కొత్త సభాపర్వం

కొత్త సభాపర్వం

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తరువాత శాసనసభకు రెండవసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన రాజకీయ పక్షాల మాట ఎలా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితికి (తెరాస) ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కిందే లెక్క. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస గెలుపొందడం ఒక ‘ఉద్యమ ఆకాంక్ష’ నెరవేరిన నేపథ్యంలో జరిగింది. అప్పుడు జనంలో ఉన్న ఉద్వేగం వేరు. వారి ఊహలు వేరు. పాలన నుంచి ఆశించినది వేరు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఉద్యమ ఆకాంక్షలు అందలం ఎక్కాయా? అడుగంటాయా? ప్రజలు ఆశించినదేమిటి? జరిగినదేమిటి? ఇందులో ప్రభుత్వ విజయమెంత? వైఫల్యం ఎంత? ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? అంచనా వేస్తున్నారు? విజయం సాధించినదిగా గౌరవిస్తున్నారా? విఫలమైనట్టు నిర్ధారించుకుంటున్నారా? ఈ రెండూ కాక, పరవాలేదనుకున్నట్టు ఉందా? తెరాస మీద ఇవాళ ప్రజల దృక్కోణం ఏమిటి? ఎందుకంటే ఉద్యమం నడపడం వేరు. ప్రభుత్వాన్ని నడపడం వేరు. ఇవన్నీ లెక్కకు వస్తాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల ఫలితాలు వాటినే ప్రతిఫలిస్తాయంటే అసంగతం కానేరదు. ఈ ఎన్నికలు తమ పార్టీ మీద, ప్రభుత్వం మీద రిఫరెండం అని తెరాస నాయకుడు, మంత్రి కె. తారకరామారావు చెప్పడం ఇందుకే కాబోలు. నిజమే, ఆ ఫలితాలు ఏమైనా కూడా దాని ఫలశ్రుతి తెరాసకే చెందుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కృషిలో ఉద్యమ సంస్థగా అగ్రభాగాన ఉండి, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అధికార పక్షంగా రూపుమార్చుకుని తొలిసారి అధికారం చేపట్టిన పార్టీ అదే.

సెప్టెంబర్‌ 6న తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిఫారసు చేశారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్‌, ఆపై రాజకీయ వేడి వరసగా వచ్చేశాయి. అసెంబ్లీ రద్దు గురించి, ఎన్నికల జాబితా గురించి మధ్యలో న్యాయస్థానాలలో వాదోపవాదాలు జరిగినా ఇప్పుడు అన్ని ఆటంకాలు తొలగిపోయినట్టే. ఇక డిసెంబర్‌ 7న పోలింగ్‌కు వెళ్లడమే. నిజం చెప్పాలంటే తెరాస అసలు బలం ఏమిటో ఈ ఎన్నికలు చెబుతాయి.

2014 నాటి ఎన్నికలలో ఉన్న సమీకరణలు, సమర నాదాలు ఇప్పుడు కూడా ఉంటాయని ఎవరూ అనలేరు. అయితే ఈ శాసనసభ తాజా ఎన్నికల సమీకరణలు కొత్తగానే అనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. రద్దయిన సభలో తెరాస బలం 63. కాంగ్రెస్‌ బలం 21. తెలుగుదేశం బలం 15. కానీ తెలుగుదేశం నుంచి 12 మంది, కాంగ్రెస్‌ నుంచి 8 మంది తెరాసలోకి వలసపోయారు. లేదా వలస వచ్చేటట్టు చేసుకున్నారు. ఇండిపెండెట్లు ఇంకా ఇతరులు కూడా ఇలా తెరాసలోకి తరలిపోయారు. దీనితో రద్దయిన సభలో తెరాస బలం 90కి చేరుకుంది. ఇంకా ఎంఐఎం 7, బీజేపీ 5, సీపీఎం 1 స్థానాలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌, సీపీఐ కలసి పోటీ చేశాయి. తెలుగుదేశం, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.

ఈ ఎన్నికలలో కూడా తెలంగాణలో బహుముఖ పోటీయే జరగబోతోంది. తెరాస స్వతంత్రంగా మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నది. తరువాత కాంగ్రెస్‌ కూటమి రావచ్చు. దీనినే మహా కూటమి అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ కూటమిలో తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఉన్నాయి. బీజేపీ ఒంటరిగానే పోటీలో దిగుతున్నది. ఎంఐఎం కూడా అంతే. మరొకటి- బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌. సీపీఎం నాయకత్వంలోని ఈ కూటమి 28 పార్టీలు, సంస్థల వేదిక. సీపీఎం, ఎంసీపీఐ (యు), మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌, లోక్‌సత్తా, రాజ్యాధికార పార్టీ మొదలైనవన్నీ ఈ కూటమిగా ఏర్పడ్డాయి. వామపక్షాలు, అంబేడ్కర్‌ వాదులు ప్రధానంగా ఇందులో ఉన్నారు. మరోవైపు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ నాయకత్వంలోని ఎల్‌జేపీ (లోక జన శక్తి పార్టీ) కూడా ఈ ఎన్నికల్లో 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చెబుతున్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌ రాహుల్‌ గాంధీని కలుసుకోవడం వంటి విశేష పరిణామంతో పాటు, కాంగ్రెస్‌ ప్రముఖుడు దామోదర్‌ రాజనరసింహ సతీమణి పద్మనీరెడ్డి ఉదయం బీజేపీలో చేరి, సాయంత్రానికి మళ్లీ సొంత గూటికి చేరుకోవడం వంటి వింత కూడా ఈ ఎన్నికల నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు దర్శించారు.

ఈ సంవత్సరం మార్చి నెల నుంచే తెలుగుదేశం పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంటూ వచ్చింది. మార్చి 8వ తేదీన ఎన్డీయే ప్రభుత్వం నుంచి తన ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బీజేపీ మంత్రులు వైదొలిగారు. మార్చి 17న కూటమి నుంచి వైదొలగి అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది. తరువాత దృశ్యం అందరికీ తెలిసినదే. అప్పటి నుంచి జరిగిన పరిణామాలు వింతగానే అనిపిస్తాయి. ఈ ఆగస్టు 23న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఒక ప్రకటన ఇచ్చారు. విలేకరులతో ముచ్చటిస్తూ ఆయన ఆ మాట చెప్పారు. అయితే ఆ మాటను విశ్వసించడానికి చాలామందికి మనసు అంగీకరించలేదు. అసలు ఆ ప్రతిపాదనే మింగుడు పడలేదు. తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అది నిజమైపోయింది. ‘మారిన పరిస్థితులలో టీడీపీతో ఎన్నికల అవగాహనకు రావడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి ఇబ్బందీ లేదు.’ అని విక్రమార్క చెప్పారు. ఆయన ఇంకా, ‘తెలంగాణ ఏర్పడినాక ఇక టీడీపీ కాంగ్రెస్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాదు. అది ఆంధ్రలో మాత్రం బలమైన పార్టీ’ అని కూడా అన్నారు. కాబట్టి ఎన్డీయే నుంచి విడవడిన తరువాత నుంచే టీడీపీ తన పాత వ్రతాన్ని కూడా త్యాగం చేసినట్టు అర్థమవుతుంది. 1982లో కేవలం కాంగ్రెస్‌ వ్యతిరేకతతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఇలాంటి అక్రమ పొత్తులకు వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం బరి తెగిచింది. కాంగ్రెస్‌కు సంబంధించి పొత్తుల విషయంలో పెద్ద పట్టింపులు ఎప్పుడూ లేవు. ఆ పార్టీకి గెలుపు ప్రధానం. తరువాత భస్మాసుర పాత్ర పోషిస్తూ తన వెంట వచ్చిన లేదా తనతో పొత్తు పెట్టుకున్న పార్టీని నామరూపాలు లేకుండా చేస్తూ ఉంటుంది. మహా కూటమిలో కూడా ఇతర పార్టీలకు ముప్పయ్‌ లేదా ఇరవై సీట్లకు మించి ఇవ్వరాదన్నదే కాంగ్రెస్‌ అభిప్రాయంగా కనిపిస్తున్నది. ఆచార్య కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జన సమితి ముప్పయ్‌ స్థానాలు కోరుతోంది. తెలుగుదేశం కూడా దాదాపు అన్నే కోరుకుంటున్నది. ఇంకా సీపీఐ ఉంది. కాంగ్రెస్‌ పెద్దన్నగా తనదైన శైలిలో జనసమితిని మూడు స్థానాలతో సర్దుకోమని చెబుతోంది. అయితే ఈ పంపకాలు ఇంకా తేలవలసి ఉంది.

తెరాస సొంతంగానే బరిలోకి దిగుతోంది. కానీ ఈ పార్టీ చిత్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నది. బయట మజ్లిస్‌ (ఎంఐఎం)తోను, లోపాయికారీగా బీజేపీతోను పొత్తు పెట్టుకున్నదని ఆ పార్టీ మీద కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణ. ఇందుకు తెరాస శ్రేణుల నుంచి వస్తున్న విమర్శ కూడా మామూలుది కాదు. ఆంధ్ర ప్రాంతవారి పార్టీ తెలుగుదేశంతో, తెలంగాణ వారికి దక్కవలసిన నీటి వాటా దక్క కుండా చేస్తున్న పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్నదని తెరాస నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం తమ పార్టీ విజయం మీద అసాధారణమైన నమ్మకాన్ని ప్రకటిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే రోజును కూడా చెప్పేశారు. అలాగే తెరాస కార్యాలయం ప్రగతి భవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిగా కూడా మారుస్తామని ఆయన చెప్పేశారు. ఈ క్రమంలోనే అటు కాంగ్రెస్‌, ఇటు తెరాస నేతల నుంచి తిట్ల దండకాలు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. వీటికి శ్రీకారం చుట్టిన ఘనత మాత్రం తెరాస అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుంది.

ఎంఐఎం విడిగా పోటీ చేస్తున్నప్పటికీ తెరాస మీద ఉన్న అభిమానాన్ని దాచుకోవడం లేదు. మైనారిటీల రక్షకుడు కేసీఆర్‌ అని ఒవైసీ ద్వయం ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. 12 శాతం ఉన్న ముస్లింల ఓట్లు ఎంఐఎంకు హక్కుగాను, తమ పార్టీకి కీలకంగాను కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకోసమే ఆయన నిజాం ప్రభువును పొగడడానికి, సెప్టెంబర్‌ 17 వంటి చారిత్రక సందర్భాన్ని గాలికి ఒదిలి వేయడానికి వెనుకాడడం లేదు. నిజాం తలవంచిన సెప్టెంబర్‌ 17 సందర్భానికి తగిన గౌరవం ఇవ్వడం మొదట్లో కేసీఆర్‌ దృష్టిలో తెలంగాణ ఆకాంక్షలలో ఒకటే. కానీ ఓట్ల రాజకీయంలో ఆ ఆకాంక్ష అటకెక్కింది. ఇక కేసీఆర్‌, బీజేపీల మధ్య పొత్తు నిజమే అయితే ముస్లింలు ఎవరూ ఓటు వేయరని ముందు నుంచి తమకు తాము భయపడుతున్నవారు, తెరాసను భయపెడుతున్నవారు చాలామందే ఉన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో కాకపోయినా, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలో ఉన్న ముస్లిం ఓట్లను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ ఇన్ని విన్యాసాలు చేస్తున్నారు. ఇక ఆయన నెరవేర్చని హామీలు సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఎంతో ‘ప్రతిష్టాత్మకంగా’ భావించిన కేజీ టు పీజీ హామీని కూడా ఆయన వదిలిపెట్టేశారు.

ఈ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం ఎక్కువ మంది కార్యకర్తలను ఆనందింప చేస్తున్న విషయం. 119 స్థానాలకు కూడా ఆ పార్టీ అభ్యర్థులను దింపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శాసనసభలో నిర్మాణాత్మకమైన పాత్ర నిర్వహించిన పార్టీగా బీజేపీకి మంచి పేరు ఉంది. సుశిక్షితులైన కార్యకర్తలు, సిద్ధాంతం ఉన్నప్పటికీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జరిగిన జాప్యం పార్టీ కార్యకర్తలను కొంచెం ఇబ్బంది పెడుతోంది. వచ్చే ఎన్నికలలో మహాకూటమి కంటే బీజేపీయే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కొన్ని దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు కలసి రంగంలోకి దిగాయి. రెండు పార్టీల కార్యకర్తలకు ఇది మింగుడు పడడం లేదు. ఇది తెలుగుదేశానికి పరీక్షా సమయమే అవుతుంది. తెలంగాణలో ఉన్న 50 శాతం వరకు బీసీలు చాలా వరకు, చాలాకాలం టీడీపీని సమర్థించారు. ఇందుకు కారణం కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు కాంగ్రెస్‌ వ్యతిరేకతకు టీడీపీ నేతలు స్వస్తి పలుకుతున్నా, సాధారణ కార్యకర్తలు అంత సులభంగా ఆ పనిచేయలేరు. కాబట్టి టీడీపీ కార్యకర్తలంతా కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని చెప్పడం కష్టం. ఇదే వాతావరణం కాంగ్రెస్‌లో కూడా ఉంటుంది. ఇలాంటి అసమ్మతులంతా ఎవరికి ఓటు వేస్తారు? వీరిని ఎంతవరకు ఆకర్షించగలరన్న అంశం కూడా బీజేపీ విజయానికి దోహదం చేసే వాస్తవాలలో ఒకటిగానే చెప్పాలి. 1969 తరువాత తెలంగాణ అంశాన్ని తెర మీదకు తెచ్చిన ఘనత బీజేపీదే. ఈ కోణం నుంచి చూస్తే కాంగ్రెస్‌, టీడీపీల కంటే బీజేపీ వైపే తెలంగాణ ఓటర్లు మొగ్గే అవకాశం ఎక్కువ. ఏ విధంగా చూసినా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు తెలంగాణలో టీడీపీ భారీ మూల్యమే చెల్లించబోతున్నది.

కొత్త సభాపర్వం ఆరంభ సంరంభంలో కొన్ని ఘోరమైన తిట్లు వినిపించాయి. ఓట్ల పండుగకు ముందు, తిట్ల జాతర జరిగిపోయింది. ‘థూ మీ బతుకు చెడ’ అని కాంగ్రెస్‌ను కేసీఆర్‌ తిట్టారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందుకు ఆయన కాంగ్రెస్‌ మీద ఆ రీతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుక్కుంటే మేమే నాలుగు సీట్లు పడేద్దుం అన్నారు కూడా. సరే ఇక కేసీఆర్‌కు ఎంతో ప్రియమైన సన్నాసులు అన్న పదం కూడా ప్రయోగించారు. చంద్రబాబుని తిట్టడమంటే ఇక కేసీఆర్‌కు పట్టపగ్గాలు ఉండవు. ‘ఛీ, నీతో పొత్తా?’ అని అన్నారాయన. అంటే చంద్రబాబుతో పొత్తన్నమాట. కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణను కూడా అదే మోతాదుతో ఆయన తిట్టారు. దగుల్బాజీ, బట్టేబాజీ వంటి తిట్లతో కేసీఆర్‌ తన స్థాయిని తానే దించుకున్నారు.


ఉదయం బీజేపీలో, సాయంత్రం సొంత గూటిలో

కాంగ్రెస్‌ ప్రముఖుడు దామోదర్‌ రాజనరసింహ సతీమణి అక్టోబర్‌ 12 ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్‌ నాయకురాలు. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఒకే కుటుంబానికి ఒకటే సీటు అన్న నినాదం ఆమెను కలవరానికి గురి చేసిందని చెబుతున్నారు. దీనితో తనకు టికెట్టు రాదన్న అనుమానంతో ఆమె బీజేపీలో చేరారని వార్తలు వచ్చాయి. తరువాత సాయంత్రానికే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. తన పార్టీ కార్యకర్తల మనోభావాలను అనుసరించి తాను సొంత గూటికి చేరుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి, కాంగ్రెస్‌ నుంచి తెరాస లోకి, టీడీపీ నుంచి ఇతర పార్టీలలోకి వలసలు సాగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటుడు, తెరాస నాయకుడు బాబూమోహన్‌ బీజేపీలో చేరారు. మరో ప్రముఖ నటి ఒకనాటి బీజేపీ, తెరాస నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌ పంచన చేరారు. రేవంత్‌ రెడ్డి చాలా కాలం క్రితమే టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.


రాహుల్‌ చెంత గద్దర్‌

‘లాల్‌ సలాం….!’ అని ఆయన పాట అందుకుంటే ఆ గొంతులో గంధక గనులున్నాయని అనిపించేది. అలాగే ఆయేగా మేడే అన్న గేయం కూడా. అడవి తల్లికి దండాలో అంటూ కొన్ని దశాబ్దాల పాటు గొంగడి వేసుకుని దేశమంతా సంచరించిన గద్దర్‌ ఈ అక్టోబర్‌ 12 కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ చెంతన ప్రత్యక్ష మయ్యారు. ఇది అనూహ్య పరిణామం కాదు. గత కొంతకాలంగా ఆయన పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆయన ప్రకటనల ద్వారానే జనానికి తెలిసింది కూడా. ఆయన కుమారుడు ఇదివరకే కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. అయితే తాను ఏ పార్టీలోను సభ్యుడిని కానని, కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేయనని రాహుల్‌ను కలుసుకుని వచ్చిన తరువాత గద్దర్‌ చెప్పారు. బహుశా ఆయన కూడా బరిలోకి దిగవచ్చు. అది కూడా కేసీఆర్‌ మీదే అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటివి జరగడం అంత సలుభం కాదు. ఏమైనా గద్దర్‌ వంటి వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వారు కాంగ్రెస్‌ వాకిట కనిపించడం ఒక దశాబ్దపు వింత. చిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌ తరఫున కానీ, కాంగ్రెస్‌ మద్దతుతో గానీ పోటీ చేస్తే పక్కన తెలుగుదేశం కూడా ఉంటుంది. ఈ రెండు పార్టీలను కూడా గద్దర్‌ గతంలో పనిచేసిన సంస్థకు ప్రబల శత్రువులు. తెలుగుదేశంలో చంద్రబాబు మీద హత్యాయత్నంతో, కాంగ్రెస్‌లోని చాలామంది నాయకుల హత్యతో గద్దర్‌ పూర్వం పని చేసిన సంస్థకే సంబంధం ఉన్న విషయాన్ని బహుశా ఆయన కూడా కాదనలేరు. కానీ ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి వచ్చి ప్రజా సేవ చేద్దామన్న ఆశయాన్ని స్వాగతించాలి.


ఇక సోదికి వెళితే రంకు బయటపడిన చందంగా చాలా విషయాలు ఒకరివి ఒకరు బయట పెట్టుకుంటూనే ఉన్నారు. నేను దేశం కోసం సరిహద్దులలో పోరాడుతూ ఉంటే, కేసీఆర్‌ దొంగ వీసాలతో జనాన్ని మోసం చేసి దేశం దాటించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ తిట్టిన తిట్లకు డీకే అరుణ కూడా అదే స్థాయిలో జవాబు ఇచ్చారు. ఆంధ్ర ప్రాంతంలో కలసిన ఏడు మండలాల విషయంలో ఇప్పుడు లొల్లి ఎందుకు? అవి అందులో కలిపినప్పుడు ఏమయ్యావని మళ్లీ కాంగ్రెస్‌ కేసీఆర్‌ మీద ధ్వజమెత్తింది. ఉత్తమ్‌కుమార్‌ భద్రతాదళాలలో ఉండగా ఈయన నిర్వాకంతో రెండు విమానాలు చెడిపోయాయని మరో తెరాస నేత ఆరోపించారు. నాలుక కోస్తా, తాట తీస్తా వంటి పదాలు ఈ మధ్య చాలామంది నేతలకు ఇష్టమైన పదాలుగా మారి పోయాయి. రేవంత్‌రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇదొక కొత్త పరిణామం. తనను సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిండు అసెంబ్లీలోనే నీ అంతు చూస్తానని బెదిరించారని రేవంత్‌ ఆరోపణ. ఇప్పుడు స్థానిక తెరాస నాయకులు కూడా ఇదే పంథాలో వెళుతూ, కేసీఆర్‌ మీద ఆరోపణలు మానుకోకపోతే భౌతిక దాడులు తప్పవని తనను హెచ్చరించారని, ఇది బహిరంగంగా చేసిన హెచ్చరికేనని రేవంత్‌ చెబుతున్నారు.

తెరాస టికెట్‌ పొందడం విఫలమైన కొండా సురేఖ దంపతుల ఆరోపణ మరొక తీరులో ఉంది. తెరాసలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న తన్నీర్‌ హరీశ్‌రావు ప్రాధాన్యం పార్టీలో తగ్గించేందుకు కేసీఆర్‌ కుటుంబం కుట్ర పన్నుతున్నదని సురేఖ ఆరోపించారు. తమతో పాటు హరీశ్‌రావు వర్గంగా చెబుతున్నవారు ఎవరికీ కూడా టికెట్లు రాకుండా చేశారని ఆ దంపతులు ఆరోపించారు. మోత్కుపల్లి నరసింహులు తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తుంటే, ఆయన మీద మరో మహిళా నాయకురాలు ఆరోపణలు గుప్పించారు.

ఈ ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పొత్తు ఎంత అపవిత్రమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈ అవకాశవాదాన్ని ఎత్తి చూపే క్రమంలో ఇటు తెరాస, అటు కాంగ్రెస్‌ కూడా కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు, ఆలోచనలు చేస్తున్నాయి. ‘ఆంధ్రోళ్ల’ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ అని తెరాస విమర్శిస్తున్నది. ఇందులో నిజం ఎంత? తన బలం అసెంబ్లీలో 90కి చేరడంలో ఇక్కడ గెలిచిన టీడీపీ సభ్యులు కూడా కారణం కాదా? వారంతా ఆంధ్రోళ్ల పార్టీ సభ్యులే కదా! మరి ఎలా ఫిరాయింపచేశారు? వారి చేత ఎందుకు రాజీనామాలు చేయించి, మళ్లీ తెలంగాణ ఓటుతో గెలిపించే ప్రయత్నం చేయలేదు? తెరాస వంటి ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నీటి పంపకాల దగ్గర జరిగిన, జరుగుతున్న అన్యాయాలను ఎందుకు నిరోధించలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీల కంటే ఎన్ని ఉద్యోగాలను ఎక్కువగా ఇవ్వ గలిగింది? ఏమీ ఇవ్వలేదనే కదా ఆచార్య కోదండరాం వంటివారు వాదిస్తున్నారు.

కాబట్టి మళ్లీ ప్రాంతీయ వాదాన్ని ప్రస్తావించడం తెరాస, కేసీఆర్‌ తమను తామే చిన్న బుచ్చుకోవడమే అవుతుంది. ఆయన మేనల్లుడు, మరో మంత్రి హరీష్‌రావు ఈ విషయంలో మరీ ముందు ఉన్నారు. ఆయన మిషన్‌ భగీరథ గురించి కాకుండా ఇలాంటి ఆరోపణలకు దిగడం అందుకు రుజువు. మళ్లీ ఆంధ్ర నినాదం తేవడం అంటే తాము చేసిన ప్రగతి మీద తమకి నమ్మకం లేకపోవడమే. కేసీఆర్‌ తిట్ల దండకం, ఆయనను అనుసరిస్తున్న చిన్న నేతల ఆరోపణలు కొత్త రాష్ట్రానికి శోభనిచ్చేవి కావు. కాంగ్రెస్‌ పార్టీ ‘సెటిలర్ల’ ఓట్ల కోసం టీడీపీతో పొత్తుకు దిగిందన్న వాదన ఉంది. ఆ ఆలోచనే నిజమైతే జాతీయ పార్టీ కాంగ్రెస్‌ కూడా తెరాసతో పాటే తెలంగాణ సెంటిమెంంట్‌తోనే ఎన్నికలకు వెళుతున్నట్టు లెక్క. పైగా ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌-మేలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం గురించి, సీట్లు గెలవడం గురించి ఆ పార్టీకి పెద్దగా ఆశలు లేవని కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశంతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్నది. రేపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ వ్యతిరేకంగా పోటీ చేస్తుందా? అందుకు ఏం కారణం చూపుతుంది?

– జాగృతి డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *