భారత్‌ చిరునామా

భారత్‌ చిరునామా

భుజ్‌ భూకంప బాధితుల సహాయక చర్యల కోసం ఆయన గుజరాత్‌ వెళ్లారు.

ఆపై గుజరాత్‌, భారత రాజకీయాలలో ఆయనే ఒక భూకంపం సృష్టించారు.

ఆయన పేరే నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ. చరిత్రాత్మక విజయంతో రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన బీజేపీ నేత.

కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్‌ నుంచి బంగాళం వరకు ఒకే రాజకీయ నేతను ఆరాధించిన సందర్భాలు మన చరిత్రలో చాలా అరుదు. మరొక మాటలో చెప్పాలంటే భారతావని మొత్తం ఒకే నేత వెంట నడిచిన సందర్భాలు పరిమితం. ఇన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు ఒకే మనిషిని తమ నేతగా చెప్పుకున్న సమయాలు తక్కువ. ఇప్పటికీ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు ఈ లోపం కూడా ఒక కారణం. కొన్ని తేడాలు ఉన్నా ఆధునిక భారతదేశంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్‌ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ మాత్రమే అలా జాతికంతటికీ ఆమోదయోగ్య నేతలుగా కనిపిస్తారు. ఆవిర్భవించారు. వీరిలో నెహ్రూ పెద్ద స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడు. జాతిపితగా చెప్పే గాంధీజీకి ప్రియశిష్యుడు. ఇలాంటి నెహ్రూ కుమార్తె ఇందిర. వీరిద్దరు స్వాతంత్య్రోద్యమానికీ, అందులోని రథసారథు లకూ, గొప్ప కీర్తికీ వారసులు. వారి గతమే వారికి ఈ దేశంలో ముందే ఒక స్థానం సంపాదించి పెట్టింది. ఒక సాధారణ బడిపంతులు కుమారు డైన అటల్‌జీ స్వయంకృషితో ఈ దేశం ఆరాధించిన పార్లమెంటేరియన్‌గా అవతరించారు. మహా వక్తల వారసత్వం వచ్చిందే గానీ, మహా వ్యక్తుల ప్రోద్బలం ఆయనకు లేదు. జాతి ఇచ్చిన మద్దతే గానీ, జాతిపిత ఆశీస్సులు ఆయనకు అందే అవకాశం లేకపోయింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అటల్‌జీ జ్ఞాననేత్రం. జనసంఘ్‌, బీజేపీల తాత్వికత ఆయన రాజనీతిసూత్రం. ఇక నరేంద్ర మోదీ సాధారణ చాయ్‌వాలా కుమారుడు. ఆయన ప్రజాజీవన ప్రస్థానం గుజరాత్‌లోని వాద్‌నగర్‌ భాగవతాచార్య ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ నుంచి ఆరంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ దేశానికి అందించిన రాజనీతిజ్ఞుడు అటల్‌జీ. ఆయన వారసుడే నరేంద్ర మోదీ. ఇప్పుడు భారతదేశపు ఘనకీర్తి.

దేశం స్వతంత్రమైన మూడేళ్లకు సెప్టెంబర్‌ 17, 1950న నరేంద్ర మోదీ పుట్టారు. ఆయన బాల్యం చెప్పుకోదగినంత ఆహ్లాదకరమైనది కాకపోవచ్చు. పైగా చిన్నతనంలో ఆయనకు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు ఉండేది. ఒక వయసు వచ్చిన తరువాత సన్యాసం స్వీకరించాలని కూడా భావించారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. హిమాలయాలలో కొద్దికాలం ఉన్నారు. తరువాత గుజరాత్‌కు తిరిగి వచ్చి రామకృష్ణ మిషన్‌లో పని చేయాలని అనుకున్నారు. అలాంటి సందర్భంలోనే పాఠశాల ప్రాయంలో పరిచయమైన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆయనను మళ్లీ పిలిచినట్టయింది. మోదీ భాగవతాచార్య ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అక్కడ హిందీ పండితునిగా పనిచేసిన చంద్రకాంత్‌ దావే ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌తో తొలి పరిచయం కలిగింది. తరువాత వకీల్‌ సాబ్‌ ఆయనలో జాతీయ చైతన్యాన్ని కలిగించారు. ఒక పక్క ఆధ్యాత్మిక చింతన. మరొక పక్క జాతీయ భావాలు ఆయనను ముప్పిరిగొన్నాయి. 1962లో ఇండో చైనా యుద్ధం జరిగింది. దేశమంతా జాతీయ భావాలు వెల్లువెత్తాయి. సొంతూరు వాద్‌నగర్‌కు సమీపంలోని మెహసినా వద్ద రైల్వే స్టేషన్‌ ఉండేది. సైనికులను తీసుకువెళ్లే రైళ్లు అక్కడ ఆగేవి. స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు వారికి అవసరమైన నీళ్లు, ఫలహారాలు, ఆహార పొట్లాలు ఇచ్చి సాదరంగా పంపించేవారు. వాద్‌నగర్‌ నుంచి వెళ్లిన బృందంతో మోదీ కూడా వెళ్లి అలా సైని శ్రేణులకు సేవలు చేసి వచ్చారు.

2019 మే 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీ

సంపూర్ణ విప్లవ స్ఫూర్తి

హిమాలయ పర్యటన తరువాత అక్టోబర్‌ 3, 1972లో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా జీవితం ఆరంభించారు. ఇది జరిగిన రెండేళ్లకే బిహార్‌ నుంచి జయప్రకాశ్‌ నారాయణ్‌ సంపూర్ణ విప్లవం పిలుపు ఇచ్చారు. సంపూర్ణ విప్లవం ఉద్దేశం ఎంతో లోతయినది. నాటి కాంగ్రెస్‌ పాలన అవినీతి మయమైపోయింది. రాజకీయాలలో విలువలు లేవు. ముఖ్యమంత్రులను పేకముక్కల్లా మార్చే సంస్కృతి అప్పుడే వేళ్లూనుకుంటుంటోంది. ఫలితం పాలన అనేది సాగని పరిస్థితి. దీనిని పూర్తిగా అంతం చేయడానికే జేపీ సంపూర్ణ విప్లవం పిలుపు ఇచ్చారు. చిత్రంగా ఇది బిహార్‌ను పెద్దగా స్పందింపచేయలేదు. కానీ గుజరాత్‌లో మారుమోగింది. ఆ ఉద్యమంలో చాలామంది ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘ్‌ సభ్యులు పాల్గొన్నారు. నిజానికి ఆ ఉద్యమానికి వీరే కీలకం. తరువాతి పరిణామాలలో రాయ్‌బరేలీలో ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆ తీర్పు మీద షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చింది. దీనితో ఇందిర జూన్‌ 25, 1975న దేశంలో తొలిసారి ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధించారు. ఇంతటి తీవ్ర చర్య తీసుకోవ డానికి ఇందిర చూపిన కారణాలు ఏమీ లేవు. దేశంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపణ. ప్రభుత్వం ఆజ్ఞలు ధిక్కరించవలసిందంటూ జేపీ పోలీసులకు, సైనికులకు పిలుపు ఇచ్చారని ఇది ప్రమాదకర సంకేతమని ఆమె వాదించారు. జేపీ, వ్యవస్థా కాంగ్రెస్‌ నాయకుడు, గుజరాత్‌ ప్రముఖుడు మొరార్జీ దేశాయ్‌, జేబీ కృపలానీ, చంద్రశేఖర్‌, అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్‌కె అడ్వాణి, కేఆర్‌ మల్కానీ, జార్జ్‌ ఫెర్నాండెజ్‌, వెంకయ్యనాయుడు, మధు దండావతేలతో పాటు వేలాదిమంది స్వయం సేవకులను, జనసంఘ్‌ కార్యకర్తలను ఇందిర ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎక్కువగా అరెస్టయిన వారు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘ్‌ వారే. అలాగే అజ్ఞాతవాసంలోకి కూడా వేలాది మంది వెళ్లి రహస్యంగా ఉద్యమం నడిపారు. అందులో నరేంద్ర మోదీ ఒకరు. పోరాటం కోసం ఏర్పడిన లోక్‌ సంఘర్ష్‌ సమితికి అధ్యక్షుడు జేపీ. కన్వీనర్‌ నానాజీ దేశ్‌ముఖ్‌. 1977 జనవరిలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసి, మార్చిలో ఎన్నికలు నిర్వహించింది ఇందిర ప్రభుత్వం. వ్యవస్థా కాంగ్రెస్‌, సోషలిస్టులు, భారతీయ లోక్‌దళ్‌, జనసంఘ్‌ విలీనమై, జనతా పార్టీ పేరుతో ఆ ఎన్నికలలో పోటీ చేశాయి. గుజరాత్‌ దిగ్గజం మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే 1979లో ద్వంద్వ సభ్యత్వం వివాదం తెరపైకి తెచ్చి (ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యత్వం ఉన్నవారు, జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోకూడదు. దీని మీదే జనతా ప్రభుత్వం కూలిపోయింది.) జనతా పార్టీని, ప్రభుత్వాన్ని మోహన్‌ ధారియా, రబీరే వంటి సోషలిస్టులు భ్రష్టు పట్టించారు. జనతా పార్టీ మీద జనసంఘ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ల పట్టును సహించలేకే ఆత్మహత్యా సదృశమైన ‘ద్వంద్వ సభ్యత్వం’ వివాదం రేపారు. నిజానికి వీరే జనతాను నిర్మించారు. అందుకే వీరంతా బయటకు రాగానే జనతా పార్టీ కుప్పకూలింది. మాజీ జనసంఘ్‌ సభ్యులంతా బయటకు వచ్చి 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా భవిష్యత్తులో తనకు చరమగీతం పాడే బీజేపీ ఆవిర్భావానికి కాంగ్రెస్‌ స్వయంగా కారణమైంది. ఇక మోదీ రాజకీయ జన్మ బీజేపీ పుణ్యమే. అసలు ఆయన నినాదమే, ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’. మోదీ ప్రస్థానంలో ఇవన్నీ మైలురాళ్లు. ఆయన రాజకీయ తాత్వికత, మూర్తిమత్వం వెనుక ఉన్నది ఈ రాజకీయ నేపథ్యమే. ఆయన ప్రచారక్‌గా, ప్రజాసేవకునిగా పని చేస్తూనే ఈ చారిత్రక, రాజకీయ ఘట్టాలలో భాగస్వామి అయ్యారు. సమీపం నుంచి అధ్యయనం చేశారు. అలాగే దూర విద్య ద్వారా రాజనీతిశాస్త్రం కూడా చదువుకున్నారు.

ప్రచారక్‌గా…

1978లో మోదీ విభాగ్‌ ప్రచారక్‌గా (బరోడా గ్రామ్‌, పంచమహల్‌, దహోద్‌, ఆనంద్‌, ఖెడా) బాధ్యతలు నిర్వహించారు. ఇవన్నీ గుజరాత్‌లో ఎంతో కీలకమైన ప్రాంతాలు. రెండేళ్లకు బరోడా, దంగ్‌ ప్రాంతాల సంభాగ్‌ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టారు. 1981లో రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి (డాక్టర్‌ హెడ్గేవార్‌ భవన్‌) మారారు. అహ్మదాబాద్‌ విభాగ్‌ ప్రచారక్‌ బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రాంత సహ వ్యవస్థా ప్రముఖ్‌గా కూడా వ్యవహరించారు. ఆ సమయంలోనే మోదీ గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా పొందారు. 1987 వరకు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలలోనే నిమగ్నమయ్యారు. కానీ బీజేపీ స్థాపించిన ఆ ఏడేళ్లలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిన మాట వాస్తవం. బాలారిష్టాలు కూడా ఎక్కువే. 1984లో ఆ పార్టీ పోటీ చేస్తే లోక్‌సభలో రెండు స్థానాలే గెలిచింది. ఇందుకు ఉన్న నేపథ్యం దారుణమైనది. అదే సంవత్సరం ఇందిరను ఆమె అంగరక్షకులే ఢిల్లీలో కాల్చి చంపారు. తరువాత ఎన్నికలు జరిగాయి. గెలిచిన రెండు స్థానాలలో ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనిది కాగా, మరొకటి గుజరాత్‌లోనిది. పార్టీ ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి. నిజానికి ఆనాటి నుంచే బీజేపీ మీద దుప్ప్రచారం విరివిగా సాగడం మొదలయింది. అలాంటి సమయంలో 1987లో మోదీ పార్టీలో చేరారు. ఆయనకు కాలం కలసి వచ్చింది. ఆ సంవత్సరమే అహ్మదాబాద్‌ నగరపాలక ఎన్నికలు జరిగాయి. బీజేపీ తొలిసారి విజయం సాధించింది. ఒక్క సంవత్సరంలోనే గుజరాత్‌ శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. అప్పటికే ఆయనకు మంచి నిర్వహణా దక్షునిగా పేరుంది.

2014 మే 26న ప్రధానిగా మొదటి ప్రమాణస్వీకారం

రథయాత్రలకు శ్రీకారం

భారత రాజకీయాలలో చాలామంది నేతలు రథయాత్రలు చేశారు. కానీ బీజేపీలో ఈ యాత్రా ధోరణికి ఆద్యుడు మోదీయే. 1987లో న్యాయ యాత్రను నిర్వహించారు. కరువుతో బాధపడుతున్న 15,000 గ్రామాల ప్రజానీకాన్ని కలసి రావడం ఈ యాత్ర ఉద్దేశం. వీటితో పాటు పాదయాత్రలను కూడా నిర్వహించారు. జనానికి మరింత చేరువ కావడానికి ఇవి ఉపకరించాయి. 1989లో లోక్‌శక్తి యాత్ర కూడా గుజరాత్‌లో నిర్వహించారాయన. ఐదు జిల్లాలకే పరిమితమైనా దీని ప్రభావం ఎంతో ఉంది. వీటికి పరాకాష్ట సెప్టెంబర్‌ 25, 1990న మొదలైన అయోధ్య రథయాత్ర. గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి ముంబయ్‌ వరకు అడ్వాణీ నాయకత్వంలో నిర్వహించ తలపెట్టిన ఈ యాత్రకు మోదీయే కీలకంగా వ్యవహరించారు. కానీ, ఈ రథాన్ని బిహార్‌ లోనే నాటి ముఖ్యమంత్రి లాలూ నిరోధించారు. అడ్వాణి అరెస్టయ్యారు. కానీ ఈ యాత్ర సృష్టించిన సంచనలం అసామాన్యమైనది. మళ్లీ 1991లో మురళీ మనోహర్‌ జోషి నాయకత్వంలో ఏక్తా యాత్రకు కూడా మోదీ సారథ్యం వహించారు. ఆ సంవత్సరమే మోదీని బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఆ తరువాత గుజరాత్‌ బీజేపీ వ్యవహారాలతో పాటు హరియాణా, హిమాచల్‌, చండీఘడ్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌గా కూడా మోదీ పని చేశారు. అయితే గుజరాత్‌లో కేశూభాయ్‌ పటేల్‌, శంకర్‌ సింఘ్‌ వాఘేలా రాజకీయాలు ఆయనను కొంచెం బాధించాయి. రాష్ట్ర రాజకీయాల నుంచి పూర్తిగా కేంద్ర రాజకీయాలలోకి వచ్చారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో మళ్లీ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో బీజేపీ విజయం సాధించి కేశూభాయ్‌ పటేల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పటేల్‌ హయాంలోనే అప్పుడే 2001లో భుజ్‌లో భారీ భూకంపం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు మీద విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో సహాయక చర్యల కోసం అక్కడకు వెళ్లిన మోదీ అనూహ్యంగా అక్టోబర్‌ 7న కేంద్ర నాయకత్వం ఆదేశంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి ముందు ఉన్న రాజకీయ, సామాజిక అనుభవం ఇంత విస్తృతమైనది. ఫిబ్రవరి 24, 2002లో రాజ్‌కోట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్లారు.

గోధ్రా అల్లర్లు

మోదీ అసెంబ్లీకి ఎన్నికైన నాలుగో రోజు అది. ఫిబ్రవరి 27న గోధ్రా రైలు దగ్ధం దుర్ఘటన జరిగింది. అయోధ్య నుంచి వస్తున్న దాదాపు 60 మంది రామభక్తులను గోధ్రా వద్ద రైలులో బోగీలోనే సజీవ దహనం చేశారు. మరునాడు విశ్వహిందూ పరిషత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ బంద్‌లోనే అల్లర్లు మొదలయ్యాయి. 790 వరకు ముస్లింలు, 254 వరకు హిందువులు ఈ అల్లర్లలో చనిపోయారని నాడు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రెండువేల మంది మరణించినట్టు ప్రచారం జరిగింది. లక్షా యాభయ్‌ వేల మందిని రక్షణ శిబిరాలకు తరలించారు. ఈ ఉదంతం మీద భారతదేశంలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మేధావులు, విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇందులోని నిజానిజాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉన్నదన్న వారి విమర్శలలోని నిజమెంతో తరువాత బయటపడింది. అప్పుడు కేంద్రంలో వాజపేయి నాయకత్వంలో ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వాములు తెలుగుదేశం, డీఎంకే నాయకులు మోదీ రాజీనామా చేయాలని పట్టుపట్టారు. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు అయితే మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తే అరెస్టు చేయిస్తానని కూడా ప్రకటించారు. ఆ సంవత్సరం ఏప్రిల్‌లో గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ తన రాజీనామా పత్రం సమర్పించారు. కానీ అధిష్టానం అంగీకరించలేదు. కానీ జూలైలో మోదీ ప్రభుత్వం రాజీనామా చేసింది. 2002 డిసెంబర్‌లో తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో బీజేపీ 182 స్థానాలు ఉన్న గుజరాత్‌ అసెంబ్లీలో 127 గెలుచుకుంది. అయినా మోదీ మీద విమర్శల దాడి తగ్గలేదు. గోధ్రా అల్లర్లకు మోదీ బాధ్యుడని ఆరోపిస్తూ 2005లో అమెరికా వీసాను కూడా నిరాకరించింది. ఇంగ్లండ్‌ కూడా మోదీ మీద విమర్శలు గుప్పించింది. ఇక దేశంలో సాగిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ చాలామందికి వచ్చిన ప్రశ్న ఒకటి ఉంది. మతం పేరుతో హింసాకాండకు దిగడం సరికాదు. కానీ గుజరాత్‌ మతకల్లోలాలకు పెట్టింది పేరు. అక్కడి మత కల్లోలాలకు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 1713లోనే తొలి హిందూ ముస్లిం ఘర్షణ జరిగిందని చరిత్ర చెబుతోంది. ఇక స్వాతంత్య్రం వచ్చిన తరువాత 35 సంవత్సరాల పాటు 979 హిందూ ముస్లిం ఘర్షణలు జరిగాయి. గోధ్రా తరువాత మోదీ హయాంలో ఒక్క ఘర్షణ కూడా జరగలేదు. ఇవెందుకు ఎవరికీ గుర్తుకు రావడం లేదు. గోధ్రా రైలు దురంతాన్ని విడిచిపెట్టి, తదనంతర అల్లర్లనే ఎందుకు అంతగా పట్టించు కుంటున్నారు? ఇది పక్షపాతం కాదా? 1984లో ఇందిర హత్యా నంతరం దేశంలో మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోశారు. దీని మీద ఎందుకు నోరు మెదపరు? వారు మైనారిటీలు కారా?

వాజపేయి, ఎల్‌.కె. అడ్వాణీలతో మోదీ..

2007, 2012 ఎన్నికలలో కూడా మోదీ నాయకత్వంలో బీజేపీయే గుజరాత్‌లో విజయకేతనం ఎగురవేసింది. గోధ్రా అల్లర్ల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అటు విమర్శలను వింటూనే, ఇటు మోదీని నిలబెట్టుకున్న తీరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. 2004 ఎన్నికలలో బీజేపీ ఓడిపోయింది. 2009లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. కానీ అప్పటికి మోదీ ఈ దేశంలో అభివృద్ధికి నమూనా అన్న ఖ్యాతి గడించారు. గుజరాత్‌ రూపురేఖలు మారిపోయా యన్న కీర్తి కూడా ప్రపంచాన్ని చుట్టింది. ఈ నేపథ్యంలోనే 2013లో మోదీ బీజేపీ ప్రచార సారథిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఆయనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యారు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. మోదీయే ప్రధాని అభ్యర్థి అయినప్పటికీ, చంద్రబాబు వచ్చి ఎన్‌డిఏ కూటమిలో చేరారు. మూడు దశాబ్దాల తరువాత మొదటిసారి 282 స్థానాలతో బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఎన్‌డిఏకు 323 స్థానాలు దక్కాయి. మే 26, 2014న మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2014 నుంచి 2019 ఎన్నికలు జరిగే వరకు కూడా మీడియా మోదీ మీద విషం చిలకరిస్తూనే ఉంది. కానీ ఆయన తన పని తాను చేసుకు పోయారు. ఆయన దేశానికి ఏం చేశారంటూ ప్రశ్నించిన దివానంధులు ఇప్పటికైనా మేల్కోవడం అవసరం. మోదీ సంక్షేమ కార్యక్రమాలను, వాటి ద్వారా ఆయన ప్రజలహృదయాలను దోచుకున్న తీరును అంచనా వేయడంలో భారత పత్రికా రచయితలు పొరబడ్డారని, గుర్తించినా బాహాటంగా చెప్పడానికి ముందుకు రాలేదని ఇటీవలనే ప్రఖ్యాత పత్రికా రచయిత శేఖర్‌గుప్తా నిజాయితీగా ఒప్పుకున్నారు. జూన్‌ రెండో తేదీన కేరళలోని కన్నూర్‌ లోక్‌సభ ఎంపీని కాంగ్రెస్‌ బహిష్కరించింది. ఆయన మహ్మదీయుడు. పేరు ఏపీ అబ్దుల్లా కుట్టీ. ఇతడు మోదీని కీర్తించినందుకు కాంగ్రెస్‌ పార్టీ బహిష్క రించింది. చిత్రం ఏమిటంటే అంతకుముందు ఈయన కన్నూర్‌ నుంచే సీపీఎం ఎంపీ. అప్పుడు గుజరాత్‌ మోడల్‌ను ప్రశంసించినందుకు ఆ పార్టీ బహిష్కరించింది. చిత్రం కదా! ఒక కవితలో మోదీ, ‘పటంలో నన్ను చూసి నేనేమిటో అంచనా వేయకు. నా ఘర్మజలం వాసన చూసి చెప్పు’ అన్నారు. మోదీ కట్టించిన వేలాది మరుగుదొడ్లను మహిళలు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడినవిగా భావించారు. అందుకు కారకుడు మోదీ. అలాగే గ్యాస్‌ కనెక్షన్లు. లక్షలాది గ్యాస్‌ కనెక్షన్లు మహిళలను వంటింటి నరకం నుంచి తప్పించాయి. ఇవి కాక దేశభద్రతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం కొత్త ఓటర్లను ఆకర్షించింది. అందుకే బీజేపీకి సొంతంగా 303 స్థానాలను (ఎన్‌డిఏకు 353 సీట్లు) కట్టబెట్టి ఈ జాతి మళ్లీ ఆయననే ప్రధానిగా ఎన్నుకున్నది. మే 30, 2019న మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు. ఈ వాస్తవాన్ని అంగీకరించపోతే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుంది.

మోదీ ఈ దేశానికి పదిహేనో (ప్రమాణ స్వీకారాల ప్రకారం) ప్రధాని. నెహ్రూ, గుల్జారీలాల్‌ నందా (తాత్కాలిక), లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్‌, చరణ్‌సింగ్‌, రాజీవ్‌ గాంధీ, వీపీ సింగ్‌, చంద్రశేఖర్‌, పీవీ నరసింహారావు, వాజపేయి, దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌ తరువాత మోదీ. వీరిలో నెహ్రూ స్వాతంత్య్రోద్యమ కాలం వారు. విదేశాలలో చదువుకున్నవారు. ఇందిర ఆయన కుమార్తె. ఆమె పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. రాజీవ్‌ గాంధీ వీరి వంశం వారే. లాల్‌బహదూర్‌, చరణ్‌సింగ్‌, దేవెగౌడ, వాజపేయి సాధారణ కుటుంబీ కులు. వీరందరి కుటుంబాల కంటే వెనుకబడిన కుటుంబం మోదీది. కానీ ఆయన భారత ప్రధాని అయ్యారు. ఇప్పుడు ఆయన భారత జన హృదయ నేత. అందుకు కారణం ఆయన వ్యక్త్విత్వం. ఆయన జాతీయ భావాలు. దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత. ఇందులో చాలామంది ప్రధానులు ఎదుర్కొన్న సమస్యలను ఆయన ఒక్కరే ఏకకాలంలో ఎదుర్కొన్నారు. కొందరు ప్రధానుల మాదిరిగా సమస్య దానంతట అదే సమసిపోతుందన్న అలక్ష్య ధోరణి మోదీకి లేదు. ఆయనకు దేశాభివృద్ధే మతం. ఆయన పాలనలో ముస్లింలు భయం భయంగా బతుకుతున్నారన్న మాట అవాస్తవం. 2019 ఎన్నికలలో ముస్లింలు అధికంగా ఉండే చాలా నియోజక వర్గాలలో బీజేపీ గెలిచింది.

చారిత్రక దృష్టి కలిగిన ఏ నేత అయినా ఈ దేశం ధర్మసత్రంగా మిగిలిపోవడానికి అంగీక రించడు. ఉగ్రవాదం కారణంగా అభివృద్ధికి దూరంగా జరిగిపోతుంటే ప్రేక్షక పాత్రకు పరిమితం కాలేడు. అలాంటి నాయకుడిని మోదీలో చూస్తోంది భారతదేశం. దూరదృష్టి కలిగిన నేతలు ఎవరూ కశ్మీర్‌ వంటి సమస్యను అసలే నానబెట్టరు. చారిత్రక తప్పిదాలను సవరించేందుకే యత్నిస్తారు. ఇందుకు రాజకీయ సంకల్పం అవసరం. అది జాతీయత నుంచి ఉద్భవించినది కావడం ఇంకా అవసరం. ఇవన్నీ మోదీలో కనిపిస్తున్నాయి.

మోదీ అంటే భారత స్వాతంత్య్రోద్యమంలో కనిపించే తీవ్ర జాతీయవాదుల అకళంక దేశభక్తికి వారసుడు. మోదీ అంటే ఆధునిక భారతావనికి ఏం కావాలో, ఆధునిక ప్రపంచంలో ఈ పురాతన దేశం తన విలువలు వదులుకోకుండా ఎటు అడుగులు వేయాలో తెలిసినవాడు. మూలాలు మరచిన దేశం ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్లీ కుంగిపోతుందన్న వాస్తవం తెలిసినవాడు కూడా. ఇప్పుడు మోదీ భారత్‌కు చిరునామా.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *