కఠినవైఖరే ఉగ్రవాద సమస్యకు పరిష్కారం..!

కఠినవైఖరే ఉగ్రవాద సమస్యకు పరిష్కారం..!

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగం. కానీ జమ్మూ, లద్దాక్‌ ప్రాంతాలను మినహాయిస్తే కశ్మీర్‌లోయను భారతదేశం, మిగిలిన భారతావనిని కశ్మీర్‌ లోయ అర్థం చేసుకునే ప్రయత్నంలో, విధానంలో పెద్ద అఘాతమే కొనసాగుతోంది. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం లోయవాసుల దృష్టిని ప్రభావితం చేస్తున్న మాట ఎవరూ కాదనలేనిది. ఆ అఘాతం ఉగ్రవాదం చూపుతున్న ప్రభావం ఫలితమే కూడా. అక్కడ ప్రభుత్వాల ఏర్పాటు, రాజకీయాలను కూడా పాక్‌ రాజకీయాలు, ఉగ్రవాదం ప్రభావితం చేస్తున్నాయి. అందుకే కొన్ని అవాంఛనీయ, అప్రజాస్వామిక అంశాలు కూడా లోయవాసులకు ఆమోదనీయంగా మారిపోతున్నాయి. లోయ ప్రజలను మిగిలిన భారతదేశం నుంచి మానసికంగా మరింత దూరంగా తీసుకువెళుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటన బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వ పతనం. ఆ తరువాత పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ అనుసరిస్తున్న వైఖరి మిగిలిన భారతావనిలో చర్చనీయాంశంగా మిగిలింది. ఈ అన్ని అంశాల మీద విహంగ వీక్షణం చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కే చెందిన అరుణ్‌కుమార్‌ ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు ‘జాగృతి’ జరిపిన ముఖాముఖీలోని అంశాలు.

కశ్మీర్‌ సమస్య గురించి హురియత్‌ నాయకులతో పాటు, పాకిస్తాన్‌, ఉగ్రవాదులతో కూడా ప్రభుత్వం చర్చలు జరపాలని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జనవరి మధ్యలో పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనలోని సాధ్యాసాధ్యాలను ఆమె గమనించారా?

నిజమే, ఆమె చర్చలు జరపాలని అంటున్నారు. కానీ చర్చలలో పాల్గొనడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అసలు చర్చలకు ప్రాతిపదిక ఏమిటి? చర్చనీయాంశాలు ఏమిటి? చర్చలు జరపాలని అనుకుంటున్నవారికి, చర్చలలో పాల్గొనవలసిన వాళ్లకి కొన్ని విషయాలు తెలియాలి. ఉగ్రవాదం కారణంగా తలెత్తిన సమస్యల గురించి, ఉగ్రవాద పీడితుల గురించి వాళ్లకి తెలుసా? భారతదేశంలోని బహుళత్వం గురించి తెలుసా? ముస్లింల నుంచి రాష్ట్రపతిని, గవర్నర్లను, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని కూడా ఈ దేశం నియమించుకుంది. ఇవి వారికి గుర్తు న్నాయా? అన్నింటికి మించి చర్చల గురించి ప్రతిపాదిస్తున్నవారికీ, చర్చలలో పాల్గొన వలసిన వారికే భారత్‌ మీద విశ్వాసం ఉందా? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. వీటికి ముందు వచ్చే ప్రశ్నే – అసలు చర్చలకు సిద్ధంగా ఉన్నవారు ఎవరు?

బీజేపీ, పీడీపీ భిన్నధృవాలు. ఈ సంగతి అందరికీ తెలుసు. అయినా ఆ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఇందుకు దారి తీసిన పరిస్థితులు అసాధారణమైనవని ఒప్పుకోవాలి. అలాగే ఒక సంక్షుభిత రాష్ట్రానికి ఈ సంకీర్ణం వల్ల ఒనగూడిన ప్రయోజనం ఏమిటి? ఫలితాలు ఏమిటి?

అదొక ప్రయోగం. అంతవరకే. ఈ ఒక్క సంకీర్ణంతోనే అంతా సజావుగా సాగిపోతుందని ఎవరూ ఆశలు పెట్టుకోలేదు. ఆ రెండు పార్టీలతో సహా ఆ సంకీర్ణం మీద పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్న వారు దాదాపు లేరు. నిజానికి జమ్మూకశ్మీర్‌కు సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కూడా కాదు. అక్కడ అదొక అనివార్యత. జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం అంటేనే సంకీర్ణం దాని ప్రధాన లక్షణంగా ఉంటుంది. అదెలా అంటే, జమ్మూలో నెగ్గినవారు, లోయలో నెగ్గిన వారు. ఈ ఇద్దరు కలసి ప్రభుత్వం స్థాపిప్తారు. జమ్మూ హిందువులు అధికంగా ఉండే ప్రాంతం. లోయలో ముస్లింలు అధికం. జమ్మూలో గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ ప్రాబల్యం కలిగి ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు చెంది, జమ్మూ నుంచి ఎన్నికైనవారు సంకీర్ణంలో ఒక భాగంగా ఉంటారు. కశ్మీర్‌ లోయ నుంచి ఎన్నికైన వారు, అంటే నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీల సభ్యులు- ఇంకొక భాగం. జమ్మూ, కశ్మీర్‌ ప్రాంతాల నుంచి ఎన్నికైన వారు కలసి జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందే. నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌; కాంగ్రెస్‌- పీడీపీ; బీజేపీ- పీడీపీ ఇలాంటివే. మనం చూసిన చివరి సంకీర్ణం బీజేపీ-పీడీపీ సంకీర్ణం! మెహబూబాకి ఆమె అజెండా అమెకు ఉన్నది. సంకీర్ణంలో బీజేపీ ఉన్నప్పటికీ అది అమలు చేసుకోవాలని ఆమె చూశారు.

అంటే వచ్చే ఎన్నికల ఫలితాలను కూడా ఈ గతాన్ని బట్టే చూడడం అనివార్యమవుతుందా?

ఇంచుమించు అంతే. రాష్ట్రం మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికలలో కూడా ఏ పార్టీకీ మెజారిటీ రాదు. కొంచెం అటు ఇటుగా దాదాపు ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి.

మెహబూబా ముఖ్యమంత్రిగా దిగిపోయిన వెంటనే ఎదురుకాల్పులలో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబీకులను పరామర్శించే తన పాత వ్యూహాన్ని తిరిగి అమలు చేయడం ఆరంభించారు. అటు రాజ్యాంగ పరమైన పదవిని చేపట్టడానికీ ఆమెకు అభ్యంతరం లేదు. ఇటు రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు పాల్పడడానికీ వెనుకాడడం లేదు. ఇవేం రాజకీయాలు? దీనికి ప్రజామోదం ఎలా ఉంటుంది? ఎదురుకాల్పులలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం, అందులో ఆమె చెప్పుకుంటున్న మానవతల సంగతి ఎలా ఉన్నా, ఆ సమయంలో ఆమె భద్రతాదళాలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలకు, దేశానికి వేరే విధమైన సంకేతాలు పంపడం లేదా?

మొదట మనం గుర్తుంచుకోవలసినది మెహబూబా ముఫ్తీ పరిణతి చెందిన నాయకురాలు కాదు. ఆమె విధానమే మెత్తని వేర్పాటువాదం. ఆమె ఈ వైఖరి జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. ఉగ్రవాదుల కుటుంబాలను, ఉగ్రవాదుల బంధువులను వేధించరాదనే ఆది నుంచి ఆమె చెబుతూ వస్తున్నారు. ఈ మధ్యన గవర్నర్‌కు ఇందుకు సంబంధించి ఆమె ఒక విన్నపం కూడా చేశారు. కాబట్టి ఆమె ధోరణి అక్కడ ఎవరికీ కొత్తగా అనిపించడం లేదు. అదీకాక, మిగిలిన భారతదేశం ఉగ్రవాద కుటుంబాల పరామర్శను ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్టగా, ఆ తరహా రాజకీయాలకు సంబంధించి పరమ వికృత రూపంగా భావిస్తున్నది. కానీ ఎదురు కాల్పులలో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలను పరామర్శించడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్రమైన అంశంగా చాలామంది పరిగణించడం లేదు. ఆమె ధోరణి సైన్యం సహా, భద్రతా దళాలన్నింటికి తీవ్ర వ్యతిరేకమే. ఆ పరామర్శలకు ఆమె ఏ పేరు పెట్టినా అది కచ్చితంగా ఓటు బ్యాంక్‌ రాజకీయమే. మరొక అంశం కూడా ఉంది. పీడీపీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆవిర్భవించిన రాజకీయ పార్టీ. ఉగ్రవాద పీడిత కుటుంబాల వారికీ, ఉగ్రవాదం బాటను వీడి వచ్చిన వారికీ, అటు కాంగ్రెస్‌, ఇటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌లతో విసిగిపోయిన వారికీ వేదికగా ఉండడం పీడీపీ ఆశయాలలో ఒకటి. కాబట్టి ఆ అంశం కూడా ఆమెను ఈ ధోరణి నుంచి బయట పడకుండా చేస్తున్నదని భావించవచ్చు కూడా.

పాకిస్తాన్‌ అధ్యక్షునిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నికైన తరువాత జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి?

ఎలాంటి మార్పులూ లేవు. నిజానికి మార్పులకి అవకాశమే లేదు. అసలు మార్పులు వస్తాయని అనుకోవడం ఎలా? లోయలో జరుగుతున్నదంతా పరోక్ష యుద్ధం. ఉగ్రవాదులు పాకిస్తాన్‌ సైన్యం ఆసరాతో పరోక్ష యుద్ధం చేస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ది ఎన్నిక కాదు. ఆ దేశ సైన్యం చేసిన ఎంపిక. ప్రజలు ఆయన్ను ఎన్నుకోలేదు. పాక్‌ సైన్యం ఆయన్ను ఎంపిక చేసుకుంది. కాబట్టి నడిపేదంతా సైన్యమే. దీనితో పాటు పాకిస్తాన్‌ న్యాయ వ్యవస్థనీ, ఎన్నికల కమిషన్‌నీ కూడా ఇమ్రాన్‌ ఎంపిక చేయడం కోసం సైన్యం నయాన్నో భయాన్నో ఒప్పించింది. ఇమ్రాన్‌ విధానం అంటే, అది సైన్యం విధానమే. అందుకే లోయలో ఎలాంటి మార్పుకీ అవకాశం లేదు. ఆయన ఎన్నిక ఏ మార్పూ తీసుకురాలేదు. పరోక్ష యుద్ధం యథాతథంగా సాగుతూనే ఉంది.

కశ్మీర్‌ అంశంలో నేటి ప్రధాని నరేంద్ర మోదీకీ, మిగిలిన కేంద్ర ప్రభుత్వాలకి మధ్య గుణాత్మకమైన భేదం ఏమిటి?

సరిహద్దు ఉగ్రవాదం విషయంలో స్థిరమైన విధానంతో మోదీ ప్రభుత్వం కొనసాగగలిగింది. లద్దాక్‌, జమ్మూ ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నించడం కూడా మంచి యత్నం. అంటే లోయ వాసులను ఏకాకులను చేయడం మాత్రం కాదు. పరిస్థితులు ఇలాంటి ఒక ప్రయత్నం చేయడానికి మోదీని ప్రేరేపించాయి. అంతే. అలాగే ఉగ్రవాద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు, స్వాంతన కలిగించే కార్యక్రమాలు తీసుకోవడం కూడా మోదీ చేపట్టిన నిర్మాణాత్మక విధానం.

మోదీ ప్రభుత్వం పాక్‌ సరిహద్దులలో నిర్వహించిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ గురించి మిగిలిన భారతదేశంలో కొంత వివాదం రేగింది. వాటి ఫలితం లోయ మీద ఎలా ఉంది?

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అనేవి కొత్త కాదు. పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ నిర్దేశించుకున్న విధానంలో అదొక భాగం, అంతే. అలాగే చెలరేగిపోతున్న పాక్‌కు మోదీ హయాం చేసిన హెచ్చరిక అని అనుకోవాలి. వాటి ప్రభావం లోయ మీద ప్రత్యేక ప్రభావం అంటూ ఏమీ లేదు. అవే రగడలు, నినాదాలు, అవే అల్లర్లు.

ఈ ఉగ్రవాదం పీడ ఎంతకాలం? పరిష్కారం ఏమిటి?

ఉగ్రవాదం విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా కఠినంగా వ్యవహరించాలి. దేశ భద్రత, సార్వ భౌమాధికారమే ప్రధానంగా భావించాలి. కాబట్టి ఉగ్రవాదులతో కఠినంగా వ్యవహరించడం తప్పని సరి. ఉగ్రవాదులను ఏరివేయడం ఒక్కటే మార్గం.

– ఇంటర్య్వూ వేదుల నరసింహం, సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *