రఫేల్‌ చిక్కుల్లో రాహుల్‌

రఫేల్‌ చిక్కుల్లో రాహుల్‌

అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటే ఇదే. అబద్దాన్ని పదే పదే చెప్పినంతమాత్రాన అది నిజమై ప్రజలు నమ్ముతారనుకోవడం అత్యాశే అవుతుంది. పైగా అత్యున్నత స్థానాలకు ఆ అబద్ధాన్ని ముడిపెట్టి ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తుందని ప్రధాన ప్రతిపక్షం అధినేతకు అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. పైగా కోర్టు చేతిలో మొట్టికాయలు తిని దేశ ప్రజల దష్టిలో చులకనైపోయారు రాహుల్‌ గాంధీ. మరోవైపు రాహుల్‌ నామినేషన్‌ పత్రాలు కూడా వివాదానికి దారి తీశాయి. తన పౌరసత్వం, విద్యార్హతల విషయంలో దేశ ప్రజలు అనుమానించే దుస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఎంతటి రాద్ధాంతానికి అయినా ఒక హద్దు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించి జనాలను రెచ్చగొట్టి లబ్దిపొందాలని ప్రయత్నించడం సహజం. కానీ కల్పిత కథనాలతో జనాలని మభ్యపెట్టాలనుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ అందుకు తొందరగానే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

అబద్దాల వేటలో ప్రావీణ్యం

తిమ్మిని బమ్మిని చేసి మభ్యపెట్టే విద్యలో మాస్టర్‌ డిగ్రీ సాధించే ప్రయత్నంలో ఉన్నారు రాహుల్‌ గాంధీ. పదేపదే అవాస్తవాలను ప్రచారంలో పెట్టి ప్రజలను నమ్మించాలని కంకణం కట్టుకున్నారాయన. దేశ భద్రత, రక్షణ రహస్యాలకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని అనవరసంగా వివాదాల్లోకి లాగారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని కొంత కాలంగా ప్రచారం చేస్తున్నారు రాహుల్‌ గాంధీ. ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి లబ్ది చేకూర్చారనేది ఆయన చేస్తున్న ఆరోపణ.

ప్రధాని మోదీ తాను దేశానికి చౌకీదార్‌ (కాపలాదారు) నని చెప్పకుంటారు. తాను అధికారం చేపట్టిన తర్వాత గత కాంగ్రెస్‌ పార్టీ దోపిడీకి అడ్డుకట్టపడిందని, దేశ సంపదకు తాను చౌకీదార్‌గా వ్యవహరిస్తున్నానని చెబుతుంటారు.

అయితే రాహుల్‌గాంధీ ‘కాపలాదారు’ అనే ప్రధాని మాటను తనకు అనుకూలంగా మార్చు కుందామని భావించి, రఫేల్‌ వ్యవహరంలో కాపలాదారుడే అసలు దొంగ అని ఆరోపించారు. తప్పులో కాలేశారు. ప్రధాని పదవికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ ప్రతి సమావేశంలోనూ తమ పార్టీ కార్యకర్తలతో నినాదాలు చేయిస్తూ అదోరకమైన ఆనందాన్ని పొందుతున్నా రాయన.

కోర్టు తీర్పునే వక్రీకరించేశారు

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును తిరిగి సమీక్షించాలంటూ ప్రశాంత్‌ భూషణ్‌, యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్‌ 10వ తేదీన ప్రధాన న్యాయస్థానం విచారణ చేపట్టింది. అవినీతి జరిగిందనేందుకు ఆధారాలుగా హిందూ పత్రిక ప్రచురించిన రహస్య పత్రాలను వారు కోర్టుకు సమర్పించారు. ఇందుకు కేంద్రప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగానే విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోయ్‌ నేతత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.

అయితే సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ రాహుల్‌ గాంధీ అతి తెలివి ప్రదర్శించారు. ‘వాయుసేనకు చెందిన సొమ్మును అనిల్‌ అంబానీకి ఇచ్చారని తాను చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించింది, చౌకీదారే చోర్‌ అని అంగీకరించింది, ఇందుకు సంతోషిస్తూ, సుప్రీంకోర్టుకు కతజ్ఞతలు తెలుపు తున్నాను. సుప్రీంకోర్టు న్యాయం గురించి మాట్లా డింది. న్యాయం నిలబడింది’ అని పేర్కొన్నారు.

సుప్రీం మొట్టికాయలు

సుప్రీంకోర్టు చేయని వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ ప్రచారం చేయడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా పేర్కొంటూ కొన్ని వ్యాఖ్యలను రాహుల్‌ ప్రచారం చేశారని, అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆరోపిస్తూ భాజపా ఎంపీ మీనాక్షి లేఖి పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పుకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ పై ఏప్రిల్‌ 15వ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రాహుల్‌ వ్యవహారాన్ని తప్పుపట్టింది, తాము ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజయ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో తమకు ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్‌ 22లోపు వివరణ ఇవ్వాలని రాహుల్‌గాంధీని ఆదేశించింది.

సుప్రీంకోర్టు మొట్టికాయలతో స్ప హలోకి వచ్చిన రాహుల్‌ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు దురదష్టకరమని, ప్రధాని మోదీని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎన్నికల ప్రచార వేడిలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులు వక్రీకరించారని వివరణ ఇచ్చుకున్నారు.

ఏప్రిల్‌ 23న మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం రాహుల్‌ విచారంపై సంతప్తి వ్యక్తం చేయలేదు. ఆయనకు కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది.

తనపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ 29న అఫిడవిట్‌ దాఖలు చేశారు. చౌకీదార్‌ చోర్‌ అనే వ్యాఖ్యలను సుప్రీం తీర్పునకు ఆపాదించడంపై మరోసారి విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. రఫేల్‌ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. న్యాయవ్యవస్థను రాజకీయాల్లోకి లాగాలని తాను భావించలేదని, రాజకీయ దురుద్దేశంతోనే భాజపా ఎంపీ మీనాక్షి లేఖీ తనపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారని ఈ సందర్భంగా మళ్లీ ఆరోపించారు.

కుక్కతోక వంకర

ఇంత జరిగినప్పటికీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు. చౌకీదార్‌ చోర్‌ హై నినాదాన్ని తాము ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సభలో పదే పదే ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని రాహుల్‌ పదేపదే ‘దొంగ’ అని దూషిస్తున్నారని, ఆయన గురించి పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ భాజపా నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

రౌల్‌ విన్సీ ఎవరు ?

ఇంతకీ రాహుల్‌ గాంధీ అసలు పేరు ఏమిటి? ఆయన విద్యార్హతలు ఏమిటి? తాజా లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి మరోసారి పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ తన నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్న వివరాలు వివాదానికి దారి తీశాయి. రాహుల్‌ సమర్పించిన నామినేషన్‌ పట్ల తనకు అనేక సందేహాలు ఉన్నాయంటూ అక్కడ పోటీచేస్తున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థి ధ్రువ్‌లాల్‌ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. రాహుల్‌ విద్యార్హతల విషయంలో తమకు అనుమానం వస్తోందని తెలిపారు. కాలేజీలో ఆయన పేరు ‘రౌల్‌ విన్సీ’ అని ఉందని, రాహుల్‌ గాంధీ పేరిట ఒక్క సర్టిఫికెట్‌ కూడా లేదన్నారు. అసలు రాహుల్‌ గాంధీ, రౌల్‌ విన్సీ ఒక్కరేనా అనేది తేలాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా, బ్రిటన్‌లో రిజిస్టర్‌ అయిన ఒక కంపెనీ సర్టిఫికెట్‌లో రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పౌరుడిగా డిక్లరేషన్‌ ఇచ్చారు. ఇతర దేశాల్లో పౌరసత్వం ఉన్న వ్యక్తులు భారత్‌ ఎన్నికల్లో పోటీచేస్తారా ? అంటూ ధ్రువ్‌లాల్‌ ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరుడు భారతదేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయరాదు. రాహుల్‌ పౌరసత్వం, విద్యార్హతలపై స్పష్టత వచ్చేంత వరకూ నామినేషన్‌ పేపర్లను ఆమోదించరాదని రిటర్నింగ్‌ అధికారిని కోరారు. రిటర్నింగ్‌ అధికారి రెండు రోజుల పాటు రాహల్‌ నామినేషన్‌ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించి చివరకు ఆమోదం తెలపడంతో కాంగ్రెస్‌ నాయకులు ఊపిరి పీల్చు కున్నారు. అయితే అఫిడవిట్‌లోని వివరాలపై మాత్రం దేశ ప్రజల్లో సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. రాహుల్‌ గాంధీ అసలు పేరు, ఆయన విద్యార్హతలు, పౌరసత్వం విషయంలో సందేహాలు కొత్తేమీ కాదు. బీజేపీ సీనియర్‌ నేత, ఎం.పి. సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే ఈ విషయాలను వెలుగులోకి తెచ్చారు.

కేంద్ర హోంశాఖ నోటీసులు

అయితే రాహుల్‌కి విదేశీ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై తాజాగా కేంద్ర హోంశాఖ స్పందించింది. తనపై వస్తున్న బ్రిటిష్‌ పౌరసత్వ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఏప్రిల్‌ 30 న రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసింది. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. ‘బ్యాకప్స్‌ లిమిటెడ్‌ పేరిట యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో రిజిస్టరైన కంపెనీలో మీరూ ఒక డైరెక్టరుగా కంపెనీ నమోదు కోసం సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. అలాగే 2005 అక్టోబర్‌ 10 నుండి 2006 అక్టోబర్‌ 31 మధ్య కంపెనీ వార్షిక రిటర్నుల్లో మీ పుట్టిన తేదీ 1970 జూన్‌ 19 అని ఉంది. మీ జాతీయత బ్రిటిష్‌గా పేర్కొన్నారు. కంపెనీ మూసివేత కోసం చేసుకున్న దరఖాస్తులోనూ మీ జాతీయతను బ్రిటిషర్‌గా తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలేంటో మీరు రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలి’ అని కేంద్ర హోంశాఖ రాహుల్‌ను ఆదేశించింది. హోంమంత్రిత్వ శాఖ పౌరసత్వ విభాగం డైరెక్టర్‌ బీసీ జోషీ రాహుల్‌కు ఈ లేఖ రాశారు.

– క్రాంతిదేవ్‌ మిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *