స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత సుదీర్ఘ కాలం హస్తం పార్టీనే దేశాన్నేలింది. దశాబ్దాల పాటు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారాన్ని చలాయించింది. అయినప్పటికీ ప్రజలు ఆశించిన ప్రగతి మాత్రం అందని మావిగానే మిగిలింది. ఇతర విషయాలను పక్కనపెడితే ప్రజల కనీస అవసరాలను తీర్చడంలోనూ విఫలమైంది. ఏడు దశబ్దాల తరవాత కూడా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరూ కరవే. బిందెలు పట్టుకుని దూరాన ఉన్న చెరువులు, కుంటల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి. అవీ అరక్షిత నీరే. ఇక వేసవిలో పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. విద్యుత్‌కు సంబంధించి పరిస్థితి మరింత దయనీయం. దశాబ్దాల పాటు పెద్ద సంఖ్యలో పల్లెలు చీకట్లో మగ్గాయి. పొద్దుపోయిందంటే కటిక చీకట్లో కాలం గడపటం ప్రజలకు అలవాటైపోయింది. పట్టణాలకు విద్యుత్‌ ‌సౌకర్యం ఉన్నప్పటికీ నిరంతర సరఫరాకు ఎప్పుడూ ఆటంకాలే.


2014లో అధికారాన్ని అందుకున్న నరేంద్రమోదీ ఈ దుస్థితిని చూసి విచలితుడయ్యారు. సగటు రాజకీయ నాయకుడి మాదిరిగా కాకుండా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఆయనకు ప్రజల ఇబ్బందులపై అవగాహన ఎక్కువ. వారి కష్టాలను అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తి. గుజరాత్‌ ‌ముఖ్య మంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విజయవంతమయ్యారు. అనంతరం 2014లో ప్రధాని పదవి చేపట్టాక దేశవ్యాప్తంగానూ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం అనంతరమూ ఈ దుస్థితి కొనసాగరాదని బలంగా నిర్ణయించుకున్నారు. పల్లె ప్రజల తాగునీటి ఇబ్బందులను తీర్చడానికి 2019 ఆగస్టు 15న జలజీవన్‌ ‌మిషన్‌ ‌పథకాన్ని ప్రారంభించారు. దీనిని హర్‌ ‌ఘర్‌ ‌జల్‌ అని కూడా వ్యవహరిస్తారు. అదే విధంగా ప్రతి పల్లెకూ విద్యుత్‌ ‌వెలుగులు పంచడానికి ‘సౌభాగ్య’ పథకాన్ని ప్రకటించారు. దీనిని ప్రధానమంత్రి సహజ్‌ ‌బిజిలీ హర్‌ ‌ఘర్‌ ‌యోజన, దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన అని కూడా వ్యవహరిస్తారు. 2017 సెప్టెంబరులో దీనిని మోదీ ప్రకటించారు. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక వినియోగదారులకు వారి అవసరాల మేరకు విద్యుత్‌ ‌సౌకర్యాన్ని కల్పించడం దీని లక్ష్యం. దీని ప్రణాళిక వ్యయం రూ.16,320 కోట్లు. ఈ రెండు పథకాలను సమర్థంగా అమలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు కనపడుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాల్లో చెప్పుకోదగ్గ మార్పు కనపడుతోంది. ఇది ఎవరో పార్టీ నాయకులు చెబుతున్న మాట కాదు. అధికారిక గణాంకాలే ఈ విషయాన్ని చాటుతున్నాయి. వేలకోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్న ఈ పథకాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయి.

సౌభాగ్య పథకం చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. దేశంలో సుమారు 97 శాతం గ్రామాలకు విద్యుత్‌ ‌సౌకర్యం దీనివల్ల సమకూరింది. దాదాపు 5,79,012 ఇళ్లలో విద్యుత్‌ ‌వెలుగులు విరజిమ్ము తున్నాయి. విద్యుత్‌ ఉత్పాదనలో ప్రపంచంలోనే భారత్‌ ‌మూడో స్థానంలో నిలవడం విశేషం. విద్యుత్‌ ‌వినియోగంలోనూ భారత్‌ అం‌తర్జాతీయంగా మూడో స్థానంలో ఉంది. వినియోగదారులకు వందశాతం విద్యుత్‌ ‌సౌకర్యం కల్పించడంలో త్రిపుర, బిహార్‌, ‌జమ్ము కశ్మీర్‌, ‌మిజోరం, సిక్కిం, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ‌గుజరాత్‌, ‌గోవా, దాద్రానగర్‌ ‌హవేలీ, హరియాణా రాష్ట్రాలు ముందున్నాయి. గత ఏడాది మార్చి నాటికి గోవాలో 2.82 కోట్ల మంది గృహ వినియోగ దారులకు విద్యుత్‌ ‌సౌకర్యం కల్పించారు. 2018 లెక్కల ప్రకారం దేశంలో 14,700 గ్రామాలు మాత్రమే విద్యుత్‌ ‌సౌకర్యానికి నోచుకోలేదు. తాజా అంచనాల ప్రకారం అంటే మూడేళ్ల అనంతరం ఇప్పుడు వీటిల్లో మెజారిటీ గ్రామాల్లో విద్యుత్‌ ‌వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఉత్పత్తి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ సరఫరా, పంపిణీలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించి నట్లయితే మిగిలిన గ్రామాల్లోనూ వెలుగులు నింపడం కష్టమేమీ కాదు. ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ ‌సౌకర్యాన్ని కల్పించేందుకు గాను ప్రభుత్వం వివిధ మార్గాల్లో ఉత్పత్తి చేపడుతోంది. తాప, జల, సౌర, అణువిద్యుత్‌ ‌కేంద్రాల స్థాపన ద్వారా ఉత్పత్తి చేస్తోంది. వీటిల్లో జల, సౌర విద్యుదుత్పాదన అత్యంత చౌకైనది. తేలికైనది. అందువల్ల ప్రభుత్వం ఎక్కువగా దీనిపై దృష్టి కేంద్రీకరించింది. తాప (థర్మల్‌) ‌విద్యుత్‌ ‌వ్యయంతో కూడుకున్నది. అదే విధంగా అణు విద్యుత్‌కు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. పర్యావరణ, స్థానిక అటవీ ప్రాంత ప్రజల నుంచి అభ్యంతరాలు ఎదురవు తున్నాయి. దీనికితోడు నేషనల్‌ ‌గ్రీన్‌ ‌ట్రైబ్యునల్‌ ‌నుంచి అనుమతులు కూడా అవసరం. అందువల్ల అణు విద్యుత్‌ ఆశించిన మేరకు జరగడం లేదు. 2014 మే నెలలో మోదీ అధికారం చేపట్టేనాటికి దాదాపు 18,452 గ్రామాలకు విద్యుత్‌ ‌సౌకర్యం లేదు. ఏడేళ్ల అనంతరం, ఇప్పుడా సంఖ్య గణనీయంగా తగ్గింది. మారుమూల గ్రామాలకు విద్యుత్‌ ‌వెలుగులు పంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. 2018 ఏప్రిల్‌ 28‌న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లోని మారుమూల కుగ్రామం ‘లిసాంగ్‌’‌కు విద్యుత్‌ ‌సౌకర్యం కల్పించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఇది అప్పట్లో రికార్డుగా నిలిచింది. పదో పంచవర్ష ప్రణాళిక (2002-07) నాటికి 63,955, 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12) నాటికి 51,79,012 గ్రామాలు విద్యుత్‌ ‌సౌకర్యానికి దూరంగా ఉండిపోయాయి. ప్రస్తుతం పరిస్థితిలో గణనీయ మార్పు కనపడుతోంది. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత చేపట్టిన చర్యల ఫలితంగానే పల్లెలను విద్యుత్‌ ‌వెలుగులు నింపుతున్నాయని చెప్పడం అతిశయోక్తి కానేకాదు. మరింత వేగంగా, సమర్థంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోంది.

మంచినీరు.. మౌలిక వసతుల్లో అతిముఖ్యమైనది. ప్రజల గొంతు తడపడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మోదీ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం 2019 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జలజీవన్‌ ‌మిషన్‌ ‌పథకాన్ని మోదీ ప్రకటించారు. 2024 నాటికి ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడం దీని లక్ష్యం. చెరువులు, కుంటలు తదితర సహజ వనరుల ద్వారా నీటి నిల్వ సంరక్షణ, రీఛార్జ్, ‌పునర్వినియోగంతోపాటు ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని నిర్ణయించారు. బిందెలు పట్టుకుని మహిళలు, పిల్లలు సుదూరంలోని చెరువులు, కుంటలు వద్దకు వెళ్లరాదని, అదేవిధంగా ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకునే పరిస్థితి చూడరాదని మోదీ అప్పట్లో చెప్పారు. ఈ పరిస్థితి స్వతంత్ర భారతానికి అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని రూపు మాపేందుకు ప్రత్యేకంగా జలశక్తి మంత్రిత్వశాఖను 2019 జులైలో ఏర్పాటు చేశారు. ఈ శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ ‌షెఖావత్‌ ‌ప్రధాని మోదీ లక్ష్యాలను నెరవేర్చేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.

2022 జనవరి ఒకటి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 19,25,09,039 కుటుంబాలు ఉండగా వాటిల్లో 8,79,46,642 మందికి కేంద్ర ప్రభుత్వం కుళాయి సౌకర్యం కల్పించి నిబద్ధతను చాటుకుంది. మిగిలిన కుటుంబాలకు సైతం తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పంచాయతీ, పానీ సమితులు, గ్రామ నీటిపారిశుద్ధ్య కమిటీలను ఏర్పాటు చేశారు. దాదాపు 3.60 లక్షల గ్రామాల్లో ఈ కమిటీలు పని చేస్తున్నాయి. 2019కి ముందు మూడుకోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి సౌకర్యం ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు మూడురెట్లకు చేరడం గమనార్హం. గోవా, పంజాబ్‌, ‌హరియానా, పుదుచ్చేరి, అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులు, దాద్రానగర్‌ ‌హవేలీల్లో పథకం సమర్థంగా అమలవుతోంది. పల్లెలకు సురక్షిత, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 15వ ఆర్థిక సంఘం పంచాయతీరాజ్‌ ‌సంస్థలకు రూ.1.42 లక్షల కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ రెండు పథకాలను మరింత సమర్థంగా, పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటోంది. అధునాతన, ప్రపంచస్థాయి సౌకర్యాలు వంటి ఆర్భాటపు మాటలను పక్కనపెట్టి ఆచరణాత్మకమైన అంశాలపైనే దృష్టి పెడుతోంది. మౌలిక వసతులు సమకూర్చకుండా ఎన్ని చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత పదవిని అందుకున్న మోదీ వంటి నాయకుడికి ప్రజల ఇబ్బందులు, సమస్యలు, సాధకబాధకాలు బాగా తెలుసు. అదే సమయంలో వాటిని పరిష్కరించడానికి అవసరమైన కార్యాచరణ, నిబద్ధత, చిత్తశుద్ధి పుష్కలంగా ఉండబట్టే తక్కువ కాలంలోనే పథకాల వల్ల ప్రజలకు మేలు జరుగుతోంది.

– జి.వి. ప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram