రాఫెల్‌ ఒప్పందంలో అసలు నిజాలు ఏమిటి?

రాఫెల్‌ ఒప్పందంలో అసలు నిజాలు ఏమిటి?

కాంగ్రెస్‌ ఆరోపణల వెనుక ఎవరున్నారు?

ఒకటి మాత్రం నిజం. భారతదేశం కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన అధునాతన ఆయుధ సంపత్తి కొనుగోలు కోసం ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దక్కక భంగపడిన ప్రత్యర్థి కంపెనీ రచ్చ చేస్తోంది. ఇలాంటి కుట్రలో ప్రతిపక్షాలు భాగస్వామ్యం అవడం నిజంగా వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనం. దేశం ఏమైతే మాకేమిటి? మాకు పదవులు కావాలి అనుకునే కాంగ్రెస్‌ పార్టీ వైఖరి సరైంది కాదు.

రాఫెల్‌.. రాఫెల్‌.. రాఫెల్‌.. ఈ మధ్య రాహుల్‌ గాంధీతో సహా కాంగ్రెస్‌ నాయకులు జపిస్తున్న మంత్రం ఇది. నాలుగున్నరేళ్ల మోదీ సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు ఎంతగా గాలించినా ఒక్క స్కామ్‌ దొరక్కపోవడంతో సున్నితమైన రక్షణ అంశాన్ని స్కామ్‌గా చూపించి 2019 ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఎత్తుగడ వారి ఆరోపణల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బోఫోర్స్‌ స్కామ్‌లో అప్రతిష్టపాలై అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రాఫెల్‌ను ఆయుధంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రచ్చ చేస్తోంది. ఈ యుద్ధ విమానాల కొనుగోళ్ల సందర్భంగా భంగపడిన ఒక అంతర్జాతీయ కంపెనీ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఈ ఒప్పందందాన్ని వివాదాస్పదం చేస్తోంది అనే అనుమానాలు తాజాగా బలపడు తున్నాయి. దేశరక్షణ ప్రయోజనాలు, గోప్యతతో ముడిపడిన ఈ అంశాన్ని కాంగ్రెస్‌ పార్జీ రాజకీయం చేయడం సిగ్గు చేటు.

గత కొద్ది నెలలుగా మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి 18 సంవత్సరాల చరిత్ర ఉంది. దేశ రక్షణ అవసరాలను తీర్చడంలో తీవ్ర నిర్లక్ష వైఖరిని ప్రదర్శించే గుణం నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్‌ పార్టీకి అబ్బింది. తమకు వ్యక్తిగత ప్రయోజానాలు ఉంటే తప్ప ఫైళ్లను క్లియర్‌ చేయని చరిత్ర వారిది. సకాలంలో నిర్ణయాలు తీసుకొని, అవసరాలను తీర్చకపోవడంతో ఇతర దేశాలతో పోలిస్తే మన సైన్యం కొంతమేర వెనుకబడింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ లోటు మరింత పెరిగింది. దీన్ని సరిదిద్ది సైన్యం అమ్ముల పొదిలో శక్తివంతమైన యుద్ధ విమానాలను చేర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పంద పూర్వాప రాలను కచ్చితంగా దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

యుద్ధ విమానాల కొనుగోళ్ల నేపథ్యం ఇదీ..

1999 : కార్గిల్‌ యుద్ధంలో ఎత్తైన కొండల మీద తిష్టవేసిన పాకిస్తాన్‌ సైన్యాన్ని ఎంతో సాహసంతో చిత్తు చేసి విజయం సాధించింది భారత సైన్యం. మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలది ఇందులో కీలక పాత్ర. ఈ కంపెనీపై మన సైన్యానికి మంచి గురి. అయితే టెండర్లు లేకుండా విమానాలను కొనడం సరికాదని భావించారు.

2001 : కార్గిల్‌ యుద్ధ అనుభవాల నేపథ్యంలో మన రక్షణ అవసరాల కోసం పాతబడిన యుద్ధ విమానాల స్థానంలో మరింత శక్తివంతమైన యుద్ధ విమానాలను చేర్చాల్సిన అవసరం ఉందని వాజపేయి ప్రభుత్వం భావించింది. మన వాయు సేనకు 126 యుద్ధ విమానాలు కావాలని నిర్ణయించారు. వీటి కొనుగోలు కోసం టెండర్లు పిలవాలని భావించారు. ఈ ప్రక్రియకు తొలుత MRCA (multi-role combat aircraft) అని పేరు పెట్టారు. తర్వాత MMRCA (medium multi-role combat aircraft) గా మర్చారు.

2004 : యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలను పక్కన పడేసింది. యుద్ధ విమానాల కొనుగోలును ముందుకు తీసుకెళ్లలేదు.

2007 : యూపీఏ ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోలు కోసం గ్రిపెన్‌, యూరోఫైటర్‌, డసాల్ట్‌, మికయోవ్‌, లుక్‌ హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌ అనే 6 కంపెనీలకు ప్రతిపాదనలు పంపింది.

2011 : పై కంపెనీలకు చెందిన 6 యుద్ధ విమానాలను మన దేశంలోని అత్యంత ఎత్తులోని మంచు ప్రదేశమైన లెహ్‌లో, వేడిగా ఉండే ఎడారి ప్రాంతం జైసల్మేర్‌లో, బెంగళూర్‌ వాతావరణంలో పరిశీలించారు. ఈ సాంకేతిక, సామర్ధ్య పరీక్షల తర్వాత యూరోఫైటర్‌ కంపెనీకి చెందిన టైఫూన్‌ని, డసాల్ట్‌ కంపెనీకి చెందిన రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలుకు ఎంపిక చేశారు.

2012 : యూరోఫైటర్‌ కన్నా తక్కువ కోట్‌ చేసిన డసాల్ట్‌ నుండి రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ధర, ఇతర విధి విధానాల కోసం చర్చలు జరపాల్సి ఉంది. కానీ యూపీఏ ప్రభుత్వం తతంగాన్ని ఇంతటితో అటకెక్కించేసింది.

ఒప్పందం తుది దశకు చేరకపోవడానికి కారణాలు

రాఫెల్‌ యుద్ధ విమానాలని ఫ్రాన్స్‌కి చెందిన డసాల్ట్‌ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత ఆధునికమైన యుద్ధ విమానాల్లో ఒకటి.

2007 ప్రతిపాదన ప్రకారం ఈ యుద్ధ విమానాల్లో 18 ఎగరడానికి సిద్ధంగా ఉండే స్థితిలో, మిగతా 108 హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) ఆధ్వర్యంలో భారత్‌లో తయారు చేయాలి. అయితే 126 యుద్ధ విమానాలు తయారు చేయడానికి 3.1 కోట్ల గంటల మానవ సమయం అవసరం అని డసాల్ట్‌ చెప్పగా, 8.3 కోట్ల గంటల మానవ సమయం పడుతుందని HAL చెప్పడంతో చర్చలు స్తంభించాయి.

HAL వసతులని పరిశీలించిన డసాల్ట్‌ బృందం ఇక్కడ ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలు, యుద్ధ విమానాలు నిర్మించే సామర్థ్యం లేదని అప్పటి ప్రభుత్వానికి చెప్పింది. కానీ విచిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ HAL పల్లవి అందుకుని దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.

2007లో 12 బిలియన్‌ డాలర్లు ఉన్న ధర 2013 నాటికి 20 నుంచి 30 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

HAL తయారు చేసే 108 యుద్ధ విమానాలకు మేము గారంటీ ఇవ్వం అని డసాల్ట్‌ చెప్పింది.

ప్రపంచంలో ఏ కంపెనీ అయినా లాభం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వదు. ఈ కారణాలతో చర్చలు ముందుకు సాగలేదు. 2014 వరకు కూడా ఏ నిర్ణయం జరగలేదు.

మోదీ ప్రభుత్వం వచ్చాక కుదిరిన డీల్‌

2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతకాలం పాటు రాఫెల్‌ ఒప్పందంపై చర్చలు ముందుకు సాగలేదు. కారణం డసాల్ట్‌కి నాణ్యత, ఆర్థిక విషయాల్లో HALపై నమ్మకం లేకపోవడమే. ఈ దశలో 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా పెద్ద ముందడుగు పడింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో నేరుగా (Government to Government డీల్‌) ఒప్పందం కుదిరింది. రాఫెల్‌ యుద్ధ విమానాలు 126కు బదులు 36 మాత్రమే కొనాలని నిర్ణయించారు.

సెప్టెంబర్‌ 2016 వరకు ఒప్పందంపై చర్చలు జరిగాయి. అప్పటి భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ సమక్షంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఒప్పందంలోని ముఖ్యాంశాలను గమనిస్తే ఈ 36 విమానాలను 66 నెలల్లో సప్లయ్‌ చేయాలి. మొదటి విమానం సెప్టెంబర్‌ 2019లో ఇవ్వాలి. ఒప్పందం మొత్తం విలువ 8.8 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ. 59 వేల కోట్లు.

ఈ యుద్ధ విమానాలు, అత్యంత ఆధునిక న్యూక్లియర్‌ వార్‌ హెడ్స్‌ని తీసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటాయి. అత్యాధునిక రాడార్‌ వ్యవస్థ, క్షిపణులు, ఇంకా 17 ఇతర అంశాలు భారత్‌ చెప్పిన ప్రమాణాల ప్రకారం ఉంటాయి.

ఈ ఒప్పందంలో భాగంగా డసాల్ట్‌ కంపెనీ మొదటి ఐదేళ్ల పాటు మన వైమానిక దళానికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ, ఇతర ఆధునిక సదుపా యాలను ఏర్పాటు చేస్తుంది. ఒప్పందంతో పాటుగా కొన్ని మిరాజ్‌ యుద్ధ విమానాలు, ఒక ట్రైనింగ్‌ జెట్‌ ఉచితంగా ఇస్తుంది.

కొనుగోలు చేయనున్న 36 విమానాలకు సంబంధించి 15 శాతం అడ్వాన్సు చెల్లించారు. దీనికి తోడు మొత్తం ధరలో 30 శాతం ఫ్రాన్సు మన సైనిక, వైమానిక పరిశోధనా రంగంలో పెట్టు బడులు పెడుతుంది. 20 శాతం రాఫెల్‌ విడిభాగాల తయారీలో కూడా పెట్టుబడి పెడుతుంది. ఇలా మొత్తం ఒప్పందంలో 50 శాతం తిరిగి ఆఫ్సెట్‌ పార్టనర్స్‌తో భారత్‌లోనే పెట్టుబడిగా పెట్టాలి. ఇది రాఫెల్‌కి సంబంధించిదే కానవసరం లేదు.

ఈ ఒప్పందంలో భాగంగా ధరను ఖరారు చేసుందుకు ప్రైస్‌ నెగోషియేషన్‌ కమిటీ, కాంట్రాక్టు నెగోషియేషన్‌ కమిటి 14 నెలల పాటు సంప్ర దింపులు జరిపాయి. ఆ తర్వాతే క్యాబినెట్‌ కమిటీకి ధరల సిఫారసు వెళ్లింది. ఇవన్నీ లేవని రాహుల్‌ గాంధీ బుకాయించడం కేవలం ఎన్డీఏపై బురద జల్లే ప్రయత్నమే.

మన వాయుసేనకు పాకిస్తాన్‌, చైనాలను ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం ఉండేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైగా మోదీ ప్రభుత్వం అనేక సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో అణుశక్తిని మాధ్యమంగా చేసుకొని యుద్ధం చేసే వెసులుబాటు కూడా ఉంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల్లో సామాన్య యుద్ధవిమానం కొనుగోలు మాత్రమే ప్రధానాంశమైంది.

శత్రుదేశాలకు మన ఒప్పందాల తాలూకు కీలక సమాచారం అందకుండా కొంతమేర గోప్యత అవసరం. ఈ గోప్యత క్లాజ్‌ను ఫ్రాన్స్‌ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ ఒప్పదంలో గోప్యత క్లాజు లేదని నాటి రక్షణ మంత్రి ఆంటోని చెప్పగలరా? రాహుల్‌గాంధీకి ఈ తరహా ఒప్పందం 2008లో జరిగిందని తెలియకపోవడం శోచనీయం.

36 మాత్రమే ఎందుకు? 126 కొనొచ్చు కదా?

నిజానికి మన దగ్గర 126 రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనడానికి సరిపడ బడ్జెట్‌ లేదు. ఇది మన రక్షణ శాఖ బడ్జెట్‌ను దాటిపోతుంది, కాబట్టి మన తక్షణ అవసరాలకు అత్యవసరమైన మేర మాత్రమే కొనాలని వైమానిక శాఖతో చర్చించాక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొనుగోలు చేయాలని నిర్ణయించిన 36 యుద్ధ విమానాలు 75 నుంచి 90 శాతం వరకు యుద్ధ సంసిద్ధతను కలిగి ఉండేట్లు డసాల్ట్‌ కంపెనీ ఇంజనీర్స్‌ని, ముడి భాగాలను సిద్ధంగా ఉంచుతుంది. సాధారణంగా ఇతర యుద్ధ విమాన కంపెనీలు 50 శాతం సంసిద్ధతను మాత్రమే కలిగి ఉంటాయి.

ఎన్డీఏ ప్రభుత్వ ఒప్పందం ద్వారా ఎంత ఆదా?

రాఫెల్‌ యుద్ధ విమానాల కోసం ఎక్కువ ధర చెల్లిస్తున్నారనేది కాంగ్రెస్‌ చేస్తున్న నిరాధార, దురుద్దేశ్య పూరిత నింద. అసలు 2007 నుండి 2014 వరకు అంటే ఏడేళ్ల పాటు ధరతో పాటు, ఇతర విషయాలపై నిర్ణయం తీసుకోలేనంత అసమర్ధంగా వ్యవహరించింది యూపీఏ ప్రభుత్వం.

ప్రముఖ రక్షణ వ్యవహారాల విశ్లేషకులు మహరూప్‌ రాజా చెప్పిన వివరాల ప్రకారం.. ఒక జెట్‌ ఫైటర్‌ విషయంలో యూపీఏ ప్రభుత్వ ఫైటర్‌ జెట్‌ ధర రూ.737 కోట్లు (ఖరారు కాలేదు). కానీ ఎన్డీఏ ధర రూ.670 కోట్లు మాత్రమే. అంటే రూ. 67 కోట్లు ఆదా.

ఈ జెట్‌ ఫైటర్‌కు క్షిపణి, అణ్వాయుధ, రాడార్‌ తదితర అధునాతన హంగులు చేరిస్తే యూపీఏ ధర రూ.2000 కోట్లు (ఖరారు కాలేదు). ఎన్డీఏ ధర రూ.1600 కోట్లు మాత్రమే. అంటే రూ.400 కోట్లు ఆదా అన్నమాట.

ఏ ఒప్పందంలో అయినా కాలంతోపాటు ధరలు పెరగడం సహజం. ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్యం (డాలర్‌) విలువ హెచ్చుతుగ్గులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు పెరగడంవల్లనే కొనాలనుకున్న యుద్ధ విమానాలను 36కు కుదించింది ఎన్డీఏ ప్రభుత్వం. పైగా కొన్ని సాంకేతి కాంశాలను కూడా జతచేసి ఈ విమానాల నిర్మాణం జరగాలని నిర్ణయించారు. ధర ఎంత పెరిగినా యూపీఏ ప్రభుత్వ హయాంలో (2007)లో నిర్ణయించిన ధర కంటే తక్కువగానే ఇప్పుడు సరఫరా చేసే యుద్ధ విమానాల ధర తక్కువగా ఉండాలని భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వ నేతలు భావించారు. ఈ లెక్కన ప్రస్తుతం మనకు రాఫెల్‌ విమానాలు 9 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి.

అనిల్‌ అంబానీ కంపెనీ పాత్ర ఏమిటి?

ఫ్రాన్సులోని డసాల్ట్‌ సంస్థ అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ రాద్ధాంతం చేస్తోంది. నిజానికి రిలయన్స్‌ ది ఫిన్స్‌ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్‌ ఏరోస్పేస్‌, డసాల్ట్‌ ఏవియేషన్‌తో కలిసి డసాల్ట్‌-రిలయన్స్‌ ఏరోస్పేస్‌గా జాయింట్‌ వెన్చర్‌గా ఏర్పడ్డాయి. ఇది రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీలేదు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించడాన్ని కాంగ్రెస్‌ ప్రస్తావించింది. జూలీ గయె ప్రొడక్షన్‌ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్‌ సినిమాలు తీస్తామంటూ అనిల్‌ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్‌ ప్రోకో ఒప్పందంలో భాగంగా రాఫెల్‌ కాంట్రాక్ట్‌ తమకి దక్కడం కోసమే రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఫ్రెంచ్‌ ప్రభుత్వం, డసాల్ట్‌ కంపెనీ కొట్టిపారేస్తున్నాయి. రిలయన్స్‌ అధినేత అంబానీ ఇదివరకే రాహుల్‌ గాంధీకి ఈ విషయమై హెచ్చరిక జారీ చేశారు. తాజాగా రూ.5 వేల కోట్ల పరువు నష్టం దావావేశారు.

హెచ్‌ఏఎల్‌ను కాదని రిలయన్స్‌?

ప్రభుత్వరంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ ను కాదని రిలయన్స్‌ ఏరోస్పేస్‌ని డసాల్ట్‌ పార్టనర్‌గా పెట్టు కున్నారని చేస్తున్న ఆరోపణలో పస లేదు. రిలయన్స్‌తో పాటుగా 72 మంది ఆఫ్సెట్‌ పార్టనర్స్‌ ఉన్నారు. అందులో నూకూ కూడా ఒకటి. అసలు డసాల్ట్‌ భారత్‌లో యుద్ధ విమానాలు తయారు చేయడం లేదు. విడి భాగాల కోసం మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా పార్టనర్‌ షిప్స్‌ పెట్టుకుంది. ఇప్పుడు రిలయన్స్‌ ఏరోస్పేస్‌ అసలు రాఫెల్‌కి సంబంధించినవి ఏవీ తయారు చేయడం లేదు. ఫాల్కన్‌ 2000 జెట్‌కి సంబంధించిన విడి భాగాలు తయారు చేస్తున్నది. డసాల్ట్‌ కంపెనీ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ని సెలెక్ట్‌ చేసుకోడానికి ముఖ్య కారణం దానికి నాగపూర్‌ రన్‌వే దగ్గరలో ల్యాండ్‌ ఉండటమే.

హెచ్‌ఏఎల్‌ ను కాదని అనిల్‌ అంబానీ కంపెనీకి మాత్రమే 20 బిలియన్ల డాలర్ల కాంట్రాక్ట్‌ వచ్చింది అనే ఆరోపణ కూడా అవాస్తవం. మన రక్షణ సంస్థ డీఆర్డీవోకు రూ.9 వేల కోట్లు ఆర్డర్‌ వచ్చే అవకాశం ఉంది. అలాగే రిలయన్స్‌కు రూ.1220 నుంచి 1480 కోట్ల మేర ఆర్డర్‌ వచ్చే అవకాశం ఉంది. డసాల్ట్‌తో జాయింట్‌ వెంచర్‌ కాబట్టి రాఫెల్‌ ఒక్కటే కాకుండా మిగతా యుద్ధ విమానాలకు, ఏరోస్పేస్‌కి సంబంధించి ఆర్డర్స్‌ కూడా రావొచ్చు. ఏ ఆఫ్సెట్‌ పార్టనర్‌కి ఎంత కాంట్రాక్టు ఇవ్వాలనేది పూర్తిగా డసాల్ట్‌ బిజినెస్‌ నిర్ణయం.

హోలాండే గందరగోళం

రాఫెల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఆయుధంగా మారాయి. అనిల్‌ అంబానీ కంపెనీని భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఉద్దేశించినవని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ వ్యూహాత్మకంగా స్పందించారు. రాఫెల్‌ డీల్‌ వివాదంపై డైరెక్ట్‌గా సమాధానం చెప్పకుండా.. భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య ఈ వేల కోట్ల డీల్‌ జరిగే టప్పుడు తాను పదవిలో లేనని చెప్పారు. కానీ మేము చాలా స్పష్టమైన నిబంధనలు కలిగి ఉన్నాం. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన చర్చ. ఇది భారత్‌, ఫ్రాన్స్‌ల మిలటరీ, డిఫెన్స్‌ల సంకీర్ణ ఒప్పందం’ అని స్పష్టం చేశారు.

మోదీపై అనుమానాలు లేవు : శరద్‌ పవార్‌

రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాలన్నీ బీజేపీపై ఎదురుదాడికి దిగితే.. ఎన్సీపీ అధినేత, మాజీ రక్షణ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏది ఏమైనా యుద్ధ విమానాల ధరలు బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని ఆయన పేర్కొన్నారు.

ఒప్పందం నుంచి వెనక్కి తగ్గం : జైట్లీ

రాఫెల్‌ డీల్‌ తీవ్ర వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు విమర్శించినంత మాత్రానో, ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఆరోపణలు చేసినంత మాత్రానో తాము రాఫెల్‌ ఒప్పందం నుండి వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌ కంపెనీలతో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కాంట్రాక్టు కొనసాగుతుందన్నారు. ఇదంతా మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి రాహుల్‌గాంధీ వండి వార్చుతున్న వివాదం అని జైట్లీ ఆరోపించారు. భారత ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌, ఫ్రాన్స్‌ ప్రతిపక్షం రెండూ చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయని అన్నారు. రెండు దేశాల ప్రతిపక్ష నాయకులు ఒకే తరహా ఆరోపణ చేయడం యాదచ్ఛికం కాదని, ఇది కచ్చితంగా కూడబలుక్కుని చేసినట్టే కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

హెచ్‌ఎఎల్‌ను తొలగించింది యూపీఏనే : రక్షణ మంత్రి

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలన్నీ తప్పుడు ఆరోపణలే అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మండి పడ్డారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని వేయాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌ను ఆమె తోసిపుచ్చారు. రాఫెల్‌ ఒప్పందం నుండి హెచ్‌ఎఎల్‌ను తొలగించింది యూపీఏ ప్రభుత్వమేనని వెల్లడించారు.

కాంగ్రెస్‌ ఆరోపణలు కట్టు కథలేనా?

కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించినట్లు రాఫెల్‌ ఒప్పందలో కుట్ర మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు సహజం గానే మోదీపై వ్యతిరేకతతో అతిగా స్పందిస్తున్నాయి. వారి ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే బోఫోర్సు స్కామ్‌లో ఖత్రోచి లాంటి మధ్యవర్తులు బయటపడ్డారు. వాళ్ల బ్యాంకు ఖాతాలు బయటపడ్డాయి. బ్యాంకు ఖాతాల్లోకి చేరిన మొత్తాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ సాక్షాత్తు స్వీడన్‌ ప్రభుత్వపు విచారణలోనే బయటపడ్డాయి. కానీ రాఫెల్‌ ఒప్పందం ఫ్రాన్స్‌, భారత ప్రభుత్వాల మధ్య జరిగింది. ఇందులో మధ్యవర్తులెవరూ లేరు.

డోక్లాం గురించి నాకు తెలియదు : రాహుల్‌

ఈ మధ్య లండన్‌ జర్మనీలు పర్యటించిన రాహుల్‌ డోక్లామ్‌ సమస్యను మోదీ ప్రభుత్వం సరిగా చక్కబెట్టలేదని ఆరోపించీరు. కానీ ‘మీరు ప్రధాని స్థానంలో ఉంటే ఏం చేస్తారు’ అని అడిగితే మాత్రం డోక్లాం గురించి నాకు వివరాలు తెలియవని తప్పు కున్నారు. ఇలా ఏ విషయంలోనూ కనీస పరిజ్ఞానం, అవగాహన లేకుండానే ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ విధంగా తన అపరిపక్వతను బయటపెట్టుకుని అభాసుపాలవుతున్నారు. రక్షణ బలగాలలో అత్మస్థైర్యం నింపే రాఫెల్‌ ఒప్పందాన్ని ఆయన నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాన్ని పదిసార్లు చెబితే అది నిజమవుతుందని భ్రమపడుతున్నారు.

రాహుల్‌ అండ్‌ కో ఆరోపణ వెనక మతలబు ఇదేనా?

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో కుట్ర (స్కామ్‌) ఉంది అని రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్న మతలబు ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.

ఆగస్ట్‌ నెల చివరి వారంలో రాహుల్‌ గాంధీ జర్మనీ వెళ్లారు. ఎందుకు వెళ్లారని ఎవరైనా ఆరా తీశారా? రాహుల్‌ ఇంకా కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఒక ప్రముఖ యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ అమ్మకాల అధిపతిని కలవడం అనుమానాలకు తావిస్తోంది. వీరితో ఒక ప్రముఖ స్టీల్‌ కంపెనీ అధిపతితో పాటు అమెరికాకి చెందిన యుద్ధ విమానాలు తయారీ కంపెనీ ప్రతినిధులు కూడా ఉన్నారని వినికిడి. వీరంతా సెప్టెంబర్‌ 2వ వారంలో మళ్ళీ భారత్‌లో కలిశారట. అప్పటి నుంచే రాహుల్‌ ఈ ఆరోపణలు మొదలు పెట్టారు.

అసలు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నాయకులు ఆ యుద్ధ విమాన తయారీదారులను కలవాల్సిన అవసరం ఏమిటి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తులు ఎవరు? వారితో కుమ్మక్కై దేశరక్షణకు అతి ముఖ్యం అయిన రాఫెల్‌ ఒప్పందాన్ని రద్దు చేయించాలని ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ మధ్యే సోనియాగాంధీ కూడా రష్యా వెళ్లారు. అక్కడ ఒక కార్యక్రమంలో కేజీబీ (రష్యా గూడచార సంస్థ) తో కలిశారని వినికిడి. అసలు ఆమె రష్యాలో ప్రైవేట్‌ యాత్ర చేయాల్సిన అవసరం ఏమిటో?

ఒకటి మాత్రం నిజం. భారతదేశం కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన అధునాతన ఆయుధ సంపత్తి కొనుగోలు కోసం ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దక్కక భంగపడిన ప్రత్యర్థి కంపెనీ రచ్చ చేస్తోంది. ఇలాంటి కుట్రలో ప్రతిపక్షాలు భాగస్వామ్యం అవడం నిజంగా వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనం. దేశం ఏమైతే మాకేమిటి? మాకు పదవులు కావాలి అనుకునే కాంగ్రెస్‌ పార్టీ వైఖరి సరైంది కాదు.

ప్రస్తుతం కుట్రని భగ్నం చేసే పనిలోనే పడింది మోడీ ప్రభుత్వం. దీనిపై కొద్ది రోజుల్లోనే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు రావచ్చు. ఈ వాస్తవాలు అన్నీ బయటకు వస్తే కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయం. పారదర్శక పాలన అందిస్తున్న మోదీ సర్కారుపై అనవసర నిందలకు గాను దేశ ప్రజలకు జవాబు చెపుకోక తప్పదు. 2019 ఎన్నికల్లో అంతకన్నా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.

ప్రస్తుతం రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం నడుస్తున్నది.

– క్రాంతిదేవ్‌ మిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *