బోనాలెత్తితిమమ్మా.. దయచూడగ రావమ్మా..

బోనాలెత్తితిమమ్మా.. దయచూడగ రావమ్మా..

”యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!”

సర్వ ప్రాణుల్లోనూ మాతృరూపంగా ఉన్న ఆ జగన్మాతకు నమస్కారములు అని చెప్పడమే ఈ శ్లోక భావం. సకల ప్రాణులకూ తల్లే మూలం అని దీని పరమార్థం. మాతృశబ్దం ఎంత గొప్పదో అంత బాధ్యతాయుతమైనది. బిడ్డలకు జన్మనివ్వడమే కాదు, వారిని తల్లి పెంచి పోషిస్తుంది. అందుకే సకల చరాచర సృష్టిలో జీవులన్నీ తల్లినే ఆశ్రయిస్తాయి. సర్వలోకాలకు తల్లి ఆ జగజ్జనని. ఆదిపరాశక్తి కాబట్టే ఆమె అమ్మలగన్న అమ్మ అయ్యింది.

ఎన్నో దుష్టశక్తులు ఈ లోకంలోని ప్రశాంతతను దెబ్బతీయడానికీ, సాధు సత్పురుషుల జీవన విధానానికి భంగం కలిగించడానికి అనేకమార్లు ప్రయత్నించాయి. ఆ దుష్టశక్తుల ఆగడాలను భరించ లేక ‘అమ్మా’ అంటూ ఆర్తనాదం చేసిన ప్రతిసారి ఆ దుర్గమ్మ తల్లి తన బిడ్డలను కాపాడుకోవడం కోసం వివిధ రూపాలను ధరిస్తూ అసుర సంహారం చేస్తూ వచ్చింది.

మనకు సాధారణంగా నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేవి శరన్నవరాత్రులు లేదా ఛైత్ర నవరాత్రులు.. కానీ ప్రతి సంవత్సరం అమ్మవారికి నాలుగు సార్లు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అవి మాఘమాసంలో, ఆషాఢ మాసంలో, ఆశ్వయిజ మాసంలో, ఛైత్రమాసంలో.. ఆషాఢ మాసంలో జరిగే నవరాత్రి ఉత్సవాలను శాకంబరీ ఉత్సవాలనీ లేదా వారాహీ నవరాత్రులని అంటారు. మాఘ మాసంలోనూ, ఆషాఢ మాసంలోనూ జరిగే నవరాత్రులను గుప్త నవరాత్రు లనే పేరుతో పిలుస్తారు.

‘అమ్మవారివి సహస్ర నామాలూ, సహస్ర రూపాలూ. వేటికవే ప్రత్యేక మైనవీ, అంతరార్థంతో కూడుకున్నవి. వేదకాలంలో పెద్ద క్షామం ఏర్పడినప్పుడు రుషుల ప్రార్థన మేరకు ప్రజల ఆకలి తీర్చడానికి శాకంబరిగా అమ్మవారు ఆవిర్భవించారని పురాణ కథనం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి అర్చించడం సంప్రదాయంగా వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ప్రధాన ఆలయాలు అన్నిటిలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. కూరగాయలు సమద్ధిగా పండాలనీ, ప్రజలు ఆకలి బారిన పడకుండా ఉండాలనీ ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థించడం ఈ వేడుక వెనుక పరమార్థం. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లాలోని భద్రకాళీ దేవస్థానంలో ఈ ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి.

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. లలితా సహస్ర నామాల్లో మనకు వారాహీ దేవిపేరు వినిపిస్తుంది. వారాహీ దేవి లలితా అమ్మవారి సేనాని. రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహీ మాత ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. కిరి చక్రం అనే ప్రత్యేక రథాన్ని అథిరోహించి ఉంటుంది ఆ మాత. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, దేవవైద్యులైన అశ్విని దేవతలు కొలువై ఉంటారు. ఆజ్ఞాచక్రంలో ఉండి ఈ అమ్మవారిని ధ్యానం చేస్తే ప్రసన్న వదనురాలై అనుగ్రహిస్తుంది తల్లి.

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ||28 ||

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ||29||

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. శ్రీమహావిష్ణువు భూదేవిని రక్షించడానికి వరాహ రూపాన్ని ధరించడాని తెలుసుకదా. ఆ సమయంలో అమ్మవారు వారాహి రూపాన్ని ధరించింది. ఆమె సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపిణి. అందుకే శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి), ముసల (రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహా వారాహి (బృహద్వారాహి) స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ ఆమె. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజిస్తాం. ప్రకృతి పరంగా చూసినట్లైతే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగు తుంది. నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగుచేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాతనే కదా! దేవీ కవచంలో ”ఆయూ రక్షతు వారాహి అని ఉంటుంది అంటే, ఈ తల్లి ప్రాణ సంరక్షిణి”.

వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహీ చాలా శాంత స్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది, కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామక్రోధమోహ మధమాత్సర్యాలు నశిస్తాయి. అంత విశాలమైన దృష్టి మనకి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.

భోజనమే బోనం

బోనాల జాతర తెలంగాణ జన జీవన సంస్కృతికి ప్రతీక. ఇతర ప్రాంతాలలో కూడా గ్రామ దేవతలను కొలిచే ఆచారాలున్నాయి. పాడి పంటలను, పశువులను, కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటూ తమ తమ స్థాయిని అనుసరించి ఆ తల్లిని పూజించుకుంటారు. అమ్మవారికి కానుకలు, బోనాలు సమర్పించుకుంటారు. అందులో బలులు కూడా ఇస్తారు.

వైదిక కాలంలో ఒకప్పుడు నాలుగేసి నెలల చొప్పున రుతువులు మూడు మాత్రమే పరిగణనలో ఉండేవి. 1. వర్ష రుతువు, 2. హేమంత రుతువు 3. వసంత రుతువు. వర్షాకాలంతోనే సంవత్సరం ప్రారంభమయ్యేది. అందుకే సంవత్సరానికి వర్షా అనే పేరు. అలాగే ప్రతి రుతువు ప్రారంభకాలంలో యజ్ఞ యాగాలు చేస్తుండేవారు. అలా ఆషాఢమాసంలో వరుణ ప్రఘూసం అనే యజ్జ్ఞం ఆచరిస్తుండేవారని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. అంతేకాదు వర్షాకాలంలో ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం కొన్ని ఆరోగ్య నియమాలను కూడా పాటించాలి. ఎందు కంటే ఈ కాలం బురదకు, క్రిమికీటకాలకు పుట్టినిల్లు. అందులోనూ కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశాలు అనేకం. అందుకే ఈకాలంలో పసుపుకుంకుమల వాడుక, వేపాకు వాడకం చేసేవారు. మనకు ప్రకృతే దైవం. అందుకే అన్నింటినీ తల్లి స్వరూపంగా భావించి అర్చిస్తాం. సప్తమాతృకలను (ఐంద్రి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, చాముండి, వారాహి, మాహేశ్వరి) ఉపాసించాలని శాక్తేయంలో మనకు వివరించారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు కాబట్టి గ్రామీణులు ఈ తల్లులనే మరోవిధంగా పూజించారు.

1. పోచమ్మ (బ్రోచే అమ్మ)

2. మైసమ్మ (మహిషాసురుని సంహరించిన అమ్మ)

3. ఎల్లమ్మ (ఎల్లలు కాపాడే అమ్మ)

4. బాలమ్మ (బాలలను కాపాడే అమ్మ)

5. గంగమ్మ (గంగ రూపంలో ఉండే అమ్మ)

6. ముత్యాలమ్మ (ముచ్చట్లు తీర్చే అమ్మ)

7. పెద్దమ్మ (పెద్ద అయిన అమ్మ)

మరిడమ్మ, మారెమ్మ, అంకాళమ్మ, మాంకాళమ్మ.. ఎన్నో పేర్లతో వీరే కొలువందు కుంటున్నారు. వీరందరికి ఒకే సోదరుడు పోతురాజు. గ్రామరక్షకుడిగా గౌరవం పొందుతున్నాడు.

ఉత్సవం ఎలా చేస్తారంటే?

వర్షాలు కురిసి వ్యాధులు విజృభించే ఈ కాలంలో వీటికి నివారణగా ఆయా గ్రామదేవతల అనుగ్రహం కోసం పూజిస్తారు. ఆదివారం, గురువారం అందుకు అనుకూలమైనది అంటారు. ఘటస్థాపన, పూజలు, గంప జాతర, బలిగంప, తొట్టెల సమర్పణ, బోనాలు, రంగం, పోతరాజు, పొర్లు దండాలు, శివమెత్తడాలు, చిందులు ఈ దేవతలకు ప్రియమైనవి. సామాన్యంగా నేటి ఆలయాలలో అన్నిచోట్ల పాటించే నియమాలు మాత్రం ఘటస్థాపన, గంపజాతర, బలిగంప, తొట్టెల, బోనాలు, పోతరాజు వీరంగం, రంగ నిర్వహణ ఊరేగింపు ముఖ్యమైనవి.

ఘటస్థాపన

ఘటస్థాపన అంటే కలశస్థాపన. శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరమైన వారం కనుక ఆ రోజునే ఘటస్థాపన చేస్తారు. సమీపంలోని నది, బావి నుండి నీరు తెచ్చి, మూడు కలశాలు ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలో నీటిని, పంచ పల్లవాలను ఉంచుతారు. ఆ కలశాల వరుసకు వేప, మామిడి ఆకులతో, పుష్ప హారాలతో అలంకారం చేస్తారు. ప్రదోష వేళ అన్ని ఆలయాలలోని ఘటాలనూ ఊరేగింపుగా తీసుకువెళ్లి తమ తమ ఆలయాలలో నిర్దేశిత స్థలంలో స్థాపన చేస్తారు. అనువంశికంగా ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక పరివారం అంకితమౌతారు. నవరాత్రులు అర్చనలు చేస్తారు. బిల్వార్చన, పుష్పార్చన, కుంకుమార్చనలు, దీపార్చనలు శాకాంబరి అలంకారాలు అనేకం చేస్తారు. తొమ్మిదోరోజైన శుక్రవారం సాయంత్రం సప్తశతీ వాహనం నిర్వహిస్తారు. శనివారం రాత్రి/అర్ధరాత్రి బలిగంప నిర్వహిస్తారు.

బలి నిర్వహణ

గ్రామ రక్షణ కోసం, దేవతకు బలి ఇవ్వడం ఆచారం. పూర్వకాలంలో ఎద్దులను, మేకలను, కోళ్లను బలి ఇచ్చేవారు. నేడు వాటికి బదులుగా గుమ్మడి కాయ, ఆనపకాయలను వాడుతున్నారు. బలి ఇచ్చే వ్యక్తి గ్రామ సరిహద్దులలో పసుపు కుంకుమల మిశ్రమం చల్లుతాడు. ఆ సమయంలో నెత్తిపై బలిగంప ఉంటుంది.

తొట్టెలు

శనివారం రాత్రి తొట్టెలను ఊరే గింపుగా ఆలయానికి తీసుకువస్తారు. సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది విభాగాలలో ఈ తొట్టెల నిర్మాణం జరుగుతుంది. సంతానానికి ప్రతీక తొట్టె. ఇంట్లో తొట్టె ఊగుతున్నది అంటే సంతానం కలిగిందని అర్థం. జగన్మాతను సంతాన వద్ధి కోరి లేదా ఉన్న సంతానం రక్షణ కోరి తొట్టెలను సమర్పించడం ఆచారం.

బోనం

బోనం అంటే భోజనం (అన్నం) భోగవంతమైన ద్రవ్యం. దేవతలకు ప్రత్యేకంగా సమర్పించిన అన్నం భోనం లేదా బోనం. ఈ బోనాన్ని గ్రామదేవతకు సమర్పించే పండుగ బోనాలు. గ్రామస్తు లంతా ఊరుమ్మడిగా ఒక చోట చేరి బోనాలు ఏనాడు చేయాలో నిర్ణయిస్తారు. సాధారణంగా ఇది ఆదివారం నాడే ఉంటుంది. ఆదివారం ఉదయమే లేచి తలంటుకొంటారు. ఇంటిని శుభ్రం చేసి వేప, మామిడి మండలతో అలంక రిస్తారు. తర్వాత ఒక కొత్త కుండలో బియ్యం పోసి అన్నం వండుతారు. అన్నం వండిన ఆ కుండను పసుపు కుంకు మలతో అలంకరించి, వేప మండలతో రూపు కట్టించి, ఆ కుండపై మట్టి ప్రమిదలో/కంచుడులో జ్యోతి వెలిగిస్తారు. ఇది ‘బోనం జ్యోతి’. గ్రామంలోని/బస్తీలోని వారంతా తమ తమ ఇళ్లలో ఈ విధంగా బోనం జ్యోతులను సిద్ధం చేసుకొని ఊరేగింపుగా దేవత సన్నిధికి చేరుకొంటారు. ఊరేగింపులో డప్పులు వాయిద్యా లుంటాయి. శివసత్తులు ‘సిగాలు’ (శివాలు) ఊగుతారు. గ్రామ దేవత సమక్షంలో ఆ జ్యోతిని ఉంచి, అన్నాన్ని సమర్పించి కల్లు లేద వేప నీళ్లు ‘సాక’ పోస్తారు. సాక పోయడం అంటే కాళ్లు కడిగినట్లు భావించడం అన్నమాట.

పోతురాజు

పోతురాజు గ్రామదేవతకు సోదరుడు. గ్రామ రక్షణ బాధ్యత ఆ దేవత పరోక్షంగా తానే స్వీకరిస్తాడు. వీరంగం వేస్తూ గ్రామస్తులకు/బస్తీ వాసులకు ధైర్యం చెప్తాడు. దుష్టశక్తులను తరిమి వేస్తా నంటూ ఒళ్లంతా పసుపు కుంకుమలతో అలంకరించుకొని, కొరడాలు చేత ధరించి, ఉత్సాహంగా వీధులలో నాట్యం చేస్తాడు. ప్రజలు అతడిని చూసి సంతోషంగా తమ ఆనందోత్సాహాలను ప్రదర్శిస్తారు. నిమ్మకాయలు, వేపమండలు, పసుపు కుంకుమలు విశేషంగా పోతు రాజుకై వినియోగిస్తారు. ‘పోతులింగన్న’ అనే నామాంతరంతో కూడా ఈయనను పిలుస్తారు.

రంగం

దేవత పూనిన ఒక గ్రామస్థురాలు లేదా గ్రామస్థుడు ఆ సంవత్సరం భవిష్యత్తును ‘రంగం’ అనే పేరుతో వివరిస్తారు. ఆలయం బైట కొంత మట్టి కుప్పపై ఒక పచ్చి కుండను బోర్లా ఉంచుతారు. బోర్లించిన ఆ కుండపై రంగం చెప్పే వ్యక్తి నిలబడతారు. అతనిని/ ఆమెను పసుపు కుంకుమలతో అలంక రిస్తారు. ఏకతార మీటుతూ ఆ వ్యక్తి ‘భవిష్యవాణిని’ వినిపిస్తారు.

ఈ విధంగా బోనాలను స్వీకరించిన ఆ జగజ్జనని తమను చల్లగా చూస్తుందని ఆనందిస్తారు. శాక్తేయం అంటే పరమాత్మను శక్తి రూపంగా ఉపాసించడం. పరమాత్మ శక్తియే ప్రకృతి. దుర్గమమైన ఆపదలను నశింపజేసేది దుర్గాదేవి భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ ఆషాఢ ఉత్సవాలు జగత్కల్యాణ కారణాలు.

–  సంతోష లక్ష్మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *