సరస్సులా కనిపిస్తుంది.. ప్రాణాలను హరిస్తుంది

సరస్సులా కనిపిస్తుంది.. ప్రాణాలను హరిస్తుంది

సరస్సులా కనిపించడం కాదు, అది సరస్సే. దాని పేరు ‘కరచాయ్‌’. ఇది రష్యాలో ఉంది. ఈ సరస్సు సమీపంలో నిలబడ్డ నిండు ఆరోగ్యవంతు డైనా సరే గంటలోపు రక్తం కక్కుకుని కుప్పకూలి చావడం ఖాయం. 1951 నుండి ఈ సరస్సులో రష్యా ప్రభుత్వం రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలను విడిచిపెట్టడమే ఇంతటి విషమ పరిస్థితికి కారణం. దీనివలన ఆ సరస్సు, దాని చుట్టుపక్కల పరిస రాలు, గ్రామాలు, అక్కడికి దగ్గరలోని నదులూ విపరీతంగా కలుషితమయ్యాయి.

మధ్య రష్యాలో గల దక్షిణ యూరాల్‌ పర్వత శ్రేణులలో కరచాయ్‌ సరస్సు ఉంది. ప్రపంచం లోనే అత్యధికంగా కలుషితమైన సరస్సుగా దీనిని పరిగణిస్తున్నారు. 1951 నుండి ఆ సరస్సులో రేడియోధార్మిక వ్యర్థపదార్థాలను డంప్‌ చేస్తుండటం వలన 1990 నాటికి అక్కడి పరిసరాలలో 600 రెంట్గెన్‌ (Röntgen – ఎక్స్‌ లేదా గామా కిరణ విసర్జనకు అంతర్జాతీయ కొలమానం) పరిమాణంలో రేడియో ధార్మిక ప్రభావం పడింది. ఈ వాతా వరణంలో ఆరోగ్య వంతుడైన ఒక మనిషి నిలబడితే గంటలో అనా రోగ్యం బారిన పడి రక్తం కక్కుకుని చనిపోతాడు.

ఈ సరస్సుకు దగ్గరలో సోవియట్‌ రష్యాలో అణుబాంబు తయారీ ప్రాజెక్టుకు సంబంధించిన ‘మయాక్‌ కెమికల్‌ కంబైన్‌ కర్మాగారం’ ఉంది. ఈ కర్మాగారాన్ని 1945-48 మధ్య కాలంలో అతి గోప్యంగా నిర్మించింది రష్యా. ఈ కర్మాగారంలో అణుబాంబుల తయారీకి కావలసిన ప్లూటోనియం ఉత్పత్తి జరుగుతుంది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలను అమెరికా అణుబాంబుల దాడితో విధ్వంసం చేసిన తరువాత అమెరికాకి దీటుగా అణ్వా యుధాలను తయారుచేయాలనే ప్రధానోద్దేశ్యంతో ఈ కర్మాగారాన్ని రష్యా స్థాపించింది. దీనిని ‘చెల్యాబిన్స్క్‌-40’ పేరుతో వ్యవహరిస్తారు. ఈ కర్మాగారం నుండి విడుదలైన అణు వ్యర్థ పదార్థాలను కరచాయ్‌ సరస్సులో విడిచిపెడుతున్నారు.

చెల్యాబిన్స్క్‌-40 కర్మాగారం 90 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఎకటెరింబర్గ్‌కి ఈశాన్యంలో 150 కి.మీ. దూరంలో ‘తెచా’ నది ఒడ్డున ఉంది. సోవియట్‌ రష్యాకి అవసరమైన అణ్వాయుధాలన్నీ ఈ కర్మాగారంలోనే తయారౌతాయి. ఇందులో ఐదు న్యూక్లియర్‌ రియాక్టర్‌లు ఉన్నాయి. మొదట ఇక్కడ ఆయుధాలకు అవసరమైన ప్లూటోనియం తయారీ, రిఫైన్‌మెంట్‌ జరిగేది. తరువాత ఈ కర్మాగారాన్ని అణు ఇంధన ఉత్పత్తికి ప్రత్యేకించారు. ప్రస్తుతం ఇక్కడ ట్రిటియం, రేడియో ఐసోటోప్‌ల ఉత్పత్తులు జరుగుతున్నాయి. చెల్యాబిన్స్క్‌-40 కర్మాగార నిర్మాణానికి 1945లో 70 వేలమంది కార్మికులను రష్యా రహస్యంగా తరలించింది. ఈ కర్మాగార సమాచారం ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం సోవియట్‌ ప్రభుత్వం తన దేశ మ్యాప్‌ల నుండి ఆ కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని తొలగించింది. అంత రహస్యంగా అక్కడి కార్యక లాపాలు సాగాయన్నమాట.

కానీ ఈ కర్మాగారం ద్వారా జరిగిన అణు కాలుష్యం చెర్నోబిల్‌ దుర్ఘటన సృష్టించిన విపత్తు కన్నా ఎంతో పెద్దది. కర్మాగారంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రతల గురించి గాని, వ్యర్థపదార్థాల విసర్జన విషయంలోగాని అవసరమైన కనీస ప్రమాణాలను ఇక్కడ పాటించడం లేదు.

మొదట తెచా నదిలో కలిపేవారు

అమెరికాతో పోటీ పడి అణ్వాయుధాల తయారు చేసే తొందరలో రష్యా ఇంజనీర్లు రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాల నిర్వహణను, వాటి ద్వారా వచ్చే కాలుష్య నివారణను పూర్తిగా విస్మరించారు. వ్యర్థ పదార్థాల వేడిని వెంటనే తగ్గించాలనే ఆరాటంలో వాటిని కర్మాగారం నిర్మించిన కొత్తలో దగ్గరలోని తెచా నదిలో కలిపేవారు. దాంతో ఈ నది నీటి అడుగున వ్యర్థ పదార్థాలు పేరుకుపోయాయి. ఈ వ్యర్థాలలో అధిక వేడి పుట్టించే మూలకాలున్నాయి. సుమారు ముప్పై ఏళ్ల పాటు అణు విస్ఫోటనం కలిగించగల స్ట్రోంటియం-90, సెసియం-137 వీటిలో ఉన్నాయి.

తెచా నదీ జలాలలో వ్యర్థాలను కలిపే ప్రక్రియ 1948 నుండి జరుగుతుండగా, 1951లో రష్యన్‌ శాస్త్రవేత్తలు ఈ నదీజలాలపై ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో బయటపడ్డ విషయాలు శాస్త్రజ్ఞులని దిగ్భ్రాంతికి గురిచేశాయి. చెల్యాబిన్స్క్‌-40 కర్మాగారానికి నాలుగు మైళ్ల దిగువన మెట్లినో గ్రామం ఉంది. అదీ తెచా నది ఒడ్డునే ఉంది. సాధారణంగా నదీ జలాలలో కలిసిన వ్యర్థ పదార్థాల గామా రేడియేషన్‌ సంవత్సరానికి 0.21 రెంట్గెన్‌లు (Röntgen) వరకూ ఉంటే ప్రమాదమేమీ లేదు. కానీ తెచానదిలో ఈ గామా రేడియేషన్‌ గంటకి 5 రెంట్గెన్‌లుగా నమోదయింది. ఆ గ్రామంలో నివసించే పన్నెండు వందల మందికి ఈ నదీ జలాలే జీవనాధారం. తెచానదీ తీరంలో గల మరో ముప్పై ఎనిమిది గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి. ఆ గ్రామాలలో నివసించే 28 వేల మంది ఆరోగ్యంపై ఈ కలుషిత నదీజలాలు తీవ్ర ప్రభావం చూపుతున్నా యని సర్వేలో వెల్లడయ్యింది. ఇది కాకుండా ఇతర గ్రామాలలో నివసిస్తున్న లక్ష మంది ప్రజలపై కూడా ఈ గామా రేడియేషన్‌ ప్రభావం ఉంటుందని సర్వే పేర్కొంది. అంతేకాదు, తెచా నదీతీరంలోని పొలాలు, అక్కడ పండించే పంటలపై కూడా ఈ రేడియేషన్‌ ప్రభావం తీవ్రంగా ఉందని తేలింది.

1950లలోనే చెల్యాబిన్స్క్‌-40 ప్లూటోనియం ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే కార్మికులలో ఆరోగ్య సమస్యలు మొదయ్యాయి. ఒళ్ళు నొప్పులు, లో బి.పి., వణుకు, దడ, శరీర అవయవాలు సరిగ్గా సహకరించక పోవడం వంటి వాటితో బాధపడేవారు. ఇవి ‘క్రానిక్‌ రేడియేషన్‌ సిండ్రోమ్‌’కు సూచనలు. ప్రజలకు ఎదు ర్కొంటున్న ఆరోగ్య సమస్యల పరిష్కారంలో భాగంగా అధిక కలుషిత ప్రాంతాల నుండి 7,500ల మంది గ్రామస్తులను రష్యన్‌ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రత్యామ్నాయ జల వనరులకోసం ఇతర గ్రామాలలో బావులు తవ్వించింది. తెచా నదీ జలాలలోని కాలుష్యం దిగువ ప్రాంతాలకు వ్యాపించ కుండా అడ్డుకట్ట వేసేందుకు ఇంజనీర్లను పిలిపించి పెద్ద పెద్ద డ్యామ్‌లను నిర్మాణం చేయించారు. తరువాత చెల్యాబిన్స్క్‌-40 వ్యర్థ పదార్థాలను ఆ నదిలో విడిచిపెట్టే విధానాన్ని పునఃసమీక్షించారు.

కాలుష్య కోరల్లో కరచాయ్‌

1951లో జరిగిన ఈ పునఃసమీక్షలో వ్యర్థాలను తెచా నదిలో కలపరాదని నిర్ణయించారు. అందుకు రష్యన్‌ శాస్త్రవేత్తలతో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఆ బృందం అధిక వేడిగా ఉన్న వ్యర్థా లను మొదట స్టోరేజి ట్యాంకులలో తాత్కాలికంగా నిల్వ ఉంచి, వేడి తగ్గిన తరువాత దగ్గరలో గల పది అడుగుల లోతు, 110 ఎకరాల మేర విస్తరించి ఉన్న కరచాయ్‌ సరస్సులో విడిచిపెట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తెచా నదీ పరీవాహక ప్రాంతాలలోని ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. కానీ కరచాయ్‌ సరస్సు సర్వనాశనం అయింది. అతి భయంకరమైన రేడియో ధార్మిక వ్యర్థాలతో నిండిపోయింది. గొంతు నిండా కాలుష్యంతో నిండు ఆరోగ్యవంతుల్ని సైతం గంటలో పొట్టన పెట్టుకునేంత విషపూరిత స్థాయికి చేరింది.

అధిక వేడి గల ఈ వ్యర్థాల ప్రభావంతో 1960 నుంచి కరచాయ్‌ సరస్సు ఎండిపోవడం మొదలయ్యింది. 1951లో దీని వైశాల్యం 0.5 చదరపు కిలోమీటర్లు కాగా 1993 నాటికి దీని వైశాల్యం 0.15 చదరపు కిలోమీటర్లకి తగ్గిపోయింది. నీరు తగ్గుతుండటంతో అందులోని కాలుష్యం, రేడియో ఆక్టివిటి పైకి ఉబికివచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి, వ్యర్థాల నుండి రేడియో ధార్మికత పైకి రాకుండా ఉండడానికి, లోపలే అదిమిపెట్టడానికి రష్యన్‌ ఇంజనీర్లు పెద్ద పెద్ద రాళ్ళను, కాంక్రీటు దిమ్మలను, మట్టిని ఆ సరస్సులో వేయడం మొదలుపెట్టారు. ఇది పన్నెండేళ్ళ పాటు సాగుతూనే ఉంది. 1978-90 మధ్యకాలంలో పదివేల కాంక్రీటు దిమ్మలను ఈ సరస్సులో పడేసారు. చివరికి ఆ సరస్సులో వ్యర్థ పదార్థాలను డంప్‌ చెయ్యడాన్ని నిలిపివేసి, ఆ సరస్సును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది. 1990లో కరచాయ్‌ సరస్సును సందర్శించిన ఒక ప్రతినిధి బృందం అక్కడి రేడియేషన్‌ ప్రభావం గంటకి 600 రెంట్గెన్‌గా గుర్తించారు. అంటే ఆ సరస్సు వద్ద ఎవరైనా ఒక గంట సేపు ఉంటే చాలు, మరింక బ్రతకరన్న మాట.

1990లో కమ్యూనిజం పతనమై, రష్యా నుంచి ఐరోపా దేశాలు విడిపోయిన తరువాతే అక్కడి ప్రభుత్వ అధికారులు అప్పటి దాకా రహస్యంగా ఉంచిన ఈ వివరాలను బయట పెట్టారు. అప్పటికి ఇంకా కరచాయ్‌ సరస్సు ప్లూటోనియం ఉత్పత్తి కేంద్రం నుండి వెలువడే వ్యర్థ పదార్థాలను డంప్‌ చేసే ప్రధాన స్థలంగానే కొనసాగుతోంది. ఆ సరస్సును రాళ్ళతోనూ, మట్టితోను పూడ్చివేసే పని సగం వరకే అయ్యింది. అప్పటికే 39 సం||లుగా ఆ సరస్సులో పేరుకు పోయిన వ్యర్థ పదార్థాల నుండి 120 మెగాక్యూరీల రేడియేషన్‌ వెలువడుతోంది. చెర్నోబిల్‌ దుర్ఘటనలో వెలువడిన రేడియేషన్‌ 100 మెగాక్యూరీలే!

1991లో రూపొందిన ఒక నివేదిక కరచాయ్‌ పరిసరాలలో లుకేమియాతో బాధపడేవారి సంఖ్య 41 శాతం, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడేవారి సంఖ్య 31 శాతం పెరిగాయనీ, 1980తో పోలిస్తే కేన్సర్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య 21 శాతం పెరిగిందని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు నివేదికలో పేర్కొన్నవి మాత్రమే. వాస్తవానికి వ్యాధిగ్రస్థుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. కరచాయ్‌ సమీపంలో గల ముస్లియుమోవో గ్రామంలో ఒక వైద్యుని వద్ద 1993లో రికార్డు చేసిన వివరాల ప్రకారం అక్కడి పురుషుల సగటు జీవితకాలం 45 సంవత్సరాలే. మిగతా రష్యా అంతటా ఈ వయస్సు 69 సంవత్సరాలు. పుట్టుకతో వచ్చే వ్యాధులు, సంతానలేమి, దీర్ఘకాలిక వ్యాధులు కరచాయ్‌ పరిసర గ్రామాలలో ఎక్కువైపోయాయి. చెల్యాబిన్స్క్‌-40 (మయాక్‌) కర్మాగారం నుండి వెలువడే వ్యర్థ పదార్థాల రేడియేషన్‌ కారణంగా 1948-1990 మధ్య కాలంలో పది లక్షలకు పైగానే ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 28 వేల మంది రేడియేషన్‌ ప్రభావానికి తీవ్రంగా గురైనవారు.

కరచాయ్‌ సరస్సులో నేడు నీటి కన్నా కాంక్రీటు దిమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. అయినా అక్కడ వ్యర్థ పదార్థాల రేడియేషన్‌ ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిపిన ఒక సర్వేలో చుట్టుప్రక్కల నదులుకూడా గామా కిరణాల కాలుష్యానికి లోనయ్యాయని తేలింది. దాదాపు ఒక బిలియన్‌ గాలన్ల భూగర్భ జలాలు 5 మెగాక్యూరీల రేడియో న్యూక్లైడ్స్‌తో కలుషితమయ్యాయని ఒక అంచనా. దీని పర్యవసానంగా ఆర్కిటిక్‌ సముద్రం కలుషితమై తమ దేశ ఉత్తర సరిహద్దులలోని సాగారతీరంపై ఆ ప్రభావం పడుతుందని నార్వే దేశస్థులు ఆందోళన చెందుతున్నారు.

న్యూక్లియర్‌ వ్యర్థ పదార్థాలపై అమెరికాలోని వాషింగ్టన్‌ డిసిలో గల వరల్డ్‌ వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అందించిన సమాచారం ప్రకారం రూపొందించిన నివేదిక భూమండలంపై అత్యధికంగా కలుషితమైన ప్రాంతంగా కరచాయ్‌ సరస్సును పేర్కొంది. అంతే కాదు, అత్యధికంగా పరిసరాలను కలుషితం చేసిన కర్మాగారంగా ‘చెల్యాబిన్స్క్‌-40’ చరిత్రలో నిలిచి పోతుందని కూడా ఈ నివేదిక పేర్కొంది.

–    పొ|| దుగ్గిరాల రాజకిశోర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *