స్వాతంత్య్రం సమష్టి కృషి వల్లనే సాధ్యమైంది

స్వాతంత్య్రం సమష్టి కృషి వల్లనే సాధ్యమైంది

ఆర్‌ఎస్‌ఎస్‌ సంక్రాంతి ఉత్సవ ప్రత్యేకం

కొంతకాలం క్రితం ఒక పాత్రికేయుడు నన్ను కలుసుకున్నాడు. సంభాషణ మధ్యలో ‘స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. పోషించిన పాత్ర ఏమిటి?’ అని నన్ను ప్రశ్నించాడు. బహుశా ఆయన కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. వ్యతిరేక ప్రచార బాధితుడే అయి ఉంటాడు. ‘స్వాతంత్య్ర పోరాటం’ అనే మాట ఏ అర్థంలో మీరు వాడుతున్నారని నేను ఎదురు ప్రశ్నించాను. ఇలాంటి ప్రశ్నను ఆయన ఊహించ లేదు. తర్వాత నెమ్మదిగా, సంయాత్మక స్వరంతో ‘మహాత్మాగాంధీ జరిపినది’ అని సమాధానమిచ్చాడు. ‘మరి గాంధీగారికంటే ముందు ఏమీ జరగలేదా? లాల్‌-బాల్‌-పాల్‌ త్రయం చేసింది ఏమీ లేదా? క్రాంతికారీ ఉద్యమానికి, సుభాష్‌చంద్రబోస్‌కు స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్రగానీ లేదా?’ అని అడిగాను. ఆయన మౌనంగా ఉన్నాడు. గాంధీగారి నాయకత్వంలో ఎన్ని సత్యాగ్రహాలు జరిగాయని ప్రశ్నించాను. ఆ విషయం అతనికి అనుమానమే. 1921, 1930, 1942లో మొత్తం మూడు జరిగాయని చెప్పాను. అది అతనికి తెలియదు. 1940లో కన్నుమూసిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్థాపనకు ముందు 1921లో, స్థాపన తర్వాత 1930లో కూడా సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష కూడా అనుభవించారని చెప్పాను.

పక్షపాతంతో కూడిన చరిత్రను మనకు బోధించడానికి చాలా యోజనాబద్ధమైన ప్రయత్నం జరుగుతున్నది కనుకనే ఈ సంఘటన వివరించాను. కాంగ్రెసువల్ల, 1942లో జరిగిన సత్యాగ్రహం వల్లను మాత్రమే స్వాతంత్య్రం వచ్చిందని భారత ప్రజానీకానికి నూరిపోస్తున్నారు. ఇంకెవరూ ఏమీ చేయలేదట! ఇది పూర్తి సత్యంకాదు. చరఖా, ఖాదీల ద్వారా స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులు కూడా పాల్గొనటానికి ఆ సత్యాగ్రహం ఒక సాదాయైన సునాయాసమైన మార్గాన్ని చూపిందనేది నిజమే. కాని ఒకానొక ఉద్యమానికో, లేదా ఒక పార్టీకో మాత్రమే ఘనతను ఆపాదించడమంటే చరిత్రతో ఆడుకోవటం, ఇతరులు చేసిన ప్రయత్నాలన్నిటినీ అవమానించడమే.

మనం ఆర్‌.ఎస్‌.ఎస్‌. గురించి చర్చించదలచు కుంటే డా|| హెడ్గేవార్‌తోనే మొదలుపెట్టాలి. కేశవరావు హెడ్గేవార్‌ 1889లో జన్మించారు. స్వాతంత్య్ర సంగ్రామ సంరంభం నాగపూర్‌లో 1904-05 నుంచే ప్రారంభమైంది. కాని 1897లోనే 9-10 ఏళ్ల కేశవరావు విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవాల సందర్భంగా పంచిపెట్టిన మిఠాయిలను చెత్తబుట్టలోకి విసిరికొట్టాడు. సర్క్యులర్‌ పేరుతో వందేమాతరం పాడటాన్ని నిషేధించిన ఆదేశానికి వ్యతిరేకంగా 1907లో తను చదివే నీల్‌సిటీ స్కూల్‌లో ప్రభుత్వ ఇన్‌స్పెక్టర్‌ ఎదుటే తన సహాధ్యాయులందరిచేత ‘వందేమాతరం’ పాడించాడు. అందుకు కేశవుడు స్కూలు నుండి బహిష్కరణకు గురయ్యాడు. వైద్యవిద్యకు ముంబయిలో మంచి సౌకర్యాలున్నప్పటికీ హెడ్గేవార్‌ విప్లవకారులకు కార్యక్షేత్రంగా వున్న కలకత్తానే తన వైద్యవిద్యాభ్యాసానికి ఎంచుకున్నారు. అక్కడ అగ్రస్థాయి విప్లవ సంస్థ ‘అనుశీలన సమితి’లో కీలకబృందంలో సభ్యుడయ్యాడు.

డాక్టరుగా హెడ్గేవార్‌ 1916లో నాగపూర్‌కు తిరిగి వచ్చారు. అప్పట్లో స్వాతంత్య్రోద్యమంలోని అగ్రనాయకులంతా పెళ్లిళ్లు చేసుకొని గృహస్థ జీవనం గడుపుతున్నారు. డాక్టర్‌ హెడ్గేవార్‌ కూడా అలా ఆలోచించగిలిగి ఉండేవాడే. కుటుంబ నేపథ్యం కూడా అందుకు అనువుగానే వుంది. అయినప్పటికీ తాను వైద్యవృత్తి చేపట్టరాదని, వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నారు. స్వాతంత్య్ర సముపార్జన పట్ల ఆయనకెంతటి తీవ్ర నిష్ఠ, ఆతురత ఉండేవంటే తన యావచ్ఛక్తి సామర్థ్యాలను, సమయాన్ని దేశానికే సమర్పించి స్వాతంత్య్రం కోసం జరిగిన అన్ని రకాల ఉద్యమాల్లోను పాల్గొన్నారు.

లోకమాన్య తిలక్‌పట్ల ఆయనకు అచంచలమైన నిష్ఠ ఉండేది. 1920లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెసు మహాసభల నిర్వహణ బాధ్యతలన్నీ డా||హర్దీకర్‌, డా||హెడ్గేవార్‌లకు అప్పగించగా వారు 1200 మంది స్వచ్ఛంద సేవకులను అందుకై సమీకరించారు. అప్పటికి డా||హెడ్గేవార్‌ కాంగ్రెస్‌ నాగపూర్‌ శాఖకు సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ‘భారతదేశాన్ని సంపూర్ణ స్వతంత్ర దేశంగా చేసి, దానినొక గణతంత్రంగా రూపొందించి పెట్టుబడిదారీ విధానపు కబంధ హస్తాల నుంచి ప్రపంచ దేశాలను విముక్తం చేయా’లనే స్పష్టమైన లక్ష్యంతో ఒక తీర్మానం చేయవలసిందిగా డా||హెడ్గేవార్‌ తీర్మానాల కమిటీకి ప్రతిపాదన చేశారు. తొమ్మిది సంవత్సరాల అనంతరం 1929లో జరిగిన లా¬రు మహాసభల్లో కాంగ్రెసు సంపూర్ణ స్వాతంత్య్ర సాధన అనే ఆయన సూచనను ఆమోదించింది. ఇందుకు సంతోషించిన డాక్టర్‌జీ 1930 జనవరి 26న కాంగ్రెసు పార్టీని అభినందించవలసిందిగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. శాఖలన్నిటికీ ఆదేశమిచ్చారు. 1920 ఆగష్టు 1న లోకమాన్య తిలక్‌ స్వర్గస్తులవడంతో నాగపూర్‌లోని తిలక్‌ అభిమానులందరూ విచారగ్రస్తులైనారు. అటు పిమ్మట కాంగ్రెసువారి స్వాతంత్య్ర సమరం గాంధీజీ నాయకత్వంలో కొనసాగింది. 1921లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీజీ సహాయ నిరకరణోద్యమం లేవదీశారు. ఆ సందర్భంలో ఖిలాఫత్‌కు మద్దతు పలికారు. చాలామంది కాంగ్రెసు నాయకులే గాక జాతీయవాదులైన ముస్లింలు కూడా దీనిని వ్యతిరేకించారు. కనుక సహాయ నిరాకరణోద్య మం నాగపూర్‌లో ఏమంత ప్రభావం చూపలేదు. కాని డా||హెడ్గేవార్‌, డా||చోల్కర్‌, సమీముల్లాఖాన్‌ ప్రభృతులు ఈ దృశ్యాన్ని మార్చారు. బ్రిటిష్‌ సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించే ఏకైక ఉద్దేశంతో వారు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకు రాజద్రోహ ఆరోపణల క్రింద హెడ్గేవార్‌ ఒక ఏడాది జైలుశిక్ష అనుభవించవలసి వచ్చింది.

స్వాతంత్య్ర సాధన ప్రాముఖ్యం, దాని అగ్రప్రాధాన్యం తెలిసినప్పటికీ డా||హెడ్గేవార్‌ను ఒక ప్రశ్న వేధిస్తుండేది. ఎక్కడో 7 వేల మైళ్ళ దూరం నుంచి వ్యాపారం కోసం వచ్చిన చాలా కొద్దిమంది ఆంగ్లేయులు ఇంత పెద్ద దేశాన్ని ఎలా పరిపాలించ గలుగుతున్నారు అని. మనలోనే ఏవో లోపాలు ఉండి ఉంటాయి. మన సమాజం ఆత్మవిస్మృతి చెందింది. ఐక్య భారతం కులాలు, ప్రాంతాలు, భాషలు, మత సంప్రదాయాలవంటి ముక్కలుగా చీలిపోయింది. అసంఘటితంగా ఉంటూ దురాచారాల బారినపడింది. దీనినుంచి బ్రిటిష్‌వారు లబ్దిపొంది మనను పరిపా లించగలుగుతున్నారు. స్వాతంత్య్రం సంపాదించు కున్న తర్వాత కూడా సమాజం ఇలాగే ఉండిపోతే భవిష్యత్తులోనూ ఇదే చరిత్ర పునరావృతం కావచ్చు. ‘నాగనాథ్‌ పోతే సర్పనాథ్‌ వస్తాడు’ (ఒక పీడ వదిలితే ఇంకో పీడ వస్తుంది) అని ఆయన అంటుండేవారు. కనుక మన సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచి, చైతన్యవంతం చేసి, సంఘటితపరచడంతో పాటు దురాచార విముక్తంచేసి జాతీయశీలాన్ని నింపటం మరెంతో ముఖ్యమైన ఆవశ్యకమైన కార్యం. రాజకీయాలకు, ప్రచారానికి దూరంగా ఉంటూ నిశ్శబ్దంగా, నిరంతరంగా పనిచేస్తేనే ఇది సాధ్యపడు తుందని ఆయన గ్రహించారు. ఈ ఉద్దేశంతోనే ఆయన 1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను స్థాపించిన తర్వాత కూడా ఆయనకు రాజకీయ, సామాజిక నేతలందరి తోను, అన్ని ఉద్యమాలు, కార్యకలాపాలతోను హృదయపూర్వకమైన, ఆత్మీయమైన సంబంధాలుండేవి.

గాంధీజీ 1930 ఏప్రిల్‌ 6న గుజరాత్‌లోని దండి నుంచి శానోల్లంఘనోద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి మద్దతునివ్వాలని 1929 నవంబరులోనే మూడురోజులపాటు జరిగిన సంఘచాలకుల సమావేశంలో డాక్టర్‌ హెడ్గేవార్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. విధానం ప్రకారం డా||హెడ్గేవార్‌ ఇతర స్వయంసేవకులతోబాటు వ్యక్తిగత ¬దాలో ఈ సత్యాగ్రహంలో పాల్గొనటానికి నిర్ణయించుకున్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. పనిమీద దీని ప్రభావం పడకుండా చూసేందుకు ఆయన సర్‌సంఘచాలక్‌ బాధ్యతను తన చిరకాలమిత్రుడైన డా||పరంజపేకు, శాఖలను సందర్శించే బాధ్యతను బాబాసాహెబ్‌ ఆప్టే, బాపురావ్‌ భిడేలకు అప్పగించారు.ప్రారంభంలో ఈ సత్యాగ్రహం లో మూడు నుంచి నాలుగువేల మంది ఆయన వెంట బయలుదేరారు. సత్యాగ్రహ స్థలమైన పుసాద్‌ చేరేసరికి పదివేలమంది పోగయ్యారు. ఈ సత్యాగ్రహంలో వారికి తొమ్మిది నెలల జైలుశిక్ష పడింది. జైలు నుంచి విడుద లైన తర్వాత ఆయన తిరిగి సర్‌సంఘచాలక్‌ బాధ్యతలు స్వీకరించి ఆర్‌.ఎస్‌.ఎస్‌. పనిపై శ్రద్ధపెట్టారు.

భాగ్యనగర్‌ (హైదరాబాద్‌)లో హిందువులపై నిజాం అత్యాచారాలను ప్రతిఘటించడానికి 1938లో భాగ్యనగర్‌ నిశ్శస్త్ర ప్రతీకారమండల్‌ పేరిట సత్యాగ్రహానికి హిందూమహాసభ, ఆర్యసమాజ్‌లు పిలుపునిచ్చాయి. ఈ సత్యాగ్రహంలో చేరడానికి అనుమతి కోరిన స్వయంసేవకులందరికి డాక్టర్‌జీ సమ్మతి తెలిపారు. అయితే వారు వ్యక్తిగత ¬దాలోనే పాల్గొనవలసి ఉంటుందని స్పష్టం చేశారు. భాగ్య నగర్‌ సత్యాగ్రహంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. పాల్గొన్నదంటూ నిర్వాహకులు పత్రికా ప్రకటనల్లో తరచుగా చెబుతూ వుంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. అనే పేరు ప్రస్తావించవద్దని డాక్టర్‌జీ వారికొక లేఖ రాశారు.

ఒక దూరదృష్టితో, స్పష్టమైన ఆలోచనతోనే డాక్టర్‌జీ బుద్ధి పూర్వకంగా ఈ వ్యూహాన్ని రూపొందించారు. రాజకీయ ఉద్యమాల క్షణికమైన మరియు పోరాట స్వభావాన్ని, నిరంతరంగా, అవిచ్ఛిన్నంగా సాగే ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిర్మాణాత్మక కార్యాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అటవీ సత్యాగ్రహం సందర్భంగా కూడా ఆయన సర్‌సంఘచాలక్‌ బాధ్యతను డా||పరంజపేకు అప్పగించి పలువురు ఇతర స్వయంసేవకులతోబాటు అందులో పాల్గొన్నారు.

1942 ఆగష్టు 8న ముంబైలో గోవాలియా టాంక్‌ గ్రౌండ్‌లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో మహాత్మాగాంధీ ‘ఆంగ్లేయులారా! వెనక్కు వెళ్ళండి’ అనే చారిత్రాత్మకమైన పిలుపునిచ్చారు. ఆ మరునాటి నుంచే దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకోవడంతో చాలాచోట్ల నాయకులను అరెస్టు చేయడం ప్రారంభమైంది.

విదర్భలోని బవాలి (అమరావతి), అష్టి (వార్థా), చిమూర్‌ (చంద్రపూర్‌)లలో జరిగిన ఆందోళనలు ప్రత్యేకత కలిగినవి. చిమూర్‌ వార్తను బెర్లిన్‌ రేడియోలో కూడా ప్రకటించారు. ఈ ఆందోళనలు కాంగ్రెసుకు చెందిన ఉద్ధవరావ్‌ కోరేకర్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధికారు లైన దాదానాయక్‌, బాబురావ్‌ బెగడే, అన్నాజీ సిరాస్‌ల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఆందోళనలో బ్రిటిషువారి బుల్లెట్‌ వల్ల మరణించిన ఒకే ఒక వ్యక్తి ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్వయంసేవక్‌ బాలాజీ రాయపూర్‌కర్‌. కాంగ్రెసువారు, శ్రీ తుకడోజీ మహారాజ్‌కు చెందిన శ్రీ గురుదేవ్‌ సేవామండల్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్వయంసేవకులు కలసి చిమూర్‌ ఆందోళనను, సత్యాగ్రహాన్ని సంయుక్తంగా చేపట్టారు. ఈ ఆందోళనలో 125 మంది సత్యాగ్రహుల మీద, అసంఖ్యాకులైన స్వయంసేవకుల మీద కేసులు బనాయించారు.

దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఆర్‌.ఎస్‌.ఎస్‌. సభ్యులు, ప్రచారకులు ఈ ఉద్యమంలోకి మ¬త్సహంతో దూకారు. ఉదాహరణకు రాజస్థాన్‌లో ప్రచారక్‌గా వున్న శ్రీ జైదేవ్‌జీ పాథక్‌ (అనంతరకాలంలో విద్యాభారతిలో క్రియాశీలకంగా పనిచేశారు), విదర్భ జిల్లా ఆర్వీలో డా|| అన్నాసాహెబ్‌ దేశపాండే, రమాకాంత్‌ కేశవ్‌ (బాలాసాహెబ్‌) దేశపాండే (అనంతరకాలంలో ఛత్తీస్‌ఘడ్‌లోని జాస్‌పూర్‌లో వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ స్థాపకులు), ఢిల్లీలో వసంతరావ్‌ ఓక్‌ (అనంతరకాలంలో ఢిల్లీ ప్రాంత ప్రచారక్‌), పాట్నాలో కృష్ణవల్లభ్‌ ప్రసాద్‌ నారాయణ సింగ్‌ (బాబువాజీ – అనంతరకాలంలో బిహార్‌ సంఘచాలక్‌గా బాధ్యత వహించారు), ఢిల్లీలో చంద్రకాంత్‌ భరద్వాజ్‌ (వీరి పాదానికి బుల్లెట్‌ గాయమైంది. దానిని తీయటం కురదనే లేదు), మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో దత్తాత్రేయ గంగాధర్‌ (భయ్యాజీ) కస్తూరే, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మాధవరావ్‌ దేవడే ప్రభృతులను పేర్కొనవచ్చు.

ఒక వంక సత్యాగ్రహం సాగుతుండగా మరోవంక ఉద్యమాన్ని నడిపించడానికి చాలామంది ఆందోళనకారులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ రోజుల్లో అజ్ఞాత కార్యకర్తలకు ఆశ్రయం కల్పించడమంటే సాహసంతో కూడిన పనే. చాలామంది స్వయం సేవకులు ఆ సాహసం చేశారు. అలాంటి స్వయం సేవకుల పేర్లు అసంఖ్యాకంగా ఉదహరించవచ్చు. ఆ రోజుల్లో ఈ విషయాలన్నీ డాక్యుమెంట్లుగా రూపొందించే అవకాశాలు బొత్తిగా లేవు.

డాక్టర్‌ హెడ్గేవార్‌ జీవితం పరిశీలిస్తే ఆయన యావజ్జీవితం దేశ స్వాతంత్య్రం కోసమే అంకితం చేశారని స్పష్టమవుతుంది. జాతీయ భావన ప్రాతిపదికగా దోషరహితమైన, నైపుణ్యభరితమైన సమాజం కోసం సంఘటనను నిర్మించటమే ఆయన ఎంపిక చేసుకున్న మార్గం. ‘హిందూస్థాన్‌కి స్వాతంత్య్రాన్ని సాధించటం’ అనేది 1947 వరకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రతిజ్ఞలో ప్రధాన లక్ష్యంగా ఉండేది.

హెడ్గేవార్‌ – ఆర్‌.ఎస్‌.ఎస్‌. దృష్టి

భారత జాతీయ జీవనంలో నాయకులు పరస్పర విభిన్న దిశలలో తలొకవైపు లాగటం అలవాటే. డాక్టర్‌జీ జీవించి ఉన్న రోజుల్లోనూ కాంగ్రెసు – విప్లవకారులు, తిలక్‌ – గాంధీ, హింస – అహింస, హిందూమహాసభ – కాంగ్రెసు వగైరా ద్వంద్వ విభజనలుండేవి. ఒకరిమీద ఒకరు ఎలాగైనా పైచేయి సాధించాలని చూస్తుండేవారు. ఒక్కొక్కసారి తమలోని విభేదాల కారణంగా బ్రిటిషు సామ్రాజ్యవాదం మీద పోరాటం చేయడానికి వీరు ఒకరిమీద ఒకరు బహిరంగంగా దుమ్మెత్తిపోసుకుంటుండేవారు. 1921లో లోకనాయక్‌ ఆణే అధ్యక్షతన జరిగే మధ్య ప్రాంత కాంగ్రెసు ప్రాంతీయ మహాసభల్లో విప్లవకారుల చర్యలను ఖండించే తీర్మానం ఒకటి చర్చకు రానున్నది. డా||హెడ్గేవార్‌ తనకు విప్లవ మార్గంలో విశ్వాసం లేకున్నా విప్లవకారుల దేశభక్తిని శంకించరాదని ఆణేకు చెప్పారు. దీనినిబట్టి చూస్తే రాజకీయ భావాలు, సిద్ధాంతాలు, తిలక్‌ – గాంధీ, హింస-అహింస, కాంగ్రెసు-విప్లవకారులు ఇత్యాది సంకుచిత పక్షపాత బుద్ధి ఏదీ డాక్టర్‌జీ జీవితాన్ని శాసించలేదని స్పష్టమవుతుంది.

భారత్‌ను ఒక రాజకీయ అస్తిత్వంగా మాత్రమే భావించే ఒక వర్గంవారు ఎప్పుడూ అన్నిటికీ తామే క్రెడిట్‌ కొట్టేయాలనుకుంటూ ఉంటారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ఇతరుల పాత్రను గుర్తించకుండా తమవల్లనే అది సాధ్యపడినట్లు ఏకపక్షంగా ప్రచారం సాగిస్తుంటారు. సాయుధ విప్లవకారులు మొదలు అహింసామార్గులైన సత్యాగ్రహులు, సైన్యంలోని తిరుగుబాటుదారులు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వగైరా అందరి సమిష్టి కృషి ఫలితంగానే స్వాతంత్య్రం లభించింది. అంతేగాక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండు దిక్కుతోచని పరిస్థితికి చేరుకోవటం, వలస ప్రాంతాలపై పట్టు నిలుపుకోలేకపోవటం, వాటిని పాలించేందుకు వైముఖ్యం అనే కోణాలు కూడా కాదనలేము. భారత్‌లో మాదిరిగా స్వాతంత్య్రపోరాటం చేయని వలస ప్రాంతాలకు సైతం ఈ పరిణామ క్రమంలో బ్రిటిషువారు స్వాతంత్య్రాన్ని ఇచ్చారు.

మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన చివరి సత్యాగహ్రం 1942 నాటి సత్యాగ్రహమేనని, అటు పిమ్మట 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిందనేది సత్యం. కాని కేవలం 1942 సత్యాగ్రహం వలన, ఆ ఉద్యమంలో అరెస్టయిన వారి కారణంగా మాత్రమే స్వాతంత్య్రం వచ్చిందని చెప్పటం మాత్రం పరిహాసాస్పదం, అనుచితం, అసత్యం.

ఒక కథ ఉంది. ఒక రైతు చాలా ఆకలిగా ఉన్నాడు. భార్య వడ్డిస్తుంటే తింటున్నాడు. కాని ఆకలి తగ్గటం లేదు. పదకొండవ రొట్టె తిన్న తర్వాతనే తృప్తి కలిగింది. కోపంగా ఉన్న భర్త ఆ పదకొండవ రొట్టెను ముందుగానే ఎందుకు పెట్టలేదు అంటూ భార్యను తిట్టాడు. ఆ సంతృప్తి ముందే కలిగితే అన్ని రొట్టెలు తినవలసిన పని ఉండేది కాదని అతగాడి తర్కం! ఆ ఆలోచనే పరిహాసాస్పదమైనది.

అదేవిధంగా భారతదేశ స్వాతంత్య్ర ఘనతను 1942 క్విట్‌ ఇండియా ఉద్యమానికి మాత్రమే ఆపాదించటం పరిహాసాస్పదం. కొన్ని చారిత్రక ఆధారాలు చూస్తే ఈ ఉద్యమం గురించిన స్పష్టమైన చిత్రం మనకు లభిస్తుంది.

భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ఇచ్చే సమయంలో బ్రిటిష్‌ ప్రధానమంత్రి అట్లీ ‘బ్రిటిషు వారి మీద గాంధీ అహింసా ఉద్యమ ప్రభావం దాదాపుగా శూన్యమే’ అన్నాడు. పశ్చిమ బెంగాల్‌ మాజీ తాత్కాలిక గవర్నర్‌ (కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) పి.ఎం. చక్రవర్తి ఇలా వ్రాశారు – ‘నేను తాత్కాలిక గవర్నరుగా ఉండగా లార్డ్‌ అట్లీ భారతదేశ పర్యటన చేస్తూ కలకత్తాలోని గవర్నరు భవనంలో రెండు రోజులు గడిపారు. ఆ సమయంలో నేను బ్రిటిషు వారు భారతదేశం విడిచి వెళ్ళవలసి రావడానికి అసలైన కారణాల గురించి ఆయనతో సుదీర్ఘంగా చర్చించాను. ‘గాంధీగారి ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం ఎప్పుడో చల్లారిపోయింది, 1947లో అలాంటి సరికొత్త బలాత్కార పరిస్థితులేమీ తలయెత్తలేదు. అలాంటప్పుడు బ్రిటిషువారు హడావిడిగా వెళ్లి పోవలసిన అగత్యం ఏమి వచ్చింది? అని సూటిగా ప్రశ్నించాను. దీనికి సమాధానంగా అట్లీ చాలా కారణాలు చెప్పారు. వాటిలో ప్రధానమైనదేమంటే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సైనిక కార్యకలాపాల ఫలితంగా భారతీయ సైనికుల్లోను, నౌకాదళంలోను బ్రిటిషు రాజవంశం పట్ల విధేయత సన్నగిల్లింది. చర్చ చివరలో నేను ‘భారతదేశాన్ని విడిచి వెళ్ళాలనే బ్రిటిషు వారి నిర్ణయంపై గాంధీజీ ప్రభావం పరిమితి ఎంత?’ అని అట్లీని అడిగితే అట్లే వ్యంగ్యంగా నవ్వి పెదవి విరుస్తూ ”చా..లా.. త..క్కు..వ’ అంటూ నెమ్మదిగా మాట వదిలాడు.

రమేష్‌చంద్ర మజుందార్‌ ఇలా అంటాడు -‘ఆ మూడింటి సమిష్టి ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. ప్రత్యేకించి అజాద్‌ హింద్‌ఫౌజ్‌పై విచారణ సందర్భంగా వెల్లడైన వాస్తవాలు, భారతదేశంలో అవి కనబరచిన ప్రతిక్రియ చూస్తే అప్పటికే యుద్ధంతో చతికిలపడిన బ్రిటిషువారికి భారతదేశంలో తమ అధికారం నిలుపుకోవడానికి సిపాయిల విధేయతపై ఇక ఎంతమాత్రం ఆధారపడ లేమని చక్కగా అర్థమైంది. భారతదేశాన్ని విడిచివెళ్లా లనే వారి అంతమ నిర్ణయంపై అత్యంత ప్రభావం చూపిన అంశం బహుశా ఇదే అయి ఉంటుంది.

ఇది చదివిన మీదట భారత స్వాతంత్య్ర సాధనలో 1942 క్విట్‌ ఇండియా ఉద్యమానికి పాత్ర ఏమీ లేదనుకోవడం కూడా సరికాదు. జైల్లో ఉండి బాధపడటం ఒక్కటే దేశభక్తుడి లక్షణం అని భావిం చటం కూడా సరికాదు. స్వాతంత్య్ర సంగ్రామంలో జైలుకు వెళ్లిన వారితోబాటు వారి కుటుంబాలను ఆదుకొన్న వారు, అజ్ఞాత కార్యకర్తలకు ఆశ్రయమిచ్చిన వారు, జాతీయ విద్య ద్వారా విద్యార్థులలో దేశభక్తిని ప్రబోధించిన వారు, స్వదేశీ వస్తు వినియోగానికై ప్రచారం కల్పించి బ్రిటిషు తయారీ వస్తువులను ఆర్థిక రంగంలో అడ్డుకున్న వారు, స్వదేశీ పరిశ్రమల ద్వారా బలమైన ప్రత్యామ్నాయాలను అందించిన వారు, జానపద కళలు, పత్రికారంగం, కథలు, నవలలు, నాటకాల ద్వారా జాతీయ చైతన్యాన్ని రగుల్కొల్పిన వారు అందరూ తమవైన పద్ధతుల్లో చేయూతనిచ్చిన వారే. వారినందరినీ పరిగణలోకి తీసుకోవాలి.

భారత్‌ కేవలం రాజకీయ అస్తిత్వం కాదు. వేలాది సంవత్సరాల సనాతన ఆలోచన, దర్శనాలపై నిర్మిత మైన అవిరళ, సమగ్ర, ఏకాత్మక దృష్టి ప్రాతిపదికగా కలిగిన ఒక సాంస్కృతిక సత్తా ఇది. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు వ్యాపించి ఉన్న ఈ వైవిధ్య భరితమైన సమాజానికి ఈ దర్శనం, సంస్కృతి ఒక విశిష్టమైన గుర్తింపునిస్తున్నాయి. కనుకనే భారత్‌లో ఏదైనా రాజకీయ మార్పు సంభవించినప్పుడు దానికి ముందుగాగాని, అదే సమయంలో గాని ఒక ఆధ్యాత్మిక శక్తి కారణంగా ఒక సాంస్కృతిక చైతన్య ప్రక్రియ సంభవిస్తుంటుంది. పరిస్థితి క్లిష్టంగా ఉన్న కొద్దీ ఈ ఆధ్యాత్మిక శక్తి కూడా మరింత బలీయంగా వ్య్తం కావడం చూడవచ్చు. కనుకనే మొఘలుల పాలనాకాలంలో 12 నుంచి 16వ శతాబ్దం వరకు భారతదేశ వ్యాప్తంగా భక్తి ఉద్యమం వ్యాపించటం కనిపిస్తుంది. ఉత్తరాన రామానందుడి నుంచి దక్షిణాగ్రాన రామానుజాచార్యుల వరకు అన్ని ప్రాంతాలలోను సాధువులు, సంత్‌లు, సన్యాసుల అవిచ్ఛిన్న పరంపర ఒకటి కనిపిస్తుంది. బ్రిటిషువారి దాస్యపు రోజుల్లో స్వామి దయానంద సరస్వతి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి ఆధ్యాత్మిక నేతల సంప్రదాయం కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో సాంస్కృతిక జాగరణ లేకుండా ఏ రాజకీయ మార్పుగాని విజయవంతం అవలేదు, శాశ్వతం కాలేదు. కనుక సాంస్కృతిక జాగరణను రాజకీయమైన కొలమానాలతో విలువ కట్టకూడదు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా సాగిపోయే ఆధ్యాత్మిక, సాంస్కృతిక జాగరణ భారత్‌ వంటి దేశానికి మరెంతో ప్రాముఖ్యం కలిగి ఉంటుందనే విషయాన్ని విస్మరించరాదు.

– డా.మన్మోహన్‌ వైద్య

ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *