మాటతప్పితే ఇబ్బందులూ తప్పవు

మాటతప్పితే ఇబ్బందులూ తప్పవు

గత ఐదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించింది. దీనితోపాటు దేశ భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేసింది. ఫలితంగా ప్రజలు మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమిని రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ అద్భుత విజయం తర్వాత ప్రపంచ దేశాలన్ని మోదీని అభినందించాయి. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపాడు. ఇరుదేశాల మధ్య చర్చలు పునరుద్ధరించడానికి ఇమ్రాన్‌ మోదీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇమ్రాన్‌ఖాన్‌ ఆహ్వానాన్ని మోదీ మన్నిస్తారని అందరూ భావించారు. కాని రాజకీయ విశ్లేషకుల ఊహాగానాలకు భిన్నంగా నరేంద మోదీ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. పైగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సైతం ఆ దేశానికి ఆహ్వానం పంపలేదు. అయితే, బింస్టెక్‌ దేశాలైన – బంగ్లాదేశ్‌, భారత్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, నేపాల్‌, భూటాన్‌లకు ఆహ్వానాలు పంపించారు. పాక్‌, భారత్‌ల మధ్య చర్చలు జరగాలనే ఆలోచనలు బలం పుంజుకునే సమయంలోనే పాకిస్తాన్‌ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో ఇఫ్తార్‌ విందుకు హాజరైన అతిథులను క్షోభకు గురి చేసింది.

పాకిస్తాన్‌ భారత్‌తో స్నేహానికి ఉబలాట పడుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆర్థికస్థితి దుర్భరంగా ఉంది. డాలర్‌తో పోలిస్తే పాక్‌ రూపాయి విలువ 157కి పడిపోయింది. పాక్‌లో విదేశీ ఆర్థిక విలువలు అడుగంటిపోయాయి. ద్రవ్యోల్బణం రెండు అంకెలకు చేరుకుంది. జూన్‌ మొదటి వారంలో పాక్‌ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొంది. జమాత్‌-ఉద్‌-దాలీ ముఖ్యుడు హాఫీజ్‌ సయీద్‌పై నిర్బంధం ప్రకటించింది. FATF (Financial Action Task Force) నిబంధనల ప్రకారం రక్షణ శాఖ బడ్జెట్‌లో కోత విధించింది. వాస్తవానికి పాకిస్తాన్‌ ఇవేవీ ఆచరణలో పెట్టలేదు. ఆ దేశంలో మనుగడ సాగిస్తున్న 11 తీవ్రవాద శిబిరాలను ముసివేయించా మని గొప్పగా ప్రకటించింది. కాని అంతర్జాతీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం పాక్‌ ప్రభుత్వం చెప్పినవన్నీ బూటకపు మాటలే అని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడులు పెరుగుతున్నాయి. ఫలితంగా FATF పాక్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ కారణాల వల్లే పాక్‌ ప్రభుత్వం కొన్ని కంటితుడుపు చర్యలు ప్రారంభించింది.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలన్నింటికి, పాకిస్తాన్‌ తీవ్రవాద అనుకూలత, ప్రోత్సాహాన్ని విశదపరచింది. పాకిస్తాన్‌ తన భూభాగంలో తీవ్రవాద స్థావరాలు మనుగడ సాగిస్తున్నా వాటిని అణచివేయకుండా వత్తాసు పలుకుతోంది. పైగా తీవ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది గమనించిన భారత్‌ తనను తాను రక్షించుకొనే క్రమంలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరంపై దాడులు చేసింది.

భారత్‌ దాడులను ప్రపంచదేశాలన్ని సమర్థించాయి. ఈ దాడులలో పాక్‌ పౌరులెవరూ గాయపడలేదు, చనిపోలేదు. ఈ దాడులతో పాక్‌ను భారత్‌ ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా దెబ్బతీసింది. పాకిస్తాన్‌లో నివసిస్తున్న మసూద్‌ అజర్‌ను ‘అంతర్జాతీయ తీవ్రవాది’గా ప్రకటించడంలో భారత్‌ విజయం సాధించింది. దౌత్యపరంగా ఇది గొప్ప విజయం. అదే సమయంలో పాకిస్తాన్‌ ‘ఒంటరి’ అయిపోయింది. అయితే ఇన్ని లోటుపాట్లున్నా పాక్‌ IMF నుండి 6 బిలియన్‌ డాలర్ల రుణాన్ని పొందగలిగింది. తీవ్రవాదం పట్ల మొక్కుబడిగా అంకుశం బిగించి భారత్‌తో చర్చలకు తెరలేపుదామని ఆలోచిస్తోంది.

గత ఏడు దశాబ్దాలుగా భారత్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్ని భారత్‌పైనే బాధ్యత మోపి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలని అనేవి. కాని నేడు పరిస్థితులు మారిపోయాయి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చర్చలు ప్రారంభిద్దామని మోదీకి రెండుసార్లు లేఖలు పంపాడు. కాని అమెరికా శ్వేత సౌధం నుండి ఒక ప్రకటన వెలువడింది. ద్వైపాక్షిక చర్చలు జరగడానికి అవసరమైన అనుకూల వాతావరణాన్ని పాకిస్తాన్‌ నెలకొల్పవలసి ఉంది. అప్పుడే చర్చలకు ఆస్కార ముంటుందని తేల్చి చెప్పింది. ఈ సంఘటనతో పాక్‌ ఎప్పుడూ పాడే ‘భారత్‌ దురాక్రమదారు’ పాట అసత్యమని తేలిపోయింది.

బాలాకోట్‌ దాడుల తర్వాత పాకిస్తాన్‌ తన గగనతలంలో విమానాలు నిషేధించింది. ఫలితంగా భారత్‌లోని ఎన్నో విమాన సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరుకు రవాణాకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. భారత్‌ తన దేశంపై విమాన దాడులు చేస్తుందనే అనుమానంతో జూన్‌ 1 నుండి తన గగనతలంపై పాక్‌ నిషేధం విధించింది.

షాంఘైలో జరగనున్న ‘షాంఘై సహకార సంస్థ’ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనవలసి ఉంది. భారత అధికారులు పాక్‌ ప్రభుత్వానికి తమ గగనతలం నుండి ప్రధాని విమానం ప్రయాణించ డానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరారు. అయితే ఆ అభ్యర్థనను పాక్‌ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినా దాని చిత్తశుద్ధిపై అందరికీ అనుమానం కలిగింది. ఈ సాకుతో పాక్‌ భారత్‌పై ఒత్తిడి పెంచాలని చూసింది. అయితే మోదీ పాక్‌ గగనతలాన్ని ఉపయోగించుకోకూడదని నిర్ణయించు కున్నారు. ప్రయాణ దూరం పెరిగినా ఇరాన్‌, ఓమన్‌, మధ్య ఆసియాల గుండా ప్రయాణించి షాంఘై చేరుకున్నారు. తీవ్రవాదం ఉన్న దగ్గర శాంతి చర్చలకు చోటు లేదని తేల్చిచెప్పారు. అదే సమయంలో పాక్‌ క్రూర చర్యల వలన మిగతా దేశాల సమయం, డబ్బు వృథా అయ్యింది. ప్రపంచదేశాలు పాకిస్తాన్‌ నిజ స్వరూపాన్ని గ్రహించాయి. కాని పాక్‌ మాధ్యమాలు మాత్రం ఇమ్రాన్‌ఖాన్‌ను ‘శాంతిదూత’గా పొగడుతున్నాయి.

పాకిస్తాన్‌ అభిమానులు భారతదేశం చొరవ తీసుకొని పాక్‌తో చర్చలు జరపాలని ఆశిస్తున్నారు. ఈ మధ్య షాంఘైలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల ప్రధానులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో తమ మధ్య చర్చలు జరగవచ్చని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భావించాడు. 2015లో ‘ఉఫా’లో ఈ విధంగానే సమావేశం జరిగినప్పుడు నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ప్రధాని మోదీల మధ్య చర్చలు జరిగాయి. ఇరు ప్రధానుల మధ్య జరిగిన ఆ భేటిని మీడియా కూడా అదొక గొప్ప సంఘటన అని వర్ణించాయి. కాని పాక్‌ పఠాన్‌కోట్‌ దాడులతో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చేద్దామనుకున్న మోదీ ప్రయత్నానికి పెద్ద దెబ్బతగిలింది.

పాకిస్తాన్‌ కుట్ర రాజకీయాలు గ్రహించిన మోదీ ఇటీవలి షాంఘైలో జరిగిన సమావేశంలో ఇమ్రాన్‌ఖాన్‌ ఎదురుపడినా ఆయనకు పలకరించడానికి అవకాశమివ్వలేదు. ఈ నేపథ్యంలో రెండోసారి భారీ మెజారిటీతో ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని ఇమ్రాన్‌ అభినందించాడని వార్తలొచ్చాయి.

షాంఘై సమావేశంలో మోదీ మాట్లాడుతూ ‘ప్రపంచంలో తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అణచివేయవలసిందే’ అన్నారు. తీవ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను కూడా ఒంటరి చేయాలని, వాటికి సహకరించరాదని పేర్కొన్నారు. అన్ని దేశాలు తీవ్రవాద వ్యతిరేక చర్యల్ని ఉధృతం చేసి ప్రపంచంలో శాంతి నెలకొనేలా చేయాలన్నారు. షాంఘైలో జరిగిన సమావేశంలో ‘తీవ్రవాదం’ ముఖ్య విషయమయ్యే సరికి పాకిస్తాన్‌ ఇరుకున పడింది. ఆ సమావేశంలో ఆర్థిక విషయాలు, దేశాల మధ్య అనుసంధానాల గురించి కూడా చర్చించారు.

గతంలో భారత్‌లో సమర్థ నాయకత్వ లోపం వల్ల పాకిస్తాన్‌ వైఖరి పట్ల దృఢంగా వ్యవహరించలేక పోయాం. దీనిని ఆ దేశం ఉపయోగించుకొని భారత్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందు లకు గురి చేసింది. గత పాలకుల హయాంలో భారత ప్రభుత్వం ఎన్నడూ పాక్‌ను మోకాళ్లపై కూర్చునేలా చేయలేదు. బాలాకోట్‌ ప్రతీకార చర్యల ద్వారా, పఠాన్‌కోట్‌ దాడుల ద్వారా మోదీ భారత్‌ శక్తి ఏమిటో పాకిస్తాన్‌కు తెలియపరిచారు. తద్వారా తమకు ఎలాంటి రాయితీలు, అనుకూలమైన నిర్ణయాలు రావని నేటి పాకిస్తాన్‌ గ్రహించింది.

– డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *