వంగభూమిలో భంగపడ్డ దీదీ!

వంగభూమిలో భంగపడ్డ దీదీ!

వంగభూమిలో కమలం అనూహ్యంగా వికసించింది. పశ్చిమ బెంగాల్‌లో తనకు ఎదురే లేదు అన్నట్లు ప్రధాని మోదీతో పాటు బీజేపీతో కయ్యానికి దిగిన మమతా బెనర్జీ ఘోరంగా భంగపడ్డారు. కేంద్రంతో అనుసరించిన ఘర్షణ వైఖరికి తగిన మూల్యమే చెల్లించుకున్నారు. మమత దీదీ అహంకారాన్ని దెబ్బ తీస్తూ బెంగాల్‌ ఓటర్లు బీజేపీకి ఏకంగా 18 సీట్లు కట్టబెట్టారు. టీఎంసీకి 12 సీట్లు కోత పెట్టారు. మమత అనుసరించిన మైనారిటీ సంతుష్టీకరణ, హిందూ వ్యతిరేక రాజకీయాలను లోక్‌సభ ఎన్నికల ఫలితాల రూపంలో ఓటర్లు స్పష్టంగా తిరస్కరించ డంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖామమని అంచనా వేస్తున్నారు కమలనాథులు.

17వ లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి తిరిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే అంచనాలు నిజమవడమే కాదు, అనేక రాష్ట్రాల్లో విజయం ఏకపక్షంగా సాగింది. మోదీ వేవ్‌లో కాంగ్రెస్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు భంగపాటు తప్పలేదు.. ఈ ఫలితాలు అన్నీ ఒక ఎత్తైతే పశ్చిమ బెంగాల్‌లో తణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఓటర్లు ఇచ్చిన షాక్‌ గురించి మరింత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.. ఓటర్లు తణమూల్‌ పాలనపై ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా చాటుతూ బీజేపీకి గణనీయ మైన స్థాయిలో సీట్లను కట్టబెట్టారు.. ప్రధాని నరేంద్ర మోదీతో మొదటి నుంచి ఘర్షణ వైఖరిని అవలం బించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భంగపాటు తప్పలేదు.

2 నుంచి 18

ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పవనాలు పశ్చిమ బెంగాల్‌ను బలంగానే తాకాయి.. ఇది మమతా బెనర్జీ అహంకారంపై దెబ్బగానే భావించాలి. 42 లోక్‌సభ సీట్లు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 18 సీట్లను కైవసం చేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ సీట్లు 22కు పరిమితం అయ్యాయి.. 2014 ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే రావడం ఇక్కడ గమనించాలి.. నాటి ఎన్నికల్లో టీఎంసీ 34 సీట్లను గెలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 22కి పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లకు పరిమితం కాగా, వామపక్షాలు గతంలో గెలిచిన రెండు సీట్లను పోగొట్టుకుని రాష్ట్రంలో ఉనికిని కోల్పోయాయి.. వామపక్షాల ఓటు బ్యాంకు 10 నుంచి 12 శాతం దాకా బీజేపీకి మరలినట్లు కనిపిస్తోంది..

పశ్చిమ బెంగాల్‌లో పోలైన మొత్తం ఓట్లలో టీఎంసీకి 43 శాతం రాగా బీజేపీ 40 శాతం దక్కించుకుంది.. 2014లో 34 శాతం ఓట్లతో 2 సీట్లను మాత్రమే గెలిచిన బీజేపీ తన ఓటు బ్యాంకుతో పాటు సీట్లను గణనీయంగా పెంచుకోవడం గమనించవచ్చు.. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌ నుంచి డార్జిలింగ్‌, అసన్‌సోల్‌ సీట్లను గెలుచుకున్న బీజేపీ వాటిని నిలుపుకోవడంతో పాటు కూచ్‌ బిహార్‌, అలీపూర్‌ దువార్స్‌, జలపాయ్‌ గురి, రాయ్‌గంజ్‌, బేలూర్‌ఘాట్‌, ఉత్తర మాల్దా, రాణా ఘాట్‌, బంగాన్‌, బారక్‌పూర్‌, హుగ్లీ, జార్‌గ్రామ్‌, మేదినీపూర్‌, పురూలియా, బంకురా, బిష్ణుపూర్‌, బర్దమాన్‌ దుర్గాపూర్‌లలో విజయకేతనం ఎగురవేసింది.

పెనం మీద నుంచి..

పశ్చిమ బెంగాల్‌లో రెండున్నర దశాబ్దాలకు పైగా సాగిన వామపక్ష ప్రభుత్వ పాలనపై విసిగిపోయిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిచించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ పాలన వామపక్షాల మూసలోనే సాగింది. దీంతో అక్కడి ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. క్షీణించిన వామపక్షాల స్థానంలో బలమైన ప్రత్యా మ్నాయ పార్టీ కనిపించకపోవడంతో బెంగాల్‌ ప్రజలు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనివార్యంగా తృణమూల్‌నే గెలిపించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా మారిపోయింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు గూండాయిజంలో వామపక్షాలను మించిపోయారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలు సర్వసాధారణమైపోయాయి. స్థానిక ఎన్నికల్లో తృణమూల్‌ గుండాలు ప్రత్యర్థులను భయభ్రాంతు లను చేసి ఏకపక్ష విజయాలను నమోదు చేసేవారు. దీనికి తోడు మమత ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరింది. శారదా, రోజ్‌వ్యాలీ కుంభ కోణాల్లో మమతతో పాటు తృణమూల్‌ నాయకుల పాత్ర స్పష్టంగా కనిపించింది.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం అభివృద్ధిలో వెనుక బడింది. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై స్పందించి పోరాడే విషయంలో శ్రద్ధ చూపించకపోవడంతో కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు క్రమంగా క్షీణించి పోయాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ బెంగాల్‌ ప్రజలకు ఆశాకిరణంలా కనిపించింది.

బంగ్లాదేశ్‌తో సుదీర్ఘ సరిహద్దు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పొరుగు దేశం నుంచి పెద్ద సంఖ్యలో జరిగిన చొరబాట్ల కారణంగా జనాభా తారుమారై పోయింది. ఈ చొరబాట్లను నివారించడంలో దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వామపక్షాలు తగిన శ్రద్ధ చూపించలేదు. అక్రమంగా వలసవచ్చిన వారిని వారు ఓటు బ్యాంకుగా పరిగణించారు. దీంతో బెంగాల్‌ ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పారు. అయితే తృణమూల్‌ కూడా వామపక్షాల దుర్నీతినే కొనసాగించింది. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన సినీ నటులు తృణమూల్‌ తరఫున ప్రచారం నిర్వహించ డంపై విమర్శలు కూడా వచ్చాయి.

మమతా బెనర్జీ పాలనలో సంతుష్టీకరణ విధానాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మైనారిటీలను ప్రసన్నులను చేసుకోడానికి వరాలను కురిపించారు. మసీదులు, మదర్సాలకు ప్రత్యేక నిధులను కేటాయించారు. దుర్గా నవరాత్రులు, వినాయక చవితి వేడుకలు, శ్రీరామ నవమి తదితర పండుగల సమయంలో ఆంక్షలు విధించడం రాష్ట్రం లోని హిందువులకు ఆగ్రహం తెప్పించింది. మమతా బెనర్జీ వాహన శ్రేణి పోతుంటే రోడ్డు పక్కన ఎవరైనా జైశ్రీరాం అని నినాదాలు చేస్తే ఆగిమరీ వారిని హెచ్చ రించి, అరెస్టు చేయించిన సందర్భాలూ ఉన్నాయి.

కుట్ర రాజకీయాలు!

బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనా వైఫల్యాలపై బీజేపీ పెద్దఎత్తున ఉద్యమాలు సాగించింది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారిని వెనక్కి పంపిస్తామని ఆ పార్టీ ప్రకటించడంతో పాటు లోక్‌సభలో ఎన్‌ఆర్‌సీ బిల్లును ఆమోదింపజేయడం ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంచింది. బెంగాలీ ప్రజలు టీఎంసీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేని గ్రహించారు. దీదీ సంతుష్టీకరణ రాజకీయాలపై విసుగెత్తిన హిందూ ఓటర్లలో చైతన్యం రావడం బీజేపీకి లాభించింది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడం మమతకు గుబులు పుట్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, వామపక్షా లపై విశ్వాసం కోల్పోయిన ఆయా పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరిపోయారు. మమత నియంతృత్వ ధోరణి నచ్చని టీఎంసీ నాయకులు, కార్యకర్తలు సైతం కమలదళంలోకి వచ్చారు.

బెంగాల్‌లో బీజేపీ ఎదగడాన్ని సహించలేక పోయారు మమతా బెనర్జీ. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదంటూ తరచూ ప్రకటనలు చేసేవారామె. తృణమూల్‌ గూండాలు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిపారు. ఎంతో మందిని హత్య చేశారు. వీటిపై పోలీసుల విచారణ కూడా సక్రమంగా కొనసాగలేదు.

బీజేపీ పట్ల మమతా బెనర్జీ అసహనం ఎంత తీవ్రంగా ఉండేదో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పక్షంగా సభలు నిర్వహించుకోడానికి కూడా బీజేపీకి అర్హత లేదు అన్నట్లుగా దురహంకారాన్ని ప్రదర్శించారు. బీజేపీ ర్యాలీలు, సభలకు అనుమతులను నిరాకరిం చారు. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హెలిక్యాప్టర్‌ ల్యాండింగ్‌కు కూడా అనుమతి లభించలేదు. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ చౌహాన్‌లు ఆ రాష్ట్రంలో తలపెట్టిన సభల విషయంలో కూడా మమత సర్కారు ఇలాగే వ్యవహరించింది.

ఘర్షణ వైఖరి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను కూడా ప్రశ్నించే రీతిలో మమతా బెనర్జీ వ్యవహరించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. శారదా కుంభకోణంతో సంబంధం ఉన్న కలకత్తా పోలీసు కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను మమత సర్కారు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ప్రధానమంత్రి పదవిలో ఉన్న నరేంద్ర మోదీకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ఇటీవల ఫొని తుఫాను వల్ల దెబ్బతిన్న బెంగాల్‌కు సాయం అందించడం కోసం ప్రధాని మోదీ ఫోన్‌ చేస్తే మట్లాడేందుకు కూడా నిరాకరించారామె. గతంలో మమతా బెనర్జీ తనకు ఏటా రసగుల్లాలు, కుర్తాలు బహుమతులుగా పంపేవారని ప్రధాని మోదీ ఒక ఇంటర్వ్యూలో చెప్పగా ఈసారి ఇసుక నింపిన మిఠాయిలను పంపుతానని తన శాడిజాన్ని బయట పెట్టుకున్నారు దీదీ. కోల్‌కతాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్‌షో నిర్వహించిన అమిత్‌ షాపై రాళ్ల దాడి జరగడంతో ఎన్నికల సంఘం సైతం ఆగ్రహించింది. బెంగాల్‌లో చివరి విడత ప్రచారాన్ని ఒకరోజు ముందుగానే నిలిపి వేసి మమతకు షాక్‌ ఇచ్చింది.

బీజేపీ దూకుడు

స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశభక్తియుత విప్లవ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న బెంగాల్‌ను కాంగ్రెస్‌, వామపక్ష రాజకీయాలు చాలా వరకు బలహీన పరిచాయి. రాష్ట్ర ప్రజలు మమత నేతృత్వంలోని తృణమూల్‌ను నమ్మితే వామపక్షాల కంటే అధ్వాన్న పాలన సాగుతోంది. మోదీ, అమిత్‌ షాల ద్వయం బెంగాల్‌ మీద దృష్టి పెట్టింది. వారు గత ఐదేళ్లుగా మమతా బెనర్జీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగించిన ఆందోళనా కార్యక్రమాలు ఒక ఎత్తయితే, ఎన్నికల సమయంలో ఈ అగ్రనేతలు పెద్ద ఎత్తున చేపట్టిన ప్రచార సభలు మరో ఎత్తు. ఈ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీకి లభించిన విజయం సాధారణ మైనది కాదు. గెలిచినవి 18 లోక్‌సభ సీట్లే అయినా ఈ ప్రభావం రాష్ట్రంలోని 160 అసెంబ్లీ స్థానాలపై స్పష్టంగా కనిపించింది. బీజేపీ ఇదే దూకుడు కొనసాగిస్తే 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం.

బీజేపీలోకి రావడానికి 40 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని బెంగాల్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఎమ్మెల్యేలు కాదు కదా ఒక్క కౌన్సిలర్‌ కూడా బీజేపీలోకి వెళ్లరు అన్నారు దీదీ. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడగానే ముగ్గురు టీఎంసీ ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు బీజేపీలోకి రావడంతో మమతకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తృణమూల్‌ నుంచి బీజేపీలోకి వెళ్లే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

కేంద్రంలో హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడితే చక్రం తిప్పి ప్రధాని పీఠంపై కూర్చోవాలని ఆశ పడ్డారు మమత. తృతీయ ఫ్రంట్‌ అంటూ ఆర్భాటం చేశారు. కోల్‌కతాలో భారీ ఎత్తున ప్రతిపక్షాల ర్యాలీ నిర్వహించారు. తీరా మోదీ వేవ్‌ కాంగ్రెస్‌, ఇతర విపక్షాలతో పాటు టీఎంసీని కూడా కుదేలు చేసింది. అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటిగా.. మారింది దీదీ పరిస్థితి. ఇప్పడు ఆమె దిగులంతా ఒక్కటే! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఎలా అన్నదే అది!

– క్రాంతిదేవ్‌ మిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *