దివాకర నమస్తుభ్యం.. ప్రభాకర నమోస్తుతే

దివాకర నమస్తుభ్యం.. ప్రభాకర నమోస్తుతే

యశోధర్ముడనే రాజుకి వార్ధక్యంలో రోగగ్రస్తుడైన కుమారుడు జన్మించాడు. కుమారుని రోగానికి కారణమేమిటని రాజు పండితులని అడిగాడట. ‘నీ కుమారుడు గత జన్మలో మహా ధనికుడు, పరమ లోభియైన వర్తకుడు. ఏనాడూ ఓ చిల్లిగవ్వను కూడా దానం చెయ్యలేదు గానీ,  అతను అదృష్టవశాన రథ సప్తమి వ్రతం చూశాడు. దాని పుణ్యఫలంగానే ఈ జన్మలో నీ కుమారుడిగా జన్మించే అదృష్టం వరించింది, ఇతనితో రథసప్తమి వ్రతం చేయించండి’ అని పండితులు చెప్పారట.

ఉత్తరాయణంలో వసంతపంచమి తర్వాత రెండు రోజుల్లో వచ్చే మాఘ శుక్ల సప్తమిని రథసప్తమిగా పిలుస్తారు. ఆ రోజే సూర్యజయంతి కూడా. భూలోకానికి ప్రత్యక్ష దైవం, లోక సాక్షి, ఆరోగ్య ప్రదాత, ప్రాణకోటిలో చైతన్యం నింపుతున్న సూర్యుడు పుట్టిందీ ఈ రోజునే. జన్మిస్తూనే భూగోళానికి ప్రథమ దర్శనమిచ్చి తన రథాన్ని అధిరోహించాడని మత్య్సపురాణంలో ఉంది. చలి తగ్గడం రథసప్తమి నుండే ప్రారంభమవుతుంది.

‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అన్నారు మన పూర్వులు. వేదాల్లో సూర్యదేవతా సూక్తంలో సూర్యశక్తి గురించి వివరంగా ఉంది. సూర్యోపాసన, ఆరాధన, సూర్య నమస్కారాల వల్ల చర్మ, అస్థి, హృదయ సంబంధ వ్యాధులు నయమవుతాయి. అందువల్లనే వేదకాలం నుండి సూర్యారాధన ఉంది. ఆరోగ్యానికి, స్వస్థతకి రథసప్తమి వ్రతాన్ని సూచించారు మన మునులు. భవిష్య పురాణంలో ఆ వివరాలన్నీ ఉన్నాయి.

స్నాన విధి

షష్ఠినాటి రాత్రి ఉపవాసం చేసి సప్తమి నాడు అరుణోదయాన స్నానం చేసి, సూర్యోపాసన చేయటం వల్ల ఏడు జన్మల పాపం నశించిపోతుందని ధర్మ సింధువు చెబుతోంది. రాగి, వెండి, బంగారం లాంటి ఏదైనా లోహంతో పల్చని రేకు తయారు చేసి, దాన్ని దీపపు ప్రమిదగా మలిచి, అందులో రెండు వత్తులు వేసి, నేతితో దీపం వెలిగించాలి. ఆ వెలుగుతున్న దీపాన్ని తలపై పెట్టుకొని సూర్య ధ్యానంతో సరస్సులో, చెరువులో లేక నదిలో జాగ్రత్తగా నీటిలో తేలేట్లుగా వదిలి, స్నానం చెయ్యాలి. అవకాశం ఉన్నవాళ్లు సముద్రస్నానం కూడా చెయ్యవచ్చు. జిల్లేడు ఆకులు, రేగు పండుని తలపై ఉంచుకుని స్నానం చెయ్యటం ఆచారం.

ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మంత రార్జితం

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతజ్ఞాతే చ యే పునః

అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చెయ్యాలి. తరువాత సూర్యుడికి ముమ్మారు అర్ఘ్యం ఇస్తూ ఈ క్రింది మంత్రం స్మరించుకోవాలి.

సప్తమీ వహప్రీత సప్తలోక ప్రదీపన |

సప్తమీ సహితోదేవ గృహాణార్ఘ్యం దివాకరః ||

ఆ తరువాత సప్తమీ తిథికి నమస్కరించాలి. ‘ఓ మాఘ శుక్ల సప్తమీ మాతా నీవు సూర్యుని తల్లివి, వందనీయవు. నా ప్రణామాలు స్వీకరించు అని చెప్పుకున్న తర్వాత ‘పితృదేవతలారా! మీకిదే తర్పణం’ అంటూ మూడుసార్లు నీళ్లు విడిచిపెట్టాలి.


మన దేశంలో  సూర్య దేవాలయాలు

ఎన్నో యుగాల క్రితం ఇంద్రుడు అరసువెల్లిలో ప్రతిష్ఠించిన సూర్యనారాయణ మూర్తి ఇప్పటికీ పూజలందుకుంటున్నాడు. కుంభకోణానికి 22 కి.మీ. దూరంలో ఉన్న సూర్యదేవాలయం కూడా దక్షిణాదిలో మరో ప్రముఖ పుణ్యక్షేత్రం. వేల కొద్దీ భక్తులు ప్రతినిత్యం ఇక్కడ సూర్యభగవానుడిని దర్శించు కుంటారు. ఖజురహోలో పూజలు జరుగుతున్న సూర్యదేవాలయంలో విష్ణు విగ్రహమే ఉంది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోణార్క్‌ దేవాలయ గర్భ గుడిలో సూర్యుడు గోళాకారంలో, గాలిలో తేలియాడేవాడని కథనం. ఆ గోళాన్ని ఎన్నో విధాలుగా చివరకు బల ప్రయోగం ద్వారా కూడా క్రిందికి దింపలేకపోయారట. ఎన్నో రోజులు ఆలోచించి గర్భగుడి పైకప్పు, మూడు వైపులా గోడల్ని పడగొట్టించిన తర్వాత, వాటిలోని అయస్కాంతాలు బయట పడటం, ధాతు రూపంలోని సూర్యగోళం నెమ్మదిగా క్రిందపడడంతో దాన్ని తనతో తీసుకు పోయాడట ముస్లిమ్‌గా మారిన ‘కళా పహడ్‌’ అనే అప్పటి బెంగాల్‌ సైన్యాధిపతి. సోలంకీ రాజులు కట్టించిన ‘మోథేరా సూర్య దేవాలయం’లోని గర్భ గుడిలో సూర్యుడు, రథం, సప్తాశ్వాలు బంగారంతో చేసినవి ఉండేవట. ఇవన్నీ కలిపి ఒకేపోతలో తయారు చేసి మెరుగులు దిద్దినవట. ఈ బంగారు విగ్రహాలను చూసి దేశ, విదేశాల యాత్రీకులు అబ్బురపడేవారట.


పూజా విధి

ఆపైన పొడి వస్త్రాలు ధరించి, పాలు పొంగించాలి. తూర్పు దిశగా కుంపటి పెట్టి పొంగుతున్న పాలలో నేయి కలిపిన బియ్యం వేసి చెరుకు ముక్కతో కలియబెడుతూ పొంగలి తయారు చేస్తారు. పిడకలు లేదా కుంపటి ఉపయోగించి ఈ పొంగలిని తయారు చెయ్యటం ఆచారంగా వస్తోంది. ఈ పొంగలిలో ఖర్జూరం, కిస్‌మిస్‌, జీడిపప్పులాంటి ఎండిన పళ్లు కూడా వేస్తారు. పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి, రథం ముగ్గు వేసిన పీటను ముందుగానే సిద్ధం చేసుకుంటారు. రెండు చిక్కుడుకాయలు లేదా 5/9/13 సంఖ్యతో చిక్కుడు గింజలు, పుల్లలతో తయారు చేసిన సూర్యరథాన్ని ఆ పీటపైన ఉంచుతారు. సూర్యుడికి నైవేద్యాన్ని చిక్కుడు ఆకులలో నివేదించడం ఆరోగ్యప్రదం. ఈ చిక్కుడు సూర్యరథాన్ని కొత్త సిల్క్‌ లేదా కాటన్‌ దారంతో కట్టి ఇంట్లో వారంతా కొద్ది దూరం లాగుతారు. పొంగలితో పాటు చెరుకు ముక్కలు, రేగుపళ్లు, అరటి పళ్లు, కమలా పళ్లను నివేదించి, ధూప, దీప హారతులతో, పూలతో సూర్య భగవానుని ఆరాధిస్తారు. ఆపైన దక్షిణ, తాంబుల ఫలాలు ఇచ్చి బ్రాహ్మణుని సత్కరిస్తారు. సూర్యోదయమైన ఒక గంట లోపు స్నానం చెయ్యటం, పొంగలి పెట్టటం, పూజ పూర్తి చేయడం చేస్తే విశేష శుభప్రదమని పెద్దలు చెబుతారు. అదితి, కశ్యప మహర్షుల పుత్రుడైన సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఈ రోజున గాయత్రి మంత్రంతో పాటు సూర్యాష్టకం, సూర్య సహస్ర నామాలు, సూర్య శతకంతో పాటు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఆయురారోగ్యాలు, ధనలాభం, శతృవిజయం కలుగుతాయి.

ఆది దేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరాః |

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ||

అనే శ్లోకాన్ని పూజానంతరం స్మరించుకోవాలి.

సూర్య రథం

సూర్యుని రథానికి 12 చక్రాలని, అవి సంవత్సరంలోని 12 నెలలకు ప్రతీకలని కొందరి అభిప్రాయం. అయితే సూర్య రథానికి చక్రం ఒక్కటేనని అది ఒక సంవత్సర కాలానికి ప్రతిబింబమని, ఆ చక్రంలోని ఆరు ఆకులు ఆరు ఋతువులకు ప్రతీకలని, రథానికి కట్టిన ఏడు గుర్రాలు ఏడు రోజులకు, సూర్యకాంతిలోని సప్త వర్ణాలకు చిహ్నాలు అని మన పూర్వీకులు వర్ణించారు. రథ సప్తమి నాడు సూర్యోదయ కాలంలో గ్రహ, నక్షత్ర కూడలి ఆకాశంలో రథాకారంలో ఉంటుందని అందుకే ఈ రోజు రథసప్తమి నామాన్ని సంతరించు కుందని కొందరి భావన.

సప్తాశ్వ రథమారుఢం ప్రచండ కశ్యపాత్మజం |

శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌||

రథసప్తమి మహాత్యం

పూర్వం కాంభోజ దేశంలో యశోధర్ముడనే రాజుకి ఎన్ని పూజలు చేసినా సంతానం కలుగలేదట. అయితే వార్ధక్యంలో ఉండగా రోగగ్రస్తుడైన ఓ కుమారుడు జన్మించాడు. కుమారుని రోగానికి కారణమేమిటని రాజు పండితులని అడిగాడట. ‘నీ కుమారుడు గత జన్మలో మహా ధనికుడు, పరమ లోభియైన వర్తకుడు. ఏనాడూ ఓ చిల్లిగవ్వను కూడా దానం చెయ్యలేదు గానీ, అతను అదృష్టవశాన రథ సప్తమి వ్రతం చూశాడు. దాని పుణ్యఫలంగానే ఈ జన్మలో నీ కుమారుడిగా జన్మించే అదృష్టం వరిం చింది. ఈతనితో రథసప్తమి వ్రతం చేయించండి’ అని రాజుకు పండితులు సలహా ఇచ్చారట.

ఆ రాజు కుమారుడితో రథసప్తమి వ్రతం చేయించగా, కుమారుడు క్రమంగా రోగ నివారణ పొంది, పెరిగి పెద్దయి రాజుగా అభిషిక్తుడై, క్రమంగా చక్రవర్తి బిరుదు పొంది చాలా సంవత్సరాలు జనరంజకంగా పరిపాలన చేశాడట.

మకర సంక్రాంతి పుణ్య ఘడియలలో ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు మాఘ శుద్ధ సప్తమి నాడు మానసికంగా రథసప్తమిని ఆచరించి, ఆ మరునాడు ఇచ్ఛామరణం పొంది శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడని పురాణ ప్రశస్తి. అందువల్ల ఆ రోజు భీష్ముడికి చాలామంది తర్పణం విడుస్తారు. మనమంతా జ్ఞప్తిలో ఉంచుకొని ఆచరించవలసిన మరో పుణ్యప్రదమైన కార్యమిది.

బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో జరిగే ‘ఛత్‌ పూజ’ కూడా సూర్యోపాసనే. ఈ సూర్యారాధన మనదేశంలోనే కాకుండా చైనా, ఈజిప్ట్‌ దేశాల్లో కూడా ఉంది.

యదా జన్మకృతం పాపం

మయా జన్మసు జన్మసు

తన్మే రోగంచ శోకంచ

మాకరీ హంతు సప్తమీ

– డా.మరుదాడు అహల్యాదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *