ప్రపంచం చెవిలో హాంకాంగ్‌ హాహాకారాలు

ప్రపంచం చెవిలో హాంకాంగ్‌ హాహాకారాలు

చైనాలోని తియాన్మెన్‌ స్క్వేర్‌లో ఉచకోత జరిగి 30 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు చైనా ఆధీనంలోని హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. హాంకాంగ్‌లో ఎగిసిపడుతున్న నిరసనలను ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. హాంకాంగ్‌లో నూతనంగా ఒక చట్టాన్ని (నేరగాళ్లను తమ ప్రభుత్వానికి అప్పచెప్పేందుకు ఉద్దేశించినది) ప్రవేశపెట్టాలని చైనా చూస్తోంది. హాంకాంగ్‌ ప్రజలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా ప్రతిపాదించిన ఈ నియమం చట్టరూపం దాల్చితే హాంకాంగ్‌లో నేరాలకు పాల్పడిన వారిని చైనాకు తీసుకెళ్లి విచారించడం, చిత్రహింసల పాలుచేయడం, కానసంట్రేషన్‌ శిబిరాలలో నిర్బంధించడం వంటివి జరుగుతాయి. హాంకాంగ్‌లో న్యాయవ్యవస్థ పనికి రాకుండా పోతుంది. ఈ కారణంగా హాంకాంగ్‌ ప్రజలు చైనా ప్రతిపాదనను పెద్ద ఎత్తున వ్యతిరే కిస్తున్నారు. ప్రజల పట్ల క్రూరంగా వ్యవహ రించడానికి, చిత్రహింసలకు గురిచేయడానికి, అమానుషంగా ప్రవర్తించడానికి హాంకాంగ్‌ ప్రజలు ఒప్పుకోరు. నేరగాళ్లను చైనా భూభాగంలోకి పంపితే వారిని చైనా ప్రభుత్వం ఎంత అమానుషంగా చూస్తుందో తెలుసు కాబట్టి హాంకాంగ్‌ ప్రజలు ఈ చట్టం అమలులోకి రాకుండా భారీ సంఖ్యలో వీధులలోకి వచ్చి తమ నిరసనలను తెలియ జేస్తున్నారు.

చైనా నిరంకుశ వైఖరి, పారదర్శకత లేని విచారణ, నేరగాళ్లను చిత్రహింసలకు గురి చేయడం ఎలా ఉంటాయో ప్రపంచ దేశాలన్నిటికి తెలిసినదే. చైనా ప్రభుత్వంపైన, న్యాయ వ్యవస్థపై కమ్యూనిస్టు పార్టీ ‘పట్టు’ను ఎవరూ కాదనలేరు. చైనా కమ్యూనిస్టు పార్టీ దేశంలో ఎన్నోసార్లు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడింది. చైనాలోని న్యాయవ్యవస్థ ఈ సందర్భాలలో చూసీ చూడనట్టు ఉంది. పార్టీని కనీసం మందలించలేదు.

నోబెల్‌ గ్రహీత లీజియాబోను జైలు పాలు చేసింది చైనా ప్రభుత్వం. బందీగా ఉన్నప్పుడు అతడికి అవసరమైన వైద్య సహాయం అందించనందువలన అతడు జైలులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికి మరిచిపోలేదు. అతడు ఇంటర్‌పోల్‌లో ముఖ్యుడు, చైనా కమ్యూనిస్టు పార్టీలో చురుకైనవాడు ఇలాంటి వాడు అకస్మాత్తుగా కనిపించ కుండా పోయాడు. అతడే మెంగ్‌హాంగ్‌వీ. కొంత కాలానికి ఇతడు చైనా రక్షణ ఏజన్సీల ఆధీనంలో ప్రత్యక్షమయ్యాడు. అంటే చైనా ఏ విధంగా మానవ హక్కులను కాలరాస్తుందో, ఉల్లంఘిస్తుందో ఈ సంఘటనల వల్ల విశదమవుతుంది.

గత కొంతకాలంగా చైనా, అమెరికాల మధ్య వాణిజ్య పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ హువెయికి చెందిన చైర్మన్‌ మెంగ్‌ వాన్‌జును కెనడాలోని వాంకోవర్‌లో అరెస్టు చేశారు. ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమె తన కేసును వాదించటానికి న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె పట్ల కెనడా ప్రభుత్వం న్యాయబద్ధంగానే మసలుకుంటోంది. కాని ప్రతీకారంతో రగిలిన చైనా కెనడా దౌత్యవేత్తలు మైకెల్‌ కోవరిగ్‌, మైకెల్‌ స్పావోర్‌లను చైనా రహస్యాలను ఉత్తర కొరియాకు చేరవేస్తున్నారనే అభియోగం మోపి నిర్బంధించారు. న్యాయవాదులను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. నెలలో ఒకసారి ఒక్కరిని కలిసేందుకు అనుమతించారు. చైనా చర్యలను గమనిస్తున్న హాంకాంగ్‌ ప్రజలు, చైనా ప్రవేశ పెడుతున్న చట్టాలు తమను ఎంత దయనీయ స్థితికి, అమానవీయ స్థితికి తీసుకెళ్తాయో ఊహించగలరు. చైనా పాలకుల క్రూర స్వభావం, నియంత పోకడలు, ఖైదీల పట్ల అమానుష ప్రవర్తన గమనించిన హాంగ్‌ కాంగ్‌ ప్రజలు జూన్‌ 4న నిరసనలు ప్రారంభించారు.

ఉవ్వెత్తున ఎగిసిన ప్రజల నిరసనలను గమనించిన హాంకాంగ్‌ ప్రభుత్వం ఈ నియమానికి చట్ట రూపాన్నిచ్చే సమావేశాన్ని వాయిదా వేసింది. హాంకాంగ్‌ ముఖ్యఅధికారి కారీలాం సంక్షోభం గమనించి ఈ బిల్లు తన పాలనా కాలంలో ప్రతిపాదించనని ప్రజలకు ఆమె వాగ్దానం చేసింది. ప్రజలు ఆమె రాజీనామా చేయాలని కోరారు. కాని ఆమె పదవిని వదులుకోవడానికి ఒప్పుకోలేదు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఈ సందర్భంగా అరెస్టయిన ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవేళ విడుదల చేయకుంటే చట్ట సభలను అడ్డుకుంటామని అన్నారు. 2014లో జరిగిన హామ్‌బ్రెల్లా మూమెంట్‌ లాగా కాకుండా ఈ సారి నిరసన ప్రదర్శనలో రెండు లక్షల మంది పాల్గొన్నారు. ఇంత భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శనలు ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది.

చైనా ఇప్పుడు ప్రవేశపెడుతున్న బిల్లు ద్వారా హాంకాంగ్‌పై తన పట్టును మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. చైనా ఆధీనంలోకి రాక ముందు హాంకాంగ్‌ బ్రిటిష్‌ పాలనలో ఉండేది. ఒప్పందం ప్రకారం లీజు ముగిసిన వెంటనే హాంకాంగ్‌ను చైనా స్వాధీనం చేసుకుంది. హాంకాంగ్‌ ప్రజలు బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలనను భరించారు. ప్రజాస్వామ్య పాలనకు దూరమయ్యారు. కానీ బ్రిటిష్‌ పాలన తరువాత హాంకాంగ్‌ ప్రజలు ప్రజాస్వామ్య పాలనను కోరుకున్నారు. వారి ఆశలను వమ్ము చేస్తూ చైనా హాంకాంగ్‌లో ‘ముఖ్య అధికారి’ పాలనను ప్రవేశ పెట్టింది. తైవాన్‌లో కూడా ఇలాంటి పాలనే ఉంది. హాంకాంగ్‌పై పూర్తి నియంత్రణ సాధించడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ విభిన్న మార్గాలలో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముఖ్య అధికారిగా తనకు విధేయుడైన వ్యక్తిని నియమించింది. హాంకాంగ్‌ ప్రజల కోరికలను తిరస్కరించింది. చట్టసభలలో 70 మంది ఉంటారని, ఇందులో 35 మంది సభ్యులను చైనా కమ్యూనిస్టు పార్టీలోని ప్రత్యేక జట్లు నుంచి నియమించాలని నిర్ణయించింది. ఈ విధంగా హాంకాంగ్‌ పాలనలో తమదూ పై చేయిగా ఉండేట్లుగా చైనా నియమాలు రూపొందించింది.

1977లో బ్రిటన్‌ హాంకాంగ్‌ను చైనాకు అప్పగించింది. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు డెంగ్‌ జియాపింగ్‌ హాంకాంగ్‌ ప్రజలతో మాట్లాడుతూ ‘మనది ఒకే దేశం, కాని రెండు పద్ధతులు’ అని వాగ్దానం చేశారు. రాబోయే 50 సంవత్సరాల వరకు ‘హాంకాంగ్‌’ స్వయంప్రతిపత్తి కలిగి ఉంటుందని దీనితోపాటు పౌరులు న్యాయవ్యవస్థ, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కలిగి ఉంటారని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 15 సంవత్సరాలు హాంకాంగ్‌ ప్రజలు పూర్తి స్వేచ్ఛను అనుభవించారు. చైనాలో ఈ స్వేచ్ఛ లేదు. కాని హాంకాంగ్‌ ప్రజలు స్వేచ్ఛాయుత జీవనం గడిపారు. జూన్‌ 4న చైనాలో ‘తియాన్మెన్‌ స్క్వేర్‌’ వద్ద జరిగిన ప్రజాస్వామ్య పోరాటం, అసువులు బాసిన విద్యార్థుల సాహసం హాంకాంగ్‌ ప్రజలకు చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలి పోయింది.

భావస్వేచ్ఛపై విరుచుకుపడే చైనా ఒకవైపు, స్వేచ్ఛా విలువల కోసం ఇష్టపడే హాంకాంగ్‌ మరొక వైపు. ఈ కారణంగానే చైనా ప్రవేశపెట్టనున్న నియమాలను హాంకాంగ్‌ వ్యతిరేకిస్తోంది.

హాంకాంగ్‌ చైనా ఆధీనంలోకి వచ్చిన సమయంలో చైనా కన్నా హాంకాంగ్‌ ఆర్థికస్థితి ఎంతో మెరుగ్గా ఉండేది. చైనా జిడిపి కన్న హాంకాంగ్‌ జిడిపి 18% ఎక్కువ. ఇరుదేశాల ఆర్థిక స్థితుల మధ్య ఎంతో తేడా ఉండేది. ఇది గమనించిన చైనా హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తితో ఉండడానికి సమ్మతించింది. కాని కొంతకాలంలోనే చైనాలోని షాంఘై, షెక్‌జన్‌ నగరాలు గొప్ప వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. నెమ్మదిగా చైనా ఆర్థికస్థితి హాంకాంగ్‌ ఆర్థికస్థితి కంటే మెరుగు పడసాగింది. ఇరుదేశాల తలసరి ఆదాయంలో కూడా వ్యత్యాసం తగ్గిపోయింది. క్రమేపి హాంకాంగ్‌ ఆర్థికస్థితి కన్న చైనా ఆర్థికస్థితి పుంజుకుంది. ఒకప్పుడు హాంకాంగ్‌ చైనా ఆర్థికస్థితిని ‘ఇంజన్‌’లా వ్యవహరించేది. ఇప్పుడు ఆ స్థితి లేదు.

2003లో హాంకాంగ్‌లోని చట్టాలలో కొన్ని మార్పులు చేయాలని చైనా ఒత్తిడి తీసుకు వచ్చింది. చైనా దుర్బుద్ధిని గ్రహించిన హాంకాంగ్‌ ప్రజలు సుమారు 50,000 మంది వరకు వీధులలోకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రజల నిరసనలను చూసి చైనా తన ప్రయత్నాన్ని విరమించుకుంది.

2012 సంవత్సరం నుండి చైనా అధ్యక్షుడు ‘జీ’ హాంకాంగ్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రజాస్వామ్య సంస్కరణలను వ్యతిరేకించిన ‘జీ’, ముందుగానే వడగట్టిన అభ్యర్థుల నుండి నేరుగా ‘ముఖ్య అధికారిని’ ఎన్నుకునే పద్ధతిని అమలు చేయాలని అనుకున్నారు. కాని హాంకాంగ్‌ ప్రజలు చైనా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 79 రోజులు విభిన్న రీతులలో తమ నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. దేశంలో స్వేచ్ఛాయుత వాతా వరణంలో ఎన్నికలు జరగాలని వారు డిమాండ్‌ చేసారు. కాని అధ్యక్షుడు ‘జీ’ ఒప్పుకోలేడు. అదే సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ హాంకాంగ్‌లో నేరుగా ఎన్నికైన విధాన సభ్యులను తొలగించింది. ప్రజాస్వామ్యవాదానికి అనుకూలంగా ఉండే నాయకులను జైలు పాలు చేసింది. ప్రజాస్వామ్య అనుకూలురను, ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయడం ప్రారంభించింది. హాంకాంగ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఎవరెవరు అడ్డు వస్తున్నారో అలాంటివారిని తప్పించడం మొదలైంది. 2015లో హాంకాంగ్‌లోని ఒక లక్షాధికారి, ఐదుగురు పుస్తక విక్రేతలు అదృశ్యమయ్యారు. హాంగ్‌కాంగ్‌ 20వ వార్షికోత్సవ సందర్భంగా అధ్యక్షుడు ‘జీ’ మాట్లాడుతూ ‘చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటిని అణచి వేయడంతోపాటు ఈ దేశంలో దేశభక్తి విద్యను పాఠశాలలో, కళాశాలలో ప్రవేశ పెట్టాలని చైనా నిర్ణయం తీసుకుంది’ అన్నాడు.

చైనాపై విశ్వాసం కోల్పోయిన హాంకాంగ్‌ ప్రజలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మొన్నటి రోజున జరిగిన 2 లక్షల ప్రజల నిరసన వారిలో పెరుగుతున్న నిరాశకు పరాకాష్ట. ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చైనా హాంకాంగ్‌ పట్ల నిర్దయగా, నిరంకుశంగా నడుచుకోవడంవల్ల హాంకాంగ్‌ ప్రజల స్వాతంత్య్రోద్యమం మొదలైంది.

ఇటు హాంకాంగ్‌తో చైనాకు విభేదాలు ముమ్మర మవుతున్న సమయంలోనే ప్రపంచ దేశాలకు, చైనాకు మధ్య కూడా గొడవలు కూడా ఎక్కు వయ్యాయి. ఫిలిప్పైన్స్‌ నౌకను చైనాయే ముంచి వేసిందనే ఆరోపణ ఉన్నది. 1.5 మిలియన్ల ఉయిగర్స్‌ను అక్రమంగా నిర్బంధించింది. చైనా ఇన్ని విధాలుగా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నప్పటికి దానిపై ఎలాంటి ఆంక్షలు విధించటం లేదు. చైనా బయట జరుగుతున్న ప్రజాస్వామ్య అనుకూల పోరాటాల గురించి చైనాలోని ప్రజలకు తెలియ కుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. చైనాకు, అమెరికాకు వాణిజ్య పోరాటం జరుగుతూనే ఉంది. హాంకాంగ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాన్ని ప్రపంచ దేశాలు గమ నిస్తున్నాయి. అయినా ఆయా దేశాల ఆర్థిక ప్రయోజ నాల దృష్ట్యా ఏదీ కూడా బహిరంగంగా ప్రకటనలు చేయడం లేదు. జి-20 సమావేశంలో ట్రంప్‌ ఈ విషయం ప్రస్తావించవచ్చు. ట్రంప్‌ ‘మేక్‌ అమెరికన్‌ గ్రేట్‌’ అని అన్నాడు. ఇది కేవలం ఆర్థికంగానే కాక స్వేచ్ఛా విలువలకు, ప్రజాస్వామ్య విలువల రక్షణ విషయంలో కూడా అమెరికా గొప్పదని పించుకోవాలి. ప్రజాస్వామ్య వాదులకు మద్దతు ఇవ్వాలి.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *