సైబర్‌ యుద్ధాలు

సైబర్‌ యుద్ధాలు

ఇప్పుడు మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ఈ సాంకేతికతతో ఇంట్లోనే కూర్చుని అన్ని పనులూ చేసుకోవచ్చు. అంతేకాదు, యుద్ధాలూ చెయ్యొచ్చు. అంతెందుకు, ఇంట్లోనే కూర్చుని మన శత్రుదేశాన్ని నామరూపాలు లేకుండా చెయ్యొచ్చు. అంతటి శక్తి గలది ఈ సాంకేతికత. ఆ శక్తీ, యుక్తీ గురించి తెలుసుకుందాం.

ఇంతకుముందు యుద్ధం అంటే సైన్యం, టాంకులు, అవి పంపే క్షిపణులు, క్షిపణులు వదిలే బాంబులు. వీటితోనే యుద్ధం జరిగేది. వీటికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు. అత్యంత శ్రమ.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. టెలికమ్యూనికేషన్లు, ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, సంచార ఉపగ్రహాలు యుద్ధం పద్ధతినే మార్చివేస్తున్నాయి. అంతర్జాలం (ఇంటర్‌నెట్‌) ప్రపంచవ్యాప్తమై ఉంది. రైల్వేలు, విద్యుత్తు, రవాణా, పరిపాలన ఇత్యాది వ్యవస్థలన్ని ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌లు, కమ్యూనికేషన్‌ల ఆధారంగా నడుస్తున్నాయి.

యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలను కూడా ఈ టెక్నాలజీతో నియంత్రిస్తున్నారు. ఇప్పుడు సైన్యాలను పంపకుండా స్వదేశంలో కూర్చుని శత్రుదేశంలోని ప్రతి వ్యవస్థనూ నాశనం చేయవచ్చు. ఈ నైపుణ్యాన్ని ఎంతో ఆసక్తితో, వ్యయంతో, వేలమంది కుశాగ్రబుద్ధి ఉన్న నిపుణులను ఉపయోగించి నిర్మిస్తారు. ఇలా నిర్మించిన నైపుణ్యంతో ఒక దేశంపై సైబర్‌ ఆక్రమణ చేసి, సులభంగా విజయం సాధించడం వీలవుతోంది. ఇటువంటి అత్యద్భుతమైన నేర్పరితనాన్ని, సామర్థ్యాన్ని సాధించిన దేశాలలో అగ్రగాములు ఇజ్రాయెల్‌, అమెరికా, చైనా, ఇరాక్‌, రష్యా. ఇటీవల ఈ కోవలోకి భారతదేశం, పాకిస్తాన్‌లు చేరాయి. ఈ దేశాలన్నీ సైబర్‌ యుద్ధానికి, సైబర్‌ రక్షణకు మంచి తర్ఫీదు పొందుతున్నాయి. సైబర్‌ యుద్ధ / రక్షణ దళాలను, పరికరాలను ఏర్పరచుకున్నాయి. సైబర్‌ ఆక్రమణ ద్వారా ఇజ్రాయెల్‌ సాధించిన ఒక గొప్ప విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఒకప్పుడు ఇజ్రాయెల్‌తో మిత్రునిగా ఉన్న అరబ్బు జాతికి చెందని, ఆర్యజాతికి చెందిన షియా ముస్లిం దేశం ఇరాన్‌. 1979 సంవత్సరంలో అక్కడి రాజ్య వ్యవస్థను కూలద్రోసి, అతి ఛాందస ఇస్లామిక్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఇజ్రాయెల్‌ను తన ప్రథమ శత్రువుగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ దేశాన్ని, ఆ దేశస్థులైన యూదులను ధ్వంసం చేయడానికి అణుబాంబులను నిర్మించపూనుకుంది. ముందు జర్మన్‌ శాస్త్రవేత్తలు, తరువాత వ్యక్తిగత హోదాలో రష్యన్‌ శాస్త్రవేత్తలు, చివరకు ఫ్రెంచి శాస్త్రవేత్తల సహాయంతో, ఇరాన్‌ ముఖ్యపట్టణం అయిన టెహరాన్‌కు 320 కి.మీ. దూరాన దక్షిణాన ఉన్న నటాంజ్‌ (Natanz) అనే పట్టణంలో ఇరాన్‌ ఆటంబాంబు తయారు చేసే కర్మాగారాలను, ప్రయోగశాలలను నిర్మించింది. భూమికి 70 అడుగుల లోతున ఒక లక్ష చదరపు అడుగులు ఉన్న రెండు భవనాలను నిర్మించింది. అందులో కొన్నివేల Centrifuge లను కంప్యూటర్‌ నియంత్రణలో ఏర్పాటు చేశారు. తక్కువ బరువు ఉన్న యురేనియం 235 ను ఎక్కువ బరువు ఉన్న యురేనియం 238 నుంచి విడదీయడం కోసం ఈ Centrifuge లు పెద్ద వేగంతో గిరగిరా తిరుగుతాయి. దీనివల్ల తేలికగా ఉన్న యురేనియం 235లు ఒక వలయంలోకి, బరువుగా ఉన్న యురేనియం 238 లు మరో వలయంలోనికి చేరతాయి. యురేనియం 235 ఆటంబాంబు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా కంప్యూటర్‌ నియంత్రణలో ఉన్న Centrifuge లతో సాధ్యపడుతుంది. కాబట్టి Centrifuge లను ఆపితే ఆటంబాంబు నిర్మాణం పని ఆగుతుంది. ఇదంతా ఇజ్రాయెల్‌కి తెలిసింది.

ఇజ్రాయెల్‌ వెంటనే రంగంలోకి దిగింది. వేల సంఖ్యలో ఉన్న Centrifuge లను కనుక ధ్వంసం చేయగలిగితే ఆటంబాంబు నిర్మాణం కొన్ని సంవత్సరాల వరకు ఆగిపోతుంది. Centrifuge లను కంట్రోల్‌ చేసే కంప్యూటర్‌ వ్యవస్థలోకి ఇజ్రాయెల్‌ ఒక వైరస్‌ / ఔశీతీఎ ను రహస్యంగా జొప్పించింది. ఇజ్రాయెల్‌కు చెందిన పరమాద్భుత గూఢచారి సంస్థ (Mossad) కు చెందిన ఒక వ్యక్తి అతి రహస్యంగా నటాంజ్‌ పట్టణంలో ప్రవేశించి ఈ కర్మాగారంలో అతి చాకచక్యంగా, రహస్యంగా ఈ వైరస్‌ను ప్రవేశపెట్టారు. ఈ వైరస్‌ ఇజ్రాయెల్‌, అమెరికా కలసి నిర్మించినది. ఇది Stuxnet అనే పేరుతో ఆ తరువాత ఇది ప్రపంచానికి తెలియవచ్చింది. ఈ వైరస్‌ Centrifuge లు తిరిగే వేగాన్ని ఒక్కసారిగా అతిగా పెంచేసింది. దానివలన వేలాది Centrifugeలు వేగాన్ని తట్టుకోలేక నిర్వీర్యమై, విస్ఫోటనం చెందాయి. ఇది చూసి ఇరాన్‌ శాస్త్రవేత్తలు నిశ్చేష్టులయ్యారు. ఈ విధ్వంసం 2009వ సంవత్సరంలో జరిగింది.

Stuxnet వైరస్‌ మరో 14 దేశాలకి పాకి, ఎన్నో వేల కంప్యూటర్‌లను నిరూపయోగం చేసింది. ఈ ఒక్క వైరస్‌ తయారీ కోసం 15,000 లైన్ల సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ ఉపయోగించబడింది.

ఇజ్రాయెల్‌ అంతకుముందు తనకు మరో బద్ధ శత్రువైన ఇరాక్‌లో నిర్మితమవుతున్న ఆటంబాంబు ఫ్యాక్టరీని 1981వ సంవత్సరంలో యుద్ధ విమానాలను పంపించి బాంబుల వర్షం కురిపించి, ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్‌కు మరొక శత్రువైన సిరియా ఉత్తర కొరియా శాస్త్రజ్ఞుల సహాయంతో అణుబాంబులను తయారు చేసే ఫ్యాక్టరీని నిర్మించింది. 2006 సంవత్సరంలో ఇజ్రాయెల్‌ దీనిని కూడా బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసింది. ఈ చర్య ఎంతో అపాయంతో కూడినది. సిరియా రాడార్లు ఇజ్రాయెల్‌ బాంబర్లను కనిపెట్టకుండా చేయడానికి Suter అనే సాంకేతికతను ఉపయోగించింది. దీని ప్రయోగం వల్ల లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా కనిపిస్తాయి. మహాభారతంలో యుధిష్ఠిరుడు రాజసూయయాగం చేసినప్పుడు దుర్యోధనుడు నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్లుగా, మూసిన తలుపులు తెరచి ఉన్నట్లుగా చూసి భంగపడ్డాడు. Suter అనే ఎలక్ట్రానిక్‌ టెక్నాలజీ వల్ల సిరియా రాడార్‌లు ఇలా భంగపాటు చెందాయి.

ఇజ్రాయెల్‌ ఈ రెండు పర్యాయాలలో విమానాలను పంపి, బాంబులు వేసి, శత్రువు మరణాయుధ కర్మాగారాలను ధ్వంసం చేసింది. ఇవి ఎంతో అపాయకరమైన సాహస చర్యలు. కాని కంప్యూటర్‌లో నిర్మించిన వైరస్‌ల ద్వారా ఏ అస్త్రశస్త్రాలు ఉపయోగించకుండా శత్రువుల సాధనాలను ధ్వంసం చేయగలిగింది. ఇలాగే ఇకపై జరగబోయే యుద్ధాలు సైన్యాలను, విమానాలను, క్షిపణులను ఉపయోగించకుండానే సైబర్‌ వార్స్‌ అనే క్రమంలో జరుగుతాయి.

ఉదాహరణకు మన రైల్వే వ్యవస్థ విద్యుత్‌ పంపిణీ వ్యసస్థ, మన సైనిక స్థావరాలు. ఇవన్నీ కంపూటరీకరణం అయ్యాయి. ఇలా అన్ని దేశాలూ చేస్తూనే ఉన్నాయి. ఇలా కంప్యూటరీకరణం అయిన ప్రతి వ్యవస్థను సైబర్‌ వార్‌ ద్వారా భగ్నం చేయవచ్చు. అందుకోసం ఆ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి trogen horse అనే వైరస్‌ను ప్రవేశపెట్టాలి. దీనిద్వారా అందులోని ఇన్‌ఫర్‌మేషన్‌ అంతా శత్రువు సంగ్రహించవచ్చు. ఈ ప్రక్రియను exfiltration అంటారు. శత్రువు సంగ్రహించిన ఇన్‌ఫర్‌మేషన్‌ను వక్రీకరించవచ్చు. ఈ రెండు విన్యాసాల వల్ల ఆయా వ్యవస్థలు భగ్నం అవుతాయి. ఇలా శత్రువులు సునాయసంగా దేశాన్ని ఆక్రమించవచ్చు. ఈ విధమైన యుద్ధాలను సైబర్‌ వార్స్‌ (సైబర్‌ యుద్ధాలు) అంటారు.

కంప్యూటర్‌లు, వెబ్‌సైట్‌లను ఎవరూ హ్యాక్‌ చేయడానికి వీలులేకుండా కూడా ఇప్పుడు మరో వ్యవస్థ నిర్మాణమైంది. అదే సైబర్‌ సెక్యూరిటీ. అంటే హ్యాక్‌లను నిరోధించే కొన్ని సాఫ్ట్‌వేర్‌లను తయారుచేయడం. ఇలా సైబర్‌ సెక్యూరిటీ కోసం ప్రపంచంలో 100 బిలియన్‌ డాలర్ల విలువైన పరికరాలు అమ్మబడుతున్నాయి. వీటిలో 15% ఇజ్రాయెల్‌ తయారు చేసి ఎగుమతి చేస్తోంది.

– డా.త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, ప్రముఖ సాంకేతిక నిపుణులు,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమాజీ సాంకేతిక సలహాదారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *