ప్రకృతి నుండి ప్రగతి

ప్రకృతి నుండి ప్రగతి

భావనగర్‌ సమీపాన సముద్రతీరంలో విహరిస్తుండగా జెమ్‌షెడ్‌జి పెదవులపై సముద్రపు నీరు వచ్చి పడింది. ‘అబ్బ! ఎంత ఉప్పగా ఉంది!’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, తన సహచర శాస్త్రజ్ఞుడు, ‘ఒక్క ఉప్పేంటి, సముద్రపు నీటిలో పొటాషియం, బ్రోమిన్‌, క్లోరిన్‌, అయోడిన్‌లతో కూడిన ఎన్నో లవణాలు (Chemicals) ఉన్నాయి’ అన్నాడు. పర్యవసానం టాటా కెమికల్స్‌ కంపెనీ స్థాపన.

మానవులు ఆకలి దప్పులు లేకుండా, ప్రకృతి వైపరీత్యాలకూ విపత్తులకూ బలికాకుండా, చల్లగా సుఖంగా ఉంటూ, సహజ శారీరిక శక్తికి మించి పనిచేస్తూ, వైభవోపేతమైన సామాజిక జీవితాన్ని సాధించాలి. అందుకోసం సూర్యుడు, ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రకృతి వనరులను, సంపదను మేధో శక్తితో పరిశీలించి, వాటిని ఉపయోగించి రకరకాల వస్తువులు, ఉత్పత్తులు, సాధనాలను ఉత్పత్తి చేసి మానవ ఉపయోగంలోకి తేవాలి. అనుభవం, ఆలోచ నాత్మక దృష్టి, విశ్లేషణ, ప్రయోగం, అధ్యయనం వంటి ప్రక్రియల ద్వారా శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచుకుంటూ, సాంకేతికతను (Technology) వృద్ధి చేయాలి. ఇటువంటి ప్రయత్నం ద్వారా మేధావులు, మేధస్సు సృష్టి జరుగుతుంది. ఇలా తయారైనవారే శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు. అలా గత నాలుగైదు దశాబ్దాల నుంచి వివిధ దేశాల్లో పరిశోధనలు, ప్రయోగాల ద్వారా మనిషి సాధించిన సృజనాత్మకత, సాంకేతిక ప్రగతి నేడు ప్రకృతి సహజ సృజనాత్మకతకు ప్రత్యామ్నా యంగా పురోగమిస్తోంది.

యుగయుగాల కాలాంతరంలో ప్రకృతి సృష్టించిన నిధులను మానవ మేధోశక్తినుపయోగించి, విలాస సంపదగా, వస్తువులుగా, పరికరాలుగా, అందరికీ అందుబాటులోనికి తేవడానికి, ఉత్పత్తి- వితరణ వ్యవస్థలు కావాలి. ఈ వ్యవస్థల స్థాపనకు పెట్టుబడులు కావాలి. వ్యవస్థను ఊహించేవారు, స్థాపనకు సాహసించేవారూ కావాలి. పరిశోధకులు, శాస్త్రజ్ఞులు, సాంకేతికులూ, వాణిజ్య కంపెనీల స్థాపకులు (Enterprising, Corporation Creators) వంటి వారు కలిసి పనిచేయటం ద్వారా రకరకాల విలాస వస్తువులూ, సేవలూ ప్రజలకు లభిస్తాయి. దీనికి ఉదాహరణ మనదేశంలో వందకు పైగా ఉన్న టాటా కంపెనీల సముదాయం.

జెమ్‌షెడ్‌జి టాటా (జననం 1839 – మరణం 1940), జె.ఆర్‌.డి. టాటా (జననం 1940 – మరణం 1993) లచే వారి వంశజులచే స్థాపితమై, వందకు పైన దేశాలలో కార్యకలాపాలు నడుపుతూ, వందకు మించిన కంపెనీల స్థాపన జరిగింది. సంపద సృష్టి జరిగింది. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. వీటి ఉదంతం ఔత్సాహికులకు మార్గదర్శకంగా ఉంటుంది.

భారతదేశంలోని పత్తిని కొని, ఇంగ్లండ్‌ తీసుకుపోయి, నూలు తీసి, బట్టలు చేసి, మనదేశానికి ఇంగ్లీషు వారు ఎగుమతి చేసేవారు. ‘ఔరా! ఇదేమీ కర్మ’ అని జెమ్‌షెడ్‌జి టాటా 1874లో ముంబయ్‌లో టాటా టెక్స్‌టైల్‌ మిల్లును, 1887లో నాగపూర్‌లో స్వదేశీ మిల్లును స్థాపించారు. స్వదేశీ పదాన్ని ప్రథమంగా ఉపయోగించిన ద్రష్ట పార్సీ సముదాయానికి చెందిన జెమ్‌షెడ్‌జియే.

భారతదేశంలో పుష్కలంగా ఇనుము గనులున్నాయి. శతాబ్దాల నుండి ఇక్కడ ఉక్కు తయారయేది. కాని బ్రిటిష్‌ వాళ్ల పాలన కాలంలో బ్రిటన్‌ నుండి దిగుమతులు పెరగడంతో ఇక్కడి మన ఉక్కు పరిశ్రమ కుదేలైంది. అంటే చంపబడింది. ఇది గమనించిన జెమ్‌షెడ్‌జి టాటా అమెరికా నుండి టెక్నాలజీ పొంది ఉక్కు (స్టీల్‌) పరిశ్రమ స్థాపించారు. ఇది చూసి బ్రిటిషర్‌ అయిన అప్పటి రైల్వే ఛైర్‌మన్‌ ‘ఇండియన్స్‌ స్టీల్‌ తయారు చేస్తారా? అలా చేయగలిగితే వారు ఉత్పత్తి చేసిన ప్రతి కిలో స్టీల్‌ను నేను తింటా’ అని హేళన చేసి, పందెం కట్టి, జెమ్‌షెడ్‌జి దెబ్బకు మట్టికరిచాడు. బీహార్‌లోని సాక్బి గ్రామంలో టాటా స్టీల్‌ కర్మాగారం స్థాపించబడింది.

వైస్‌రాయ్‌ సంతోషించి ఆ గ్రామం పేరు జెమ్‌షెడ్‌పూర్‌గా, ఆ ప్రాంతం, పరిసరాన్ని టాటానగర్‌గా పేరు మార్చాడు. ప్రథమ ప్రపంచ సంగ్రామ కాలంలో టాటా స్టీల్‌ కంపెనీ తయారు చేసిన రైలు పట్టాలను బ్రిటిష్‌ వారు కొని, ఇరాక్‌లో రైల్వే లైన్లు వేశారు. పట్టాల తయారీతో ఆగక, రైల్‌ ఇంజన్లు, లోకోమోటివ్‌ రైల్‌ ఇంజన్‌ల తయారీకీ ముందడుగు వేసి టాటాలు టెల్కో కంపెనీని స్థాపించారు. రైలు పట్టాలపైనే కాక, రోడ్లమీద నడిచే ట్రక్కులూ, కార్ల తయారీ కోసం టాటా మోటార్స్‌ కంపెనీని స్థాపించారు.

భావనగర్‌ సమీపాన సముద్రతీరంలో విహ రిస్తుండగా జెమ్‌షెడ్‌జి పెదవులపై సముద్రపు నీరు వచ్చి పడింది. ‘అబ్బ! ఎంత ఉప్పగా ఉంది!’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, తన సహచర శాస్త్రజ్ఞుడు, ‘ఒక్క ఉప్పేంటి, సముద్రపు నీటిలో పొటాషియం, బ్రోమిన్‌, క్లోరిన్‌, అయోడిన్‌లతో కూడిన ఎన్నో లవణాలు (Chemicals) ఉన్నాయి’ అన్నాడు. పర్యవసానం టాటా కెమికల్స్‌ కంపెనీ స్థాపన.

ఒకసారి జెమ్‌షెడ్‌జి అమెరికా ప్రయాణం ఫిలిప్పైన్స్‌ మీదుగా సాగింది. ఒక అమెరికన్‌ జెమ్‌షెడ్‌జికి ఫిలిప్పైన్స్‌ నుండి ప్రయాణంలో కలిశాడు. ఫిలిప్పైన్స్‌ ఎందుకు వచ్చారని జెమ్‌షెడ్‌జి ఆ అమెరికన్‌ను అడిగారు. అందుకు ఆయన ‘ఈ దేశంలో కోట్ల సంఖ్యలో కొబ్బరి చెట్లున్నాయి. ఇక్కడి నుండి కొబ్బరి కాయలు కొని, అమెరికాకు తీసుకువెళ్లి, వాటితో నూనె తీసి, దేశవిదేశాల్లో విక్రయిస్తాను’ అన్నాడు. అంతే, భారతదేశానికి తిరిగి రాగానే, జెమ్‌షెడ్‌జి కేరళ వెళ్లి, కొబ్బరినూనె తయారు చేయడానికి ‘టామ్‌కో’ (Tata Oil Mills Company) కంపెనీని స్థాపించారు.

ఒకసారి పుణే ప్రాంతంలో విహరిస్తూ సహ్యాద్రి పర్వతాల నుండి జారుతున్న జలపాతాన్ని చూసి ‘అయ్యో! ఎంత జలపాతం. ఊరికే వృధా అయి పోతోంది’ అని బాధపడి, ఆలోచించి, క్రింద టర్బైన్స్‌ పెట్టి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అలా ఏర్పడిందే ‘టాటా ఆంధ్రావ్యాలీ ఎలక్ట్రిక్‌ కంపెనీ’.

బ్రిటిష్‌వారి పాలన కాలంలో తారాస్థాయి (స్టార్‌) హోటళ్లలోకి బ్రిటిషర్లు భారతీయులను రానిచ్చేవారు కాదు. మీ హోటళ్లను మించిన హోటళ్లను మేం కట్టి నిర్వహించగలమని జె.ఆర్‌.డి. టాటా ముంబయ్‌లో తాజ్‌మహల్‌ హోటల్‌ను కట్టి ప్రపంచ విఖ్యాతిని దానికి సంపాదించారు.

భారతదేశంతో మొట్టమొదటి విమానయాన కంపెనీని స్థాపించి, ప్రథమ వాయు విహంగాన్ని స్వయంగా జె.ఆర్‌.డి. టాటాయే కరాచీ నుండి ముంబాయికి నడిపారు.

పారిశ్రామికంగా, వైజ్ఞానిక-సాంకేతికంగా భారతదేశం స్వయంశక్తిని సృష్టించుకోవాలని, అలా అయితేనే భారతదేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకుని, నిలబెట్టుకోగలుగుతుందని టాటా వంశపు నమ్మకం. జెమ్‌షెడ్‌జి టాటా తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని వైస్‌రాయ్‌కిచ్చి, బెంగళూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ను స్థాపించారు. 1940 దశకంలోనే ముంబయ్‌లో టాటా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ను హోమీ భాభా దర్శకత్వంలో స్థాపించారు. ఆ సంస్థలో నుంచే భారత ప్రభుత్వం ద్వారా భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌, ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌, ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన దిగ్గజ సంస్థలు ఉద్భవించాయి.

స్త్రీల సౌందర్యం కోసం ఫేస్‌పౌడర్‌ తయారుచేసే ‘లాక్మె’ కంపెనీ (ఇందిరాగాంధీ 1952లో ఇచ్చిన సలహా మేరకు), సామాన్యుల ఉల్లాసం కోసం టాటా టీ (తేనీరు) కంపెనీని స్థాపించారు. భగవద్గీత పదో అధ్యాయంలోని విభూతులను తలపించే విధంగా ఉత్తమ గుణవత్తరమైన యంత్రాలను, వస్తువులనూ, వ్యవస్థలనూ, సేవలను అందించడమే టాటా కంపెనీల ధ్యేయం.

భారతదేశం ఒక మేధో-పారిశ్రామిక సంపన్న శక్తిగా వికసించాలనే లక్ష్యంతో టాటా వంశస్థులు రకరకాల ఉత్పత్తుల కోసం 100కు పైగా కంపెనీలు స్థాపించారు. టాటా సన్స్‌ అనేది మాతృసంస్థ. టాటా కంపెనీల్లో అతిపెద్దది టాటా కన్సల్టింగ్‌ సర్వీసెస్‌. స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో దాని మూల్యాంకనం 5 లక్షల కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో ఉంది. 147 దేశాల నుండి వచ్చిన 4,11,000 సిబ్బంది, 46 దేశాల్లో పనిచేస్తూ, దాదాపు 1,50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మన దేశానికి సమకూరు స్తున్నారు. ఐ.టి. రంగంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గౌరవం తెస్తున్నారు.

టాటాల వలె దేశభక్తి, దూరదృష్టి, నైతికత ఉన్న కంపెనీలు ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను, మానవ మేధోశక్తిని ఉపయోగించి భారతదేశంలో సంపదను సృష్టించడానికి కృషి చేయాలి.

– డా.త్రిపురనేని హనుమాన్‌ చౌదరి,  ప్రముఖ సాంకేతిక నిపుణులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ సాంకేతిక సలహాదారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *