవేత్తలు, కళాకారులకు మిశ్రమ ఫలితాలు. ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-4, అవమానం-5. వీరు శనీశ్వరునికి తైలాభిషేకం, రాహుకేతువుల దోష నివారణకు అమ్మవారికి కుంకుమార్చనలు చేయడం మంచిది. అలాగే గురుదోష నివారణకు పరిహారాలు చేయించుకుంటే మేలు.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

వీరికి ఏప్రిల్‌ 22 నుంచి నవంబర్‌ వరకు గురుబలం, సంవత్సరమంతా శని, రాహుకేతువుల బలం విశేషం. జనవరి 24 నుంచి అర్థాష్టమ శని ప్రారంభమవుతుంది. ఈ రీత్యా చూస్తే వీరికి జనవరి వరకూ అంతా శుభదాయకంగానే ఉంటుంది. జ్ఞానాన్ని మరింత పెంచుకుంటారు. ఆధ్యాత్మికంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అవివాహితులకు వివాహయోగం కలిగే సూచనలు. ఆర్థికపరంగా మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రెండుమూడు విధాలుగా ధనలాభాలు కలుగుతాయి. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. ఇంటి నిర్మాణాలు ఏప్రిల్‌-నవంబర్‌ మధ్యకాలంలో అనుకూలిస్తాయి. ఊహించని రీతిలో భూములు కొనుగోలు చేస్తారు. తండ్రి తరఫువారితో విభేదాలు పరిష్కరించుకుంటారు. కొన్నేళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న కేసు ఒకటి పరిష్కారమవుతుంది. వ్యాపారులకు పట్టింది బంగారమే. ఉద్యోగులకు ప్రమోషన్లు ఊరటనిస్తాయి. ఉన్నతాధికారులు మీపట్ల మరింత సానుకూలత చూపడం విశేషం. పారిశ్రామికవేత్తలు అనుమతులు సాధిస్తారు. కొత్త కంపెనీల ప్రారంభంలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. అలాగే, ప్రజాదరణలో లోటు ఉండదు. సినీ,టీవీ కళాకారులు అవార్డులు పొందుతారు. ప్రతిభను చాటుకుని కొత్త అవకాశాలు సాధిస్తారు. క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలిస్తాయి. మహిళలు అన్ని రంగాలలోనూ విశేషంగా రాణిస్తారు. జనవరి 24 నుంచి అర్థాష్టమ శని ప్రభావంతో పాటు, నవంబర్‌ నుంచి గురుబలం తగ్గిన కారణంగా శారీరక రుగ్మతలు, ఇతరులతో మాటపడాల్సి పరిస్థితులు. మానసిక అధైర్యం. తరచూ ఇంటాబయటా విభేదాలు వంటి ఫలితాలు ఉంటాయి. ఆదాయం-8, వ్యయం-8, రాజపూజ్యం-7, అవమానం-1. వీరు అర్థాష్టమ శని దోష నివారణకు శనీశ్వరుని తైలాభిషేకాలు జరిపించుకోవాలి. అలాగే, నవంబర్‌ నుంచి గురుదోష నివారణకు పరిహారాలు చేయించుకోవాలి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

వీరికి గురుబలం కొంతవరకు ఉంది. జనవరి వరకూ ఏల్నాటి శని ప్రభావంతో పాటు, సంవత్సరమంతా అష్టమ రాహువు, ద్వితీయంలో కేతు సంచారం ప్రతికూలం. ఈ రీత్యా చూస్తే మొత్తం మీద గురుబలం మీద కొంతవరకు నెట్టుకొస్తారు. తరచూ శారీరక సంబంధిత రుగ్మతలు బాధపెట్టవచ్చు. అష్టమ రాహువు ప్రభావం వల్ల వాహనాలు నడిపే వారు అత్యంత జాగరూకతతో మసలుకోవాలి. అలాగే, కొందరికి శస్త్రచికిత్సలు జరుగవచ్చు. ఏపనిపైనా శ్రద్ధ ఉండదు, మీ ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో వైరం. మొత్తం మీద వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వివాహ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు కనిపిస్తాయి. నూతన పెట్టుబడుల అన్వేషణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. రాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తుంటాయి. కళాకారులు అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులు, టెక్నాలజీ రంగాల వారు మరింత గుర్తింపు పొందుతారు. ఆదాయం-14, వ్యయం-14, రాజపూజ్యం-3, అవమానం-1. వీరు శనికి తైలాభిషేకాలు, రాహుదోష నివారణకు అమ్మవారికి కుంకుమార్చనలు, ఈశ్వరారాధన చేస్తే మంచిది.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

గ్రహస్థితి పరిశీలించగా, వీరికి ఏల్నాటి శనితో పాటు, గురుని వ్యయ, జన్మరాశిలో సంచారం, రాహువు సప్తమం, కేతువు జన్మరాశిలో సంచారం కారణంగా అన్ని విషయాలలోనూ జాగరూకతతో మెలగాలి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. అనుకున్న సమయానికి డబ్బు అందక తరచూ ఇబ్బందులు పడతారు. ఆస్తుల క్రయవిక్రయాలు కూడా అంతగా లాభించవు. అనుకున్నంత ఆదాయం లేక రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఖర్చులు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. శారీరక రుగ్మతలు, మనోక్లేశాలు బాధిస్తాయి. ఆస్పత్రులు సందర్శిస్తారు. తల్లిదండ్రుల తరఫు వారి నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. అవివాహితులకు శ్రమానంతరం వివాహాలు జరుగుతాయి. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులు తరచూ మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు నిరాశ చెందుతారు. రాజకీయవేత్తలకు అతికష్టంమీద కొంత అనుకూలత ఉంటుంది. పదవులు చేజారవచ్చు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. కళాకారులకు అవకాశాలు తగ్గుతాయి. న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు సమస్యలు ఎదురుకావచ్చు. వ్యవసాయదారులకు రెండవపంట కొంత అనుకూలిస్తుంది. ఆదాయం-2, వ్యయం-8, రాజపూజ్యం-6, అవమానం-1. వీరు శని, రాహుకేతువులు, గురునికి విశేషంగా పరిహారాలు చేయించుకోవాలి. అనునిత్యం దైవారాధన మంచిది.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

వీరికి ఏల్నాటి శని ప్రభావం అధికం. అయితే ఏప్రిల్‌ 22 నుంచి నవంబర్‌ 4వరకు లాభగురుడు యోగకారకుడు. రాహువు అనుకూలుడు. కేతువు అంతగా కలసిరాదు. జనవరి నుంచి శని జన్మరాశి సంచారం కారణంగా ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి. అయినవారితో విభేదాలు నెలకొనవచ్చు. ఏ పనిపైనా శ్రద్ధ చూపరు. మొత్తం మీద గురుబలం కాలంలో విశేష సంపదలు పొందుతారు. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా గడుపుతారు. ఖర్చులు మీదపడినా అధిగమిస్తారు. వివాహాది శుభకార్యాల నిర్వహణ. సంతానపరంగా మరింత సౌఖ్యం. జ్ఞాతుల ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మీ అభిప్రాయాలు, నిర్ణయాలు కుటుంబసభ్యులకు శిరోధార్యంగా మారతాయి. వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కే ఛాన్స్‌. పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైనరీతిలో ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. రాజకీయవేత్తలకు మరిన్ని పదవులు దక్కుతాయి. కళాకారులు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. వైద్యులు, న్యాయవాదులు, ఐటీరంగం వారికి మరింత అనుకూలత ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవపంట బాగా కలసివస్తుంది. ఆదాయం-5, వ్యయం-2, రాజపూజ్యం-2, అవమానం-4. వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, ఆంజనేయస్వామికి అర్చనలు చేయించుకుంటే ఉపశమనం లభిస్తుంది.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

వీరికి గ్రహస్థితి అంతా అనుకూలమైనదే. గురు, శని, కేతువు, రాహువులు సంవత్సరమంతా శుభులే. జనవరి 24నుంచి వీరికి ఏల్నాటి శని ప్రారంభమవుతుంది. మొత్తం మీద వీరు విజయాలు, అభివృద్ధి వైపు పరుగులు తీస్తారు. ఏ కార్యం తలపెట్టినా విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అవసరానికి మించి డబ్బు అందుతుంది. జ్ఞాతుల ద్వారా ధనలాభాలు. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికంగా చేస్తారు. రాహువు పంచమస్థితి కారణంగా సంతానం వల్ల కొద్దిపాటి సమస్యలు ఉండవచ్చు. నిరుద్యోగులకు అవకాశాలు. కోర్టు కేసులు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారులు అనుకున్న దాని కంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. అవార్డులు లేదా పురస్కారాలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో విజయం. టీవీ, సినీకళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ సానుకూలం. క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాదులు ఐటీ రంగం వారు విజయాల వైపు సాగుతారు. జనవరి 24 నుంచి ఏల్నాటి శని ప్రారంభం వల్ల మనోక్లేశాలు, వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు, కుటుంబంలో సమస్యలు ఎదురుకావచ్చు. ఆదాయం-5, వ్యయం-2, రాజపూజ్యం-5, అవమానం-4. వీరు జనవరి నుంచి శనీశ్వరునిక తైలాభిషేకాలు, జపాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆంజనేయస్వామిని పూజించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

వీరికి గురుబలం విశేషం. అలాగే, సంవత్సరాంతంలో శని విశేష లాభదాయకుడు. అయితే రాహుకేతువులు దోషకారులు. మొత్తంమీద వీరికి శుభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కొన్ని సందర్భాల్లో వద్దంటే డబ్బు అన్నట్లుంటుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వివాహయత్నాలు కలసివచ్చి ఊరట చెందుతారు. సంతాన, కుటుంబ సౌఖ్యం. సంతానం ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులు మీకు వెన్నంటి నిలిచి మీ విజయాలలో భాగస్వాముల వుతారు. కాంట్రాక్టర్లు అనుకున్న దానికంటే అధికంగా లాభాలు పొందుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. అలాగే, ధార్మిక కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. నూతన భాగస్వాములు చేరతారు. ఉద్యోగస్తులకు విశేష గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలమవుతాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటులో విజయం. రాజకీయవేత్తలను అనుకోని పదవులు వరిస్తాయి. సినీ, టీవీ కళాకారులు గతం కంటే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విశేష గుర్తింపు, ప్రోత్సాహం అందుతాయి. క్రీడాకారులు, పరిశోధకులు, వైద్యులు తమ సత్తా నిరూపించుకుంటారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యవసాయదారులు రెండు పంటలూ లాభించి ఉత్సాహంగా గడుపుతారు. అర్థాష్టమ రాహువు కారణంగా తరచూ శారీరక రుగ్మతలు, మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు నెలకొనవచ్చు. అయినవారి నుంచే అవమానాలు ఎదురవుతాయి. ఆదాయం-2, వ్యయం-8, రాజపూజ్యం-1, అవమానం-7. వీరు రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, దుర్గామాతకు కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు మంచిది.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *