‘బోస్‌ చరిత్రంతా వక్రీకరణలే !’

‘బోస్‌ చరిత్రంతా వక్రీకరణలే !’

– బ్రిటిష్‌ తొత్తులు, కాంగ్రెస్‌ భక్తులు స్వరాజ్య సమర చరిత్రకు మసిపూశారు.

– భారత చరిత్ర రచనను నెహ్రూ తప్పుతోవ పట్టించారు.

– నరేంద్ర మోదీ చరిత్రను సరిచేస్తున్నారు.

– స్వాతంత్య్ర సాధనలో ‘అహింసా పథం’ పాత్ర స్వల్పం

– ‘ఆర్గనైజర్‌’తో సుభాష్‌ బోస్‌ అన్నగారి మునిమనుమని వ్యాఖ్య

‘లాలా హరదయాళ్‌, శ్యామ్‌జీ కృష్ణవర్మ, బీర్సా ముండా, అల్లూరి శ్రీరామరాజు, భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సావర్కర్‌ వంటి మహనీయుల, త్యాగధనుల పేర్లు వింటే ఇప్పటికీ భారతీయ యువత హృదయం ఉప్పొంగిపోతుంది. అలాగే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరు విన్నా భారత జాతి గుండె స్పందిస్తుంది. వారందరి త్యాగాలు అలాంటివి. ఈ దేశం కోసం, ఈ ప్రజల స్వాతంత్య్రం కోసం వారు చేసిన నిస్వార్థ త్యాగం ఎప్పటికీ స్మరణీయమే. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా ఇలాంటి వారికి, అంటే గాంధీమార్గంలో కాకుండా, తమకు నచ్చిన మార్గంలో దేశం కోసం పోరాడిన వారి చరిత్రలకు పాఠ్యపుస్తకాలలో తగిన స్థానం దొరడడంలేదు. ఈ అంశం మీదే నేతాజీ బోస్‌ సోదరుడు శరత్‌చంద్ర బోస్‌ ముని మనుమడు చంద్రకుమార్‌ బోస్‌ మాట్లాడారు. అండమాన్‌ నికోబార్‌ ద్వీపాలకు అజాద్‌ ఫౌజ్‌ దళపతి సుభాష్‌ చంద్రబోస్‌ పేరు పెట్టాడాన్ని చంద్రకుమార్‌ స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్‌ ఆంగ్ల పత్రిక సీనియర్‌ పాత్రికేయులు నిశాంత్‌ కె.ఆర్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. అందులో ముఖ్యాంశాలు…

నేతాజీకి నివాళిగా అండమాన్‌ నికోబార్‌లోని హావ్లాక్‌, నేల్‌, రోస్‌ దీవులకు ఆయన పేరు పెట్టాలని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మీరే తీసుకొచ్చారు. దీని ఫలితం గురించి మీ స్పందన, అనుభూతి ఏమిటి?

రోస్‌, నేల్‌, హావ్లాక్‌ దీవులను నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దీవులుగా ప్రకటించాలని ఎన్నో ఏండ్లుగా డిమాండ్‌ ఉంది. అది ఈ దేశ ప్రజల ఆకాంక్ష. రెండవ ప్రపంచయుద్ధం అనంతరం బ్రిటిషర్ల నుంచి జపాన్‌ ఈ దీవులను స్వాధీనం చేసుకుంది. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి నేతాజీ బోస్‌కు అప్పగించింది. అవిభాజిత భారత తొలి ప్రధానమంత్రిగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ డిసెంబరు 30, 1943న తొలిసారి భారత పతాకాన్ని సగౌరవంగా ద్వీపాలపై ఎగురవేశారు. అనంతరం ద్వీపాన్ని షహీద్‌, స్వరాజ్‌ ద్వీపాలుగా ఆయనే ప్రకటించారు.

అగస్టు 15, 1947న బ్రిటిష్‌ ప్రభుత్వం భారత దేశానికి స్వతంత్రం ప్రకటించింది. అనంతరం విభజిత భారత ప్రధాని జవహర్‌లాల్‌ డిసెంబరు 30, 1947లో అండమాన్‌ దీవులకు వెళ్లి వాటిని షహీద్‌, స్వరాజ్‌ దీవులుగా ప్రకటించి ఉండవల సింది. కానీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైనికులకు గౌరవం దక్కడానికి 72 సంవత్సరాలు పట్టింది. నేతాజీ సైన్యాన్ని గౌరవించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నా ధన్యవాదాలు. ఆ దీవులకు కొత్త పేర్లు నేతాజీకి నిజమైన నివాళి.

ఎన్నో దేశాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తమ దేశ అంతర్భాగంగా చెప్పుకుంటున్నప్పటికీ వాటిని స్వాధీనపరచుకోవడంలో నేతాజీ పాత్రను ఎలా అంచనా వేయవలసి ఉంటుంది? ఆయనకి ఎలా సాధ్యమైంది?

సుభాష్‌ చంద్రబోస్‌ సాహసంతో ఈ దీవులు స్వాంతంత్య్రం పొందాయి గానీ, ఒకవేళ ఆనాడు ఆ చారిత్రక ఘటనే జరగకుంటే ఇప్పటికీ అవి విదేశాల ఆధీనంలో ఉండేవి. వాటిని వ్యూహాత్మక ప్రదేశంగా మార్చుకునే దష్టితో చాలా దేశాలు వాటిపై కన్నేసి ఉండేవి. వీటి ఆక్రమణకు ఆ దేశాల వ్యూహాలు విజయవంతం అయ్యేవి. ఇక ఆ పరిణామం మన దేశభద్రతకు ముప్పుగా పరిణమించేదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కేవలం నేతాజీ వంటి యోధుడి కదలికల వల్లనే బ్రిటిషర్లు ఆ దీవులను భారతదేశానికి అప్పగించేందుకు ముందుకు వచ్చారు.

ఈ దీవులలోని ప్రజలను జపాన్‌ సైనికులు అణచివేతకు గురి చేశారనీ, ప్రజలు కూడా ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ని వ్యతిరేకించారనీ ఇప్పటికీ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. వాటిలో వాస్తవం ఎంత?

ఆ ద్వీపాలలో నివసించిన వారిని ఆనాడు జపాన్‌ జాతీయులు అణచివేతకు గురిచేశారంటే, అది పసలేని వాదన. బ్రిటిషర్లకు తొత్తులుగా పనిచేసిన వారి వారసత్వం, ఆంగ్ల మనస్తత్వం ఇప్పటికీ కాంగ్రెస్‌లో ఉంది. వారే ఇప్పటికీ దీవులలోని ప్రజలు నేతాజీని ఇష్టపడలేదని ప్రచారం చేస్తూ ఉంటారు. జపనీయుల అరాచకాలు, అణచివేత కబురును తెరపైకి తెస్తున్నవారు కూడా వీరే. గత ఏడేళ్లలో చాలాసార్లు నేను అండమాన్‌ నికోబార్‌ దీవులకు వెళ్లాను. అక్కడి ప్రజలతో మాట్లాడాను. నేతాజీపట్ల వారికున్న గౌరవం నాకెంతో ఆనందాన్ని కలిగింది. ఇవాళ్టికీ అక్కడి ప్రజానీకానికి నేతాజీ అంటే గొప్ప హీరో కింద లెక్క. ఎంతో ఆరాధన.

జపనీయులు మార్చి 23, 1942 సంవత్సరంలో దీవులకు వచ్చారు. నాలుగు నెలలపాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అజాద్‌ హింద్‌ ప్రభుత్వం డిసెంబరు 30, 1943న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీవులను స్వాధీనపరచుకునేటప్పుడు అప్పటి జపాన్‌ సైనిక జనరల్‌ హిడేకీ టోజోకు నేతాజీ స్పష్ట మైన సూచనలు చేశారు. ‘నా ప్రజలపై ఎటువంటి అరాచకాన్ని నేను సహించను’ అని టోజోకి నేతాజీ చెప్పారు. ఈమాటలకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి కూడా.

భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పాత్ర ఎలాంటిది?

మన స్వాతంత్య్ర పోరాటం 1857లో ప్రథమ స్వాతంత్య్ర సమరంతో మొదలైంది. మంగళ్‌పాండేతో మొదలైన ఆ తిరుగుబాటు షహీద్‌ భగత్‌సింగ్‌, ఖుదీరాం బోస్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటివారి త్యాగాలతో స్వాతంత్య్రానికి బాటలు పరిచింది. ఆ తరువాతే గాంధీజీ గారి అహింసా మార్గం ముందుకొచ్చింది. గాంధీజీ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారనేది వాస్తవం. స్వాతంత్య్ర పోరాటం మీద ఆయన ముద్ర ఒక వాస్తవం. కానీ బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌, నేతాజీల యుద్ధమే అంతిమవాక్యం పలికిందన్నది నిజం. ఇవి కేవలం నా మాటలు కాదు. జనరల్‌ జీడీ బక్షి రచించిన ‘బోస్‌: యాన్‌ ఇండియన్‌ సమురాయ్‌’ పుస్తకంలో ఇవి నమోదై ఉన్నాయి. బ్రిటిష్‌ ప్రధాని క్లెమెంట్‌ రిచర్డ్‌ అట్లీ, నాటి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జస్టిస్‌ ఫణీభూషణ్‌ చక్రవర్తి మధ్య జరిగిన సంభాషణలను బక్షి తన పుస్తకంలో ఉటంకించారు.

1956లో గవర్నర్‌ అతిథిగా కోల్‌కత్తా వచ్చిన అట్లీ రాజ్‌భవన్‌లో బస చేశారు. ఆయన 1945 నుంచి 1951 వరకు బ్రిటిష్‌ ప్రధానమంత్రి. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించడానికి అంగీకరించినది కూడా ఆయనే. ఆయన హయాం లోనే ఆ చారిత్రక ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా!

ఆ సమయంలో పీబీ చక్రవర్తి కోల్‌కత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ తాత్కాలిక గవర్నరుగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఆర్‌.సి.మజుందర్‌ రచించిన ‘హిస్టరీ ఆఫ్‌ బెంగాల్‌’ ప్రచురణకర్తలకు చక్రవర్తి ఒక ఉత్తరం రాశారు. దానిలో ఆయన చాలా విషయాలే ప్రస్తావించారు కూడా. ‘నేను పశ్చిమ బెంగాల్‌ తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న సమయంలోనే బ్రిటిష్‌ ప్రధాని అట్లీ కోల్‌కత్తా వచ్చారు. బ్రిటిష్‌ పాలనకు స్వస్తి పలికి మనకు స్వాతంత్య్రం ఇచ్చిన వ్యక్తి ఆయనే. భారత్య పర్యటనలో భాగంగా వచ్చారు. రెండు రోజులపాటు కోల్‌కత్తా రాజ్‌భవన్‌లో అతిథిగా ఉన్నారు. ఆ సమయంలో బ్రిటిష్‌ జాతీయులు భారతదేశాన్ని వీడి వెళ్లడానికి వెనుక ఉన్న కారణాలను గురించి కూలంకషంగా చర్చించాను’.

చక్రవర్తి ఆ ఉత్తరంలో ఇంకా ఇలా రాశారు. ‘అట్లీని నేను సూటిగా ఒకటే ప్రశ్న అడిగాను. 1947 వరకు గాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమం తప్ప దేశంలో అంత ప్రభావవంతమైన ఉద్యమాలు ఏవీ లేవు. మరి బ్రిటిష్‌ జాతీయులు భారతదేశాన్ని వదిలి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది?’ అని. అందుకు సమాధానంగా అట్లీ ఎన్నో కారణాలను చూపించారని చక్రవర్తి పేర్కొన్నారు. నేతాజీ సైనిక విన్యాసాల కారణంగా భారత సైన్యం, నౌకా దళాలలో బ్రిటిష్‌ అధికారుల పట్ల గౌరవ భావం తగ్గిపోయింది. అనంతరం చక్రవర్తి స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ అహింసా పోరాటం ఎంత వరకు ప్రభావం చూపిందని అట్లీని అడిగారు. అందుకు అట్లీ వ్యంగ్యంగా ‘మినిమల్‌’ (కొద్దిగా) అనే పదాన్ని నర్బగర్భంగా పలికారని చక్రవర్తి ఆ ఉత్తరంలో పేర్కొన్నారని బక్షి ఉటంకించారు.

ఏప్రిల్‌ 14, 1944వ సంవత్సరంలోనే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఉండేది. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ కల్నల్‌ షౌకత్‌ అలీ మాలిక్‌ ఆధ్వర్యం లోని బహదూర్‌ బ్రిగేడ్‌ తొలుత మోయిరాంగ్‌ ప్రాంతాన్ని స్వాధీనపరచుకుంది. అదే భారతదేశంలో ఐఎన్‌ఏ తొలి అడుగు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఇంఫాల్‌ మీద దండయాత్ర సందర్భంలో ఇది జరిగింది. ఏప్రిల్‌ 14, 1944న అక్కడే త్రివర్ణ పతాకాన్ని మాలిక్‌ ఎగురవేశారు. వెంటనే మాలిక్‌ ‘ఛలో దిల్లీ’ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. ఢిల్లీలో ఎర్రకోట మీద మన పతాకాన్ని ఎగుర వేయడమే ఆయన ఆశయం. అయితే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా అది సాధ్యపడలేదు. అంతేకాదు, కొన్ని రహస్య కారణాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌లోని కొందరు దిల్లీ నాయకులు అంతర్గతంగా బ్రిటిష్‌ వారితో కలిసిపోయి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ అణచివేతకు కూడా ప్రయత్నం చేశారు. అన్ని సక్రమంగా జరిగి ఉంటే 1944లోనే మనం ‘పూర్ణ స్వరాజ్‌’ సాధించే వాళ్లం. అఖండ భారత విభజనను బోస్‌ పూర్తిగా వ్యతిరేకించారు.

జీడీ బక్షి కూడా ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ లేకపోతే భారతదేశం బ్రిటిషర్ల బానిసత్వంలో మరో యాభై, అరవైయేళ్లు ఉండేది’ అని తన పుస్తకంలో వ్యాఖ్యా నించారు. అయితే ఈ నిజాలు ఏనాడూ వెలుగు చూడలేదు. ప్రజలకు చారిత్రక వాస్తవాలను తెలియజేయడానికి ఇదే సరైన సమయం. నిజాన్ని ఎవరూ ఎక్కువ కాలం అణచిపెట్టి ఉంచలేరు. వాస్తవ చరిత్రను వెలికి తీయవలసిన సమయం ఆసన్న మైంది.

చాలా వరకు పాఠ్యపుస్తకాల్లో అహింసా ఉద్యమం గురించే ఉంది, కాని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీకి సరైన స్థానం లభించలేదు. ఎందుకు?

బ్రిటిష జాతీయులకు తొత్తులుగా ఉండిపోయిన వారి పుణ్యమా అంటూ భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర పూర్తిగా వక్రీకరణకు గురైంది. తరువాత నెహ్రూ, ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పనిచేసిన తొత్తులు చరిత్ర రచనను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌కి, మహాత్మాగాంధీకి ఎటువంటి సంబంధం లేదు. గాంధీజీ పేరు తమ ఆస్తిగా కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ గాంధీజీ నమ్మిన ధర్మాన్ని, సిద్ధాంతాలను, భారతీయ సంస్కతి సంప్రదాయాలను వ్యతిరేకించే వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. భారతీ యుల మనోగతాన్ని, ఆత్మాభిమానాన్ని ప్రతిబింబించని స్వార్థపరుల చేతుల్లో ఈ కాంగ్రెస్‌ ఉంది.

స్వాతంత్య్రం సాధించుకున్నాం కాబట్టి, ఇక కాంగ్రెస్‌ ఏర్పడిన లక్ష్యం పూర్తయిందని, ఆ సంస్థను నిర్వీర్యం చేయడం మంచిదని గాంధీజీ స్పష్టంగా చెప్పారు. మా నాన్న అమియానాథ్‌ బోస్‌ గాంధీజీకి అత్యంత సన్నిహితులు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత పుణెలో ఆయన గాంధీజీని కలిశారు. ఆ సమయంలో సరోజినీనాయుడు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ‘నేను సరైన అశ్వాన్ని ఎంచుకోలేదు. నెహ్రుకు ఊతమిచ్చి తప్పుచేశాను. ఇప్పుడు సమయం మించిపోయింది’ అని గాంధీజీ అన్నారు.

నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీఏ) చరిత్ర రచనలో జరిగిన పొర పాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఇది ‘చరిత్రను తిరగరాయడం’ కాదు ‘చరిత్రను సరిచేయడం’.

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ విజయాల గురించిన వాస్తవాలు ప్రజలకూ, ముఖ్యంగా యువతకూ చేరేలా మనం ఏం చేయగలం?

మనం చేయగలిగిన మొట్టమొదటి పని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) చరిత్రకు పాఠ్యపుస్తకాల్లో తగిన స్థానం కల్పించాలి. స్వాతంత్య్రోద్యమం గురించి మహోన్నత చరిత్ర కారుడు రమేశ్‌చంద్ర మజుందర్‌ రాసిన పుస్తకాలలో కనిపించే మార్గదర్శక అంశాల్లో ఆ అంశాన్ని చేర్చాలి.

ఇక్కడొక విషయం చెబుతాను. నెహ్రూ కూడా భారతదేశ చరిత్ర మీద ఒక పుస్తకం రాయవలసిందని మజుందర్‌ను అడిగారు. మజుందర్‌ ఒక పుస్తకం రాసి నెహ్రూకు ఇచ్చారు కూడా. అయితే అది ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌ పోషించిన పాత్రే గొప్పదంటూ మజుందార్‌ రాయలేదు.

ప్రొఫెసర్‌ ప్రఫుల్‌ చంద్రగుప్త ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ గురించి అద్భుతమైన చరిత్ర పుసకం రచించారు. దానిని నెహ్రూ నిషేధించడమే కాకుండా దిల్లీలోని రక్షణ శాఖ పురాపత్రాల భాండాగారంలో బంధించారు. ప్రఫుల్‌ చంద్ర గ్రంథాన్ని బహిర్గతం చేయాలి. ప్రజల్లోకి తీసుకురావాలి. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని నేను ఎంతోమందిని కోరాను. విద్యార్థులు దాని గురించే ప్రయత్నం చేయాలి. చరిత్ర రచనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడానికి ఇది సరైన సమయం. అందుకు ఐదు సంవత్సరాల కాలం అవసరం.

ఇప్పటివరకు కనిపించిన, వినిపించిన స్వాతంత్య్ర పోరాట చరిత్ర నిజమైంది కాదు. దాని వెనకాల వాస్తవం వేరే విధంగా ఉంది. ఆ కనబడని చరిత్రను ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాలి. మన విద్యార్థులకు బోధించేదంతా మసిపూసి మారేడు కాయ చేసిన చరిత్రే. ఇదే విధంగా తప్పుడు చరిత్రను బోధిస్తే భావితరాలు ఎన్నటికీ మనల్ని క్షమించవు. నిజమైన చరిత్రను బోధించే కృషిని ఆరంభించడానికి కూడా ఇదే తగిన సమయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *