ఆ వ్యతిరేకత ఎవరిమీద?

ఆ వ్యతిరేకత ఎవరిమీద?

నడుస్తున్న చరిత్ర దేశానికీ, జాతికీ స్ఫూర్తిదాయకంగా, ప్రేరణగా ఉండాలి. అప్పుడే యావత్‌ జాతి ముఖ్యంగా యువత, విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాదులుగా ఉండగలరు. కానీ ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందడుగు అగ్రరాజ్యాలకు దీటుగా సాగుతున్న భారత్‌ ప్రస్తుతం కొన్ని అవాంఛనీయ పరిస్థితులలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఆ పరిస్థితులు చాలా కోణాల నుంచి ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులను విధ్వంసకర ఆలోచనల వైపు మళ్లించడం అందులో ప్రధానమైనది. ఈ వ్యతిరేకత ఎవరి మీద? ఎందుకు? ఇది నిజంగానే రాజకీయమా? భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాటమేనా? ఈ దేశాన్ని ద్వేషించి, ఇతరులు కూడా ద్వేషించేటట్టు చేయడానికి ఇలాంటి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడికి దారి తీస్తాయి? ఇటీవలి కొన్ని ఘట్టాలను చూద్దాం.

ఈ మధ్య కన్హయ్యకుమార్‌ తదితరుల మీద చార్జిషీట్‌ దాఖలైంది. యథాప్రకారం మళ్లీ రగడ రేగింది. విద్యాబుద్ధులకు ఆలవాలంగా ఉండవలసిన విద్యాలయాలను విషవలయాలుగా మారుస్తుంటే సమాజం మౌనంగా ఉండిపోవడం మరొక విషాదం. కన్హయ్యకుమార్‌ బృందం ఆ దుశ్చర్యకు పాల్పడిన సమయం ఎలాంటిది? ఆ రోజు దేశప్రజల మానసిక స్థితి ఏమిటి? అసలు అందుకే ఆ మూకలు ఆ రోజును ఎంచుకున్నాయా?

9, ఫిబ్రవరి 2016 సాయంత్రం 6 గంటలు. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌ లో ఓ వ్యక్తి వెంటిలేటర్‌ మీద ఉండి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. దేశ ప్రజలందరూ ఆయన ప్రాణం కోసం ప్రార్థనలు చేశారు. అవి సర్వమత ప్రార్థనలు. చివరకు ఆయన మృత్యువు చేతిలో ఓడిపోయారు. నిజానికి విధి నిర్వహణలో మాత్రం విజయం సాధించారు. అందుకే అది వీరమరణమనాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌ ప్రాంతంలో దేశ రక్షణ కోసం పహారా కాస్తూ 25 అడుగుల లోతున కూరుకుపోయారు. ఆయనే హనుమంతప్ప. ఆయన మరణం దేశ ప్రజలందరినీ కలచివేసింది. ఈ దేశక్షేమం కోరేవారందరి చేత కంటతడి పెట్టించింది. ఆ అమర జవాను అంతిమ యాత్ర కోసం అసంఖ్యాకంగా ప్రజలు బారులుతీరి భావోద్వేగాలతో నివాళులు అర్పించారు.

హనుమంతప్ప అంతిమ యాత్ర

అదే సమయంలో 9వ తేదీ సాయంత్రం ఢిల్లీ నగరంలో ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కొంతమంది విద్యార్థులు పార్లమెంట్‌ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన ఆఫ్జల్‌ గురును వీరుడిగా కీర్తిస్తూ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అఫ్జల్‌ గురు, కసబ్‌ వంటివారిని ఆరాధించవలసిన అవసరం ఏమిటి? వారిది ఉగ్రవాదం కాదని ఎవరైనా అనగలరా? అప్పట్లో ఆ విద్యార్థుల చర్య ఉద్రిక్తతలకు దారితీసి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. జాతీయతా భావాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ముసుగులో తిష్టవేసిన వ్యక్తుల నిర్వాకాలే అవన్నీ. వీటికి పాల్పడిన వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థి నేతలపై మూడేళ్ల తర్వాత ఢిల్లీ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. కన్హయ్యకుమార్‌, ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్యతో పాటు మరో ఏడుగురి మీద దేశద్రోహం సహా పలు ఆరోపణ లతో హైకోర్టులో 1200 పేజీల చార్జీషీట్‌ (అభియోగ పత్రం) దాఖలు చేశారు.

పార్లమెంట్‌పై దాడి సూత్రధారి అఫ్జల్‌ గురు వర్ధంతిని జే.ఎన్‌.యూ క్యాంపస్‌లో కన్హయ్య కుమార్‌ ఆధ్వర్యంలో కొందరు విద్యార్థులు ఆ రోజు నిర్వహించారు. దీనికి సంబం ధించిన వీడియో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది ఫిబ్రవరి 11న బీజేపీ ఎంపీ మహేష్‌ గిరి, ఏబీవీపీ నేతల ఫిర్యాదులను స్వీకరించిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఫిబ్రవరి 12న అరెస్టు చేసిన పోలీసులు వారిని ఫిబ్రవరి 15 న పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఫిబ్రవరి 25న కన్హయ్య కుమార్‌ మృందాన్ని జైలుకు తరలించగా మార్చి 3న ఆయనకు ఆరు నెలల బెయిల్‌ లభించింది ఆ తర్వాత గత ఏడాది ఆగస్టు 26న కుమార్‌ తో పాటు సాధారణ బెయిల్‌ మంజూరయింది. క్యాంపస్‌ వీడియో, సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం పది మందిపై కేసులు నమోదు చేశారు అలాగే ఈ కేసులో మరో 36 మందిని విచారించారు. ఈ చార్జిషీట్‌ దాఖలు చేశారు. వీరిలో సిపిఐ నేత డి.రాజా కూతురు అపరాజిత, షెహ్ల రషీద్‌, బానోజ్యోత్న లాహిరి, రమానాగాలపై పలు ఆధారాలతో పత్రాలను వీడియో పుటేజ్‌ కూడా పోలీసులు అభియోగపత్రం తో పాటు కోర్టుకు సమర్పించారు.

కన్హయ్య కుమార్‌ నేతృత్వంలో ఆనాడు విద్యార్థులు చేసిన నినాదాలు ఎలాంటివి? వారు నిర్వహించిన ఉగ్రవాద అనుకూల సభలో భద్రతా దళాలకు, పోలీసులకు, దేశానికి, జాతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదులకు, కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తికి, పాకిస్థాన్‌కు అనుకూలంగా చేసిన నినాదాలు టీవీ న్యూస్‌ చానెళ్లలో, సామాజిక మాధ్యమాలలో దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షించారు. ఆ వ్యతిరేక నినాదాలు చేయడంలో కన్హయ్య కుమార్‌ బృందం విద్యార్థులను రెచ్చగొట్టారని పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు.

ఈ సమయంలోనే ప్రజల దృష్టి మళ్లించేందుకు చార్జిషీట్‌ను కూడా కుట్రగా చిత్రిస్తూ కోర్టు బయట కూడా రాజకీయంగా పోరాడతామని కన్హయ్య, సిపిఐ నేత డి.రాజా ప్రకటించారు. ఆ ఇద్దరు కూడా సీపీఐకి చెందినవారే. అంటే వారి కలుషిత భావాలను విశ్వ విద్యాలయాలకే పరిమితం చేయకుండా ప్రధాన నగరాలలో, రాష్ట్రాల్లో కూడా వెదజల్లుతారన్నమాట. భారతదేశంలో రిక్షా కార్మికుడు కట్టిన పన్నుతో పొలం దున్నే రైతు కట్టిన పన్నుతో, రాళ్లు కొట్టి జీవించే రోజువారి కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలు రెక్కాడితే డొక్కాడని సామాన్య జీవులు చెమటోడ్చి పన్నులుగా చెల్లిస్తున్న సొమ్ముతో విశ్వవిద్యాలయాల్లో చదువు పేరిట, పరిశోధనల పేరిట తిష్ట వేసిన కన్హయ్య, ఉమర్‌ లాంటి వేలాది మంది భావస్వేచ్ఛ ముసుగులో అవాంఛనీయ పోకడలను ప్రోత్సహిస్తు న్నారు. ఉద్యమకారులుగా చెలామణీ అవుతున్నారు.

విశ్వవిద్యాలయాల్లోని వామపక్ష భావజాల విద్యార్థి సంఘాల నాయకులు ప్రదర్శిస్తు ఈ తీరుకే వారు అసహనం మీద పోరాటంగా చిత్రిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు, ముఖ్యంగా అవార్డ్‌ వాపసీ మేధావులకు, లెఫ్ట్‌ లిబరల్‌ నాయకులు, ఇతర స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది వామపక్షాల ప్రొఫెసర్లకు కూడా అదే మాట పట్టుకుని వేలాడారు. ఈ దేశంలో అసహనం పెరిగింది. అది కూడా ఒక్క హిందూత్వ అసహనమే. వీరికి జిహాదీ శక్తులు, మిషనరీ సంస్థల మద్దతు, సహాయ సహకారాలు దండిగా అందుతున్నాయి. దేశం పట్ల, జాతి పట్ల ద్వేషంతో, విదేశీశక్తుల ప్రమేయంతో కొంతమంది ఉద్దే శపూర్వకంగానే విశ్వవిద్యాల యాలను ఇలాంటి దుస్థితిలోని నెట్టివేస్తున్నారు. రాజకీయ శిక్షణ కేంద్రాలుగా మలుస్తున్నారు. ఉన్నత విద్య పేరుతో విద్యార్థి నాయకులుగా చలామణి అవుతూ విశ్వవిద్యాలయాల్లో ఉగ్రవాదుల జయంతులు వర్ధంతులు నిర్వహించడం, పాకిస్థాన్‌కు వంతపాడడం దేశద్రోహంగానే పరిగణించాలి. వారికి విచారించి కఠిన శిక్షలు వేయాల్సిందే.

ఇంకొన్ని నిర్వాకాలు చూద్దాం! హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో యాకుబ్‌ మెమెన్‌కు మద్దతుగా, ఢిల్లీ యూనివర్సిటీలో అఫ్జల్‌ గురు వర్ధంతి నిర్వహించడం, అలీఘడ్‌ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ యూనివర్సిటీలో ఎన్‌కౌంటర్లో మరణించిన అబ్దుల్‌ వాని వర్ధంతి నిర్వహిస్తూ కాశ్మీర్‌కు ఆజాది కావాలని కేకలు వేయడం, వేర్పాటువాదులను సమర్థించడంలో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? పెద్ద ప్రయత్నం లేకుండానే అలాంటి విద్యార్థుల లక్ష్యమేమిటో స్పష్టంగానే అర్థమవుతుంది. సంస్కృతిని మంట కలిపే విధంగా విశ్వవిద్యాలయాల్లో, నడివీధుల్లో కిస్‌ ఆఫ్‌ లవ్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకు? దీనికి స్వయం ప్రకటిత సెక్యులర్‌ శక్తులు మద్దతు ఉంటోంది. ఇలాంటి వికృత చేష్టల లక్ష్యం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పెద్దకూర(బీఫ్‌ ఫెస్ఠివెల్‌) పండుగ ఒక సాకు. ఆ పేరుతో విరసం వరవరరావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, కంచె అయిలయ్య లాంటి వారంతా కలుసుకోవడం ప్రశ్నార్థకమే. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో తమ ఆలోచనలే ఈ దేశ ప్రజల అందరి ఆలోచనలు అన్నట్టు టీవీ చానళ్లలో జరుగుతున్న బాకా మరొకటి. ఇలాంటి ధోరణి పట్ల, మనోభావాలు దెబ్బ తిన్న ప్రతి సగటు భారతీయుడు ఆవేదన చెందుతున్నాడు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రజాస్వామిక వామపక్ష పార్టీలు, ఆజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీలు, అర్బన్‌ నక్సల్స్‌, కుహనా లౌకికవాదులు అందరూ కలిసి ఈ దేశ ప్రయోజ నాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. చీలికలు తేవడానికి యత్నిస్తున్నారు. ఇదొక అంతర్జాతీయ కుట్రలో భాగం. భారతీయ సాంస్కృతిక, సామాజిక జాతీయవాద మూలాలపై ఈ శక్తులు దాడి చేస్తున్న తీరులోనే ఆ కుట్ర ప్రతిబింబిస్తున్నది.

కన్హయ్యకుమార్‌

విశ్వవిద్యాలయాల కేంద్రంగా దేశాన్ని అస్థిర పరిచే కార్యక్రమాలు ఉధృతం చేస్తూ దేశ ప్రజల మధ్య విభేదాలు, విభజన రేఖలు సృష్టించేపనిని వేగవంతం చేయడం ద్వారా కన్హయ్య కుమార్‌, జిగ్నేష్‌ మెవాని, ఉమర్‌ ఖలీద్‌ వంటి వ్యక్తులు ఉన్న బృందాలు బీజేపీని అడ్డు పెట్టుకుని తమ ప్రయత్నా లను తీవ్రం చేస్తున్నాయి. జాతీయ జెండా మీద, వందేమాతరం మీద వివాదాలు లేపేవారు, హిందుత్వ మీద విషం చల్లే వారు అంతా విశ్వవిద్యాలయాలలోనే తయారవుతున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోగలం? అంతేకాదు కొరెగావ్‌ గర్జనల వెనుక ఉన్న ఆశయం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ జాతి వ్యతిరేక చర్యలు మితిమీరాయి. ఆఖరికి అంబేద్కర్‌ పేరుతో విద్యార్థి సంఘాలు పెట్టి ఆయన కీర్తిని ప్రతిష్టను కూడా బజారుకు ఈడుస్తున్నారు. వేముల రోహిత్‌ ఆత్మహత్య ఘటనను వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేశారు. పార్లమెంటులో కూడా అర్థసత్యాలే చెప్పారు. తరువాత అసలు రోహిత్‌ ఏ వర్గమో బయటపడిన సంగతి తెలిసినదే.

ప్రధాన నగరాల్లో ఉన్న యూనివర్సిటీల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల విశ్వవిద్యాలయాలు ఉన్న కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీలో ఈ రకమైన సంఘటనలు జరగడం గమనించాలి. కరీంనగర్‌ లో తెలంగాణ విద్యావంతుల వేదికకు అనుబంధంగా ఉన్న తెలంగాణ విద్యార్థి వేదిక, బహుజన విద్యార్థి సంఘం పేరుతో భరతమాత చిత్రపటాన్ని దగ్ధం చేశారు. అంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఎంత శ్రుతి మించుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కళాశాలలు విద్యాలయాల కేంద్రంగా జరుగుతున్న ఈ చర్యలకు బీమా కోరేగావ్‌ సంఘటనకు సంబంధం ఉండి మహారాష్ట్రలో అరెస్టులు జరగడం ఆందోళన కలిగించే విషయం. విశ్వవిద్యాలయాల కేంద్రంగా సాగుతున్న ఈ దుశ్చర్యలన్నింటికీ భవిష్యత్తులో ఎలాంటి పర్యవస నాలు ఉంటాయో ఊహించుకుంటే భయానక దృశ్యం కళ్లెదుట ప్రత్యక్షమవుతుంది. అంబేద్కర్‌ పేరుతో ఫోటోలతో బ్యానర్లతో వేదికలు పంచుకుంటున్న ఈ కుహనా మేధావి బృందం ఆయన ఆశయాలకు ఆకాంక్షలకు ఆశలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తూ వికృత పోకడలతో దేశాన్ని అస్థిరపరిచే చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఈ తుక్డే గ్యాంగ్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలతో సాధారణ విద్యార్థులు భ్రమల్లో పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటూ వారి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. మరికొందరు కడుపుకోత మిగులుస్తున్నారు. ఉపాధి విద్యావకాశాల్లో రాణించి తమ భవిష్యత్తును తీర్చుకోదిద్దుకోవాల్సిన విద్యార్థులు వారిని సంస్కరించి మెరుగైన బాటలు వేయాల్సిన ఆచార్యులు అధ్యాపకులు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ విశ్వవిద్యాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోధన పరిశోధనా విభాగాల్లో జ్ఞానాన్ని అందించాల్సిన విశ్వవిద్యాలయాల తీరుపై ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదే. మహా పురుషులు అయినా రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ వారసులుగా ప్రజాస్వామిక వాదులుగా విశ్వవిద్యాలయాలను దేశహిత కార్యక్రమాల వైపు మళ్లించాల్సిన బాధ్యత ముఖ్యంగా జాతీయవాద శక్తులపై ప్రధానంగా ఉందన్నది వాస్తవం.

– కొట్టె మురళీకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *