భాషా ప్రయుక్త రాష్ట్రాల స్పూర్తిని వంచించారు !

భాషా ప్రయుక్త రాష్ట్రాల స్పూర్తిని వంచించారు !

తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావుతో ఇంటర్వ్యూ

భాషా ప్రయుక్త రాష్ట్రాల సూత్రం ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కానీ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత గాని తెలుగును అధికార భాషగా అమలు చేయడానికి తొలి అడుగు పడలేదని అంటున్నారు తెలంగాణ తెలుగు అధికార భాషా సంఘం తొలి అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన భాషను వెనువెంటనే మనం మరచిపోయామని ఆయన ఆరోపణ. తెలుగు భాష చిరంజీవి అని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని ఎన్ని ఖండాల అవతలికి వెళ్లినా, మళ్లీ ఇంటికి వస్తే మాతృభాష ఎడల మమకారం బయటకు వస్తుందని అంటున్నారాయన. తెలుగు అకాడెమీల రద్దు అత్యంత అవాంఛనీయ నిర్ణయమని, దాంతో తెలుగువారు ఎన్నో ఏళ్లు వెనక్కి పోయారని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా దేవులపల్లి ప్రభాకరరావు గారితో ‘జాగృతి’ జరిపిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.

తెలుగునేల మీద ఇవాళ తెలుగు భాష స్థితిగతులు ఎలా ఉన్నాయి?

నా వ్యక్తిగత అభిప్రాయం చెబుతాను. తెలుగు నేల మీద మాతృభాషకి మన్నన ఉంది. తెలుగు నేల అంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలే కాదు. ప్రపంచం లోని వివిధ దేశాలలో కూడా తెలుగు మాట్లాడే వాళ్లున్నారు. అమెరికా తదితర ప్రాంతాలలో కూడా తెలుగువాళ్లున్నారు. తెలుగు మాట్లాడేవాళ్లు ఎక్కడున్నా అది తెలుగు నేలే. అన్నిచోట్లా తెలుగుకు ఆదరణ ఉంది. కానీ ఒకటి చెప్పుకోవాలి. అచ్చమైన తెలుగు ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్ల కంటే అమెరికా వంటి చోట ఉంటున్న తెలుగువాళ్లు భాష పట్ల మరింత గౌరవప్రతిపత్తులు చూపుతున్నారు. వాళ్లకున్న మమకారాన్ని వ్యక్తపరుస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది తెలుగునేల నుంచి వాళ్లకి లభించిన ప్రేరణే కదా. కాబట్టి ఇక్కడ కూడా మాతృభాషకి భవిష్యత్తు ఉందనే నా అభిప్రాయం. అప్పుడప్పుడు ఏవో సర్వేల, పరిశోధక పత్రాల సారమంటూ వార్తలు వస్తున్న మాట నిజం. కానీ అవి చెబుతున్నంత దుస్థితిలో మన భాష లేదు. ఆ భాషాభిమానులుగా మనం నిస్పృహ పడవలసిన అవసరం లేదనే నా అభిప్రాయం. జనాభా దృష్ట్యా హిందీ తరువాత తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్యే ఈ దేశంలో ఎక్కువ. ఇది నా దగ్గరున్న సమాచారం.

 ప్రపంచ భాషలలో పతన దశకు చేరుకుంటున్న వాటిలో తెలుగు కూడా ఉన్నదంటూ యునెస్కో వంటి సంస్థ చెప్పింది కాబట్టి కొంత కలత ఉంటుంది కదా!

పతనం అనే పదం నేను ఉపయోగించను. తెలుగు అంతరించిపోవడం అనే దశను నేను ఊహించను. యునెస్కో చేసిన అధ్యయనంలో పతనం అంచున కొన్ని భాషలు ఉన్నాయంటూ నిన్న మొన్న కూడా ఒక వార్త వచ్చింది. నిజానికి ఇలాంటివే వార్తలు ఇంతకు ముందు కూడా వచ్చాయి. ఇవాళ ప్రపంచంలో అంతరించిపోతున్న భాషలలో తెలుగు కూడా ఉందన్నదే ఆ వార్తల సారాంశం. యునెస్కోయే కావచ్చు, కానీ వాళ్ల అభిప్రాయంతో నేను ఏకీభవించడంలేదు. నా వ్యక్తిగతమైన అనుభవం చెబుతాను. మేం నిజాం రాజ్యంలో ఉండేవాళ్లం. నాది వరంగల్‌. అప్పుడు ఉర్దూ భాషదే ఆధిక్యం. నేను చదువుకునే కాలం కంటే ముందు ఇక్కడ ఉర్దూ బోధన భాష. నా కంటే పెద్దవాళ్లు ఉర్దూలోనే డిగ్రీలు తెచ్చుకున్నారు. అది రాజభాష, అంటే అధికార భాష. రాజ్యంలో ప్రజలంతా మాట్లాడే తెలుగును చిన్నచూపు చూసేవారు. కానీ ప్రజలు మాతృభాషని, అంటే తెలుగును చిన్నచూపు చూడలేదు. అలాంటి నిర్బంధంలోనూ తెలుగు వికాసం జరిగింది. మాతృభాష అంటే ఇప్పటికంటే ఎక్కువ శ్రద్ధ, ఉత్సాహం అప్పుడు చూపేవారు. ప్రతి ఇంట్లోను తెలుగు నేర్చుకునేవారు. చదివేవారు. మాట్లాడేవారు. తెలుగులోనే రాసేవారు. భాషను కాపాడుకునేవారు. బయట ఉర్దూ సంస్కృతి ఉన్నా, ఇంట్లో మాత్రం తెలుగు సంస్కృతే ఉండేది. మా నాయనగారి సంగతి చెబుతాను. ఆయన బయటకు వెళితే షేర్వానీ, పైజమా లేదా కోటు, తల మీద రూమీ టోపీ ధరించేవారు. మళ్లీ ఇంటికొస్తే మడికట్టుకుని కూర్చునేవారు. ఇది నా ఒక్క కుటుంబ అనుభవమే కాదు. మందుముల నరసింగరావు మెహబూబ్‌నగర్‌ జిల్లావారు. రాజకీయ సామాజిక ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు. ఎంతో పేరున్న ఉర్దూ పత్రిక ‘రయ్యత్‌’ సంపాదకులు. ఉర్దూలో ఆయన రాసినంత శక్తివంతంగా ఉర్దూ మాతృభాషగా ఉన్నవారు కూడా రాయలేకపోయే వారు. కానీ తెలుగులో ఆయనకి చాలా ఆసక్తి. స్వీయచరిత్ర – జ్ఞాపకాలు – తెలుగులోనే రాసుకున్నారు. నిజాం రాజ్యానికి బయట ఇంగ్లిష్‌ వాళ్ల పాలన ఉండేది. ఎవరు అధికారంలో ఉన్నా, ఎలాంటి రాజరికం ఉన్నా మనం తెలుగును మరచిపోలేదు. కాబట్టి పతనం అనడం బాగా తొందరపాటు. తెలుగుకు భవిష్యత్తు ఉంది. ఉంటుంది.

ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులా, తెలుగు మీడియం విద్యార్థులా? ఎవరు ఎక్కువ కనిపిస్తారు? పత్రికల సంగతికొస్తే అసలు భాషా పత్రికలకు ఉన్న ప్రాధాన్యం, ప్రాచుర్యం ఎంత? ఇంగ్లిష్‌ పత్రికలకు ఉన్న ప్రాచుర్యం ఎంత?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఏ ఇంటిలో చూసినా ఒకటే దృశ్యం. ఇంగ్లిష్‌ మీడియంలోనే తమ పిల్లలు చదవాలని తల్లిదండ్రులంతా కోరుకుంటున్నారు. ఇది నిజం. కారణం, కెరియర్‌. తెలుగు చదివిన వారికీ ఉపాధి అవకాశాలు కల్పించే వాతావరణం ఉంటే తెలుగే చదువుకుంటారు. ఇక పత్రికలు. కేరళ వంటి రాష్ట్రంతో పోల్చి చూస్తే తెలుగు పత్రికల సంఖ్య తక్కువ. ఉన్నవే నాలుగో అయిదో ప్రధాన పత్రికలు. వాటిలో తెలుగు భాషా సాహిత్యాలకు ఇస్తున్న చోటు ఎంత? గౌరవం ఎంత? రాజకీయ కుమ్ములాటలు, లైంగిక అత్యా చారాలు, సంచలనం కలిగించే వార్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక కవికి సత్కారమో, ఒక పుస్తకావిష్క రణమో, భాష మీద సదస్సో జరిగితే ఒక మూల చిన్న చోటు కేటాయిస్తున్నారు. ఇదొక చేదు నిజం.

మీరు నిజాం కాలం చూశారు. మిగిలిన చోట్ల ఆంగ్లేయులు. కానీ ఆ రోజుల్లో అద్భుతమైన ఆంగ్లం వచ్చినవారు ఉన్నారు. అద్భుతంగా ఉర్దూ నేర్చినవారు ఉన్నారు. అలాగే అద్భుతమైన తెలుగు రాసినవారు చదివిన వారూ ఉన్నారు. ఇప్పుడు ఏ భాషా రావడం లేదు కదా!

ప్రపంచీకరణ అనండి మరొకటి అనండి. ఇవాళ్టి పరిస్థితులలో మన వాళ్లు అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళుతున్నారు. అక్కడి కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఆంగ్లం అనివార్యం. ఇంకొకటి కూడా ఉంది. ఇంజనీరింగ్‌ విద్యార్థి ఉన్నాడు! అతడు ఇంజనీరింగ్‌ పాఠ్యాంశాలు మాత్రమే చదువుతాడు. అలాగే మెడిసిన్‌ చేయాలని అనుకునేవాళ్లు అందుకు సంబంధించిన అంశాలే చదువుతున్నారు. కొన్ని మినహాయింపులు ఉంటే ఉండవచ్చు. నా మనుమడు ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వాడు ఆ అంశం తప్ప మరొకటి చదవడానికి ఇష్టపడడు. కానీ మా ముందు తరం, మా తరం, ఆనాడు మేం కళాశాలల్లో, పాఠశాలల్లో చదవవలసిన అంశాలతో పాటు తెలుగు కూడా చదువుకునేవాళ్లం. తెలుగు పుస్తకాలు చదివేవాళ్లం. మరొక అంశం కూడా ఉంది. ఇప్పటి పిల్లలకి సమయం ఉండడం లేదు. అంటే పాఠ్యాంశాలకే పరిమితం కావడం, దానితో మాతృభాష అవసరం గురించిన స్పృహ లేకపోవడం, దీనికి తోడు సమయం కరువైపోవడం.. దీనితో ఇవాళ తెలుగు భాషకు పిల్లలు కొంతదూరం అవుతున్నారు.

మీరు చూస్తుండగానే మీ మనుమడికి ఆసక్తి తగ్గిన వాస్తవం కనిపించింది. అతని తరువాతి తరం మాటేమిటి? వాళ్ల పిల్లల పరిస్థితి ఇంకెలా ఉంటుంది?

ఈ పరిస్థితి ఎదురుకావడంలో ప్రభుత్వాల పాత్ర చాలా ఉంది. ఇక్కడ ప్రభుత్వాల గురించి ప్రస్తావించ వలసి ఉంటుంది. బ్రెయిన్‌ డ్రెయిన్‌ జరగకుండా ఆగాలంటే ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలి. సైన్సులో పరిశోధన చేసే వారికి ప్రయోగ శాల, మరొకటీ.. మరొకటీ అన్ని సదుపాయాలు ఇక్కడే కల్పించాలి. అదే నిజాయితీగా జరిగితే వాళ్లు అమెరికా వరకు ఎందుకు పోతారు? తెలుగును ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు?

ఏదైనా చదువుకోవచ్చు. కానీ ఒక గంట మాతృభాష కోసం కేటాయించలేరా? ఇది కావాలని చేస్తున్న నిర్లక్ష్యం అనిపించడం లేదా?

ఇలాంటి వాదన సమంజసం కాదు. కావాలని నిర్లక్ష్యం చేయడం లేదని నేను అనుకుంటాను. ప్రస్తుత పరిస్థితులు మాతృభాష వినియోగాన్ని కొంతమేర అడ్డుకోవచ్చు. ఏ భాష మాట్లాడినా మళ్లీ కుటుంబం మధ్య తెలుగే నడుస్తుంది. మాతృభాషను కావాలని నిర్లక్ష్యం చేయడమనో, దానిని కాపాడుకోవడంలో తగినంత నిబద్ధత లేదనో అనడం సరికాదు. ఇందాక అనుకున్నట్టు పరిస్థితులు ఇందుకు కారణం. ఎంతసేపు కెరియర్‌, భవిష్యత్తు. ఇది మెటిరియలిస్టిక్‌ ప్రపంచం అయిపోయింది కదా!

భాషాప్రయుక్త రాష్ట్రాల యోచన, అమలు స్వతంత్ర భారత చరిత్రలో పెద్ద చారిత్రక పరిణామం. భాష మీద మమకారమే ఈ పరిణామం వెనుక ఉన్న ఆత్మ. దీనితో ప్రాంతీయ భాషలకు జరిగిన మేలు ఏమిటి?

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆశయం మ¬న్నతమైనది. అది ఉద్యమాల ఫలితం. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు కోసం శతాబ్దాల పాటు సాగిన ఉద్యమాలకి చోదకశక్తి, ప్రేరణ ఏమిటి? భాష! కానీ, భాషతోనే, భాష కేంద్రంగా జరిగిన ఉద్యమం తోనే మనకొక రాష్ట్రం వచ్చిందన్న గొప్ప వాస్తవాన్ని మనం నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేశాం. ఒక కఠిన వాస్తవం చెబుతాను. నవంబర్‌ 1, 1956న కదా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది! తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం మనదే కదా! అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. కానీ భాష ప్రాతిపదికగా ఏర్పడిన ఈ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏళ్ల వరకు తెలుగును అధికార భాషగా అమలు చేయాలన్న ఆలోచనే కనిపించలేదు. మొత్తానికి 1974 లేదా 1976 సంవత్సరంలో అప్పుడు న్యాయశాఖ సహాయ మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావుగారు ఒక చట్టం తెచ్చారు. అదే అధికార భాషా చట్టం. మళ్లీ, ఈ చట్టం రూపొందిన పదేళ్లకు గాని అధికార భాషా సంఘం ఆవిర్భవించలేదు. నిజం చెప్పాలంటే, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత గాని అధికార భాషగా తెలుగును అమలు చేయడానికి తొలి అడుగు పడలేదంటే నమ్మగలరా మీరు! కానీ నిజం. భాష ప్రాతిపదికగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించక ముందు ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులంతా, అంటే టంగుటూరి ప్రకాశం గారు, బులుసు సాంబమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు వంటివారు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు. అందులో చాలా నేను విన్నాను. తెలుగు మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే చెప్పేవారు. నదీజలాలు వంటి అంశాలు తరువాత చెప్పేవారు. సరే, భాషా ప్రయుక్త రాష్ట్రాల పథకం మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించింది. నీలం సంజీవరెడ్డిగారు తొలి ముఖ్యమంత్రి. కానీ ఆయనే తెలుగును మరచిపోయి, మిగతా విషయాలపై శ్రద్ధ చూపారు. కానీ అలాంటి శ్రద్ధ తెలుగు రాష్ట్రాన్ని తెచ్చిన భాష మీద, ఆ భాష అభివృద్ధి మీద లేకపోయింది. కానీ, అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఇందుకు మినహాయింపు. ఆయనే తొలి శాసన సభాపతి. ఆయన మాత్రం తెలుగు అమలుకు అపారమైన శ్రద్ధ చూపారు. వివిధ పక్షాలతో చర్చించి, పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య వంటివారితో చర్చించి తెలుగు భాష వినియోగం కోసం కమిటీ వేసి తన వంతు కృషి చేశారు. అంతటి కృషి తరువాత మరెవ్వరూ చేయలేదని కూడా చెప్పాలి. అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షుడు వావిలాల. ఆయన నిబద్ధత కలిగినవారు. పదవులను ఆశించినవారు కాదు. కానీ ఆయన కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేను విన్నాను. చివరి అధ్యక్షుడు, అంటే పదిహేనో అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిలో ముఖ్య మంత్రి చంద్రశేఖరరావుగారు నన్ను నియమించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో, ఆ పదిహేనుమంది అధ్యక్షుల హయాంలో జరిగినదేమిటి? సాధించిన దేమిటి? మనం అధికార భాషగా తెలుగును నిలబెట్టడానికి చేసిన కృషి ఏమిటి? ఈ విషయంలో వ్యక్తులను తప్పు పట్టడం సరికాదు.

కేసీఆర్‌గారు నన్ను తెలంగాణ అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షునిగా నియమించిన తరువాత నేను చేసిన మొదటి పని, అధికార భాషా సంఘం చట్టం, అందులో అధ్యక్షుడి విధులను అధ్యయనం చేయడం. ఆ చట్టం ప్రకారం అధ్యక్షుడికి అసలు అధికారాలే లేవు. ఏ శాఖ తెలుగును ఏ విధంగా అధికార భాషగా అమలు చేసిందీ, లేదా చేస్తున్నదీ పరిశీలించి అందుకు సంబంధించి మిగిలిన అంశాలను చర్చించేందుకు ఏ ఉన్నతాధికారినీ పిలిపించుకుని మాట్లాడే అధికారం అధ్యక్షుడికి లేదు. కానీ ఈ పదవికి క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చారు. ఈ పదవికి ఎప్పుడు ప్రయోజనం చేకూరుతుంది? ఒక శాఖలో తెలుగు అమలు బాగా జరిగితే ఒక ఇంక్రి మెంట్‌ కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయగలగాలి. ఫలితాలు నిరాశాజనకంగా ఉంటే బాధ్యులైన వారికి ఒక ఇంక్రిమెంట్‌ నిలిపివేయాలని సూచించే వెసులుబాటు ఉండాలి. అప్పుడు భాష అభివృద్ధికి కొంత అవకాశం లభిస్తుంది.

ప్రభుత్వ కార్యకలాపాలలో, న్యాయస్థానాలలో తెలుగు అమలు లక్ష్యం ఏ దశలో ఉంది?

ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి గురించి నేను వ్యాఖ్యానించ లేను. తెలంగాణలో తెలుగు భాషకు ఇస్తున్న ప్రోత్సాహం ఆశాజనకంగానే ఉంది. సచివాలయం నుంచి పంచాయతీ స్థాయి దాకా తెలుగును అధికార భాషగా అమలు చేయాలన్నది ఒక లక్ష్యం. ఈ లక్ష్యం పరిపూర్ణంగా సాధించామని మాత్రం చెప్పలేం. ప్రభుత్వ ఆదేశాలు ఆంగ్లంలోనే వెలువడుతున్నాయి. సచివాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరగడం లేదు. శాసనసభ సభ్యులు తెలుగులోనే మాట్లాడుతున్నారు. ప్రశ్నలు, తీర్మానాలు, ఇతర సమాచారం ఆంగ్లాంధ్రాలలో వెలువరిస్తున్నారు. పంచాయతీల స్థాయిలో తెలుగు అధికార భాషగా అమలవుతోంది.

ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న కంప్యూటర్‌ను మన మాతృభాషకు అనుగుణంగా మలుచు కోవడంలో మనం ఏ మేరకు విజయం సాధించాం? కంప్యూటర్‌ విద్య, మరింత పెరిగిన ఇంగ్లిష్‌ ఆధిపత్యం, ప్రపంచ పరిస్థితులు, అమెరికా మోజు – ఈ నేపథ్యంలో మన మాతృభాషకు రక్షణ ఎలా?

తెలుగును అధికార భాషగా మలచే ప్రక్రియలోనే కంప్యూటర్‌ వినియోగం కూడా పెరుగుతుంది. అది ఇంకా జరగవలసి ఉంది. ఒకటి ఉంది. మనకు విశ్వవిద్యాలయాలు పెరిగాయి. వాటిలో తెలుగు శాఖలు కూడా పెరిగాయి. ఆ మేరకు తెలుగుకు అందవలసినంత ప్రోత్సాహం అందడం లేదు. ఇదే జరిగితే మన యువతరం అమెరికాకు ఎందుకు పోతుంది? అక్కడ అవమానాలు పడుతూ ఎందుకు బతుకుతుంది? కంప్యూటర్లను తెలుగు భాష ప్రాతిపదికగా ఉపయోగించుకోలేమా? సోవియెట్‌ రష్యా, జర్మనీ, చైనా, జపాన్‌ వంటి దేశాలను తీసుకోండి. వాటి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆంగ్లం ఆధారంగా వృద్ధి చెందలేదు కదా! ఆయా దేశాలకు చదువుకోవడానికి వెళ్లినవారికి ముందు అక్కడి భాషలు నేర్పుతారు. తరువాత అసలు విద్య. అసలు అంతదూరం వెళ్లనక్కరలేదు. అలాంటి ప్రయత్నం ఇక్కడ ఉర్దూలోను జరిగింది. మర్రి చెన్నారెడ్డి వంటివారు ఉర్దూలోనే వైద్యశాస్త్రం చదివారు. అలాంటి ప్రయత్నం, అందుకు అవసరమైన సంకల్పం ప్రభుత్వాల దగ్గర కూడా ఉండాలి.

తంజావూరులోని మ¬న్నత గ్రంథాలయం సరస్వతీ మహల్‌లో విలువైన తెలుగు పురాతన గ్రంథాలు ఉన్నాయని డాక్టర్‌ డి.రాజారెడ్డి వంటివారు చెబుతు న్నారు. కొన్ని తాళపత్ర గ్రంథాలు, కొన్ని శిథిలావస్థలో ఉన్న పాత గ్రంథాలు.. అలా అని ఇవన్నీ సాహిత్యం, కావ్యాలు, విమర్శ, నృత్యం వంటి అంశాలకు సంబంధించినవి కాదు. అవీ ఉన్నాయి కానీ, వైద్యం, రసాయనిక శాస్త్రం, వాతావరణ శాస్త్రం వంటి అంశాలకు సంబంధించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తీసుకువచ్చి, అచ్చువేసి అందరికీ అందు బాటులో ఉంచాలన్నది డాక్టర్‌ రాజారెడ్డి అభిప్రాయం. అందువల్ల శాస్త్రసాంకేతిక రంగాలలో మనవైన పదప్రయోగాలు, వ్యక్తీకరణలు బయటకొస్తాయి. కృతకమైన భాషతో కాకుండా, సహజ పదబంధం సామాన్యులకు చేరువు అవుతుంది. ఈ పనికి పది కోట్ల రూపాయలు చాలునని డాక్టర్‌ రెడ్డి రాశారు. దీని గురించి ఏమంటారు?

కొన్ని పుస్తకాలేమిటి? అసలు తంజావూరు గ్రంథాలయాన్నే మనం తెచ్చుకోవాలి. అచ్చు వేసుకోవాలి. ప్రాచీన భాష హోదా వచ్చిన తరువాత ఇలాంటివి చేయవలసి ఉంటుంది కూడా. ఇంకొక ముఖ్య విషయం కూడా ఉంది. తెలుగు భాషలో మౌలిక గ్రంథాలన్నీ యాభయ్‌ ఏళ్ల క్రితం వచ్చినవే. అంటే తరువాత వచ్చినవి పేలవమని కాదు. ఆ పుస్తకాలలో కొన్ని ఇప్పుడు దొరకడం లేదు. వాటిని కూడా పునర్‌ ముద్రించాలి. ఉదాహరణకి గిడుగు రామమూర్తి పంతులు గారి రచనలు. గాంధీ ఆత్మకథను తొలిసారి అనువదించినవారు వేలూరి శివరామశాస్త్రి. ఆయన పుస్తకాలు కూడా అలభ్యం.

అకాడెమీల రద్దు నిర్ణయం, ఫలితాల గురించి ఒక అభిప్రాయానికి రావడానికి చరిత్రలో ఈ సమయం సరిపోతుంది. ఆ నిర్ణయం మీద మీ అభిప్రాయం?

అకాడెమీల రద్దు నిర్ణయం పెద్ద తప్పిదం. ఆ నిర్ణయంతో తెలుగువారు చాలా కోల్పోయారు. ఎంతో కీడు జరిగింది. ఎన్నో ఏళ్లు వెనక్కి పోయాం. సాహిత్య అకాడెమి రద్దయినప్పుడు దానికి మా అన్నగారు రామానుజరావు అధ్యక్షులు. ఆయన కేవలం ఇద్దరు ఉద్యోగుల సాయంతో అంతా నిర్వహించారు. రిక్షా మీద తిరిగేవారు. కానీ అకాడెమీ ద్వారా ఎన్నో విలువైన పుస్తకాలు ఎంతో చౌకగా పాఠకులకి అందుబాటులోకి తెచ్చారు. అకాడెమీలను రద్దు చేస్తున్నట్టు తెలియగానే ఒక పెద్దాయన నాటి ముఖ్య మంత్రి ఎన్‌టిఆర్‌ను కలసి ఆ నిర్ణయం సరికాదని, మన అకాడెమీలు చేసినంత సేవ మరెక్కడా ఏ సంస్థ చేయలేదని నచ్చ చెప్పే యత్నం చేసినా ఎన్‌టిఆర్‌ వినలేదని చెబుతారు. భారతం, భాగవతం నాలుగు రూపాయలకే అందించారు. సాహిత్య విమర్శ పుస్తకాలు సరేసరి. అలాగే ఎన్నో ఉపన్యాసాలు ఏర్పాటు చేసి వాటిని కూడా పుస్తక రూపంలోకి తెచ్చింది అకాడెమీ. ఇన్ని చేసిన అకాడెమీ రద్దును తలుచుకుంటే బాధగానే ఉంటుంది. ఆంధ్ర సారస్వత పరిషత్‌ను తీసుకోండి. దాని కృషి కొనసాగవలసిందే. దాని కర్తవ్యం ఇంకా ముగియలేదన్న సంగతి ఒక వాస్తవం.

గ్రాంథికం, శిష్ట వ్యావహారికం, వ్యావహారికం, గ్రామ్యం గురించి ఏమంటారు?

ఇప్పుడు మనం వ్యావహారికమే ఉపయో గిస్తున్నాం. పాఠ్యపుస్తకాలు, అధికారిక లావాదేవీలు అన్నీ వ్యావహారిక భాషలోనే జరుగుతున్నాయి. రాత వరకు ప్రామాణిక భాష అవసరం. నేను రాసేటప్పుడు వచ్చాను, చూశాను, పోయాను అనే రాస్తాను. మాట్లాడేటప్పుడు ఆయా ప్రాంతాల మాండలికం, పడికట్టు తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఏ దేశానికైనా ఒక ప్రామాణిక భాష ఉంటుంది. ఉండాలని నేను అనుకుంటాను. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. మాది వరంగల్‌. నా శ్రీమతి మహబూబ్‌నగర్‌ ప్రాంతం నుంచి వచ్చింది. ఏ సందర్భంలో చూసినా నేను ప్రయోగించే పదాలలో, ఆమె ప్రయోగించే పదాలలో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరిదీ తెలంగాణే. ఇప్పుడు కొన్ని తెలంగాణ టీవీ చానళ్లలో గ్రామీణ తెలంగాణ పదాలను ఉపయోగిస్తున్నారు. మా చిన్నతనంలో పన్యాల రంగనాథరావుగారు ఆకాశ వాణిలో వార్తలు చదివేవారు. అవి వింటే మాండలీకాలు, పడికట్లు ఏమీ గుర్తుకు వచ్చేవే కాదు. అంతా శ్రద్ధగా వినేవాళ్లం. కానీ రచయిత తను రాయదలుచుకున్న విధంగా రాస్తాడు. అది వేరు.

తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖల పనితీరు ఎలా ఉంది?

విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగింది. అక్కడ తెలుగు శాఖల సంఖ్య కూడా పెరిగింది. కానీ గతంలో తెలుగుభాషకు ఉన్న ప్రోత్సాహం ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. ఇది దురదృష్టం.

పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు మాధ్యమం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది?

తెలంగాణలో లేదా పాత హైదరాబాద్‌ స్టేట్‌ పరిధిలో వచ్చిన ప్రతి ఉద్యమానికి భాషే ఊపిరులు ఊదింది. శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగ పడింది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ తొలి ముఖ్య మంత్రి భాషాభిమాని. సాహిత్యాభిమాని. అధికారం లోకి వచ్చిన వెంటనే అధికార భాషా సంఘం ఏర్పాటు చేశారు. తెలుగు పట్ల శ్రద్ధాసక్తులు కనిపిస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి అంశంగా చేర్చాలని ఆదేశాలు జారీ చేయించారు. ఈ ఆదేశాలు ఒక్క రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే పాఠశాలలకే కాదు, ఇక్కడ ఉన్న ఏ తరహా పాఠశాలలకైనా వర్తించేలా చేశారు. ప్రతి పాఠశాల తెలుగును తప్పనిసరి అంశంగా చేర్చి తీరాలి. తెలుగు మహాసభలు నిర్వహించారు. నిజానికి ఇంటర్మీడియెట్‌ దాకా కూడా అమలు చేయాలని అనుకున్నా, కొన్ని సాంకేతిక కారణాలతో అది జరగలేదు.

మాతృభాష ఎవరికైనా సాంస్కృతిక, సామాజిక చిరునామా. దీనిని రక్షించుకోవలసిందే. ఇందుకు ఎలాంటి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయి? ప్రజల స్పందన ఏమిటి? కొత్త తరాలు తెలుగును ఏ విధంగా చూస్తున్నాయి?

ఏ భాష అయినా అభివృద్ధి చెందాలంటే, లేదా ప్రజా జీవితంలో దాని ప్రభావం బలహీన పడకుండా ఉండాలంటే కొన్ని చర్యలు అవసరం. ముందు ఆ భాషలో రాసేవాళ్లకు, పండితులకు, పరిశోధకులకు ప్రోత్సాహం ఇవ్వాలి. కవులకీ, రచయితలకీ, చిన్న పత్రికలకీ అలాంటి సహకారం అందాలి. ఒక కవో, రచయితో ఒక పుస్తకం చాలా కష్టపడి రాస్తాడు. ఇంకెన్నో కష్టాలు పడి ముద్రిస్తాడు. కానీ మార్కెటింగ్‌ వారికి సాధ్యంకాని పని. కాబట్టి ప్రభుత్వం సైటేషన్‌ తరహా నిబంధనలకు లోబడి ప్రతి ప్రచురణను ఐదు వందల ప్రతులను సింగిల్‌ విండో పద్ధతి ద్వారా కొనుగోలు చేయాలి. రచయిత పది శాఖలకు తిరిగే పని ఉండకూడదు. కానీ ఇలాంటిది రాష్ట్రాల స్థాయిలోనే కాదు, కేంద్ర స్థాయిలో కూడా లేదను కుంటున్నాను. ఈ అంశంలో కేరళ నుంచి మనం కొంత తెలుసుకోవచ్చు. అక్కడ రచయితల సహకార సంఘాల ద్వారా పుస్తకాలు ముద్రిస్తున్నారు. వాటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఎక్కడైనా మన ప్రభుత్వాలు వచ్చాయనీ, దానితోనే మాతృభాషకు చాలా సేవ జరిగిందనీ భావించడం సరికాదు. భాషాభివృద్ధి, భాషాసేవ ప్రతితరం స్వీకరించవలసిన బాధ్యతేనని మరిచిపోకూడదు.

పరిచయం

జననం వరంగల్లు పట్టణంలో. తల్లిదండ్రులు ఆండాళమ్మ, వేంకట చలపతిరావు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులు. రాష్ట్ర ప్రభుత్వ సమాచార-పౌర సంబంధ శాఖలో (ఆంధ్ర ప్రదేశ్‌ మాసపత్రిక ప్రచురణ విభాగంలో), రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ మాస్‌ మీడియా విభాగంలో (సంక్షేమవాణి మాసపత్రిక సంపాద కత్వం) సంపాదకులు. ఈనాడు, ఆంధ్రభూమి, వార్త, ప్రజాతంత్ర, నమస్తే తెలంగాణ తదితర పత్రికలలో అనేక సంవత్సరాలు కాలమిస్ట్‌, రచయిత. ‘ఈనాడు’ దినపత్రికతో ఫీచర్‌ రైటరుగా, అనువాదకుడుగా ఇరవయి సంవత్సరాల అనుబంధం. ‘మహాకవి గురజాడ జీవితం-సాహిత్యం’ గ్రంథానికి యునెస్కో అవార్డు. జాతీయ సమైక్యతపై ‘నేను ఎవరు’ పుస్తకానికి భారత ప్రభుత్వ అవార్డు. ‘అల్లూరి సీతారామరాజు’ రేడియో నాటికకు జాతీయ అవార్డు. గోలకొండ, విశాలాంధ్ర పత్రికలలో పలు రచనలు. ప్రత్యేక సంచికలు కొన్నింటికి సంపాదకత్వం. అనువాదాలు, ఉద్యమ రచనలు అనేకం(తెలంగాణ ఉద్యమ పత్రికలకు సంపాదకత్వం). ‘పెన్షనర్స్‌ మూవ్మెంట్‌’ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు.

– పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం-2009 సెప్టెంబరులో.

– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారి సాహిత్య పురస్కారం-2012 సెప్టెంబరులో.

– 2016 ఏప్రిల్‌ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం ఛైర్మన్‌.

ప్రభాకరరావు గారి కొన్ని రచనలు

– గాంధీ శకం

– మన మహనీయులు

– చెప్పుకోదగ్గ మనుషులు

– తెలంగాణ వెలుగుకిరణాలు

– ముక్తసరి

– టిప్పణి – ఖుల్లమ్‌ ఖుల్లా (సమకాలిక పరిణామాలపై విశ్లేషణ, విమర్శ)

– రవి కథ (రవీంద్రనాథ్‌ టాగోర్‌ జీవితచరిత్ర)

– దేవులపల్లి రామానుజరావు(జీవితచరిత్ర)

– సమరం నుంచి స్వాతంత్య్రానికి

– మహాకవి గురజాడ

– కొన్ని వ్యాసాలు.. సంపాదకీయాల సంకలనం…

– పారిజాతాలు -కవితా సంకలనం

– శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం (నూటా పది సంవత్సరాల చైతన్య చరిత్ర)

– జ్ఞాపకాలు…

– మాటకచేరి

– పాళీ కేళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *