అందమైనది బాల్యం.. వీరికేమో బలిపీఠం

అందమైనది బాల్యం.. వీరికేమో బలిపీఠం

జూన్‌ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం

బాల్యం.. జీవితంలో అదో అపూర్వ ఘట్టం. జీవిత చరమాంకం దాకా తీపి గురుతులను మరిచిపోలేని మధుర జ్ఞాపకం. పొత్తిళ్ల నుంచి మొదలుకొని తనంతట తానుగా అడుగులు వేస్తూ నడవడం.. ఆ తర్వాత యుక్తవయస్సు వచ్చేదాకా.. అమ్మ కొంగుచాటున, నాన్న వేలు పట్టుకొని ఎదగడం.. అందుకే ఆ కాలం ఎంతో మధురం. పూర్తిగా ఎదుటివాళ్లమీదనే ఆధారపడి కష్ట నష్టాలు తెలియకుండా, బాధ్యతలు లేకుండా హాయిగా గడిచిపోయే వయసు బాల్యం. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండోవైపు ఉన్నట్లుగానే పైన చెప్పుకున్న దానికి భిన్నంగా పెరుగుతూ కష్టాలు అనుభవిస్తున్న బాలలు కూడా ఉన్నారు. ఎవరి ఆసరా లేకుండా పెరగడమే కాదు.. పసిప్రాయంలోనే బాధ్యతలు భుజానికెత్తుకునే బుజ్జికన్నలు కూడా అక్కడక్కడా కనిపిస్తారు. వాళ్లే బాల కార్మికులు. కొందరు కుటుంబ, ఆర్థిక పరిస్థితుల కారణంగా బాలకార్మికులుగా మారితే.. మరికొందరు బాలలు బలవంతంగా కార్మికులుగా బతుకీడుస్తున్నారు.

బాలకార్మిక వ్యవస్థ ఓ రకంగా తీవ్రమైన మానవ హక్కుల సమస్య. ‘బాల్యాన్ని నాశనం చేసే రీతిలో బాలుడు లేదా బాలిక పనిచేయడం’ – బాల కార్మికుడు అన్న దానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనం ఇది. బాలల శారీరక, మానసిక అభివృద్ధికి ఆటంకమై వారికి కనీస అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వని పనిని, స్థితిని బాలకార్మిక వ్యవస్థ అంటారు. అక్షర జ్ఞానానికి నోచుకోకుండా భారమైన శ్రమకు బలైపోతున్న బాలల జీవితాలు ప్రస్తుత నాగరిక సమాజాన్ని వెక్కిరిస్తు న్నాయి. ప్రగతికే తలవంపులు తెస్తున్నాయి.

మనదేశంలోని ప్రమాదకర పని స్థలాల్లోనూ పసివాళ్లు పనిచేస్తున్నారు. సూరత్‌లోని వజ్రాల పరిశ్రమల్లో, శివకాశీలోని టపాసుల తయారీ పరిశ్రమల్లో, జైపూర్‌లోని రాళ్ల పనిలో, ఫిరోజాబాద్‌ లోని అద్దాల పరిశ్రమల్లో, మురాదాబాద్‌లోని లోహ పరిశ్రమల్లో, అలీఘర్‌లోని తాళాల తయారీ పరిశ్రమల్లో, మీర్జాపూర్‌లోని తివాచీల తయారీ కర్మాగారాల్లో, మార్కాపూర్‌లోని పలకల తయారీ పరిశ్రమల్లో అత్యంత దయనీయమైన వాతా వరణంలో బాలకార్మికులు పనిచేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇటుకబట్టీల్లో, భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఈ పరిశ్రమలన్నీ ప్రమాదభరిత పనులకు సంబంధించినవే. ఇంకా అనేకమంది పిల్లలు హోటళ్లలో, దుకాణాలలో, ఇళ్లలో పనులు చేస్తున్నారు. పిల్లలు వాళ్ల శక్తికి మించి ఎక్కువ గంటలు పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతు న్నారు. శారీరక, మానసిక సమస్యలతో బాధపడు తున్నారు. యునిసెఫ్‌ లెక్కల ప్రకారం దాదాపు 50శాతం మంది, ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం సుమారు 43 శాతం మంది బాలబాలికలు ఎనిమిదో తరగతి లోపే బడి మానేస్తున్నారు. బడి మానేసిన ప్రతి బాలుడూ అనివార్యంగా బాల కార్మికుడిగానే జీవిస్తున్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

2025 నాటికి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యం

ఐక్యరాజ్యసమితి ప్రతియేటా జూన్‌ 12వ తేదీని అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన దినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కోయేడాది ఒక్కో నినాదం ఇస్తుంది. ఈ క్రమంలోనే 2019వ సంవత్సరం కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ప్రత్యేక థీమ్‌ను రూపొందించింది. ఈ యేడాది ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నినాదం ‘Children should not work in fields, but on dreams!’ (చిన్నారులు పని స్థలాల్లో పనిచేయ కూడదు, వాళ్ల స్వప్నాలు నెరవేర్చుకోవాలి) ఈ యేడాది ప్రపంచ దేశాలన్నింటిలో ఈ థీమ్‌తోనే బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితికి చెందిన కార్మిక హక్కుల గురించి, కార్మిక సమస్యల పరిష్కారం గురించి పనిచేసే ప్రత్యేక ఏజెన్సీ ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (అంత ర్జాతీయ కార్మిక సంస్థ). 1919లో స్థాపించిన ILO విధివిధానాల్లో బాలల రక్షణ అంశాన్ని కూడా పొందు పరిచారు. సాంఘిక న్యాయాన్ని బలపరుస్తూ తగిన మర్యాదతో కూడిన పనులను ప్రోత్సహిస్తున్న ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ILO) ఈయేడాది వందేళ్ల ఉత్సవాలు నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగానే.. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో పలు అంశాలను గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 152 మిలియన్ల పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ బాలకార్మికులు కనిపిస్తున్నారు. భారతదేశంలో ఇళ్లల్లో పనిచేసే బాల కార్మికుల సంఖ్య పెరుగుతోందని జాతీయ బాలల హక్కుల కమిషన్‌ జరిపిన తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో వందేళ్లుగా ILO సహకారాన్ని పొందుతున్న దేశాల్లో బాలకార్మిక వ్యవస్థపై సాధించిన పురోగతి విషయంలో ఈ యేడాది ప్రపంచ కార్మిక సంస్థ దృష్టి సారించనుంది. అంతర్జాతీయ సమాజం రూపొందించుకున్న స్థిరమైన అభివృద్ధి లక్ష్యంలో భాగంగా 2025 నాటికి బాల కార్మికులు లేని ప్రపంచాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంపైనా ఈ యేడాది నిర్వహించే ఉత్సవాల్లో దృష్టి పెట్టనున్నట్లు ILO ప్రకటించింది.

బాల కార్మిక నిషేధ చట్టాలు

బాలకార్మిక నిర్మూలనకు అనేక చట్టాలు రూపొందాయి. వాటి ప్రకారం పిల్లలతో పని చేయించుకునేవాళ్లకు కఠిన శిక్షలు విధించేందుకు, భారీగా జరిమానాలు విధించేందుకు అవకాశం ఉంది. వాటిలో కొన్ని చూస్తే..

బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం

1986లో బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం రూపొందింది. ఈ చట్టం ప్రకారం ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికులు ఉండటాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి భారీగా అపరాధ రుసుమును విధించవచ్చు. అలాగే.. జైలుశిక్ష విధించడానికి అవకాశం ఉంది.

విద్యా హక్కు చట్టం, 2009

బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడానికి ముందుగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. చట్టం అమల్లో భాగంగా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలి. బడిబయట ఉన్న పిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించాలి. మధ్యలో బడి మానేయకుండా చూసే లక్ష్యంలో భాగంగా ఎనిమిదో తరగతి వరకూ డిటెన్షన్‌ పద్ధతి ఉండకూడదని విద్యాహక్కు చట్టంలో నిర్దేశించారు. విద్యా సంవత్సరంలో ఏ సమయంలో వచ్చినా తగిన తరగతిలో చేర్చుకోవాలి. దండన లేని బోధన అందించాలి.

అలాగే.. ది ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌-1948, ది మైన్స్‌ యాక్ట్‌-1952, వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం-1976, ది కాంట్రాక్ట్‌ లేబర్‌ (నియంత్రణ, నిర్మూలన) చట్టం-1970ల ప్రకారం బాల కార్మికులతో పని చేయంచడం నేరమే. పై చట్టాలే కాకుండా భారత రాజ్యాంగంలోని 24, 39, 45వ అధికరణలు పిల్లలకు శ్రమ దోపిడీ నుంచే కాకుండా ఇతర రక్షణలనూ కల్పిస్తున్నాయి. వయసుకు తగని ఆర్థిక కార్యకలాపాలు, వృత్తుల్లో పని చేయకుండా భారత రాజ్యాంగం పిల్లలకు రక్షణ కల్పిస్తోంది. రాజ్యాంగంలోని 24 వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలు ప్రమాదకర వృత్తులు చేపట్టడం నిషిద్ధం. బాల్యాన్ని, యవ్వనాన్ని దోపిడీ నుంచి రక్షించాలని రాజ్యాంగ ప్రకరణలు 39(ఈ), (ఎఫ్‌) చెబుతున్నాయి.

జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులు

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా రూపొందించారు. కేవలం బాల కార్మికుల సంక్షేమానికి, ఆ వ్యవస్థ నిర్మూలనకు ఉద్దేశించి ఈ ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో జాతీయ స్థాయిలో చేపట్టిన కార్యక్రమం జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు (NCLP). అంతర్జాతీయ స్థాయిలో ILO ప్రారంభించిన ప్రాజెక్టు ఇంటర్నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ ద ఎలిమినేషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ లేబర్‌ (IPEC).

జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్రం జాతీయ బాలకార్మిక ప్రాజెక్టును 1988లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌ కింద బాలకార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు. మొదటగా బాల కార్మికులు అధికంగా ఉన్న 12 జిల్లాల్లో ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు దశల్లో భారీగా చీజకూూ పాఠశాలలు నెలకొల్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 271 జిల్లాల్లో పదివేలకు పైగా ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఐదు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద 6.47 లక్షల మంది పిల్లలను ప్రత్యేక శిక్షణ అనంతరం సాధారణ పాఠశాలల్లో చేర్చారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పని నుంచి విముక్తి కల్పించిన పిల్లలకు పునరా వాసాన్ని అందించడం. అలాంటి పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో చేరుస్తారు. వారికి బ్రిడ్జి కోర్సుల ద్వారా విద్యను అందిస్తారు. వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారు. వీరికి ఉపకార వేతనం, ఆరోగ్య రక్షణ సదుపాయాలు కూడా అందిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. ఈ పథకం కింద జిల్లా స్థాయిలో ప్రాజెక్టు సొసైటీలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలేవైనా పునరావాస ప్రాజెక్టులను నిర్వహిస్తే వాటికి అయ్యే ఖర్చులో 75 శాతం మేరకు కేంద్రం సమకూరుస్తుంది.

ఇంటర్నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ ద ఎలిమినేషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ లేబర్‌

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా 1992లో ఇంటర్నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ లేబర్‌ (IPEC) అనే కార్యక్రమాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రారంభించింది. దేశాల సామర్ధ్యాన్ని పటిష్ట పర్చడం, బాల కార్మిక వ్యవస్థ నిరోధానికి ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. IPEC ప్రస్తుతం 88 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2008లో సాంకేతిక సహకార ప్రాజెక్టులపై దీని వార్షిక వ్యయం 61 మిలియన్ల యూఎస్‌ డాలర్లకు చేరుకున్నది. బాల కార్మిక వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ILO నిర్వహిస్తున్న భారీ కార్యక్రమం ఇది.

బాలకార్మిక వ్యవస్థ సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్య. దీన్ని నిర్మూలించడానికి స్థిరమైన, దీర్ఘకాల కృషి అవసరమన్నది నిపుణుల మాట. బాలలను పనికి పంపకుండా ఉండాలంటే మొదట చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. విద్యా విధానంలోనూ సమగ్ర మార్పులు రావాలి. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన బాలలకు పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వ – ప్రభుత్వేతర సంస్థల మధ్య సమన్వయం ఉండాలి. ఇటువంటి చర్యలు తీసుకుంటే పసిదివ్వెలు వసివాడకుండా చూసుకోవచ్చు.

1098 – బాలకార్మికుల కోసం ఫ్రీ హెల్ప్‌ లైన్‌

పై చట్టాలు, కార్యక్రమాలకు తోడు దేశ వ్యాప్తంగా చైల్డ్‌ లైన్‌ హెల్ప్‌ లైన్‌ పనిచేస్తోంది. ఎవరైనా బాలకార్మికులను చూసినా.. లేదా ఒక చోట పనిచేస్తున్నట్టు సమాచారం ఉన్నా 1098కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే సంబంధిత చైల్డ్‌ లైన్‌ సిబ్బంది వచ్చి ఆ పిల్లాడిని జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరు పరుస్తారు. వారు కౌన్సెలింగ్‌ ఇచ్చి జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చిల్డ్రన్‌ హోమ్‌కు తరలిస్తారు. అక్కడ ఆ చిన్నారి నుంచి తగిన వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రులు ఉంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లాడిని పాఠశాలకు పంపేలా తగిన చర్యలు తీసు కుంటారు. ఒకవేళ వారికి ఎవరూ లేరనుకుంటే వారిని సరిపడే వసతిగృహానికి పంపి విద్యా భ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకుంటారు.

– సప్తగిరి, 9985466888

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *