అధికారంలో ఉన్న పార్టీ తర్వాత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి వెళ్లడం అక్కడ ఆనవాయితీ.. కానీ తాజా ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా అధికార పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చారు ఓటర్లు.. దేవభూమి ఉత్తరాఖండ్‌లో బీజేపీ వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురేసింది. ప్రధాని మోదీ చరిష్మాకు తోడు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే బీజేపీపై ప్రజల విశ్వాసానికి కారణమయ్యాయి. కాగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేసిన ముఖ్యమంత్రి పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామీ పరాజయం పొందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎన్నికల పక్రియ మొదలైనప్పటి నుంచీ ఉత్తరాఖండ్‌లో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఇందుకు కొన్ని కారణాలను కూడా చూపించారు. మొదటిది నాలుగు నెలల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన వైనం. రెండోది అధికారంలో ఉన్న పార్టీని వరుసగా రెండోసారి గెలిపించే సాంప్రదాయం ఉత్తరాఖండ్‌కు లేకపోవడం. అయితే పోలింగ్‌ ‌ముగిసిన తర్వాత ఎగ్జిట్‌పోల్స్ అం‌చనాలు బీజేపీకి అనుకూలంగా కనిపించాయి. అనూహ్యంగా అంతకన్నా ఎక్కువ సీట్లతోనే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు కమలనాథులు.

మొత్తం 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ మార్కులను దాటేసి 47 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 19 ‌సీట్లకే పరిమితం కాగా బీఎస్పీ 2, ఇతరులు 2 చోట్ల గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ 57 చోట్ల గెలిస్తే, ఈసారి 10 సీట్లను కోల్పోయింది. అయితే అత్యధిక స్థానాలున్న గర్హ్‌వాల్‌ ‌ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా బీజేపీ తన పట్టు నిలుపుకుంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపు ఆషామాషీగా సాధ్యంకాలేదు. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డింది. అభివృద్దిపై సారించిన దృష్టి ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతను పోగొట్టి ప్రజల్లో విశ్వాసం నెలకొనేలా చేసింది. దీనికి తోడు ప్రధాని మోదీ ఆకర్షణ చాలా మేరకు పని చేసింది.

రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.17,500 కోట్లతో ఆరు ప్రాజెక్టులను ప్రారంభించంతో పాటు 17 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. బడ్జెట్‌లో పేర్కొన్న పర్వత్‌మాల పథకాన్ని ప్రధాని ప్రచారం సందర్భంగా ప్రస్తావించారు. ఉత్తరాఖండ్‌ను దృష్టిలో పెట్టుకొనే దీన్ని రూపొందించినట్టు చెప్పారు. రిషికేశ్‌- ‌కర్ణప్రయోగ్‌ ‌రైల్వేలైన్‌, ‌చార్‌ధామ్‌ ‌రోడ్డు నిర్మాణం లాంటి అంశాలను గుర్తు చేశారు. లఖ్‌వాడ్‌ ‌జలవిద్యుత్‌ ‌కేంద్రం నిర్మాణానికి 1974లో అంకురార్పణ జరిగినా పనులు ప్రారంభం కావడానికి 46 ఏళ్లు పట్టిందనీ.. ఇంత ఆలస్యం చేసిన గత ప్రభుత్వానిదే ఈ పాపం అంటూ కాంగ్రెస్‌ను ఆత్మ రక్షణలోకి నెట్టారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.5,747 కోట్లు కేటాయించిన సంగతి గుర్తు చేశారు. మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌విజయావ కాశాలను దెబ్బతీసి.. ప్రజలు బీజేపీకే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అందించేలా చేశాయని చెబుతున్నారు.

ఈ రాష్ట్రంలో బీజేపీ నాలుగు నెలల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడంతో పార్టీపై ప్రజలకు విశ్వాసం పోతుందని కాంగ్రెస్‌ ‌పార్టీ భావించింది. 2017 మార్చి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మొదట త్రివేంద్ర సింగ్‌ ‌రావత్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పనితీరుపై అసంతృప్తి నెలకొనడంతో పార్టీ నాయకత్వం 2021 మార్చిలో తీర్థసింగ్‌ ‌రావత్‌కు పగ్గాలు అప్పగించింది. చివరకు ఆయనను కూడా తప్పించి 2021 జులైలో పుష్కర్‌సింగ్‌ ‌ధామీని ముఖ్యమంత్రిని చేశారు. పుష్కర్‌సింగ్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్నెళ్లకే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. వీటిని ఆయనెంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. ఎలాగైనా తాను గెలవడంతో పాటు భాజపానూ గెలిపించాలన్న కసితో పనిచేశారు. గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీ అంతర్గత సర్వే నిర్వహించింది. సర్వేలో ఫలితాలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి అసంతృప్తిని ఇచ్చాయి. వెంటనే దిద్దుబాట్లు చేపట్టింది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ ‌నిరాకరించి కొత్తవారికి ఇచ్చారు. దీంతో ఫిరాయింపులు మొదలయ్యాయి. అయితే సిద్ధాంతపరమైన కార్యకర్తల బలం కలిగిన బీజేపీని ఈ తిరుగుబాట్లు పెద్దగా దెబ్బతీయలేకపోయాయి. ఉత్తరాఖండ్‌ ‌బీజేపీ ఇంచార్జ్, ‌పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి తీసుకున్న నిర్ణయాలు పార్టీ విజయానికి కలిసి వచ్చాయి.

ఉత్తరాఖండ్‌ ‌ప్రజలు ఆనవాయితీ ప్రకారం బీజేపీని ఓడించి తమకు అధికారం కట్టబెడతారనే అతి విశ్వాసంతో ముందుకుపోయిన కాంగ్రెస్‌ ‌పార్టీ చివరకు చతికిల పడక తప్పలేదు. ఎన్నికలకు ముందు మాజీ సీఎం హరీష్‌ ‌రావత్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని అలకబూనారు. దీంతో బాధ్యతలన్నీ ఆయన మీదే పెట్టేసింది అధిష్టానం. అయితే మైనారిటీల బుజ్జగింపు కోసం కాంగ్రెస్‌ ‌చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఉత్తరాఖండ్‌లో తాము అధికారంలోకి వస్తే ముస్లిం యూనివర్సిటీ పెడతామని కాంగ్రెస్‌ ‌చేసిన వాగ్దానం బీజేపీకి మంచి ప్రచారాస్త్రంగా మారింది.

మైనారిటీల బుజ్జగింపే ఎజెండాగా హస్తం పార్టీ ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దేవతలు నడయాడే భూమిని ఇలాంటి పనులతో అవమానిస్తే మీరు సహిస్తారా? అని ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్‌ ‌ప్రజలను సూటిగా ప్రశ్నించారు. సైనికుల్ని కూడా అవమానించడం కాంగ్రెస్‌ ‌పార్టీకే చెల్లిందని మోదీ ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్‌కే గర్వకారణంగా నిలిచిన దేశ మొదటి చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ను అవమానిస్తూ కాంగ్రెస్‌ ‌మాట్లాడిందని, ఈ ఎన్నికల్లో దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల్లో ప్రజల్ని ఆలోచించేలా చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ధామీ ఓడినా పార్టీని గెలిపించారు!

అతి చిన్నవయసులో ఉత్తరాఖండ్‌ ‌ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత 46 ఏళ్ల పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామీది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. కానీ ఆయనే స్వయంగా పరాజయం పొందారు.. ఖతిమా నియోజవర్గం నుంచి పోటీచేసిన పుష్కర్‌ ‌సింగ్‌ ‌కాంగ్రెస్‌ అభ్యర్థి భువన్‌ ‌చంద్ర కప్రీ చేతిలో 6,951 ఓట్లతో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించినా సిట్టింగ్‌ ‌సీఎం ఓడిపోవడం ఆ పార్టీ కర్యకర్తలను నిరాశకు గురి చేసింది.  పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామీ ముఖ్యమంత్రిగా ఉన్న స్వల్పకాలంలో ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారు. చార్‌ధామ్‌ ‌దేవస్థానం బోర్డును రద్దు చేయాలంటూ జరిగిన ఆందోళనలు, కొవిడ్‌ ‌రెండో ఉద్ధృతి, హరిద్వార్‌ ‌కుంభ్‌ ‌నిర్వహణ, నవంబర్‌లో భారీ వర్షాల వంటి కఠిన సవాళ్లను ఎదురొడ్డి నిలిచారు. దేవస్థానం బోర్డును రద్దు చేయడం ద్వారా పూజారులను శాంతింప జేశారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే ధామీ సర్కారు మెరుగ్గా వ్యవహ రించిందన్న పేరు సంపాదించు కున్నారు. తనకంటే సీనియర్లు ఉన్న మంత్రివర్గాన్ని నడిపిం చడంలోనూ విజయ వంత మయ్యారు. ఆయన పాలనలో విజయాలపై పలు వేదికల నుంచి ధామీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ ‌షా, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌ప్రశంసలు కురిపించారు. మరోవైపు లాల్‌ ‌కాన్‌ ‌స్థానం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ ‌పార్టీ సీఎం అభ్యర్థి హరీష్‌ ‌రావత్‌ ‌సైతం ఓటమి పాలయ్యారు. ఒకే రాష్ట్రంలో కాంగ్రెస్‌, ‌బీజేపీ సీఎం అభ్యర్థులు ఓడిపోవడం విశేషం.

21 ఏళ్ల ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్ర చరిత్రలో సిట్టింగ్‌ ‌ముఖ్యమంత్రులెవరూ తదుపరి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఒక్క ఉపఎన్నికల్లో మినహా ప్రతిసారీ సీఎంలకు ఓటమి తప్పలేదు. ఒకసారి సిట్టింగ్‌ ‌సీఎం పోటీ చేయలేదు. 2000లో ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రం ఏర్పడింది. 2002లో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఎన్‌డీ తివారీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2007 ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్రులతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీసీ ఖండూరీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఖండూరీ కొద్వార్‌ ‌నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరువాత భగత్‌సింగ్‌ ‌కోశ్యారీ (బీజేపీ) మాత్రమే సిట్టింగ్‌ ‌సీఎంగా విజయం సాధించినప్పటికీ పార్టీ గెలుపొందకపోవడంతో మరోసారి సీఎం అయ్యే అవకాశాన్ని కోల్పోయారు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram