నరేంద్ర మోదీ కొత్త కొలువు

నరేంద్ర మోదీ కొత్త కొలువు

భారతదేశం పటం తీసుకుని నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గ సభ్యుల నియోజక వర్గాలను భౌగోళికంగా గుర్తిస్తే ఒక అద్భుతం కళ్లకు కడుతుంది. ఆ సేతుశీతాచల పర్యంతం ఆ నియోజకవర్గాలు విస్తరించి ఉంటాయి. అది మోదీ మంత్రివర్గ కూర్పులోని నేర్పు. అంతేకాదు, ఇదే మరొక తిరుగులేని వాస్తవాన్ని కూడా వెల్లడిస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, బంగాళం నుంచి గుజరాత్‌ వరకు తన ఉనికిని తిరుగులేకుండా చాటుకుంటున్నది. ఇప్పుడు భారతావని అంతటా రెపరెపలాడుతున్నది బీజేపీ పతాకమే. అలాగే బీజేపీ-మోదీ ప్రభంజనం కూడా. 2014 నాటి మంత్రివర్గమే విశిష్టమైనదన్న కీర్తి ఉంది. ఇవాళ ప్రపంచ పరిస్థితులు మరింత మారాయి. భారత్‌కు సవాళ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో సమంగా నడిపించాలి. అంటే నరేంద్రమోదీ కొత్త మంత్రివర్గం నవభారత నిర్మాణ సేన అన్న వాస్తవాన్ని విస్మరించలేం. మే 30న నరేంద్రమోదీ సహా 58 మంది మంత్రుల చేత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. రైసినా హిల్స్‌లోని రాష్ట్రపతి భవన్‌ ఎదుట జరిగిన ఈ ఉత్సవాన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా పేర్కొంటున్నారు. మోదీ ఘన విజయం సాధించారన్న వార్త తెలిసిన మరుక్షణం నుంచి మంత్రివర్గ నిర్మాణం గురించి భారతీయులు పెద్ద పెద్ద అంచనాలకు వెళ్లారు. బీజేపీ సొంతంగా 303 స్థానాలు, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ 354 స్థానాలు గెలుచుకున్న సందర్భమిది.

నరేంద్రమోదీ ఈ దఫా కూడా తన పాత మంత్రిమండలిని యథాతథంగా కొనసాగిస్తారని ఎవరూ భావించలేదు. మార్పులు చేయకుండా ఉండడం సాధ్యం కాదు కూడా. సుష్మా స్వరాజ్‌, అరుణ్‌జైట్లీ వంటివారు స్వచ్ఛందంగా పదవులకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. కారణం- అనారోగ్యం. అలాగే మేనకా గాంధీ, రాజ్యవర్థన్‌ సింగ్‌, సురేశ్‌ప్రభు వంటివారికి మళ్లీ అవకాశం దక్కలేదు. వాస్తవమో, అవాస్తవమో… దీనికి కారణాలు ఉన్నాయని పత్రికలలో విశ్లేషణలు ఇప్పటికే వెలువడినాయి.

అనూహ్యం

బీజేపీని కొత్త శిఖరాలకు చేర్చడంలో అమోఘమైన ప్రతిభను, అఘటనా ఘటన సామర్థ్యాన్ని చూపించిన పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు ఈసారి మంత్రిమండలిలో స్థానం కల్పిస్తారన్న జనం అంచనా తప్పలేదు. కానీ ఎవరూ ఊహించని రీతిలో విదేశీ వ్యవహారాల నిపుణుడు, దౌత్యవేత్త సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు స్థానం కల్పించారు. ఈ నిర్ణయం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. జైశంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖ అప్పగించడం, బిమ్‌స్టిక్‌ దేశాలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం రెండూ ప్రపంచానికి నిర్మాణాత్మకమైన సంకేతాలు పంపుతాయి. నిజానికి అమిత్‌ షాకు ఆర్థిక శాఖను కేటాయిస్తారని చాలామంది వేసిన అంచనా తలకిందులైంది. నిన్నటి మంత్రివర్గంలో రక్షణ శాఖను నిర్వహించిన నిర్మలా సీతారామన్‌కు ఆ శాఖ దక్కింది. ఆ విధంగా స్వతంత్ర భారత దేశ చరిత్రలో రక్షణ, ఆర్థిక శాఖను చేపట్టిన రెండవ మహిళగా ఆమె చరిత్రలో స్థానం సంపా దించారు. ఈ రెండు శాఖలను గతంలో ఇందిరా గాంధీ మాత్రమే నిర్వహించారు. అయితే ప్రధాన మంత్రి హోదాలోనే ఇందిర ఆ శాఖలు నిర్వహించా రన్నది నిజం. మహిళకు మంత్రిమండలిలో ఇంతటి స్థానం కల్పించడం బీజేపీ పురోగమన దష్టికీ, సమదష్టికీ కూడా తిరుగులేని నిదర్శనాలే. రక్షణ శాఖను మాజీ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అప్పగించారు. ఆయన తన తొలి యాత్రను సియాచన్‌ పర్యటనతో ఆరంభించడం అద్భుతమే. జూన్‌ మొదటివారంలో ఆయన అక్కడికి వెళ్లారు. బాహ్య దుష్టశక్తుల బారి నుంచి దేశాన్ని రక్షించే సైనిక బలగాలకు కేంద్రం నుంచి అలాంటి మద్దతు ఉండాలి. నాలుగు ప్రధాన శాఖలు విశిష్ట వ్యక్తులకు, నిబద్ధత, సామర్థ్యం ఉన్న వ్యక్తులకు నరేంద్రమోదీ అప్పగించారు. ఈ కూర్పు ప్రధానంగా నేర్పు ప్రాతిపదికగా జరిగింది. దీనికి కొన్ని పత్రికలు, చానళ్లు ‘షా ముద్ర’ అంటూ ప్రచారం చేశాయి. కానీ ఈ మంత్రిమండలి కూర్పులో కనిపించేది నవ భారతానికి బాటలు వేయడానికి అవసరమైన మేధోశక్తిని, వ్యూహ సామర్థ్యాన్ని ఒక చోటకు చేర్చడమే. ఒడిశాలోని బాలాసోర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రతాప్‌చంద్ర సారంగికి కూడా మంత్రిమండలిలో చోటు దక్కడం ఆధునిక ప్రజా స్వామ్యంలో ఒక అద్భుతం. ఆయన కేవలం పూరింట్లో నివసిస్తున్నారు. సైకిల్‌ మీద తిరుగుతారు. బడుగులు, గిరిజనుల పిల్లలకోసం పాఠశాలలు నడుపుతూ ఆయన తన సర్వస్వం సమాజ సేవకు అంకితం చేశారు. ఆరుగురు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. రాహుల్‌ను ఓడించిన స్మతి ఇరానీ ఈసారి కూడా మంత్రివర్గంలో చోటు దక్కించు కున్నారు. ఆమెకు స్త్రీశిశు సంక్షేమ శాఖ లభించింది.

అమిత్‌ షాకు చోటు

2019 లోక్‌సభ తీర్పు ప్రధానంగా దేశభద్రతకు భరోసా ఇవ్వగల నాయకత్వానికి పడిందని ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. అదే నిజం కూడా. కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18 ఏళ్ల యువతరం నుంచి, 35 సంవత్సరాల వారి వరకు ఈ అంశాన్నే ప్రధానంగా దష్టిలో పెట్టుకున్నారని, అలాంటి భరోసా మోదీ పాలనలో వారికి కనిపించిందని రాజకీయ పండితుల నిశ్చితాభిప్రాయం. అందుకే మోదీ మీద మీడియా గడచిన ఐదేళ్లలో ఎంత వ్యతిరేకతను గుప్పించినా సాధారణ భారతీయుడు మనసు మార్చుకోలేదు. మోదీని గెలిపించాడు. నిజానికి ఈ దేశ అంతర్గత భద్రత కూడా శ్రద్ధ తీసుకోవలసిన అంశమే. ఎందరో భద్రతా సిబ్బంది త్యాగం వల్ల, బీజేపీ వంటి జాతీయ భావాలనే ప్రధానంగా నమ్మే పార్టీ, అలాంటి వ్యక్తుల వల్ల ఉగ్రవాదంతో పోరాడడంలో మన దేశానికి ప్రత్యేకత లభించింది. అయినా ముస్లిం ఫండమెంటలిజం కారణంగా తలెత్తుతున్న ఉగ్రవాదం, వామపక్ష ఉగ్రవాదం ఈ దేశ పురోగతికి పెద్ద అవరోధాలుగా మారిపోయాయి. అలాగే ఈ దేశాన్ని ఇప్పటికీ ఒక ధర్మసత్రం మాదిరిగా భావించి ఇక్కడకి వచ్చి తిష్ట వేసే ముఠాలు కూడా తక్కువేమీ కాదు. ఈ దేశంలో అలా వీసా లేదా ఇతర పత్రాల ద్వారా ఉన్న పరిమితి దాటిపోయినా ఇక్కడే ఉండిపోయిన వారిని బయటకు పంపించడం పెద్ద అవసరం. వీరికి రేషన్‌ కార్డులు అందుతున్నాయి. ఇతర సౌకర్యాలు అందుతున్నాయి. ఆఖరికి ఓటర్లుగా కూడా నమోదవుతున్నారు. వీరికి కొన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా కానరాని ఈ ధోరణిని అరికట్టాల్సిందే. ఉదాహరణకు రోహింగ్యా ముస్లింలు. మైన్మార్‌లో వీరి ఆగడాలను బట్టే అక్కడ నుంచి తరిమేశారు. చాలామంది మన దేశానికి వచ్చారు. వీరిని తిరిగి పంపించే ప్రయత్నం చేస్తే కొందరు హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం చెప్పుకోవలసిన అంశమే. వారితో మానవతా దక్పథంతో వ్యవహరించాలట. కానీ మైన్మార్‌లో వీళ్లే 90 మంది హిందువులను ఒకేసారి చంపినట్టు అదే సమయంలో వార్తలు వచ్చాయి. దీని గురించి మాట్లాడిన వారు లేరు. హైదారాబాద్‌తో సహా దేశంలోని చాలా ప్రాంతాలలో వీరు అక్రమంగా నివసిస్తున్నారు. ఈ సమస్య అస్సాం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో మరింత ప్రమాదకర స్థాయిలో ఉంది. అలాగే కశ్మీర్‌ ఒక ఆరని కుంపటి. అక్కడి ప్రాంతీయ పార్టీలు, హురియత్‌ కాన్ఫరెన్స్‌ ఇవన్నీ పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉగ్రవాద మూకలను సమర్థిస్తున్నవే. ఒకరు ఎక్కువ, ఇంకొకరు కొంచెం తక్కువ. అంతే తేడా. ఇంకా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలోనే పేర్కొన్నది. దీనితోపాటు 35ఎ కూడా. రామమందిరం అంశం ఇంకా ఎక్కువ కాలం నాన్చడం సరికాదన్న అభిప్రాయం కూడా చాలామందిలో బలంగా ఉంది. కోర్టు బయట ఒప్పందం కోసం జరుగుతున్న యత్నాలు నింపాదిగానే అయినా పురోగతిలో ఉన్నాయి. ఈ అంశాలన్నింటిని అమిత్‌ షా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. ఈశాన్య భారతంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్‌ఆర్‌సి) వ్యవహారానికి ముగింపు ఇవ్వాలన్నది కూడా బీజేపీ లక్ష్యం. అంటే కశ్మీర్‌ లోయలో ముస్లిం ఫండమెంట లిజం, మధ్య భారతంలో వామపక్ష ఉగ్రవాదం, ఈశాన్యంలో పౌరుల గుర్తింపు పట్ల బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా ఉండదలిచింది. నిజం చెప్పాలంటే అంత ర్గత భద్రత, దేశీయమైన ఉగ్రవాదం పట్ల మోదీ 2.0 సర్కార్‌ మరింత కఠినంగా ఉంటుందని చెప్పడానికే అమిత్‌ షాకు ¬ంశాఖ అప్పగించినట్టు భావించాలి.

ఆర్థికశాఖకు అన్నీ సవాళ్లే

మోదీ ఎంత అవినీతి రహితంగా, సంక్షేమ దష్టితో పాలన సాగించినా కొన్ని దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను తక్షణమే తొలగించడం సాధ్యం కాదు. వాటి సంగతి ఎలా ఉన్నా అత్యవసరంగా కాయ కల్ప చికిత్స చేయవలసిన అంశాలు కూడా సీతారామన్‌ ముందు ఇప్పుడే తిష్ట వేశాయి. అందుతున్న వివరాల ప్రకారం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధిరేటు 5.8 శాతానికి పరిమితమైంది. 2018-19 ఆర్థిక సంత్సరంలో నిర్దేశించుకున్న జీడీపీ వద్ధిరేటు మొత్తంగా 6.8 శాతం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు 6.1 శాతం నమో దైందని గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగత ఈ స్థాయిలో ఉండడం నలభయ్‌ అయిదు ఏళ్లలో మళ్లీ ఇప్పుడేనని నిపుణులు చెబుతున్నారు. వీటిని వెంటనే పరిష్కరించడం ఆర్థికమంత్రి ముందుఉన్న పెద్ద సవాలు.

జైశంకర్‌ అద్భుత దౌత్యవేత్త

2015 నుంచి 2019 వరకు భారత విదేశ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్‌ పాశ్చాత్యదేశాలతో, తూర్పు దేశాలతో భారత్‌ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కొద్దికాలం క్రితం చైనాతో డోక్లాం విషయంలో తలెత్తిన వివాదాన్ని ఆయన ఎంతో నైపుణ్యంతో పరిష్కరించారన్న ఖ్యాతి కూడా ఉంది. పశ్చిమాసియాతో భారత్‌ బంధం పటిష్టం చేయడంలో కూడా ఆయన కషి ఉంది. ఏడు దేశాల వేదిక బిమ్‌స్టిక్‌ రాజ్యాధినేతలను మోదీ ఆహ్వానించడం విదేశీ వ్యవహారాల పట్ల ఆయన మరింత దష్టి పెడతారన్న సంకేతాన్ని ఇస్తుంది. జైశంకర్‌ కంటే ముందు ఈ పదవిలో ఉన్న సుష్మ ఎంతో మానవీయతా దక్పథంతో వ్యవహరించేవారు. విదేశాలలో ఇక్కట్లు పడుతున్న భారతీయులను ఆదుకోవడంలో ఆమె కషి అద్భుతం. అదే పంథాలో జైశంకర్‌ కూడా వెళతారని ఇప్పటికే రుజువైంది. అమెరికా, చైనాలలో, సింగపూర్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన దౌత్యవేత్త జైశంకర్‌.

బీజేపీకి ఇంత ప్రాచుర్యం ఉన్నప్పటికీ దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ మినహా మిగిలిన చోట్ల బలంగా లేదు. కేరళలో శబరిమల ఉద్యమంలో అంతటి కీలక పాత్ర పోషించినప్పటికి ఆనాటి ప్రజాదరణ ఓట్ల రూపంలోకి మారలేదు. అలాగే తమిళనాడులో ద్రవిడపార్టీల ప్రాభవం మధ్య బీజేపీ ప్రవేశం సాధ్యం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడి దుష్ప్రచారం పుణ్యమా అని మంచి ఓటింగ్‌ శాతం కూడా రాలేదు. అయినా కేరళ నుంచి వి. మురళీధరన్‌కు కేంద్రంలో మోదీ చోటు కల్పించారు. ఆయన ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు. రాజ్యసభ సభ్యుడు. ఈయనకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది. తమిళనాడు నుంచి కూడా బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. కానీ ఆర్థిక, విదేశ వ్యవహారాల వంటి రెండు ప్రధాన శాఖలు నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌, సుబ్రహ్మణ్యం జైశంకర్‌ ఈ రాష్ట్రానికి చెందినవారే. తెలంగాణలో నలుగురు బీజేపీ అభ్యర్థులు గెలిచారు. అందులో సికింద్రాబాద్‌ నుంచి నెగ్గిన జి. కిషన్‌ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రిగా చోటు దక్కింది. మిగిలిన భారతదేశమంతటి నుంచి ఈ మంత్రివర్గంలో సభ్యులు ఉన్నారు.

తొలి అడుగు : జైజవాన్‌ – జైకిసాన్‌

మే 31న కొత్త మంత్రి మండలి తొలి సమావేశం జరిగింది. రైతులు, సాయుధ, సైనిక బలగాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కర్షకులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలోకి కొత్తగా రెండుకోట్ల మంది రైతులను చేర్చాలని నిర్ణయించారు. అలాగే ఉగ్రవాదులతో పోరాడుతూ, విధి నిర్వహణలో చనిపోయిన భద్రతా బలగాల కుటుంబాల చిన్నారులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను కేంద్ర మంత్రి మండలి పెంచింది. మోదీ రెండో దఫా పాలన నుంచి భారతీయులు పెద్ద అంచనాలలోనే ఉన్నారు. ఆ అంచనాలను, విశ్వాసాలను నరేంద్ర మోదీ వమ్ము చేయరనే అందరి నమ్మకం కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *