లక్ష్మీ కటాక్షం

లక్ష్మీ కటాక్షం

శ్రీలక్ష్మీదేవి భక్త సులభురాలు. కోరిన వారిని కటాక్షిస్తుంది. తనను ఆరాధించే వారిలో ఎన్ని దుర్గుణాలున్నా వారిని అనుగ్రహిస్తుంది. అయితే తనను అలక్ష్యం చేసేవారి నుంచి తక్షణం వదిలి వెళ్ళిపోతుంది.

శ్రీలక్ష్మీదేవి పుట్టుక గురించి పురాణేతి హాసాల్లో ఒక కథ ఉంది. ఒక పర్యాయం దూర్వాస ముని ఇంద్రుని శపిస్తాడు. రాక్షసులు దండెత్తి ఇంద్రుని స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. అంతటితో ఇంద్రుని ఐశ్వర్యం నశించింది. దీనితో దేవేంద్రుడు బ్రహ్మదేవుని ముందు మొరపెట్టు కుంటాడు. ”శ్రీమహావిష్ణువు కాక వేరేవ్వరూ నీకు పూర్వవైభవాన్ని తెచ్చి పెట్టలేరు. మనం శ్రీమహా విష్ణువుని ప్రార్థిద్దాం. నాతో మీ దేవతలందరు వైకుంఠానికి రండి” అంటాడు బ్రహ్మదేవుడు. శ్రీమహా విష్ణువు వారి ప్రార్థనలు ఆలకించి, మీరు అమృతాన్ని స్వీకరిస్తే కాని రాక్షసులను అంతమొందించలేరు. క్షీరసాగరాన్ని మధిస్తే అమృతం లభిస్తుంది అని ఉపాయం చెప్తాడు. దేవాసురులు కలసి క్షీరసాగరాన్ని మధించుతారు. ముందుగా హాలహలం జనిస్తుంది. దేవతల ప్రార్థన మేరకు ఈశ్వరుడు ఆ గరళాన్ని తన కంఠంలో ఉంచు కుంటాడు. అమృతానికి ముందు సురభి, ఉచ్చైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు ఆ తరువాత శ్రీమహాలక్ష్మి ఉద్భవిస్తాయి. శ్రీమహాలక్ష్మి ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షపాడ్యమి నాడు జన్మించింది. శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మిని భార్యగా స్వీకరిస్తాడు.

ఆనాటి నుంచి లక్ష్మీదేవి తన భక్తులను సిరిసంపదలతో ముంచెత్తుతోంది.

శ్రీ ఆదిశంకరులు ఒకనాడు ఒక పేద ముత్తైదువు ఇంటికి భిక్షాటనకు వెళ్ళారు. అతిథికి ఆతిథ్యం ఇవ్వలేని తన దుర్భాగ్యానికి ఆమె విలపిస్తుంది. తన ఇంట్లో ఉన్న ఉసరికాయను భిక్షగా ఇస్తుంది. ఆమె విలాపానికి ద్రవితుడై శ్రీశంకరులు ఆశువుగా కనకధారాస్తవం గానం చేస్తారు. ఇంకేముంది. లక్ష్మీదేవి ఆ ఇంట బంగారువర్షం కురిపించింది.

లక్ష్మీ స్వరూపాలు ఎన్నో ఉన్నా వాటిలో ముఖ్యమైనవి ఎనిమిది. వాటినే అష్టలక్ష్ములంటారు. అవి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. లక్ష్మీదేవిని ఏ రూపంలో పూజించినా మనోకామనలు సిద్దిస్తాయి.

సచ్చీలత లేనిచోట లక్ష్మి ఉండదు. శీలసంపద లేకుంటే లక్ష్మీదేవి అక్కడ నుండి నిర్గమిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ప్రహ్లాదుని కథను చెప్తారు పెద్దలు. చతుర్విధ పురుషార్థాలలో అర్థం అంటే సంపద రెండవది. ధర్మబద్ధంగా అర్థం ఆర్జించే వారికే ప్రసన్నురాలవుతుంది లక్ష్మి. అన్యాయంగా, అక్రమంగా, ఇతరులను మోసగించి, వంచించి ధనార్జన చేసేవారు చాలామంది ఉన్నారు. వారి ఇనపపెట్టెల్లో ఖైదీగా ఉండడానికి శ్రీలక్ష్మి అంగీకరించదు. అలా పాపకృత్యాలతో ధనార్జన చేసేవారి చెరనుండి లక్ష్మి బయటపడడమే కాక, వారిని శిక్షార్హులను చేస్తుంది. సజ్జనులు లక్ష్మీ కటాక్షం వలన కలిగిన సంపదను తనుదిగా భావించరు. కష్టాలలో ఉన్న వారిని ఆదుకునే నిమిత్తమే లక్ష్మి తమకు సంపదలనిచ్చిందని, మానవసేవకు ఆ ధనాన్ని వెచ్చిస్తారు. అలాంటి వారినే లక్ష్మీదేవి కరుణిస్తుంది.

లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించటంతో పాటు, శుచి శుభ్రతలను పాటించడం, ఉదయ సంధ్యలు దీపారాధన చేయడం, తులసిని, ఆవును పూజించడం, ఇంటి ముందు ముగ్గులు వేయడం లక్ష్మీదేవిని సంతృప్తి పరుస్తాయి. అపసంతి, అనాచారుల గుమ్మం ఎక్కదు లక్ష్మి. ఉదయం శుచిగా దీపారాధన చేసి లక్ష్మీ దేవిని స్తుతించడం ఎంతైనా అవసరం.

మాతర్నమామి కమలే కమలాయ తాక్షి

శ్రీ విష్ణు హృత్కమల హసిని విశ్వమాతః

క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ

లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే||

ఈ విధంగా లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె కరుణాకటక్షాలు పొందడం మన సుకృతంగా భావించాలి.

– గుమ్మా ప్రసాదరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *