మన్యంవీరులు

మన్యంవీరులు

మే 7వ తేదీ అల్లూరి శ్రీరామరాజు వర్ధంతి

బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. ఉత్తర భారతంలో బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. విశాఖ మన్యంలో జరిగిన మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4, 1897- మే 7, 1924). రామరాజు ఉద్యమం ఆగస్ట్‌ 22, 1922న చింతపల్లి (విశాఖ మన్యం) పోలీసు స్టేషన్‌ మీద దాడితో మొదలై, మే 7, 1924 వరకు ఉధృతంగా సాగింది. ఆ తరువాత కూడా మరో నెలపాటు రామరాజు ప్రధాన అనుచరుడు గాం గంతన్న ఉద్యమాన్ని నడిపించాడు.

విశాఖ మన్య విప్లవం వంటి ఘట్టం తెలుగు వారి చరిత్రలో అదొక్కటే. దానికదే సాటి. నిజానికి భారత గిరిజనోద్యమ చరిత్రలోనే విశిష్ట ఘట్టం. రామరాజు చరిత్ర, ఉద్యమం గురించి ఆదిలాబాద్‌ ప్రాంత గోండు ఆదివాసీ ఉద్యమనేత కొమురం భీం (1940) అస్సాంలో ఉండగా విని, ప్రేరణ పొందాడు. వేంకటరామరాజు, సూర్య నారాయణమ్మ దంపతుల తొలి సంతానం శ్రీరామరాజు. విశాఖ జిల్లా భీమిలికి సమీపంలో ఉన్న పాండ్రంగిలో అమ్మమ్మగారింట పుట్టారు. వేంకటరామరాజు స్వస్థలం ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న మోగల్లు. ఆయనకు సోదరి (సీత), సోదరుడు (సత్యనారాయణరాజు) కూడా ఉన్నారు. ప్రజానీకంలో ఆయన పేరు సీతారామరాజుగా స్థిరపడి ఉండవచ్చు. కానీ జాతక చక్రం మొదలు, ఉద్యమం మీద వచ్చిన నివేదికలలో, ప్రభుత్వ రికార్డులలో కనిపించేది శ్రీరామరాజు అనే. ఒక చరిత్ర పురుషుడి అసలు పేరును కూడా అందరికీ తెలిసేటట్టు చేయకపోవడం చరిత్ర పట్ల మనకున్న నిర్లిప్త ధోరణిని చెప్పేదే. శ్రీరామరాజు జీవితంలో సీత అనే మహిళ ఉన్నట్టు చెప్పడానికి ఒక్క బలమైన ఆధారం కూడా లేదు. రామరాజు బాల్యం అందమైనది కాదు. చిన్న వయసులోనే వేంకటరామరాజు కన్నుమూశారు. కాకినాడ, భీమవరం, రామచంద్రపురం, రాజమండ్రి, నరసాపురం, తుని వంటిచోట అతి కష్టం మీద చదువు సాగించారాయన. ప్రాథమిక విద్యార్థి దశలో ఉండగానే పినతండ్రి రామకృష్ణరాజుగారి దగ్గర కొద్దికాలం రామరాజు ఉన్నారు. శ్రీరామరాజు జూలై 24, 1917, శ్రావణ మాసంలో విశాఖ జిల్లాలోని కృష్ణదేవిపేట వచ్చారు. అక్కడ చిటికెల భాస్కరనాయుడు అనే చిన్న భూస్వామి ఇంట చాలా కాలం ఉన్నారు.

మే 7, 1924న శ్రీరారాజును విశాఖ మన్యంలోని మంప అనే కుగ్రామం శివార్లలో నిర్భంధంలోకి తీసుకున్నారు. ఆయన దొరికిపోయిన చోట నిర్మించిన స్మారక స్తూపమిది. మంపలో బంధించిన రామరాజును కొయ్యూరులో మేజర్ గూడాల్ కాల్చిచంపాడు. అక్కడ నుంచి కృష్ణదేవిపేట తీసుకువచ్చి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

మొదట అయనను ఆ గ్రామం ఒక యోగిగా భావించింది. తరువాత నెమ్మదిగా ఆ పరిసరాల లోని గిరిజనులు పడుతున్న ఇక్కట్లు ఆయన దృష్టికి వచ్చాయి. ప్రధానంగా రోడ్డు నిర్మాణంలో చింతపల్లి, లంబసింగి వద్ద జరుగుతున్న ఘోరాలు తెలిశాయి. గూడెం డిప్యూటీ తహసీల్దారు అల్ఫ్‌ బాస్టియన్‌ గిరిజనులను దోపిడీ చేస్తూ రోడ్డు పని చేయించాడు. ఈ మొత్తం అసంతృప్తి ఆగ్రహంగా మారి, ఆపై ఉద్యమ రూపం దాల్చింది. దీనికి నాయకత్వం వహించిన వారే శ్రీరామరాజు. గూడెం ముఠా (ఒక రెవెన్యూ ప్రాంతం), పెద్దవలస ముఠా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయి. ఉద్యమం కోసం రామరాజు నేరుగా గిరిజన గూడేలకు వెళ్లలేదు. అంతకు ముందే ఆయన గిరిజనుల జీవన విధానంలో మార్పులు తేవడానికి కృష్ణదేవిపేట నుంచే ప్రయత్నం చేశారు. జీలుగు కల్లుతో సర్వం పోగొట్టుకుంటున్న గిరిజనులలో సంస్కరణలు తెచ్చారు. బాస్టియన్‌ నుంచి, ఇతర వేధింపుల నుంచి తమను కాపాడ వలసిందిగా మొదటిగా గూడెం ముఠాదారు ఎండుపడాలు, బట్టిపనుకుల మునసబు గాం గంతన్న, ఆయన సోదరుడు గాం మల్లు వంటివారు రామరాజుకు మొరపెట్టుకున్నారు. ఆ సమయంలోనే ఆయన నాసిక్‌ వెళ్లి రావడం, కాంగ్రెస్‌ ఉద్యమం, గిరిజన నేతలతో సమావేశాలు ఇవన్నీ అనుమానాలు రేకెత్తించాయి. 1922 జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఇదంతా జరిగింది. అప్పుడే దేశవ్యాప్తంగా ఒక ఆశ ప్రభజనంలా వీచింది. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్య్రం వస్తుందని ఆయన ప్రకటించారు కూడా. అంతలోనే ఆ ఉద్యమ జ్వాల మీద సాక్షాత్తు గాంధీజీయే నీళ్లు చల్లారు. చౌరీచౌరా అనేచోట (నేటి ఉత్తరప్రదేశ్‌) ఉద్యమకారులు ఒక పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టడంతో 21 మంది పోలీసులు సజీవ దమనమయ్యారు. దీనితో ఉద్యమం నిలిపివేశారు గాంధీ.. గాంధీగారి ఈ ధోరణితో పెద్ద వెలితి ఏర్పడింది. అహింస మీద చాలామంది నమ్మకం పోగొట్టుకున్నారు. అలాంటి వారిలో ఇక్కడ శ్రీరామరాజు ఒకరు. ఆగస్టు 19, 1922న శబరి కొండ మీద అమ్మవారికి అభిషేకం చేయించి రామరాజు ఉద్యమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22న చింతపల్లి స్టేషన్‌ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకు రావడంతో ఉద్యమం మొదలైంది. 28వ తేదీన కృష్ణదేవిపేట, 24వ తేదీన రాజవొమ్మంగి స్టేషన్లను రామరాజు లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తం 21 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మూడు పోలీసు స్టేషన్ల మీద విజయం తరువాత రామరాజు ఒంజేరి దగ్గర బ్రిటిష్‌ బలగాలను ఓడించారు. రామరాజు ఉద్యమంలో పెద్ద మలుపు, మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రధాన కేంద్రం సెయింట్‌ జార్జి కోటను కదిలించిన ఘటన ఆ తరువాత జరిగింది. దామనపల్లి అనేచోట రామరాజు దళం చేసిన ఆ సాహసం అసాధారణమైనది. అక్కడ కవర్ట్‌, హైటర్‌ అనే ఇద్దరు పోలీసు ఉన్నతాధి కారులను రామరాజు దళం చంపింది (వీరి సమాధులు ఇప్పటికీ నర్సీపట్నంలో ఉన్నాయి). దీనితో మద్రాస్‌ ప్రెసిడెన్సీ ¬ం కార్యదర్శి కల్నల్‌ నాఫ్‌ ఆగమేఘాల మీద విశాఖ మన్యానికి వచ్చాడు. ఆ తరువాత పోలీసులు చేసిన పని, స్టేషన్లన్నింటినీ నిరాయుధం చేయడమే. అడ్డతీగల, రామవరం, మల్కనగిరి, పాడేరు వంటి స్టేషన్ల మీద రామరాజు దాడి చేశారు. కానీ అప్పటికే ఆయుధాలు వేరే చోటికి వెళ్లిపోయేవి. పెద్దగడ్డపాలెం, లింగాపురం యుద్ధాలలో కొండదళం ఎదురుదెబ్బ తిన్నది. తరువాత మల్లుదొర దొరికి పోవడంతో మరొక పెద్ద దెబ్బ. రామరాజు సేనకీ, ఆంగ్లేయ పోలీసులకు మధ్య 62 పర్యాయాలు కాల్పులు జరిగాయని చెబుతారు. స్థానిక బలగాలు పనిచేయలేకపోవడంతో మలబార్‌ పోలీసులను పిలిపించారు. వారు కూడా విఫలం కావడంతో అస్సాం రైఫిల్స్ను రప్పించారు. కుకీల తిరుగుబాటును అణచిన సైన్యమిది. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసింది. దీని అధిపతి మేజర్‌ గూడాల్‌. 1924 ఏప్రిల్లో రూథర్‌ ఫర్డ్‌ ను ప్రత్యేక అధికారిగా నియమించి, చినుకు పడే లోపున ఉద్యమం అణచాలని మద్రాసు ప్రెసిడెన్సీ పెద్దలు ఆదేశించారు. రూథర్‌ఫర్డ్‌ వచ్చిన తరువాత ఆకృత్యాలు మరిన్ని పెరిగిపోయాయి. చివరికి రామరాజు దొరికిపోయాడు. ఆయనను మంప దగ్గర అరెస్టు చేసి, కొయ్యూరు తీసుకువచ్చారు. అక్కడ క్యాంప్‌ వేసి ఉన్న మేజర్‌ గూడాల్‌ రామరాజును కాల్చి చంపాడు. కానీ రామరాజును సజీవంగా పట్టి తేవాలని ప్రభుత్వ ఆదేశం. చివరికి రామరాజు భౌతిక కాయాన్ని కృష్ణదేవిపేట తీసుకువెళ్లి శవపరీక్ష చేయించి, అంత్యక్రియలు నిర్వహించారు. రామరాజు వెంట నడిచిన గిరిజనులు ఎందరో ఉన్నారు. వాకిలో గాం గంతన్న, గాం మల్లుదొర, ఎండు పడాలు, గోకిరి ఎర్రేసు వంటి వారు ఉన్నారు.


మరువలేని మహావీరుడు

‘జాతీయోద్యమమమునకు శ్రీరామరా జొనర్చిన సేవను ప్రశంసించు భాగ్యము నాకు కలిగినందులకు సంతసించుచున్నాను.

ఈ మహానుభావుడు ఏ స్వతంత్ర దేశమునందైనను జన్మించినచో సహజముగా ఇతని సాహస కార్యములకు మరింత అవకాశముండెడిది. ఇంతకంటెను మిక్కుట ముగా దేశీయుల ప్రశంసకు పాత్రుడయ్యెడివాడు.

ఇతని ధైర్య సాహసములు, దేశభక్తి, పట్డుదల, పౌరుషము అన్నియు ఇతని ఖ్యాతిని నల్దిశల వ్యాపింపచేసినవి. ఇతని విధానములతో నంగీకరించిప జాలనివారు సహితము ఇతని విశాల భావములను ప్రశంసించక తప్పదు. భారతీయ యువకులు భారతీయ వీరుల నారాధించుటను మరువకుందురు గాక!’

నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌


మే 7, 1924న శ్రీరామరాజును విశాఖ మన్యంలోని మంప అనే కుగ్రామం శివార్లలో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయన దొరికిపోయిన చోట నిర్మించిన స్మారక స్తూపమిది. మంపలో బంధించిన రామరాజును కొయ్యూరులో మేజర్‌ గూడాల్‌ కాల్చిచంపాడు. అక్కడ నుంచి కృష్ణదేవిపేట తీసుకువచ్చి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

గాం మల్లుదొర

ఇతడు 1900 సంవత్సరంలో పుట్టినట్టు పార్లమెంట్‌ వెబ్‌ సైట్‌ ను బట్టి తెలుస్తుంది. గంతన్న సోదరుడు (తండ్రి ఒక్కరే, తల్లులు వేరు). ఉద్యమంలో కడు సాహసి. కానీ ఇతడి వ్యసనాల కారణంగా చాలా రహస్యాలు వెల్లడయ్యాయన్న అపవాదు ఉంది. మద్యం ముట్టరాదన్న ఉద్యమ నియమాన్ని ఉల్లంఘించినందుకు ఇతడిని రామరాజు బహిష్కరించాడు. తరువాత సెప్టెంబర్‌ 17, 1923న నడింపాలెంలోనే తన ఉంపుడుగత్తె చితుకులమ్మ ఇంటిలో ఉండగా ఇంటిలిజెన్స్‌ ఎస్‌ఐ రాధాకృష్ణ, మరొక శ్వేతజాతి పోలీసు ఉన్నతాధికారి కీరన్స్ల చేతికి చిక్కిపోయాడు. వారి చేతిలో ఘోరమైన హింసను అనుభవించాడు. ఉద్యమంలోని అన్ని పోరాటాల లోను ఉన్నాడు. ప్రత్యేక కోర్టు మొదట మే 12, 1924న ఉరిశిక్ష విధించింది. మద్రాసు హైకోర్టు తరువాత యావజ్జీవ శిక్షగా మార్చింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇతడు పార్లమెంటుకు ఎంపికయ్యాడు. శ్రీరామరాజు జీవితంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెలువరించిన గ్రంథానికి ఎర్రమిల్లి నర్సింహారావుతో కలసి పనిచేశారు.

అగ్గిరాజు

ఇతడు మైదాన ప్రాంతం నుంచి మన్యం వెళ్లి ఉద్యమంలో పాల్గొన్నాడు. అసలు పేరు వేగిరాజు సత్యనారాయణరాజు. ఇంగ్లిష్‌ జాతి అంటే అగ్గి మీద గుగ్గిలమయ్యేవాడు. అందుకే అగ్గిరాజు అనేవారంతా. ఏప్రిల్‌ 27, 1923న రామరాజు అన్నవరం వచ్చాడు. కొండదళం అక్కడే ఉన్నది కాబట్టి ఉదయం పదింటికి అన్నవరం చేరుకోవలసిన మద్రాస్‌ మెయిల్‌ను పిఠాపురంలో ఆపేశారు. అగ్గిరాజు అదే రైలులో ఉన్నాడు. అతడి గమ్యం కలకత్తా. పశ్చిమ గోదావరి జిల్లా కుముదవల్లి గ్రామానికి చెందిన వాడాయన. బెంగాల్‌ తీవ్ర జాతీయవాదులతో కలసి పనిచేయాలన్న ఆలోచన. ఆయన కూడా కొద్దికాలం క్రితం వరకు భీమవరం కేంద్రంగా తన ఊరి వాడే అయిన అడవి బాపిరాజుతో కలసి ఉద్యమంలో పాల్గొన్నాడు. చౌరీచౌరా ఉదంతం తరువాత గాంధీజీ అంటే నమ్మకం పోయింది. మనసు మార్చుకున్న అగ్గిరాజు అన్నవరంలో దిగిపోయి, వెతుక్కుంటూ వెళ్లి రామరాజును కలుసుకుని ఉద్యమంలో చేరాడు. మే 5, 1924న పోలీసులు అగ్గిరాజును బంధించి రామరాజు అనుకుని భుజాలు చరుచుకున్నారు. వాస్తవం తెలిశాక అగ్గిరాజును రాజవొమ్మంగి తరలించారు. తరువాత అతడికి ద్వీపాంతరవాస శిక్ష పడి, అండమాన్‌ జైలుకు తరలించారు. మళ్లీ ఆయన సంగతి 1936లో గానీ ఎవరికీ గుర్తుకు రాలేదు. అప్పుడు మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో ఆచార్య ఎన్జీ రంగా అగ్గిరాజు గురించి ప్రశ్న అడిగారు. అండమాన్‌ జైలులోనే అగ్గిరాజు విష జ్వరంతో మరణించారని సమాచారం ఇచ్చింది ప్రభుత్వం.

కొటికల బాలయ్య

కంతారం మొఖాసాదారు. మన్య ప్రజల కష్టాలను తీర్చవలసిందిగా రామరాజును కలసి కోరిన బృందంలో ఉన్నాడు. మన్యంలో పలుకు బడి కలిగినవాడు. ఉద్యమం చివరి ఘట్టంలో రేవళ్ల కంతారంలో జరిగిన సమావేశంలో రామరాజు వాదనతో విభేదించి బయటపడిన వాడని ప్రతీతి. ఇది జరిగిన రెండు రోజులకే రామరాజు పట్టుబడ్డాడు. రామరాజు ఉద్యమంలో అరెస్టయిన వారిని విచారించేందుకు అర్హంట్‌ అనే న్యాయాధికారి న్యాయమూర్తిగా విశాఖలో ప్రత్యేక కోర్టు ఏర్పాటయింది. ఆ కోర్టు 276 మందికి పైగా ఉద్యమకారులకు శిక్షలు వేసింది.

గాం గంతన్న దొర

కృష్ణదేవిపేట నుంచి పాడేరు వెళ్లే దారిలోని నడింపాలెం ఇతడి స్వగ్రామం. బట్టిపనుకుల గ్రామానికి మునసబు. తండ్రి జోగిదొర. ఇతడు బాస్టియన్‌ బాధితుడు. తన భూములను తనఖా పెట్టినప్పటికీ వాటిని ప్రభుత్వ భూములని పోలీసులకు చెప్పి సుమర్ల పెద్దబ్బి అనే గంతన్న బంధువులకే కట్టబెట్టాడు. దీని గురించి మొర పెట్టుకోవడానికి వెళితే బాస్టియన్‌ ఇతడి పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఉద్యమం మొదలయిన తరువాత రామరాజు దళంలో కీలక వ్యక్తి అయ్యాడు. అన్ని ప్రధాన పోరాటాలలోను ఉన్నాడు. రామరాజు మరణం తరువాత అంతాడ ముఠాలోని ఎద్దుమామిడి, శింగధారల దగ్గర గంతన్నను మలబారు దళానికి చెందిన పొన్నుస్వామి బృందం జూన్‌ 7, 1924న కాల్చి చంపింది. కృష్ణదేవిపేటలోనే రామరాజును దహనం చేసిన చోటే గంతన్నకు కూడా అంత్యక్రియలు జరిపారు. ఇప్పటికీ రామరాజు, గంతన్న సమాధులు కృష్ణదేవిపేటలో ఉన్నాయి.

కంకిపాటి ఎండుపడాలు

ఇతడినే కంకిపాటి బాలయ్యపడాలు అని కూడా పిలిచేవారు. పెద్దవలస ముఠాదారు. ఇతడు కూడా బాస్టియన్‌ బాధితుడే. బాస్టియన్‌ ఆ కాలంలో చాలా చోట్ల రోడ్డు నిర్మాణం బినామీ పేర్లతో చేపట్టాడు. ఒక రోడ్డు కాంట్రాక్ట్‌ పడాలుకు ఇచ్చాడు. వంద రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చాడు. రోడ్డు వేసిన తరువాత పని నాసిరకంగా ఉందని సాకు చూపించి, మిగిలిన మొత్తం ఇవ్వడం కుదరదని చెప్పాడు. దీనిని నిలదీసినందుకు పడాలు మీద చేయి చేసుకున్నాడు. తరువాత ఇతడు కూడా రామరాజు ఉద్యమంలో చేరాడు. చాలా దాడులలో పాల్గొన్నాడు. ఇతని ఇద్దరు కొడుకులు కూడా ఉద్యమంలో భాగస్తులై, ఆయుధాల తయారీలో ఉండేవారు. ఉద్యమం చివరిదశలో పోలీసు అణచివేతలు భరించలేక పెద్దవలస గ్రామ ప్రజలే ప్రభుత్వానికి ఆచూకీ చెప్పేవారు. అలా పడాలు కొడుకుని పెద్దవలసలో పోలీసులు పట్టుకున్నారు. దీనిని తట్టుకోలేక పెద్దచెరువు అనే గ్రామానికి వెళ్లి నిలదీశాడు పడాలు. ఈ అవకాశం కోసమే చూస్తున్న ఊరి మునసబు తన మనుషులతో దాడి చేయించాడు. పడాలు చేతిలో ఉన్న తుపాకీ పని చేయలేదు. ఆ గ్రామీణులే కర్రలతో, రాళ్లతో పడాలును కొట్టి చంపారు. ఇది మే 26, 1924న జరిగింది.

గోకిరి ఎర్రేసు

కృష్ణదేవిపేట ప్రాంతంలో నివాసం ఉండేవాడు. కొండ సంతలలో పందిళ్లు వేసేవాడు. గొప్ప విలుకాడు. అత్తవారి ఊరు తంటికొండ గోకవరం. కొన్ని మీటర్ల దూరంలో పేడ ముద్ద పెట్టి, దాని నాణెం ఉంచితే దానిని కూడా కొట్టేవాడట. కవర్టు, హైటర్ల మీద కాల్పులు జరిపినవాడు ఇతడేననే వాదన స్థానికులలో ఉంది. రంపుల ఘాటీ దాడిలో ఒక కానిస్టేబుల్‌ (ఇండియన్‌) చనిపోయిన తరువాత ఇతడిని రామరాజు పదిహేను రోజులు ఉద్యమం నుంచి బహిష్కరించినట్టు కూడా స్థానికులు చెబుతారు. ఎందుకంటే భారతీయుడిని చంపరాదని రామరాజు నిబంధన అమలు చేశారు. ఇతడు పోలీసు శిబిరాలకు తరలి పోతున్న ఆహార పదార్థాలను లాఘవంగా కొండదళం దగ్గరకి చేర్చేవాడు. రామన్నపాలెం అనే ఊరిలో ఉండగా ఇతడిని గ్రామస్తులే పట్టి ఇచ్చారు. రాయవెల్లూరు కారాగారంలో శిక్ష అనుభవించాడు. తిరిగి కృష్ణదేవిపేట చేరుకుని భిక్షాటనతో శేష జీవితం గడిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *