స్వేచ్ఛ కావాలి, బాధ్యత ఉండాలి

స్వేచ్ఛ కావాలి, బాధ్యత ఉండాలి

మే 3 అంతర్జాతీయ పత్రికా దినోత్సవం

నేటి ప్రపంచంలో ఆధునికతకు కొలబద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇక, ఆధునిక ప్రపంచాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపించిన ఘనత వార్తా పత్రికలకే దక్కుతుంది. ప్రపంచంలో వచ్చిన ఏ ఉద్యమమైనా వార్తాపత్రికల చేయూత లేకుండా, ప్రమేయం లేకుండా జరగలేదన్నది సత్యం. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలోను పత్రికల పాత్ర విస్మరించలేనిది. ఆ విధంగా ప్రజాస్వామ్యానికి పత్రికా ప్రపంచం, పత్రికా ప్రపంచానికి ప్రజాస్వామ్యం పరస్పరం రక్షణ కవచాలుగా నిలబడిన సంగతి చరిత్ర వెల్లడిస్తున్నది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలలో పత్రికల స్థానం వేరు. ప్రజాస్వామ్యం లేని వ్యవస్థలలో వాటి స్వరూప స్వభావాలు వేరు. అందుకే ప్రజాస్వామిక వ్యవస్థలలో పత్రికా స్వేచ్ఛ గురించిన చింతన నిరంతరం చర్చకు వస్తూ ఉంటుంది.

పత్రికా వ్యవస్థకు స్వేచ్ఛ ఉండాలన్న నినాదం వెనుక గొప్ప చరిత్ర ఉంది. పత్రికా రంగానికి నేడు దక్కుతున్న గౌరవం, నాలుగో స్తంభంగా అందుతున్న మన్నన ఆ రంగం సాగించిన సుదీర్ఘ ప్రస్థానం నుంచి వచ్చినదే తప్ప, ఎవరో ఇచ్చినది కాదు. ఎవరి ధర్మమూ కాదు. అంటే పత్రికా రంగ చరిత్రే దానికి ఆ స్థానం కట్టబెట్టింది. ప్రజాస్వామ్యం సాధారణ ప్రజల విజయం అనుకుంటే, ఆ సాధారణ ప్రజలకు గొంతునిచ్చేదే వార్తాపత్రిక. ప్రజాస్వామ్యం నిలిచి ఉండాలంటే, మరొక మాటలో చెప్పాలంటే ఒక దేశ అభ్యున్నతిలో సామాన్యుడికి కూడా భాగస్వామ్యం దక్కాలంటే పత్రికల మనుగడ అనివార్యం. వాటి మనుగడ అంటే వాటి స్వేచ్ఛ. ఇంతటి ప్రాధాన్యం ఉన్నది కనుకనే ఐక్య రాజ్యసమితి ఏటా మే నెల 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం నిర్వహిస్తున్నది. దీనినే క్లుప్తంగా ప్రపంచ పత్రికా దినోత్సవం అని కూడా అంటున్నారు.

మారిన ప్రపంచ పరిణామాలు పత్రికల మీద, ప్రజాస్వామ్యం మీద కూడా తనవైన ప్రభావం చూపించాయి. ప్రపంచీకరణ భావన బలపడిన తరువాత పత్రికల ప్రస్థానం కూడా కొత్త పంథాకు మళ్లింది. కాబట్టే పత్రికా స్వేచ్ఛ అనే అంశంలో మౌలిక చింతనను కాపాడుకుంటూనే కొన్ని వాస్తవాలను గుర్తు చేయడం పత్రికా దినోత్సవం ఉద్దేశంగా కనిపిస్తుంది. పత్రికా వ్యవస్థ పట్ల ప్రభుత్వాలు చూపవలసిన సరళ వైఖరి గురించి చెప్పడం కూడా ఇందులో ఒకటి. 1948 నాటి ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలోని ఆర్టికల్‌ 19 మేరకు ఐక్య రాజ్య సమితి ఈ అంశాలను ఏటా ప్రపంచం దృష్టికి తీసుకు రావడమే ఉద్దేశంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా యునెస్కో/గుయిలెర్మో కెనో పురస్కారం కూడా ప్రకటిస్తారు. మే రెండో తేదీన యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆండ్రీ అజులే ఈ పురస్కారం అందిస్తారు. ఒక వ్యక్తి, లేదా సంస్థ ద్వారా పత్రికా రంగానికి జరిగిన మేలును అంచనా వేసి ఈ పురస్కారానికి ఎంపిక చేస్తున్నారు. ఇది కూడా మత్తుమందు మాఫీయా నాయకులను లెక్క చేయకుండా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఒక పత్రికా రచయిత పేరు మీదనే ఇస్తున్నారు. ఆయనే గుయిలెర్మో. గడచిన సంవత్సరం ఈ పురస్కారం రష్యాకు చెందిన పరిశోధనాత్మక పత్రికా రచయితకు మరణానంతర పురస్కారంగా ఇచ్చారు. ఆయన కూడా విది నిర్వహణలోనే చనిపోయారు.

పత్రికా దినోత్సవం లక్ష్యం

ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పత్రిక అవసరం గురించి లోకానికి పదే పదే గుర్తు చేయడమే ప్రపంచ పత్రికా దినోత్సవం లక్ష్యం. ఇలాంటి దినోత్సవం నిర్వహించాలని 1993లో ఐక్య రాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ నిర్ణయించింది. 1991లో ఆఫ్రికాకు చెందిన పత్రికా రచయిత విండ్‌హోక్‌ చేసిన ప్రకటన ఆ నిర్ణయం వెనుక ఉంది. ఆఫ్రికాలో పత్రికా స్వేచ్ఛను ఆకాంక్షిస్తూ విండ్‌హూక్‌ ఒక ప్రకటన చేశారు. ఆఫ్రికా పత్రికా రంగం అనే అంశం మీద 1993లోనే ఐక్య రాజ్యసమితి నమీబియాలో ఒక సదస్సును నిర్వహించింది. విండ్‌హూక్‌ ప్రకటన ఆఫ్రికా పత్రికా రంగంలో స్వేచ్ఛ గురించి, ఆ రంగంలో బహుళ సంస్కృతి రక్షణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆర్థికాభివృద్ధికి పత్రికా రంగం ద్వారా జరిగే సేవ, ఆర్థికాభివృద్ధికీ, ప్రజాస్వామ్యానికీ నడుమ ఉన్న బంధం గురించి కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు. నాటి నుంచి ఈ దినోత్సవం ఏటా జరుగుతోంది.

నిజానికి పత్రికా స్వేచ్ఛకు ఎదురయ్యే సవాళ్లు ఎక్కడైనా దాదాపు ఒకే తీరులో ఉంటాయి. దీని ఫలితం అంతిమంగా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లడమే అవుతుంది. కొన్ని చోట్ల పాలకులు, ఇంకొన్ని చోట్ల ఉగ్రవాదుల కారణంగా పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతూనే ఉంది. పత్రికలు మూత పడుతున్నాయి. పత్రికా రచయితల మీద దాడులు జరుగుతున్నాయి. కొందరు పత్రికా రచయితలు తమ విధి నిర్వహణలో కన్ను మూస్తు న్నారు. ఇలాంటి వారిని కూడా ఈ దినోత్సవంలో స్మరించుకుంటారు.

ప్రతి ఏటా ఒక్కొక్క దేశాన్ని వేదిక చేసుకున్నట్టే, ఈసారి ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని ఇథియోపియా రాజధాని అడిస్‌అబాబాలో నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగు తుంది. ప్రస్తుత పత్రికా రంగ ధోరణులు, ఎదురవు తున్న బెడదలు, ఎదుర్కొంటున్న బెదిరింపులను గురించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గోష్టులలో, చర్చలలో ప్రపంచ ప్రఖ్యాత పత్రికా రచయితలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఏటా ఒక అంశాన్ని కూడా చర్చకు ఇస్తారు. ఈ సంవత్సరం ఇచ్చిన అంశం-ఎన్నికలు, ప్రజాస్వామ్యాలలో పత్రికల పాత్ర. అడిస్‌అబాబా వేదికతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలలో ఈ ఉత్సవాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అంత ఆశా జనకంగా లేదని ఆర్‌డబ్ల్యుబి నివేదిక పేర్కొనడం విశేషం. ఇది 2013 నాటి పరిస్థితి. 179 దేశాలలో పత్రికా స్వేచ్ఛ గురించి సర్వే చేస్తే అందులో భారత్‌ ఆనాడు 136వ స్థానం దగ్గర నిలబడి ఉంది. నిజానికి భారత రాజ్యాంగం హక్కుల ప్రస్తావనలో ఎక్కడా ‘ప్రెస్‌’ అన్న పదాన్ని ప్రయోగించలేదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మాత్రమే మన రాజ్యాంగం ఇస్తున్నది. దేశభద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతలను బట్టి కొన్ని ఆంక్షలు భారతదేశ పత్రికల మీద ఉంటాయి.

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ

మూడో ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశం భారత్‌. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పత్రికా స్వేచ్ఛకు రక్షణ ఉండవలసిందేే. భారత పత్రికా రంగ చరిత్రను మూడు భాగాలుగా విభజిస్తారు. 1947 వరకు ప్రథమ దశ. 1948 నుంచి, 1975 వరకు రెండో దశ. తరువాతి కాలం మూడో దశ. 1947 వరకు భారతీయ పత్రికా రంగం ధ్యేయం దేశానికి స్వాతంత్య్రం తేవాలన్న ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవడమే. తరువాతి దశలో స్వాతంత్రోద్యమ ప్రభావంతో కొన్ని విలువలు పరిఢవిల్లాయని అంతా అంగీకరిస్తారు. ఇక 1975 తరువాతి మూడో దశ మీద తీవ్ర విమర్శలే ఉన్నాయి. రెండో దశ ఒక ‘మిషన్‌’గా కూడా వర్ణిస్తారు. 1975 తరువాత ఇదొక ‘ప్రొఫెషన్‌’. వినేందుకు చేదుగా ఉన్నా ఇది వాస్తవమే.

దేశంలో ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే. ఆ కాలంలో తనకు వ్యతిరేకంగా ఉన్న పత్రికలను, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే సంస్థల, రాజకీయ పక్షాల పత్రికలను ఇందిరాగాంధీ ప్రభుత్వం మూసివేయించే దాకా నిద్రపోలేదు. పత్రికా రంగానికి అదొక చీకటియుగం. 1977 జనవరిలో సెన్సార్‌షిప్‌ తొలగించి, ఎన్నికలు ప్రకటించింది ప్రభుత్వం. దేశంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడింది. అదే జనతా పార్టీ ప్రభుత్వం. కానీ పత్రికల ధోరణిలో పెను మార్పులు వచ్చాయి. అందులో అవాంఛనీయమైనవే ఎక్కువ. పక్షపాత ధోరణి సుస్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక జాతీయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీ మీద బురద జల్లడమే ధ్యేయంగా పత్రికా రచయితలు పనిచేశారు. ఇప్పుడు అదే కొనసాగుతోంది. మొదట అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకున్నాయి చాలా పత్రికలు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ గురించిన అంశం కాబట్టి మీడియా మొత్తాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. ఎలక్ట్రానిక్‌ మీడియా మరింత బీజేపీ పట్ల మరింత వ్యతిరేకతతో వ్యవహరించడం ఒక వాస్తవం.

నరేంద్ర మోదీ అత్యవసర పరిస్థితిని విధిస్తారని టీవీ చర్చలలో అనేక మంది స్వయం ప్రకటిత మేధావులు అనేక పర్యాయాలు హెచ్చరించారు. కానీ ఏదీ అత్యవసర పరిస్థితి? ఐదేళ్లు గడచి పోయాయి. అలాగే దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఏదీ అంటూ ఇంకొందరు మేధావులు పదే పదే ఆక్రోశించారు. మోదీని అప్రజాస్వామికంగా దూషించారు. కానీ ఏ ఒక్కరైనా మోదీ మీద వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యారా? బీజేపీ ఉత్తరాది పార్టీ అంటూ దక్షిణాది భారతీయులకు కొందరు కాలమిస్టులు ఈ మధ్య ‘గుర్తు’ చేస్తున్నారు. ఏడు పదుల స్వాతంత్య్రం తరువాత ఇలాంటి కాలమిస్టు లకు ‘రెండు’ భారతాలు కనిపిస్తున్నాయట. కొన్ని దశాబ్దాలుగానే దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు తమ ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి. ఇందిర, రాజీవ్‌ పాలించినప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలలో ద్రవిడ పార్టీలు, జనతా పార్టీ, జనతాదళ్‌ (ఎస్‌), తెలుగుదేశం వంటి పార్టీలు, వామపక్షాల కూటమి పాలించలేదా? మరి మోదీ అధికారంలో ఉన్నప్పుడే వీరికి రెండు భారతాలు ఎందుకు కనిపిస్తున్నాయి?

మోదీని అధికారం నుంచి దించలేని పార్టీలతో కలసి ఇలాంటి ఎత్తుగడలు పన్నుతున్నట్టు కాదా? భారత దేశంలో పత్రికలు రాజకీయ పార్టీల పోకడలనే అనుసరిస్తున్నాయి. ఇవి కూడా మైనారిటీలను బుజ్జగిస్తాయి. ఇది నిజం కాకపోతే హిందువుల హక్కులకు ప్రాముఖ్యం లేకుండాను, మైనారిటీలకే హక్కులు ఉన్నట్టు ఎందుకు ప్రసారాలు, ప్రచురణలు చేస్తున్నాయి? భారతీయ పత్రికా ప్రపంచం, దీనిని ఇప్పటికీ ఏలుతున్న వామపక్ష భావజాలం కలిగిన పత్రికా రచయితలు తమ ధోరణుల గురించి ఆత్మ పరిశీలను చేసుకోవలసిన స్థితి ఉన్నమాట నిజం. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ గురించి గగ్గోలు పెట్టే వామ పక్షవాదులు ఆ సిద్ధాంతంతో నడిచిన ప్రభుత్వాలు చేసిన నిర్వాకాలు గుర్తు చేసుకోవాలి. రాజకీయాలు లేకుండా మీడియా సాగదు. కానీ అవి తప్ప ఇంకేమీ సమస్యలు ఉండవా? రైతులను పట్టించుకున్న పత్రికలు, చానళ్లు ఎన్ని ఉన్నాయి? నేత కార్మికుల ఆత్మహత్యలను వెలుగులోకి తెచ్చిన పత్రికలు ఏవీ? పాక్‌ ఉగ్రవాది కసబ్‌ను పొగిడే విద్యార్థులను హీరోలను చేయాలన్న తపన తప్ప, సాధారణ విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏనాడైనా మీడియా చర్చించిందా? అయినా ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ నిలబడి ఉండాలనే సమాజం కోరుకుంటోంది. ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా మన మీడియా ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *