లంక పేలుళ్ల లక్ష్యం ?

లంక పేలుళ్ల లక్ష్యం ?

ఉగ్రవాదం పేరుతో ఇస్లాం మత ఛాందసవాదులు సాగిస్తున్న మారణహోమం లక్ష్యం ఏమిటి? దాని ప్రయాణం ఎటువైపు? భూగోళం మీద శ్మశాన రాజ్యం నిర్మించడమే దాని ఉద్దేశమా? ఆ మత ఛాందసులు ఈ విశ్వంలోని వైవిధ్యాన్ని ధ్వంసం చేయడానికే కంకణం కట్టుకున్నారా? అసలు అన్య మతస్తులకు జీవించే హక్కు లేదని తీర్మానించారా? శ్రీలంకలో జరిగిన ఈస్టర్‌ పేలుళ్ల ఘటన తరువాత ప్రపంచం ఈ ప్రశ్నలు వేసుకోక తప్పడం లేదనిపిస్తుంది. దాడులు సాగించిన వారి చరిత్ర, తరువాత సాగిన గాలింపులో దొరికిన సామగ్రి, బయటపడిన కుట్రలు ఇవన్నీ చూస్తే నాగరిక ప్రపంచం మీద అనాగరిక వ్యవస్థ విసురుతున్న పంజాగా ఈ ఘాతుకాన్ని ప్రపంచ జనాభా భావించవలసి వస్తోంది. కాలచక్రాన్ని వెనక్కి తిప్పి తీరాలని చూస్తున్న మత ఛాందసుల మూర్ఖత్వం నానాటికీ ఎలా పెరిగిపోతున్నదో మరోసారి కళ్లకు కట్టిన ఘోర దురంతమిది. సిరియా నుంచి శ్రీలంకకు పాకిన ఈ రక్త పిపాస ప్రపంచాన్ని మధ్య యుగాలలోకి నెట్టాలన్న పిచ్చి పట్టుదలతో సాగుతున్నట్టు అర్థం చేసుకోవలసిన పరిస్థితులే అంతటా నెలకొని ఉన్నాయి. ముస్లింలు మరొకరి దగ్గర పాలితులిగా ఉండలేరంటూ వినిపిస్తున్న నినాదాల అర్థం ఏమిటి? వాటి వెనుక మర్మం ఏది?

253 మంది అమాయకులు చనిపోయారు. 500 మంది గాయాల పాలయ్యారు. ఈ గాయం నుంచి శ్రీలంక కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది? మధ్యలో ప్రతీకార ధోరణులు ప్రబల కుండా ఉండగలవా? 72 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు వెల్లడించే రహస్యాలు ఇంకెలా ఉంటాయో!

ఏప్రిల్‌ 21న శ్రీలంకలో అక్షరాలా నరమేధం జరిగింది. ఈస్టర్‌ ఆదివారం రోజునే దేశంలోని వివిధ ప్రదేశాలలో ఉన్న సెయింట్‌ అంథోనీ ష్రైన్‌ (కొలంబో 13), సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చ్‌ (నెగొంబో), జియోన్‌ చర్చ్‌ (బట్టికలోవ)లు, దేశ రాజధాని కొలంబోలోనే ఉన్న షాంగ్రి లా సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరీ, ట్రాపికల్‌ ఇన్‌ అనే మూడు విలాస వంతమైన హోటళ్లు లక్ష్యంగా పేలుళ్లు జరిగాయి. ఆ రోజు సాయంత్రం పోలీసులు, నిఘా వర్గాల అంచనా మేరకు దేమతగోడ అనే చోట ఒక అతిథిగృహంలో కూడా పేలుడు జరిగింది. కొలంబో లోనే సావీ సినిమా దగ్గర ఏప్రిల్‌ 24న తక్కువ స్థాయిలో పేలుడు ఒకటి సంభవించింది. ఏప్రిల్‌ 25న కూడా పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 26న దేశ తూర్పు భాగంలోని సమ్మంతురై పట్టణంలో ఉన్న ఒక రహస్య స్థావరం మీద నిఘా వర్గాలు, పోలీసులు జరిపిన దాడిలో ఒక ఆత్మాహుతి బాంబర్‌ చనిపోయాడు. భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. అందుతున్న సమాచారం ప్రకారం 253 మంది ఈ నరమేధానికి బలయ్యారు. ఇందులో ఆత్మాహుతి దాడులు కూడా ఉన్నాయి. మృతులలో 42 మంది విదేశీయులు. కొన్ని దశాబ్దాల పాటు తమిళ ఈలం వేర్పాటువాదంతో కకావికలైన శ్రీలంక సరిగ్గా దశాబ్దం క్రితమే శాంతించింది. 2009లో తమిళ ఈలం ఉగ్రవాదం సమసిపోయిన తరువాత జరిగిన అతి పెద్ద దాడి మళ్లీ ఇదే.


మూలస్థానం కాట్టంకుడి

‘శ్రీలంక మహమ్మదీయులది. ముస్లింలు ఇతరుల ఏలుబడిలో పాలితులిగా ఉండడానికి ఎప్పటికీ సమ్మతించబోరు!’

నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ స్థాపకుడు, ఈస్టర్‌ బాంబు పేలుళ్ల వెనుక సూత్రధారిగా దాదాపు ఆ శ్రీలంక అంతా భావిస్తున్న జహ్రాన్‌ హషీం 2017 ప్రాంతంలో చెప్పిన మాటలివి. పండుగకో, మరొక సందర్బంలోనో కుటుంబం అంతా కలిసినప్పుడు జహ్రాన్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉండేవాడని అతని సోదరి మహమ్మద్‌ హషీం మదనియా చెప్పారు. ఇలాంటి బోధలు తనకు, తన భర్తకు కూడా ఆమోదయోగ్యంగా ఉండేవి కాదని కూడా ఆమె అన్నారు. ఇప్పుడు జహ్రాన్‌ ఇంతటి అఘాత్యానికి ఒడి గట్టాడంటే నమ్మశక్యంగా లేదని, నిజానికి ఇంతటి మారణహోమం జరిపే సామర్థ్యం కూడా అతడికి లేదని మదనియా చెప్పారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన జహ్రాన్‌, ఆ ఇంటిలో తొలి సంతానం. తండ్రి చిల్లరదొంగగా పేరు తెచ్చుకున్నాడు.

జహ్రాన్‌ హషీమ్‌ స్వస్థలం కాట్టంకుడి. నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ (ఎన్‌టిజె) స్థాపకుడు కూడా అతడే. 2017లోనే ఇతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇస్లాం మత ఛాందసవాదాన్ని నూరిపోస్తున్నాడు. బౌద్ధం ప్రధానంగా ఉన్న శ్రీలంకలోని ఈ చిన్న సముద్రతీర పట్టణంలో డజన్ల కొద్దీ మసీదులు కనిపిస్తాయి. ఈ పట్టణ జనాభా 40,000. జహ్రాన్‌ పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి, ఈస్టర్‌ పేలుళ్ల తరువాత ఈ ప్రాంతం భయంతో విలవిలలాడుతోంది. ఇప్పుడు జహ్రాన్‌ను అంతా ద్వేషిస్తూ మాట్లాడుతున్నారు. జహ్రాన్‌ ఎన్‌టిజెని స్థాపించినప్పుడు కూడా అతడి కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వ్యతిరేకించారు. దీనితోనే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కానీ ఆ రోజులలో ఇతడిలో ఇంతటి రాక్షసత్వం దాగి ఉందని, దేశానికి ఇంత చేటు చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా ఇతడు చేస్తున్న రెచ్చగొట్టే బోధలతో కాట్టంకుడి ప్రాంతంలో మితవాద ఇస్లాం కనుమరుగై, ఉగ్రవాద ముస్లిం భావాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ముస్లింలంతా భయాందోళనలతో వణికి పోవడానికి కారణం- ఈస్టర్‌ బాంబు దాడులలో పాల్గొన్న తొమ్మిమంది కూడా కాట్టంకుడి ఉగ్రవాద కర్మాగారంలో తయారైన వారేేనన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే అక్కడ అనుమానితుల అరెస్టులు కూడా ఎక్కువగానే జరిగాయి. జహ్రాన్‌ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న సగం కట్టిన భవనంలోనే ఎన్‌టిజె సమావేశాలు జరుగుతూ ఉండేవి. ఇందులో హషీమ్‌ షాంగ్రీలా హోటల్‌లోనే ఆత్మాహుతి దాడికి పాల్పడి మరణించినట్టు సమాచారం. ఏప్రిల్‌ 28న హషీమ్‌ తండ్రి, మరొ ఇద్దరు కొడుకులు కూడా ఆత్మాహుతి దాడి చేసుకుని మరణించారు.

ఇల్హామ్‌, ఇమ్సాత్‌ అహ్మద్‌ ఇబ్రహీం శ్రీలంక కోటీశ్వరులలో ఒకడు, మసాలా దినుసుల వ్యాపారి కొడుకులు. ఈ ఇద్దరు ఆత్మాహుతి దాడులు చేశారు. ఇందులో ఇల్హామ్‌ గతంలోను అరెస్టయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దరి తండ్రి మహ్మద్‌ యూసుఫ్‌ ఇబ్రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్సాత్‌ ఏటా విందులు ఇచ్చేవాడని, అందరితోను స్నేహభావంతో మెలిగేవాడని అక్కడి వారు చెబుతున్నారు. కానీ ఒక్కసారిగా అతడి అసలు రూపం బయటపడడంతో ఇప్పుడు విస్తుపోతున్నారు ప్రజలు. బీఎండబ్ల్యు కారు, విలాసవంతమైన ఇల్లు, రాజకీయ నేతలు కూడా వచ్చి విందులు తీసుకునే సందర్భాలు చూసి సాధారణ ప్రజానీకం అతడిని ఏనాడూ అనుమానించలేదు. ఇంకా చిత్రం ఇతడు మార్క్సిస్టు సిద్ధాంతానికి దగ్గరగా ఉండే ఒక రాజకీయ పార్టీలో చేరాలని కూడా కొద్దికాలం క్రితం భావించాడు.


ఈ పేలుళ్లకు పాల్పడినవారు తొమ్మిది మంది అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరంతా కూడా శ్రీలంక దేశీయులేనని, నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ (ఎన్‌టిజె)కు చెందిన వారేనని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. శ్రీలంకకు బయట ఉన్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ఎన్‌టిజెకు గతంలో బౌద్ధుల మీద కూడా దాడులకు పాల్పడిన చరిత్ర ఉంది. ఈ సంవత్సరం మార్చి 15న క్రైస్ట్‌చర్చ్‌ ప్రాంతంలో ముస్లింల మీద జరిగిన దాడులకు ప్రతీకారంగానే తాజా పేలుళ్లు జరిగాయని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్‌ విజేవర్ధనే పార్లమెంంటులో చెప్పారు. కానీ కొందరి అభిప్రాయం ప్రకారం క్రైస్ట్‌చర్చ్‌లో ముస్లింల హత్యకు ముందే ఈస్టర్‌ ఆదివారం హత్యలకు పథకం తయారైంది. కానీ రక్తపాతం జరగిన రెండు రోజులకు అమాక్‌ న్యూస్‌ ఏజెన్సీ (ఇది ఐఎస్‌ఐఎస్‌ ప్రచార విభాగం) లంకలో క్రైస్తవుల మీద బాంబుదాడులు జరిపిన వారు ‘ఇస్లామిక్‌ స్టేట్‌ యోధులే’నని ప్రకటించింది.

ఉగ్రవాదానికి సంబంధించి శ్రీలంకకు సుదీర్ఘ చరిత్ర ఉంది. తమిళపులులు (ఎల్‌టిటిఇ) ప్రత్యేక ఈలం పోరాటం మొత్తం ఉగ్రవాదాన్ని ఆశ్ర యించినదే. దీనిని 2009లో పూర్తిగా అణిచేశారు. అలాగే మావోయిస్ట్‌-లెనినిస్ట్‌ కమ్యూనిస్ట్‌ జనతా విముక్తి పెరుముణ (జేవీపీ) కూడా 1971లోను తరువాత 1987-89లలోను తిరుగుబాటు చేసింది. దీనిని కూడా ప్రభుత్వం అణచివేసింది. 2000 సంవత్సరం నాటికి అంతర్జాతీయ సంబంధాలు కలిగిన మొత్తం పదమూడు ఉగ్రవాద సంస్థలు ఆ చిన్నదేశంలో కార్యకలాపాలు సాగించేవి. 2010లో క్రైస్తవులతో పాటు, ఇతర మైనారిటీల సమావేశాల మీద ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇక్కడ 70. 2 శాతం బౌద్ధులు. తమ మైనారిటీ మతానికి రాజ్యాంగ బద్ధంగా రక్షణ కల్పించాలని అప్పుడే కొలంబో బిషప్‌ ధిలోరాజ్‌ కనగసబే కోరారు. నిరుడే క్రైస్తవ వర్గాల నుంచి అక్కడ ప్రభుత్వానికి గట్టి విన్నపం కూడా అందింది. ఆ సంవత్సరమే తమ మీద దాడులు మరీ పెరిగిపోయాయని నేషనల్‌ క్రిస్టియన్‌ ఎవాంజలికల్‌ అలయెన్స్‌ బృందం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 2018లోనే శ్రీలంక క్రైస్తవానిక అనుకోని మరొక ఎదురు దెబ్బ కూడా తగిలింది. మతాంతరీకరణలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలన్న ఒక వర్గం క్రైస్తవ సంఘాల అభ్యర్థనను శ్రీలంక సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. ముస్లిం మత ఛాందస ఉగ్రవాదులు ఈస్టర్‌ నాడే పేలుళ్లకు పథకం వేయడం కూడా చెప్పుకో దగినదే. ఈస్టర్‌ పర్వదినాన్ని శ్రీలంక క్రైస్తవులు విశేష స్థాయిలో జరుపుకుంటారు.

శ్రీలంకలో ముస్లింలు, క్రైస్తవులు కూడా మైనారిటీలే. ముస్లింలు 9.7 శాతం. క్రైస్తవులు 6.1 శాతం. హిందువులు 12.6 శాతం. కానీ ఇంతటి విధ్వంసం సృష్టించినవారు ముస్లింలలోని మత ఛాందసవాదులే కావడం విశేషం. పది శాతం లోపుగా ఉన్న ఈ వర్గం చిరకాలంగా ఆ చిన్న దేశంలో పెద్ద పెద్ద కుట్రలే పన్నుతోంది. ముస్లిం వర్గాలలో, ఆ వర్గం యువతలో మత ఛాందస వాదాన్ని రెచ్చగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి శ్రీలంక ప్రభుత్వానికి తెలుసు. విద్యా వంతులు, సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబాల నుంచి 32 మంది శ్రీలంక ముస్లింలు 2016 నవంబర్‌ మాసంలోనే ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ ది లెవాంట్‌ (ఐఎస్‌ఐఎస్‌కే మరొక పేరు)లో చేరారని సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రభుత్వం ప్రకటించింది. ‘వీరంతా విదేశాలకు వెళ్లారని, అక్కడ ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణలో శిక్షణ పొంది తిరిగి వచ్చారని కూడా మాకు తెలుసు. కానీ ఇలా విదేశాలలో తర్ఫీదైనవారిని అరెస్టు చేయడాన్ని శ్రీలంక రాజ్యాంగం అనుమతిం చద’ని పేలుళ్లు జరిగిన మూడు రోజుల తరువాత ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ప్రకటించిన సంగతి విదితమే. శ్రీలంక ముస్లిం కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు హిల్మీ అహ్మద్‌ కూడా మూడేళ్ల క్రితం నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ గురించి సైనిక నిఘా విభాగం దృష్టికే తీసుకువెళ్లారు. మతం కోసం నీవు ఇతరులను చంపాలని, ఆ విధంగా బోధిస్తూ జమాత్‌ సంస్థ ముస్లిమేతరులను ఉసిగొల్పుతున్నదని హిల్మీ హెచ్చరించారు. నిజానికి ఏప్రిల్‌ 4న భారత్‌ కూడా పేలుళ్లకు సంబంధించి శ్రీలంకను హెచ్చరించింది. క్రైస్తవుల ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా విధ్వంసం జరుగుతుందని ఆ హెచ్చరిక సారాంశం. తొలి పేలుడు దేశ రాజధాని కొలంబోలోని చరిత్రాత్మక సెయింట్‌ ఆంథోని చర్చ్‌లోనే సంభవించింది.


బాధ్యత ప్రకటించుకున్న ఐఎస్‌

ఈ దాడులు మా సానుభూతిపరులే చేశారని ఐఎస్‌ఐఎస్‌ ప్రకటించింది. 32 మంది దేశం నుంచి వెళ్లి ఉగ్రవాదంలో శిక్షణ పొందివచ్చారన్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందంటూ పార్లమెంటులో రక్షణ మంత్రి చేసిన ప్రకటనలోని నిజం దీనితో తేటతెల్లమవుతోంది. దీనిని బట్టి తర్ఫీదైన ఒక మతోన్మాది తన కుటుంబాన్ని కూడా కార్యకలాపాలకు ప్రోత్సహించి ఎంతటి విధ్వంసం సృష్టించగలడో దీనిని బట్టి తెలుస్తుంది. ఒక మారుమూల ద్వీపంలో కూడా ఐఎస్‌ ఎలా అడుగు పెట్టగలదో, అక్కడ ఉన్న చిన్న ముస్లిం వర్గంలో కూడా ఎలా మతోన్మాదాన్ని నింపగలదో దీనిని బట్టి తెలిసింది. శ్రీలంక ఈస్టర్‌ దాడులు గతంలో సిరియా, ఇరాక్‌, అఫ్గానిస్తాన్‌లలో జరిగిన బాంబు దాడుల కంటే పెద్దవి. ఇవి 2000 సంవత్సరం ప్రాంతంలో అల్‌ కాయిదా యెమెన్‌లో జరిపిన దాడులకు చాలా దగ్గరగా ఉన్నాయి.

2001 నాటి న్యూయార్క్‌ దాడులు కూడా ఇదే తరహాలో జరిగాయి. బాలి (2002), ఇస్తాంబుల్‌ (2003). మాడ్రిడ్‌ రైల్వేలో పేలుళ్లు (2004), లండన్‌లో జరిగిన ట్యూబ్‌ బాంబ్‌ పేలుడు (2005)లో కూడా ఇలాంటి పదర్థాలే ఉపయోగించడం కనిపిస్తుంది. అలాగే ఆత్మాహుతి దాడులు లేదా, పేలుళ్ల కార్యకలాపాలలో ఆ సంస్థ సభ్యుల మధ్య ఉన్న సహకారం కూడా దీనితో బహిర్గతమయ్యాయి. ఉగ్రవాదులు ఎలాంటి దేశాన్ని తమ లక్ష్యంగా చేసుకుంటారో కూడా కొన్ని దేశాల రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. ఐఎస్‌ శ్రీలంకను ఎన్నుకోవడంలో ఇలాంటి కారణాలు కనిపిస్తాయి. అక్కడ కొద్దికాలంలో రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. ఒక రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. ప్రధాని రణిల్‌ను పదవి నుంచి తొలగించి, తనకు అనుకూలమైన మహింద రాజపక్సను నియమించాలని అధ్యక్షుడు సిరిసేన యోచించారు. కానీ మంత్రి మండలి నుంచి చుక్కెదురైంది. అలాగే ఈలం ఉగ్రవాదులతో పోరి అలసిపోయిన శ్రీలంక ప్రస్తుతం సైన్యం, పోలీసు వ్యవస్థలను పునర్‌ నిర్మించుకునే పనిలో ఉంది. కాబట్టి ఇలాంటి లోపాలు ఉన్న దేశాలుగా భారత్‌, బంగ్లా కూడా ఐఎస్‌ దృష్టిలో ఉన్నాయి. అలాగే మలేసియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌ కూడా జాగ్రత్తగా ఉండవలసిందే. ఈ చివరి రెండు దేశాలలో రాజకీయ అస్థిరత్వం కూడా ఉంది.

ఏప్రిల్‌ 23, 2019న ఐఎస్‌ ప్రచార వ్యవస్థ అమాఖ్‌ విడుదల చేసిన ఫోటో. పేలుళ్లు జరిపింది వీరేనని ప్రకటించింది. మధ్యలో ఉన్న వ్యక్తి జహ్రాన్‌ హషీం అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.


ఆ రోజు ఉదయం 8.45కి మొదలైన ఈ రక్తక్రీడ మధ్యాహ్నం 2. 15 వరకు సాగింది. తరువాత కూడా పేలుళ్లు సంభవించి జనం చనిపోయిన సంగతి తెలిసిందే. ఉదయం 9.05 ప్రాంతంలో జియోన్‌ చర్చ్‌లో (బట్టికలోవ) జరిగిన ఆత్మాహుతి దాడిని ఆపడానికి కడు సాహసంతదో రమేశ్‌ రాజు అనే భద్రతా ఉద్యోగి చేసిన ప్రయత్నం శ్లాఘనీయంగా ఉంది. ఆ దాడిలో మరణించిన 27 మందిలో ఆయన కూడా ఉన్నారు. ఆయనకు దేశం మొత్తం నివాళి ఘటించింది. మృతులలో 45 మంది చిన్నారులు ఉన్నారు. శ్రీలంక టీవీ చెఫ్‌ శాంతా మాయాదునే, ఆమె కుమార్తె కూడా మరణించారు. డెన్మార్క్‌ బట్టల వ్యాపారి, కోట్లకు పడగలెత్తిన ఆండర్స్‌ హోల్చ్‌ పోవెల్సన్‌కు నలుగురు సంతానం. అందులో ముగ్గురు ఈ దాడిలో చనిపోయారు. ఇలాంటి గాథలు ఎన్నో ఉన్నాయి.

దాడులకు సంబంధించిన హెచ్చరికలు, అనుమానాలు ఆ ఒక్కరోజుతోనే ఆగిపోలేదు. ముస్లిం ఉగ్రవాదులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని ఒక అనుమానం. అలాగే క్రైస్తవ ప్రార్థనా స్థలాలపై జరిగిన ఘోర దాడులకు నిరసనగా ముస్లిం వర్గాల మీద కూడా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందన్నది కూడా మరొక హెచ్చరిక. చాలా ప్రాంతాల నుంచి ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకుని రక్షణ కోసం పరుగులు తీశారు. సైంతమారుతు అనేచోట ఏప్రిల్‌ 26న గాలింపు జరుగుతూ ఉండగా సైన్యం మీద, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్టు మీద ముస్లిం ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మేరకు గాలింపు జరిగింది. ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు తమని తాము పేల్చుకుని చనిపోయారు. ఈ పేలుడుతోనే ఆరుగురు పిల్లలతో సహా, తొమ్మిది మంది ఆ కుటుంబాల వారు చనిపోయారు. సైంతమారుత, సమ్మంతురై అనే చోట జరిపిన గాలింపులలో పెద్ద ఎత్తున మందుగుండు, దాడులకు సంబంధించిన సమాచారం, పోస్టర్లు, ఇతర సామగ్రి లభించాయి. 150 గిలినైట్‌ స్టిక్‌లు, లక్ష మెటల్‌ బాల్స్‌, డ్రోన్‌, వీటితో పాటు ఐఎస్‌ఐఎస్‌ యూని ఫారాలు దొరికాయి. ఇదంతా దేనికి సంకేతం?

ముస్లింలు ఇతరుల ఏలుబడిలో అణగిమణిగి ఉండరని ముస్లిం మతోన్మాదుల వాదన. అంటే ఏం చేస్తారు? శ్రీలంకలో జరిగింది, శ్రీనగర్‌లో జరుగు తున్నది ఇలాంటి పిడివాదంతోనే. దీనితో నష్టపోతు న్నది మళ్లీ ఇస్లాంలోని సాధారణ పౌరులే. బుర్ఖాకు ఇస్లాంలో చాలా ప్రాధాన్యం ఉంది. కానీ ఈస్టర్‌ దాడులలో పాల్గొన్న కొందరు మహిళలు బుర్ఖాల సాయంతో తప్పించుకున్నట్టు బయటపడడంతో ఏప్రిల్‌ 27వ తేదీన ఆ దేశానికి చెందిన ముస్లిం పెద్దలు ముఖాల మీద ఆచ్ఛాదనలు వద్దని చెప్పవలసి వచ్చింది. ఆ మరునాడే అధ్యక్షుడు సిరిసేన బుర్ఖాను అధికారికంగా నిషేధించారు. అసలు ముఖాన్ని కప్పి ఉంచే ఏ ఆచ్ఛాదనను కూడా ఇక శ్రీలంకలో అనుమ తించబోరు. దీనిని ఉల్లంఘిస్తే మరణ దండనను కూడా ఎదుర్కొనవలసి రావచ్చు. ఇప్పుడు ముస్లింలు చర్చ్‌ పెద్దలను కలుసుకుని కన్నీరు కారుస్తున్నారు.

ఈ దాడులలో తొమ్మిదిమంది ఆత్మాహుతి దళ సభ్యులు ఉన్నారని సమాచారం అందగా, అందులో ఎనిమిది మందిని పోలీసులు గుర్తించారు. వీరు- జహ్రాన్‌ హషీమ్‌, ఇన్షాఫ్‌ అహ్మద్‌ ఇబ్రహీం, ఫాతిమా ఇబ్రహీం, ఇల్హామ్‌ అహ్మద్‌ ఇబ్రహీం, ఇమ్సత్‌ ఇబ్రహీం (ఇన్సాఫ్‌, ఇల్పాహ్‌ల సోదరుడు), అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ మహ్మద్‌.

నిజమే, ఇందులో శ్రీలంక ప్రభుత్వానికి సంబంధించి కొంత నిర్లక్ష్యం ఉంది. కానీ మతాన్ని అడ్డు పెట్టుకుని, మత రాజ్యమే ధ్యేయంగా చాటు మాటు దాడులను ఎంత నిఘా ఉంటే మాత్రం ఎవరు ఆపగలరు? ఇంటి దొంగలను ఎవరు పట్టు కుంటారు. అమెరికా వంటి సర్వోన్నత వ్యవస్థకే ఇలాంటి అంశంలో ఎదరు దెబ్బ తప్పలేదు. 22 సంవత్సరాల క్రితమే కౌంటర్‌ టెర్రిజమ్‌ విభాగంలో పని చేస్తూ బ్రూస్‌ హాఫ్మన్‌ అనే నిపుణుడు శ్రీలంకను సందర్శించాడు. ఆ సమయంలోనే తమ వర్గంలో పెరిగిపోతున్న ఉన్మాదం గురించి ముస్లింలు భయాం దోళనలు వ్యక్తం చేశారు. 2014లోనే శాంతిప్రియు లైన ముస్లింల సంఘం పేరుతో కొందరు ముస్లింలు శ్రీలంక నుంచి వెలువడే పత్రికలోనే నేషనల్‌ తౌహీత్‌ జమాత్‌ ఒక క్యాన్సర్‌లా వ్యాపిస్తున్న సంగతి గమనించాలని ప్రకటించారు.

శ్రీలంక దాడులు చాలా విషయాలను స్పష్టం చేశాయి. ముస్లిం మతోన్మాదులు చేస్తున్న దాడులు పేదరికంతోనో, అవిద్యతోనో చేస్తున్న దుందుడుకు చర్యలు కావు. దీని వెనుక మత స్థాపన ఉద్దేశంతో ఉన్న పెద్ద కుట్రే ఉంది. ఈ ప్రపంచాన్ని ఇస్లామీక రించాలన్న మధ్య యుగాల నాటి ప్రేతానికి మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేయాలన్న దుగ్ధ నానాటికీ ఆ వర్గంలో కొందరిలో పెరిగిపోతోంది. ఇస్లాంలో అవిద్య ఉంది. పేదరికం ఉందంటూ ఇన్నాళ్లూ మేధావులు వాదించారు. కానీ ఆ వాదనకు ఇక స్వస్తి పలకడం మంచిదని శ్రీలంక పేలుళ్లు చెబుతున్నాయి. హషీం పేదవాడే. కానీ ఈ దాడులలో శ్రీలంక కోటీశ్వరుడు, దేశంలోనే అతిపెద్ద మసాలా దినుసుల వ్యాపారి పాత్రధారిగా ఉన్నాడు. అతడి ఇద్దరు కుమారులు, ఒక కోడలు కూడా ఆత్మాహుతి దళంలో ఉన్నారు. జమ్ముకశ్మీర్‌లో కూడా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువకులు, పరిశోధక విద్యార్థులు కూడా ఉగ్రవాదాన్ని ఆశ్రయించడం ఒక వాస్తవం.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *