డ్రాగన్‌ ఉచ్చు నుంచి తప్పించడానికే!

డ్రాగన్‌ ఉచ్చు నుంచి తప్పించడానికే!

దక్షిణాసియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక సంబంధాలు చాలాకాలం సార్క్‌ దేశాలకే పరిమితమయ్యాయి. ఈ పరిధిని దాటి మొదటిసారిగా భారత్‌ తన సంబంధాలను మరింత విస్తృతపరచుకునే ప్రయత్నం చేసింది. రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి బింస్టెక్‌ దేశాధి నేతలను ఆహ్వానించారు. అలాగే తన విదేశీ పర్యటనలను మాల్దీవులతో ప్రారంభించారు.

మొదటి విడత పాలనలో ప్రధాని మోదీ పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ఆ దేశాలకు ఉదారంగా ఆర్థిక సహాయం అందించడం, సంప్రదాయ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలైన పద్ధతులు అనుసరించారు. కానీ మాల్దీవులు మాత్రం భారత్‌ అందించిన స్నేహ హస్తాన్ని కాదని చైనాకు దగ్గర కావాలని చూసింది. యామీన్‌ నిరంకుశ పాలనలో ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడమేకాక భారతీయ అధికారులు తమ దేశం లోకి రాకుండా వీసా నిరాకరించారు. అంతేకాదు భారత్‌ బహుకరించిన హెలికాప్టర్‌లను కూడా తిప్పి పంపారు. కానీ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మహమ్మద్‌ సోలిహ్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. మాల్దీవ్స్‌ మళ్లీ ప్రజాస్వామ్యబాట పట్టింది. మహమ్మద్‌ సోలిహ్‌ తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వా నించారు కూడా. ఆ విధంగా మాల్దీవులు, భారత్‌ల మధ్య సంబంధాలు మళ్లీ బలపడ్డాయి. చైనా అప్పుల ఊబి నుంచి దేశాన్ని బయటపడేయడానికి మహమ్మద్‌ సోలిహ్‌ అనేక చర్యలు చేపట్టారు. మాల్దీవ్స్‌ను ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడేయడానికి భారత్‌ కూడా తన వంతు సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. 1.4 బిలియన్‌ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. మాల్దీవ్స్‌ను సందర్శించిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెంటనే 800 మిలియన్‌ డాలర్ల నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఇచ్చే నిధులు చైనా అప్పులు తీర్చేందుకు ఉపయోగించకూడదని భారత్‌ షరతు విధించింది.

2015లో మొదటిసారి సిషల్స్‌, మారిషస్‌, శ్రీలంకలను సందర్శించిన ప్రధాని మోదీ హిందూ మహాసముద్ర ప్రాంతంలో గల దేశాల అభివృద్దికి ప్రాధాన్యనిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి విశేష ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. హిందూ మహాసముద్రంలోని ప్రధాన రవాణా మార్గంలో, భారత్‌కు 750 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవులు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రెండవసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తరువాత మాల్దీవులలో పర్యటించిన మోదీ ప్రజా స్వామ్య వ్యవస్థ బలోపేతం చేయడానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయా దేశాల అవసరాలు తీర్చడంలో సహాయం చేయడంతోపాటు, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టపరచుకోవడం వంటి ద్విముఖ విధానాన్ని అనుసరించాలని భారత్‌ భావిస్తోంది. జూన్‌ 8న ప్రధాని మాల్దీవుల రాజధాని మాలే చేరుకున్నారు. సైనిక వందనం, అధికారిక స్వాగత సత్కారాలు అందుకున్న తరువాత మాల్దీవుల పార్లమెంట్‌ అయిన మజిలీస్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టు కోవడంలో ఆ దేశ ప్రజలు చూపిన పట్టుదల, ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. అభివృద్ధి బాటలో కలిసి నడుద్దామని భారత్‌ తరఫున ఆహ్వానం పలికారు. ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ అనేది తాము భారత్‌లో మాత్రమే అనుసరించే సూత్రం కాదని, అది తమ విదేశాంగ విధానానికి మూలమని ఆయన స్పష్టం చేశారు. ప్రాచీన కాలం నుంచి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను గుర్తుచేసిన ప్రధాని మోదీ హిందీ, దీవెహి (మాల్దీవులలో అధికారిక భాష)లు సమానార్థక పదాలని పేర్కొన్నారు. కొచ్చి, మాలే మధ్య నౌకా సదుపాయాన్ని ప్రారంభించాలన్న ప్రతిపాదనకు మోదీ అంగీకరించారు.

ఇండో, పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలు ఎదుర్కొంటున్న మూడు సమస్యలను అధిగమించడానికి కలిసి పనిచేయా లని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, పర్యావరణ మార్పుల సమస్యలను ఎదుర్కోవడంతోపాటు ఈ ప్రాంతంలో సుస్థిరమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవా లన్నారు. మాల్దీవులలో ఉగ్రవాదం, మతఛాందసవాదం బాగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో అరబ్‌ దేశాల నుంచి కాకుండా ఎక్కువగా చేరుతున్న విదేశీయులు మాల్దీవులకు చెందినవారేనని ప్రపంచ నివేదికలు చెప్తున్నాయి. ముఖ్యంగా యామీన్‌ పాలనలో అనుసరించిన నిరంకుశ విధానాల మూలంగా ఉగ్రవాద శక్తులు పెచ్చుమీరాయి. ఉగ్రవాదుల్లో మంచివారు, చెడ్డవారు అంటూ ఉండరని, ఇలాంటి అర్ధరహితమైన ఆలోచనలను ప్రపంచ దేశాలు వదిలిపెట్టాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మంచు ఖండాలు కరిగిపోవడం, సముద్రమట్టం పెరగడం వంటి పర్యావరణంలో పెను మార్పులు చిన్న ద్వీప దేశాలకు ప్రమాదంగా మారాయని, ఈ సమస్యలను అధిగమించి పర్యావరణాన్ని రక్షించుకునేందుకు అంతర్జాతీయ సౌరశక్తి కూటమిని ఫ్రాన్స్‌తో కలిసి ఏర్పాటు చేశామని మోదీ వివరించారు. అంతర్జాతీయ సౌరశక్తి కూటమిని గుర్తించినందుకు మాల్దీవులను ప్రశంసించిన మోదీ ఈ కూటమి వల్ల ఇండో, పసిఫిక్‌ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ‘వసుధైక కుటుంబకం’ అనే భారతీయ విధానాన్ని అనుసరించి మాల్దీవుల అభివృద్ధిని కూడా కోరుకుంటామని పేర్కొన్నారు. భాగస్వామ్యం అనేది రెండు దేశాలకు ప్రయోజనాకారిగా ఉండాలి తప్ప ఏదో ఒక దేశానికి మాత్రమే మేలు చేసేదిగా ఉండకూడదని చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు.

ఆరోగ్యం, సరుకుల రవాణా, మొదలైన రంగాల్లో భారత్‌, మాల్దీవుల మధ్య ఒప్పందాలు కుదిరాయి. తీరప్రాంత నిఘా కోసం ఏర్పాటు చేసిన రాడార్‌ వ్యవస్థను, సంయుక్త సైనిక శిక్షణ కేంద్రాన్ని రెండు దేశాల నేతలు ప్రారంభించారు. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంను నిర్మించడంలో, క్రికెట్‌లో ప్రపంచ స్థాయి శిక్షణను అందించ డంలో సహకరిస్తామని భారత్‌ హామీ ఇచ్చింది. రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టపరచడంలో మోదీ తీసుకున్న చొరవకు గుర్తుగా ఆయన్ను మాల్దీవ్స్‌ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్నిచ్చి సత్కరించింది.

మోదీ మాల్దీవ్స్‌, శ్రీలంక పర్యటనల గురించి రాస్తూ ఒక ఆంగ్ల జాతీయ దినపత్రిక అవి రెండు ‘మొక్కుబడిగా’ సాగాయని వ్యాఖ్యానించింది. కానీ ఈ వివరాలను పరిశీలిస్తే ఆ పర్యటన ఎంతో ఫలవంతమైన, ప్రయోజనకరమైనదిగా స్పష్టమవుతున్నది.

మోదీ శ్రీలంక పర్యటన చాలా ముఖ్యమైనది. 250మంది ప్రాణాలు కోల్పోయిన భయంకరమైన బాంబు పేలుళ్ల ఘటన తరువాత ఆ దేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ నేతగా మోదీ అక్కడి ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని అందజేయగలిగారు. ప్రోటోకాల్‌ పక్కనపెట్టి శ్రీలంక ప్రధాని రనీల్‌ విక్రమసింఘే విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు. అధికారిక కార్యక్రమాలు ప్రారంభించ డానికి ముందు మోదీ ఉగ్రదాడులకు గురైన సెయింట్‌ ఆంటోనీ చర్చిను సందర్శించి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ‘ఇలాంటి ఉగ్రదాదులు శ్రీలంక ప్రజల ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బతీయ లేవు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వారికి భారత్‌ మద్దతుగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. శ్రీలంక సురక్షితమైన దేశమని మోదీ పర్యటన ప్రపంచానికి తెలియజేసినట్లయింది. దీని వల్ల ఆ దేశంలో పర్యాటక రంగం తిరిగి పుంజుకునే అవకాశాలు బాగా మెరుగయ్యాయి.

ఉగ్రవాద నిర్మూలనకు అంతర్జాతీయ సమీకృత విధానం అమలు చేయాలని 1996 నుంచి భారత్‌ గట్టిగా కోరుతోంది. ఇదే ప్రతిపాదనను 2014లో మోదీ ఐక్యరాజ్యసమితిలో మరోసారి ప్రస్తావించారు. ఉగ్రవాదం వల్ల ఎంతో నష్టపోతున్న భారత్‌ ఈ విషయంలో కఠినమైన, ఉమ్మడి చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు పదేపదే చెపుతున్నా అవి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశాలు కూడా ఉగ్రవాదం వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతుండడంతో కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి.

మాల్దీవ్స్‌ పార్లమెంట్‌ మజిలీస్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాద భూతం ఎంత ప్రమాదకరమైనదో పి5 దేశాలకు తెలియజెప్పడానికి ప్రయత్నించిన మోదీ చివరికి చైనాకు నచ్చచెప్పగలిగారు. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించకుండా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుపడిన చైనా చివరికి పక్కకు తప్పుకుంది. మొత్తానికి ఉగ్రవాద ప్రమాదం గురించి ప్రపంచ దేశాల దష్టికి తీసుకురావడంలో మోదీ విజయం సాధించారనే చెప్పాలి.

ఐసిస్‌ ఖలిపత్‌ విచ్ఛిన్నం కావడంతో వివిధ ఉగ్ర మూకలు తమతమ దేశాలకు చేరుకున్నారు. వారు అక్కడ యువతలో ఉగ్రవాద మనస్తత్వాన్ని వ్యాప్తిచేస్తున్నారు. దీని మూలంగానే దక్షిణాసియాలో ఒక్కసారిగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఐసిస్‌కు శ్రీలంక, భారత్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులలో ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయి. ఎలాగైనా తిరిగి బలం పుజుకోవాలని ప్రయత్నిస్తున్న ఐసిస్‌ ఇటీవల శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లకు తామే బాధ్యుల మని ప్రకటించుకుంది. కానీ ఈ సంఘటనల వెనుక తవహీద్‌ జమాత్‌ అనే ఉగ్రవాద సంస్థ ఉందని దర్యాప్తులో తేలింది. శ్రీలంకలో ఉగ్రసంస్థల వెనుక తమిళనాడులోని మతమౌఢ్య ప్రవక్తలు, ఉపన్యాసకుల హస్తం ఉందని పరిశీలకులు రోహన్‌ గుణరత్నే అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దక్షిణాసియాలో కూడా ఐసిస్‌ కాలు మోపింది కాబట్టి ఇక్కడ దేశాలన్నీ పరస్పర సహకారంతో దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకనే బాంబు పేలుళ్ల దర్యాప్తులో తాము కూడా సహకరిస్తామని భారత్‌ ప్రకటించింది.

ఇప్పటివరకు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో పాలుపంచుకోవ డానికి ప్రాధాన్యం చూపిన భారత్‌ ఇప్పుడు జపాన్‌ సహాయంతో కొలంబోలో నౌక కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. తద్వారా ఈ ప్రాంతంలో చైనా జోక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఉన్న శ్రీలంక, మాల్దీవులు భారత్‌కు చాలా కీలకమైనవి. ఇక్కడ ఎలాంటి అనిశ్చితి ఏర్పడిన భారత్‌కు నష్టం వాటిల్లుతుంది. అందుకనే ఈ దేశాలతో వ్యూహాత్మక సముద్ర సహకారాన్ని మరింత పెంపొందించు కునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. దక్షిణాసియాలో ఎదురవుతున్న ప్రమాదాలను నివారించడానికి సమీకృత సహకార ధోరణి ముఖ్యమని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు విరాజ్‌ సోలంకి అభిప్రాయపడ్డారు. శ్రీలంక, భారత్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లు ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి. ప్రధాని మోదీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

– హెచ్‌.పూసర్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *