సద్గతి దాయిని.. దుర్గాభవాని…

సద్గతి దాయిని.. దుర్గాభవాని…

దేవీ నవరాత్రుల ప్రత్యేకం

భారతీయులు నిజంగా అదృష్టవంతులు. వారికి అనేక రూపాల్లో దైవాన్ని కొలిచే భాగ్యం లభించింది. భగవంతుడు ఒకే రూపంతో వెలిసినట్లైతే ఆయన జన్మదినాన సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తలుచుకునే వీలుంది. ప్రాపంచిక జీవితంలో మునిగి ఉన్న వారిచే భగవంతుడిని సదా స్మరింపజేసి, ఉత్తమ సంస్కారాలను ఏర్పరచి, వారు మనస్సును నిగ్రహించుకుని పరమ పథాన్ని పొందాలని ఆశించి భారతీయులమైన మనకు మన పూర్వీకులైన ఋషులు నిర్గుణ, నిరాకార పరబ్రహ్మను వేరువేరు రూపాల ద్వారా ఉపాసించే సౌలభ్యాన్ని కల్పించారు. వారి తాపత్రయం అంతా కర్మపంకిలంలో ఉన్న వ్యక్తి మనస్సు సదా ఆ దేవునిపై నిలిచేటట్లు చేయాలన్నదే. అందువలన ముక్కోటి దేవతలు మనం కొలిచేందుకు అందుబాటులో ఉన్నారు.

సంవత్సరం పొడుగునా మనకు పండుగలు పర్వదినాలు ఉన్నాయి. మన మనస్సు సదా భగవధ్యానంలో తదైక్యం కావాలన్నదే ఈ పండుగల ముఖ్య ఉద్దేశం. పండుగలంటే రకరకాల పిండి వంటలు చేసుకొని క్రొత్త బట్టలు కట్టుకోవడమే అనుకుంటే పొరపాటే. భగవదుపాసనలో మనస్సు నిలిపి అంతఃకరణాన్ని పవిత్ర మొనర్చుకొని పరమానందాన్ని పొందడానికి ఇవి సోపానాలు.

నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత

”పరబ్రహ్మానికి ప్రతిరూపం పరాశక్తి. ఆది పరాశక్తి ఆజ్ఞానుసారమే త్రిమూర్తులు సహితం సృష్టి, స్థితి, లయల కార్యభారాన్ని వహిస్తున్నారు. అఖిల జగత్తుకూ ఆధారం ఆది పరాశక్తి” అని దేవీ భాగవతం పేర్కొంది. శరత్కాలం నిర్మలత్వానికి, శరశ్చంద్రుడు ప్రశాంతకు ప్రతీకులు. నిర్మలమైన ప్రేమ, కరుణలను కురిపించే చల్లని మనస్సు మాతృమూర్తి సహజ లక్షణం. అందుకే నిర్మల, ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలం అంటే జగన్మాతకు అత్యంత ప్రీతి. శరత్కాలంలో విశేషంగా ఆ విశ్వేశ్వరిని తొమ్మిది రోజుల పాటు ఆరాధించి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం మన సంప్రదాయం. ”నవ” సంఖ్య పరిపూర్ణతకు సంకేతం.

మనకు సంవత్సరంలో రెండు దేవీ నవరాత్రులు వస్తాయి. చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరుపుకునేవి వసంత నవ రాత్రులు. అలాగే శరధృతువులో ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు జరుపుకునేవి శరన్నవ రాత్రులు అంటారు. ఈ ఉత్సవాల్లో పూజలందుకునే దేవత ”దేవి” కాబట్టి వీటిని దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. ‘శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాతీ, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి’ ఈ నవ దుర్గలను అర్చించి జీవితంలో పరిపూర్ణత్వాన్ని సాధించుకోవాలన్నది నవరాత్రి ఉత్సవాల విశిష్టత.

దుర్లభమైన మానవ జన్మను సార్థకం చేసుకోవా లంటే అశాశ్వతమైన ఈ దేహంలో జనన మరణాతీత స్థితిని చేరుకోవాలి. అప్పుడే మానవ జన్మకు పరి పూర్ణత సిద్ధించినట్లు, అయితే పరిపూర్ణతను సాధించ డానికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అవసరం. ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా’ సర్వజీవుల్లో శక్తిగా నెలకొని ఉన్న ఆ సర్వేశ్వరుని ఆరాధిస్తే మానవ జన్మకు పరిపూర్ణత్వానికి కావలసిన సర్వశక్తులూ సమకూరుతాయి. ఆ తల్లి ప్రేమామృత ధారలతో అమరత్వం సిద్ధిస్తుంది. మోక్షం ప్రాప్తిస్తుంది.

durga-apaduddharaka-ashtakam-in-telugu-600x600_0కరుణామూర్తి దుర్గామాత

దుర్గాదేవిని ఇలా స్తుతించాలని దేవ మహత్వ్యుం సూచిస్తుంది. ”ఓ దుర్గా! కష్టాలలో నిన్నుతలుచుకున్న వారి భయాన్ని తొలగిస్తాయి. సుఖసంతోషాలతో ఉన్న వారు నిన్ను స్మరిస్తే వారికి అంతకన్నా అధికమైన శుభాలను కలుగజేసే బుద్ధిని ప్రసాదిస్తావు, దారిద్య్రం, దుఃఖం, భయం పోగొట్టి అందరికీ ఆనందానిచ్చే సున్నిత మనస్సు నీకు తప్ప వేరేవ్వరికీ కలదు”.

ప్రపంచాన్నంతటినీ పట్టి పీడిస్తున్న దుర్గమాసురుణ్ణి సంహరించడానికి బ్రహ్మాది దేవతలకు దుర్గమమైంది. అప్పుడు దుర్గమాసురిని బారి నుండి తమను రక్షించ వలసినదిగా ఋషులు పార్వతీ దేవిని వేడుకున్నారు. కరుణాస్వరూపిణి అయిన అమ్మ మనస్సు కరిగి దుర్గమాసురుడిని సంహరించింది. జగన్మాత దుర్గమాసురుడిని సంహరించడ వలన ‘దుర్గ’గా ఆరాధనలు అందుకొంటున్నది. మనకు కలిగే భరింపరాని కష్టాలను సహితం అంతరింపజేస్తుంది కాబట్టి ఆ జగన్మాతను దుర్గ అని పిలుస్తారు. నవ రాత్రుల సందర్భంగా ఋషులు, మునులు, సమస్త మానవకోటి దుర్గను ఈ తొమ్మిది రోజులలో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆరాధిస్తారు.

పరాశక్తిని నవరాత్రులలో ఆరాధించడం అత్యంత శుభప్రదం. నక్షత్రాలలో మొదటిది అశ్వని. ఆ నక్షత్రంతో కూడిన పూర్ణిమగల మాసమిది. అందుకే దీనిని ఆశ్వయుజ మాసం అన్నారు. అలాగే చైత్రంలోనూ మొదటి తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ నవరాత్రులతో జగదంబను ఆరాధించే వారికి సర్వమంగళములు సంప్రాప్తిస్తాయి. వారి వారి విధానాలను అనుసరించి ఆరాధించాలి. అనంత నామాలతో, అనంతర రూపాలతో విలసిల్లే శక్తి స్వరూపిణిని ఏ నామంతోనైనా, ఏ రూపాలలో నైనా ఆరాధించవచ్చు. సంప్రదాయ సిద్ధంగా పద్థతి గలవారు కలశాన్ని స్థాపించి, ముగ్గురమ్మల మూలపుటమ్మను ఈనాటి నుంచి (పాడ్యమి) తొమ్మిది రోజులు ఆరాధిస్తారు.

విజయాలను చేకూర్చే విజయదశమి

రామాయణ, భారతాది వీరగాథలన్నీ ఈ నవరాత్రులతో ముడిపడి ఉన్నాయి. మూలానక్షత్రంలో పుస్తక రూపిణి సరస్వతీ దేవిని ఆరాధించడం పరం పరగా వస్తున్నది. శ్రీరాముడు దేవీ పూజ చేసి రావణుడిని సంహరించాడని, పాండవులు దేవీస్తోత్ర పఠనానంతరం కురుక్షేత్ర రణరంగంలో విజయం సాధించారని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నవరాత్రుల అనంతరం వచ్చే దశమిని విజయదశమి అంటారు. ఇది కూడా ముఖ్యమైన పర్వదినం. జీవితంలో ఏ రంగంలోనైనా విజయం కాంక్షించే వారు విజయదశమి నాడు తమ ప్రయత్నం ప్రారంభిస్తారు. అంటే విజయాన్ని చేకూర్చే దశమిగా తలుస్తారు. విజయదశమి- ఈ పదాన్ని విజయద -శమీగా విడగొట్టి విజయాన్నిచ్చే శమీ వృక్షం అని చెప్పవచ్చు. ఈ దశమి నాడు శమీ వృక్షం (జమ్మి చెట్టుని) పూజిస్తారు.

అమంగళానాంశ మీనం, శమీనందస్కృతస్యచ

దుస్వప్న నాశనీం ధన్యాం ప్రపద్యేహంశమీం శుభామ్‌

శమీ శమయతే పాపం శమీలోక హితహ కంటకా

దరిద్య్రర్జున బాణానాం రాపిస్య ప్రియ వాదినీ

కరిష్యమాణ యత్రాయాం యథాకాలం సుఖం మమా

తత్ర నిర్వఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజతే

1701_nav-durga-wallpaper-04”జమ్మి పాపాన్ని శమింప జేస్తుంది. శుత్రువులను నశింప జేస్తుంది. అజ్ఞాతవాస కాలంలో అర్జునుడి ఆయుధాలను ఈ జమ్మిచెట్టు వహించింది. విజయ యాత్రలో వచ్చే విఘ్నాలను తొలగిస్తుంది. రావణునిపై విజయానికి కారణమై శ్రీరామునికి ప్రియం చేకూర్చింది” దీనిని బట్టి శమీ పూజ ఎంత ప్రభావితమైనదో గ్రహించవచ్చు.

ముగురమ్మల మూలపుటమ్మ

ధర్మం, అర్థం, కామం అనే త్రివర్గాలను ఈ ప్రసాదించే దేవి సత్త్వరజస్తమః స్వరూపిణి. ఆమె మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అనే ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ. బమ్మెర పోతన మహాభాగవతం రచించడానికి ముందు ముగుర్మల మూలపుటమ్మను ఈ విధంగా స్తుతించాడు.

అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల

పుటమ్మ చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ

కడు పాఱడి పుచ్చెడియమ్మ, దన్నులో నమ్మిన

వేల్పుటమ్మల మనమ్ముల నుంచెడి యమ్మ

దుర్గ, మాయమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్త్వ

కవిత్వ పటుత్వ సంపదల్‌.

”ఆమె అమ్మలందరికి అమ్మ, ముల్లోకాల మూలమైన ముగ్గురమ్మలకూ మూలమైన అమ్మ, అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ, మ్రుక్కిడులైన రక్కసి మూకలను ఉక్కడించిన అమ్మ, నమ్ముకొన్న వేల్పుటమ్ముల నిండు గుండెలలో నివసించే అమ్మ, దయోపయోనిధియైన అమ్మ, మా అమ్మ దుర్గాభవాని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి.

సృష్టి, స్థిది లయకారిణి, అజ్ఞాన నాశినీ, భయహరిణీ, దుఃఖ నివారిణి, ఆత్మశక్తి ప్రదాయిని అయిన దుర్గామాతను శరణువేడితే దుర్గతి పోయి, సద్గతి ప్రాప్తిస్తుంది. కాబట్టి అమ్మ చరణాలను ఆశ్రయిద్దాం, సద్గతిని పొందుదాం.

– గుమ్మా ప్రసాదరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *