బాధ్యతను గుర్తు చేసిన బాధ

బాధ్యతను గుర్తు చేసిన బాధ

ఈస్టర్‌ ఆదివారం మిగిల్చిన విషాదంతో శ్రీలంక ప్రభుత్వం సోమవారం రాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశమంతా శోక సంద్రంలో మునిగి ఉంది. వరుస బాబు పేలుళ్లతో ప్రజలు కకావికలయ్యారు 9/11 నాటి బాధాకరమైన జ్ఞాపకాలు అందరిని వెంటాడడం మొదలుపెట్టాయి. జాతి యావత్తు దుఃఖం, బాధలో మునిగి ఉంది.

శ్రీలంకలోని పలు ప్రాంతాలలో ఉన్న చర్చ్‌లలో ఆదివారం ఈస్టర్‌ పండుగ కు క్రైస్తవులు ప్రార్థనల కోసం సమావేశమై ఉండగా 10 గంటల వ్యవధిలో సంభవించిన ఆరు విస్ఫోటనాలు ఆ దేశ మత సామరస్యానికి విఘాతం పరిణమించాయి. కొలంబో, నెగోంబో, బట్టికలోవ నగరాలలో ఉన్న మూడు ప్రసిద్ధమైన చర్చ్‌లు, విదేశీయులు తరచుగా కొలంబోలో బసచేసే అత్యంత విలాస వంతమైన హోటళ్లు షాంగ్రీలా సినామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరిలు బాంబు దాడులకు గురయ్యాయి. క్రైస్తవుల ప్రార్థన సమావేశాలపై జరిగిన ఆత్మాహుతి బాంబుదాడుల ఘటనలు ప్రపంచ దేశాలకు ఆగ్రహం కలిగించాయి. మతపరమైన అసహిష్ణు తకు ద్వారాలు తెరిచినట్టయింది.

దాడులు జరిగిన తరువాత శ్రీలంక బాంబు స్క్వాడ్‌లు విస్తృతమైన గాలింపులు జరిపి పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులపై శ్రీలంక ప్రభుత్వం మౌనం పాటిస్తుండగా అక్కడి నెటిజన్లు (సోషల్‌ మీడియా) మాత్రం ప్రభుత్వం చేతకానితనాన్ని ఎండగడుతున్నారు. శ్రీలంకంలో జరిగిన బాంబు పేలుళ్లను పరిశీలిస్తే ఈ చర్యలు స్థానిక తీవ్రవాదులు మాత్రమే చేసినట్టు భావించేవిగా లేవు. 2014 సంవత్సరం నుండి శ్రీలంకలో ఇస్లాం రాడికల్‌ గ్రూపులు చురుకుగా పనిచేస్తున్నాయి.

ఇస్లాం తీవ్రవాద కదలికల గురించి గతంలోనే భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి తన అనుమానాలను వ్యక్తం చేసింది. ఇస్లాం తీవ్రవాదులు మీ దేశంలోకి ప్రవేశించడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని హెచ్చరించింది. 2004 సంవత్సరంలో వచ్చిన సునామీ తర్వాత లష్కర్‌-ఎ-తాయిబాకు చెందిన అక్కడి ధార్మిక సంస్థ ఇదారికిద్మత్‌-ఎ-కలాక్‌ బాధితులను ఆదుకుంటా మన్న ముసుగులో శ్రీలంకలో అడుగిడింది. అప్పటి నుండి లష్కర్‌ ఏ తాయిబా తీవ్రవాద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారతదేశాన్ని అన్నివైపుల నుంచి చుట్టు ముట్టడానికి ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీస్‌ ఇంటలిజెన్స్‌) తన కార్యకలాపాలను విస్తరించింది. ముఖ్యంగా బంగాళాఖాతం ప్రాంతంలోని మాల్దీవులలో, శ్రీలంకలో, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, నేపాల్‌ దేశాలలో తన పనిని విస్తరించింది.

సెప్టెంబర్‌ 2016లో ఒక శ్రీలంక జాతీయుడిని భారత నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఈ వ్యక్తి శ్రీలంకలో ఉన్న పాకిస్తాన్‌ దౌత్య కార్యాలయానికి సాయంగా గూడచర్యం చేస్తున్నాడు. శ్రీలంక నిర్లిప్తత వలన ఐఎస్‌ఐ శ్రీలంకలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంలో సఫలమైంది. క్రమంగా అల్‌ కాయిదాలో తమ పౌరులకు చేరుతున్నట్టుగా శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందుతూనే ఉంది. ఇద్దరు శ్రీలంక పౌరులు సిరియా వచ్చి ఐఎస్‌ శ్రేణులలో చేరినందుకు 2015 సంవత్సరంలో ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రచార పత్రిక ప్రశంసించింది. ఈ సంఘటన శ్రీలంక యువతను రాడికలిజం వైపు ఆకర్షించింది. గత సంవత్సరం ఇస్లామిక్‌ గ్రూపు ఎన్‌టిజె (నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌) శ్రీలంకలో ఉన్న బుద్ధుని విగ్రహానికి అపచారం చేసి దేశ ప్రజల దృష్టిలో పడింది.

2012 సంవత్సరం నుండి మెజారిటీ ప్రజలైన బౌద్దులకు, మైనారిటీలైన ఇస్లాం వారికి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ కలహాల వలన శ్రీలంకలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లింది. పేలుళ్లు జరిగిన కొన్ని గంటలలోనే ఏ శ్రీలంక పరిశీలకులు వీటికి బౌద్ధ సంఘం బోడు బాలసేన (బిబిఎస్‌) కారణమెమో అని అనుమానించింది.

కైస్ట్‌చర్చ్‌ ప్రాంతంలోని రెండు మసీదులలో కొద్దికాలం క్రితం జరిగిన విచక్షణా రహితమైన కాల్పుల ఘటనకు ఈస్టర్‌ బాంబు పేలుళ్లు ప్రతీకారం కావచ్చని కొందరు పరిశీలకులు అనుమానిస్తున్నారు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లు ఆసియా వాసులకు, ముంబయిలో 26/11 జరిగిన బాంబు దాడులను జ్ఞప్తికి తెచ్చాయి. ఈ ఘటనలో స్థానిక రాడికల్స్‌తోపాటు ఇస్లామిక్‌ గ్రూపులు కలిసి పని చేసినట్లుగా స్పష్టమవుతున్నది.

పేలుడు సంభవించిన తరువాత శ్రీలంక ప్రభుత్వం ఎవరి మీద అనుమానమున్నది, ఎవరు బాధ్యులు అనే విషయాల గురించి ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉండిపోయింది. కాని ఇలా చర్చిలలో పేలుళ్లు జరగవచ్చని విదేశీ నిఘా విభాగం శ్రీలంక ప్రభుత్వానికి హెచ్చరికలు పంపిందని అంతర్జాతీయ మీడియా మాత్రం పేర్కొంది. ప్రేలుడు జరిగిన మరుసటి రోజు శ్రీలంక టెలికమ్యునికేషన్‌ మంత్రి ఈ విషయాలు నిజమే అని ప్రకటించాడు. ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందినప్పటికీ తగు భద్రతా చర్యలు తీసుకోలేక పోవడం వలన ఇన్ని ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ప్రజలు ఎల్‌టిటిఇ వైపు కూడా అనుమానంగా చూస్తున్నారు. గతంలో వీరు క్రైస్తవులపై మానవ బాంబులను ప్రయోగించిన సంఘటనలు ఉన్నాయి. పోలీసుల నిర్లిప్తత వలన శ్రీలంకలో ముస్లిం రాడికలిజం వేళ్లూనుకుంది. సింహళీయలకు ముస్లిములకు వైరమున్నది నిజమే. ఎట్టకేలకు శ్రీలంక ప్రభుత్వం ఈ మానవ బాంబు దాడులలో ఎన్‌టిజె హస్తముందని ప్రకటించింది.

నిఘా విభాగాల నుండి సమాచారం చేతికి అందినప్పటికీ తగు జాగ్రత్తలు పాటించలేదంటే శ్రీలంక జాతీయ రాజకీయాలలో విభేదాలున్నవని అర్థమవుతుంది. ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ ‘ఈ విషయం నాకు చెప్పలేదు’ అని ప్రకటించాడు. ఈ దాడులకు సంబంధించి భారతదేశం కూడా శ్రీలంకను మూడుసార్లు హెచ్చరించింది.

ఏప్రిల్‌ 4న మొదటిసారి, పేలుడు జరగడానికి ఒక రోజుముందు రెండవసారి, కొన్ని గంటల ముందు, అంటే ప్రేలుడు జరిగే ముందు కూడా మూడవసారి భారత్‌ పొరుగు దేశాన్ని హెచ్చ రించింది. శ్రీలంకలో ఉన్న రాజకీయ అనిశ్చితి వల్ల ఇస్లాం రాడికలిజం వ్యాపించడానికి అవకాశం లభించింది. నిఘా వ్యవస్థలు జహ్రాన్‌ హషీమ్‌కు, కొయంబత్తూరులో పని చేస్తున్న ఐఎస్‌ఐఎస్‌ కార్యకర్తలతో ఉన్న సంబంధాల గురించి విచారిస్తున్న సమయంలో తెలిసిన సమాచారాన్ని బట్టి శ్రీలంక ప్రభుత్వాన్ని భారత్‌ హెచ్చరించింది.

షాంగ్రీ-లా హోటల్‌లో మొదటి బాంబు పేలిన వెంటనే దీని వెనక సూత్రధారి తీవ్రవాదీ మౌల్వీ జహ్రాన్‌ హషీమ్‌ అని శ్రీలంక పోలీసులు గుర్తించారు. హషీమ్‌ ఎన్‌టిజె వ్యవస్థాపకుడు. హషీమ్‌ తన యూట్యూబ్‌ ఉపన్యాసాల వల్ల ముస్లిం యువతలో మంచి పలుకుబడి కలిగి ఉన్నాడు. దాడులు జరిగిన కొంత సమయానికే సిఎన్‌ఎన్‌ న్యూస్‌ ఏజెన్సీ, పేలుళ్ల తరువాతి లక్ష్యం కొలంబలో ఉన్న భారత దౌత్య కార్యాలయమే కావచ్చునని అనుమానలు వ్యక్తం చేసింది. 2017లో హషీమ్‌ బుద్ధునిపై అవమానకర వ్యాఖ్యల చేసి వెలుగులో వచ్చాడు. అప్పుడు శ్రీలంక ప్రభుత్వం కళ్లు, చెవులు పనిచేయలేదు. హషీమ్‌ ఎప్పుడూ తీవ్రవాదం గురించే బోధించేవాడు. ఆ పేలుళ్లకు తామే బాధ్యులమని మంగళవారం నాడు ఐఎస్‌ ప్రకటిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో హషీమ్‌ ఏడు గురు ఆత్మాహుతి దళ సభ్యులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న దృశ్యం కనిపిస్తున్నది.

తాజా నివేదికల ద్వారా తెలిసినదేమంటే హషీమ్‌ క్రమం తప్పకుండా పడవలో భారతదేశానికి వస్తూ, పోతూ ఉండేవాడు. యువత మెదళ్లలో తీవ్రవాదం జొప్పించే వీడియోలన్నీ భారతదేశంలోనే చిత్రీకరించే వాడు. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవాడు. లభించిన ఆధారాలను బట్టి ఎన్‌టిజెకు, దక్షిణ భారతదేశంలోని ఇస్లామిక్‌ సంస్థలతో (తమిళనాడు) దగ్గరి సంబంధాలున్నాయి.

ఈస్టర్‌ పండుగ రోజున చర్చిలపై దాడులు జరిపి మతద్వేషాలకు ఆజ్యం పోశారు. 2009లో శ్రీలంకలో సివిలోహర్‌ ముగిసింది. బౌద్ధుల ఒక సంస్థకు రాడికల్‌ ఇస్లామిస్ట్‌లకు 2012 నుండి గొడవలు జరుగుతున్నాయి. శ్రీలంక జనాభాలో 10% ముస్లిములు ఉన్నారు. క్రైస్తవులపై ఎప్పుడూ ఎవరూ దాడులు చేయలేదు. కాని ఈ మధ్య జరిగిన దాడి వారిని బలహీనులుగా చేసింది.

2009 సంవత్సరం తరువాత శ్రీలంక ఆర్థికస్థితి బలపడసాగింది. దాని జిడిపి 5.8% చేరుకుంది. మధ్యతరగతి దేశంగా మారింది. పేద ప్రజలను దారిద్య్రరేఖ నుండి పైకి తీసుకువచ్చారు. స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్ల దేశం ఆర్థికంగా నిలదొక్కు కుంది. పశ్చిమ దేశాల నుండి టూరిస్ట్‌లు శ్రీలంకకు ఎక్కువగా వెళ్తుంటారు. ఇప్పుడు జరిగిన బాంబు పేలుళ్ల వలన శ్రీలంక టూరిజం తగ్గింది. ఉగ్రవాద బాధితులకు శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇద్దరూ క్షమాపణలు చెప్పినప్పటికీ రాబోయే సాధారణ ఎన్నికలలో వీరిద్దరూ తగు మూల్యం చెల్లించుకోక తప్పదు. సింహళ బౌద్ధులు రాజపక్సకు మద్దతుగా గెలిపించగలరు. శ్రీలంక చైనాకు అప్పులు చెల్లించవలసి ఉంది. శ్రీలంక మానవబాంబు దాడులలో పాల్గొన్న తొమ్మిదిమంది లంకేయులు కూడా ఎగువ మధ్య తరగతివారే. సమాజంలోని పేదవారే తీవ్రవాదులలో చేరుతారనే సిద్ధాంతం ఇక్కడ దారుణంగా విఫలమైంది. ఉన్నత చదువులు చదివినవారే ఇస్లామిక్‌ రాడికలిజంలో చేరుతున్నారు.

శ్రీలంకలో జరిగిన దాడిలో 253 మంది చనిపోగా 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఆసియాలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఇదొక సవాలుగా మారింది. ఇస్లామిక్‌ టెర్రరిజం పెరిగిన కొలది అది ఈ ప్రాంతపు ప్రశాంతతను, భద్రతను నాశనం చేస్తుంది. ఇరాక్‌, సిరియాలలో క్షీణించిన ఐఎస్‌ ఈ పేలుళ్లకు బాధ్యత తీసుకోవడం, ఈ ఘటనలో ఊహించని మలుపు. దురదృష్టవశాత్తు చైనా వీరికి పరోక్షంగా మద్దతును కొనసాగిస్తున్నది. మన ఇరుగు పొరుగు దేశాలలో పెరుగుతున్న ఇస్లాం రాడికలిజంవలన మనదేశ భద్రతకు కూడా ముప్పు రావచ్చు. ఇప్పటి నుండే టెర్రరిజంను అణచివేయడానికి మన ఆలోచనలను దగ్గరగా ఉన్న దేశాలను కలుపుకొని ముందుకు పోవాలి.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *